Saturday, August 4, 2012

దివిసీమ గాంధీ’ మండలి వెంకటకృష్ణారావు

‘‘ఇప్పటి యువకులు, విద్యార్థులు ఆయన వద్ద నేర్చుకోవలసింది ఎంతైనా ఉంది. ప్రజా సేవకుడిగా ఆయన విజయం వేషాడంబరం పైనగానీ, అధికార ఐశ్వర్యాల ప్రదర్శన మీదగానీ ఆధారపడలేదు. మంత్రి పదవులు అధిష్టించినా ఆయనకు భోగవిలాసాలు అంట లేదు’’ అన్న ఆచార్య ఎన్‌జీ రంగా వ్యాఖ్యలు మండలి వెంకటకృష్ణారావు వ్యక్తిత్వానికి అద్దం పడతాయి. గాంధేయ విలువలకు నిలువెత్తు రూపం ఆయన. తనకున్న కొద్దిపాటి ఆస్తులు కరిగిపోయినా బడుగువర్గాల బాగు కోసం నిరంతరం శ్రమించిన స్వాప్నికుడు. పదవిలో ఉన్నా లేకున్నా ఆయన ఎప్పుడూ ప్రజల మనిషిగానే జీవించారు.

దివిసీమలోని నిరుపేదల దీనావస్థ ఎప్పుడూ మండలి కళ్లల్లో మెదలుతూనే ఉం డేది. ఆయన కృషి వల్లే బంజరు భూములను పేదలకు పంచే కార్యక్రమం 1955లో ప్రారంభమైంది. 15 వేల ఎకరాల బంజరు భూములను పేదలకు పంచారాయన. అయినప్పటికీ 1962 పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. ఆ ఓటమిని జీర్ణించుకోలేక ఆయన అనుచరులు కంటతడి పెట్టుకోగా, వారిని ఓదారుస్తూ ‘పదవులవల్ల ఏవో సొంత ప్రయోజనాలు సాధించదలచిన వాళ్లు ఓడిపోతే బాధపడాలి గాని మనకు బాధ ఎం దుకు?’ అన్న మాటలు ఆయన సేవానిరతికి తార్కాణం.

ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ప్రాంతీయ ఉద్యమాల్ని ఎదుర్కొని, తెలుగుజాతి విచ్ఛిన్నం కాకుండా కాపాడటానికి శక్తిమేర పోరాడిన ధీరోధాత్తుడాయన. ప్రాంతీయ ఉద్యమా ల వేడితగ్గిన అనంతరం, 1974లో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తనకెంతో ఇష్టమైన విద్య-సాంస్కృతిక వ్యవహారాల మం త్రిగా బాధ్యతలు చేపట్టారు. తెలుగునాట 1969-72 మధ్య జరిగిన రెండు వేర్పాటు ఉద్యమాలతో మసకబారిన తెలుగుజాతి ప్రతి ష్టను పునరుజ్జీవింపజేసి, ఐక్యతను పెంపొం దించవలసిన ఆవశ్యకతను గుర్తించారు.

ఆ నేపథ్యంలోనే, 1975 రాక్షస నామ సంవత్సరం ఉగాదినాడు ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్‌లో ఎంతో ఘనంగా నిర్వహించడానికి నడుం బిగించా రు. ఆ మహాసభల ద్వారా ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగు వారందరినీ ఒకే వేదిక పైకి తీసుకురావడంలో మండలి కృషి అనన్యం. ఆ సభలో మాట్లాడిన వక్తలు ప్రాం తాలకు అతీతంగా తెలుగు జాతి సమైక్యతను చాటిచెప్పడం విశేషం. ‘ఖండాతరాలకు వలసపోయిన తన సంతానాన్ని రెండేళ్లకు ఒకమారైనా చూసి సంతోషించే భాగ్యం తెలుగుతల్లికి దక్కింది’ అంటూ, ఆ సభలు దిగ్విజయంకావడానికి కారకులైన నాటి ముఖ్యమంత్రి జల గం వెంగళరావు, మంత్రి వెంకటకృష్ణారావులను తెలుగునేల వేనోళ్ల ప్రశంసించింది.

ఆ మహాసభలు అందించిన ఉత్తేజం, పీవీ నరసింహారావు వంటి వారి ప్రోత్సాహం తో తెలుగు భాషాభివృద్ధికి ఒక ప్రత్యేక సం స్థను ప్రారంభించాలన్న ఆలోచనకు బలం చేకూరింది. జె.పి.ఎల్.గ్విన్, వావిలాల గోపాలకృష్ణయ్య చొరవతో ‘అంతర్జాతీయ తెలుగు కేంద్రం’ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. నాటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్ 1975లో ఈ సంస్థను ప్రారంభించారు. మండలి వెంకటకృష్ణారావు ఈ సంస్థకు ప్రథ మ అధ్యక్షులు. కాలక్రమంలో నాటి ముఖ్య మంత్రి నందమూరి తారకరామారావు ఈ సంస్థను తెలుగు విశ్వవిద్యాలయంలో విలీనం చేశారు. తదనంతర కాలంలో, ప్రథమ ప్రపం చ తెలుగు మహాసభల కార్యనిర్వాహక అధ్యక్షులుగా, అంతర్జాతీయ తెలుగు కేంద్రం ప్రథ మ అధ్యక్షులుగా వ్యవహరించిన మండలి వెంకట కృష్ణారావు అవిరళ కృషిని గుర్తించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అంతర్జాతీయ తెలుగు కేంద్రం పేరును ‘మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం’గా మార్చారు.

1977వ సంవత్సరంలో సంభవించిన ఉప్పెన, దివిసీమను అతలాకుతలం చేసింది. చక్కెర వ్యాధితో, పెరిగిన గడ్డంతో కాళ్లకు బొబ్బలెక్కుతున్నా లెక్కచేయక శ్రమించి, ఆ ఉపద్రవం నుంచి దివిసీమ కోలుకునేలా మం డలి కృషిచేశారు.

దివిసీమలో ఏ ప్రాంతాన్ని సందర్శిం చినా ఆయన పోరాటతత్వం గుర్తుకు వస్తుం ది. కృష్ణానది మీద వెడల్పు చేసిన అక్విడెక్ట్ ద్వారా నేటికీ గలగలా పారుతున్న నీళ్లలో ఆయన రూపు ప్రతిబింబిస్తుంది. ఉప్పు నీరు వరద గ్రామాలను ముంచెత్తకుండా చేపట్టిన కరకట్టల నిర్మాణాలు ఆయనలోని శ్రామికుణ్ణి జ్ఞప్తికి తెస్తాయి. దివిసీమ ప్రజల చిరకాల స్వప్నం పులిగడ్డ-పెనుమూడి వంతెనను చూసిన వారెవరికైనా మండలి గుర్తురాక మా నరు. వైఎస్ ఆ వంతెనకు కూడా మండలి వెంకటకృష్ణారావు పేరు పెట్టారు.

1926 ఆగస్టు 4న కృష్ణా జిల్లా కైకలూరు తాలూకా, పల్లెవాడ గ్రామంలో పుట్టిన మం డలి ‘దివిసీమ గాంధీ’గా ప్రజల మన్ననలనందుకున్నారు. 1997 సెప్టెంబర్ 27న తుదిశ్వాస విడిచారు. ‘బాధలో ఉన్న వారిని మనమే ముందు వెళ్లి ఓదార్చాలని’ వారు ఆచరించి చెప్పిన మాటలు దివిసీమ గుండెల్లో భగవద్గీతలా వినిపిస్తూనే ఉంటాయి.

-కోట వేణుగోపాల కృష్ణప్రసాద్
(నేడు మండలి వెంకటకృష్ణారావు 86వ జయంతి)
Source: Sakshi

2 comments:

  1. కృష్ణా, గుంటూరు జిల్లాలకు సుపరిచితుడైన మహోన్నతవ్యక్తిని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పటి తరానికి(ఆ రెండు జిల్లాలలో కూడా) ఆయన గురించి తెలియదు అనుకుంటేనే బాధగా ఉంటుంది.

    ReplyDelete