Monday, November 7, 2011

తెలుగులో కలం పేర్ల కథా కమామిషు...

రచయితల మారుపేర్లను కలం పేర్లు, శ్యౄ జూళ ఔఖౄళ అని వ్యవహరించడం జరుగుతున్నది. ప్రాచీన సాహిత్యంలో, ముఖ్యంగా సంస్కృత సాహిత్యంలో కవుల మారుపేర్లు అనేకరకాలుగా సంక్రమించిన పేర్లు, ఆధునిక కాలంలో చాలావరకు పెట్టుకున్న పేర్లు, ప్రకటించుకున్న పేర్లు, యూరో అమెరికన్ సాహిత్యంలో ప్రసిద్ధ రచయితలు కొందరు కలం పేర్లతోనే ప్రపంచానికి తెలుసు. సామ్యూల్ క్లెమెన్స్ మార్క్‌టెయిన్ పేరుతో రచనలు చేశాడు. కథారచయిత ఓ.హెన్రీ అసలు పేరు విలియమ్ సిడ్నీ పోర్టర్. మేరీ ఎన్ ఇవాన్స్ కలం పేరు జార్జ్ ఇలియట్. పద్దెనిమిదవ శతాబ్ది ప్రసిద్ధ ఫ్రెంచ్ తత్వవేత్త అసలు పేరు ష్రాంసువా మేరీ అరోవ్. స్ర్తిలు పురుషుల పేర్లను కలం పేర్లుగా ఉపయోగించుకోవడం ఉండేది. పురుషులు కూడా స్ర్తిల పేర్లతో రాయడమూ కనిపిస్తుంది. ప్రక్రియనుబట్టి, రచనా స్వభావాన్నిబట్టి వేరు వేరు పేర్లతో రాసిన రచయితలున్నారు. శాస్త్ర రచయితలు సృజనాత్మక రచనలు చేసేప్పుడు వేరే పేరును ఉపయోగించడం కూడా కనిపిస్తుంది. ఒక పేరుతో ప్రసిద్ధమైన రచయిత వేరే పేరుతో రాస్తే ఒకే రీతిలో ఆదరిస్తారా లేదా అని తెలుసుకోవడానికి కలం పేరుతో కొన్ని రచనలు చేయవచ్చు.
రచయితలు పేర్లను ఎన్నుకోవడంలో అనేక దృష్టి కోణాలుంటాయి. పేరు సరళంగా ఉండి సులభంగా ప్రచారంలోకి రావడం ఒక ముఖ్యమైన ప్రయోజనం. గౌరవం పెరగడం, జనామోదం పొందడం కూడా పేర్లను ఎన్నుకోవడానికి కారణాలవుతున్నాయి. పేరు నాగరికంగా లేదని కొందరు పేర్లు మార్చుకుంటే, కొందరు తమ గుర్తింపును కప్పిపుచ్చుకోవడానికి కలంపేర్లు పెట్టుకుంటారు. కులం, మతం తెలియకుండా ఉండాలనుకుని వేరుపేర్లు పెట్టుకున్నవాళ్లున్నారు. ఎక్కువగా శృంగారాన్ని గుప్పించే రచయితలు తరచుగా మారుపేరుతోనే రచనలు చేస్తారు. కొన్ని రచనలకి రచయితలు ఎవరో తెలియకపోవచ్చు. వాటినే అజ్ఞాత కర్తృకాలని అంటున్నాం. వౌఖిక సంప్రదాయంలో సంక్రమించిన సాహిత్యం, జానపద సాహిత్యం అజ్ఞాత కర్తృకాలుగా పేర్కొనడం జరుగుతున్నది. కలం పేర్లను నిర్దిష్ట నామాలు, అనిర్దిష్ట నామాలు అని రెండు రకాలుగా గుర్తించవచ్చు. నిర్దిష్ట నామాలు వ్యక్తినామాల లాగే ప్రచారంలోకి వస్తాయి. కొందరు నిర్దిష్టమైన కలం పేర్లను ప్రత్యామ్నాయంగా మాత్రమే వాడతారు. కొందరు అవసరాన్ని, సందర్భాన్నిబట్టి గుణవాచకాన్నో, విశేషణాన్నో కలం పేరుగా ఉపయోగిస్తారు. వీటిని అనిర్దిష్ట నామాలనవచ్చు. కాస్త వెనక్కి వెళ్లి పాత పత్రికలు తిరగేస్తే రచయితల మారుపేర్లు, కలం పేర్లు కోకొల్లలుగా కనిపిస్తాయి.
తెలుగు సాహిత్య లోకంలో కలం పేరుతో మాత్రమే తెలిసిన కవులు, రచయితలు చాలామందే ఉన్నారు. సరళంగా ఉండి, సులభంగా ప్రచారంలోకి వచ్చే పద్ధతిలో ఉంటాయి ఈ పేర్లు. ఆత్రేయ, ఆరుద్ర, అజంతా, ఎల్లోరా, ఓల్గా మొదలైన పేర్లు ఈ కోవలోకి వస్తాయి. కులం తెలియకుండా ఉండడానికి నగ్నముని, నిఖిలేశ్వర్, చెరబండరాజు, జ్వాలాముఖి, భైరవయ్య అన్న పేర్లు పెట్టుకున్నామని దిగంబర కవులు ప్రకటించుకున్నారు. ఆరుగురూ కలం పేర్లతోనే ప్రసిద్ధి పొందారు. మతం తెలియకుండా పెట్టుకున్న పేర్లు రుద్రప్రియ, సుగమ్‌బాబు, కౌముది. ప్రభుత్వ ఉద్యోగాలలోనో, ఆకాశవాణి వంటి ప్రభుత్వ రంగ సంస్థలలోనో పనిచేసేవారు ఇంకొక చోట సొంత పేరుతో రాయడానికి వీలులేని పరిస్థితులలోనో, భద్రత కోసమో కలంపేర్లను ఉపయోగించుకుంటారు.
ఆకాశవాణిలో పనిచేసిన యండమూరి సత్యనారాయణ ‘శ్రీవాత్సవ’ పేరుతో రచనలు చేశారు. తెలుగు స్వతంత్ర వార పత్రికలో ప్రతి సంవత్సరం ఆయనచేసిన సాహిత్య సింహావలోకనాలు చాలా ప్రసిద్ధాలు. ఏ కారణం చేతనో కల్లూరి వేంకట నారాయణరావు 1928 ప్రాంతంలో కవిత్వవేది పేరుతో ఆంధ్ర వాజ్ఞ్మయ చరిత్ర సంగ్రహం రాశాడు. తనది ప్రచ్ఛన్న నామమే కాని బిరుదం కాదని చెప్పుకున్నారు. ఆకాశవాణి ఉద్యోగంలోనే జీవితం గడిపిన బాలాంత్రపు రజనీకాంతరావు వేరే పేర్లతో రచనలు చేశారు. సినిమాలకీ రాశారు. పోలీసు శాఖలో పనిచేసిన మోహనరావు స్పార్టకస్ పేరుతో నవలలు రాశారు. పోలీసు జీవితానికి సంబంధించిన వస్తువుతో ఆయన రచనలు చేశారు. మల్లయ్య పేరుతో పంపిన రచనలు తిరిగి వస్తే నవీన్ అని పేరు పెట్టుకున్నారు అంపశయ్య రచయిత.
రచయితలు అనేక రకాలుగా కలంపేర్లను ఎన్నుకోవడం కనిపిస్తుంది. 1. నక్షత్రాలు: ఆరుద్ర (ఆర్ధ్ర), జ్యేష్ఠ, అశ్విని, ఆశే్లష, 2. ప్రకృతి: సముద్రుడు, సూరీడు, ఓల్గా. 3. సంస్కృతి: అజంతా, ఎల్లోరా, అతిథి, 4. పురాణాలనుంచి: గాండీవి, త్రినేత్ర, విశ్వామిత్ర, 5.చరిత్రనుంచి: శాలివాహన, కౌటిల్యుడు, మల్క్భిరాం, స్పార్టకస్, 6.సాహిత్యంనుంచి: భాసుడు, భారవి, క్షేమేంద్రుడు, 7.గోత్రనామాలు: ఆత్రేయ, కౌండిన్య.
ఈ పద్ధతులు కాక మరికొన్ని పద్ధతులు కూడా కలం పేర్లలో కనిపిస్తాయి. పురుషులు స్ర్తిల పేర్లతో రాయడం వీటిలో ముఖ్యమైంది. పి.ఎన్. ఆచారి లల్లాదేవి పేరుతో రచనలు చేశారు. నటరాజన్ శారద పేరుతో రాశారు. పి.విజయకుమార్ భార్య సౌభాగ్య పేరుతో రచనలు చేస్తున్నారు. బీనాదేవి భిన్నమైన పేరు. భార్యాభర్తలు ఇద్దరూ రచయితలే. బి.నరసింగరావు సంక్షిప్త నామం ‘బిన’, భార్య పేరులో చివరి భాగం ‘దేవి’ కలిసి బీనాదేవి అయింది. రచయిత్రి ఆనందరామం పేరులో తన పేరు సగం భర్త పేరు సగం కలిసి ఉంది. ఇంటా బయటా అలవాటైన ముద్దు పేర్లే కలం పేర్లుగా పరిణమించడం కూడా కనిపిస్తుంది. శివరాజు వెంకట సుబ్బారావుకి బుచ్చిబాబు అని పేరు వచ్చిన తీరిది. దేవులపల్లి సుబ్బరాయ శాస్ర్తీ బుజ్జాయిగ మాత్రమే లోకానికి తెలుసు. ఇంట్లో మహబూబ్ అలీకి పెట్టిన ముద్దు పేరు అఫ్సర్. అదే అతని కలం పేరు అయింది. రచయితలు మారు పేర్లు పెట్టుకునే పద్ధతులు, పేర్లు మార్చుకునే పద్ధతులు అనేక రకాలుగా ఉంటాయి. అసలు పేరేమో అని భ్రమ కలిగించేటట్టుంటాయి కొన్ని మారుపేర్లు. కొమర్రాజు లక్ష్మణరావు క.రామానుజరావు పేరుతో కథలు రాశారు. సురవరం ప్రతాపరెడ్డి భావకవి రామమూర్తి పేరుతో రచనలు చేశారు. వేమరాజు భానుమూర్తి భాస్కరాచార్య పేరుతో రాశారు. అందమైన సమాసాలను కలం పేర్లుగా వాడుకున్న వాళ్లున్నారు. వరవరరావు కలం పేర్లలో ఒకటి చంద్రమల్లిక. జలదాంతశ్చంద్ర చపల చేకూరి రామారావు ఒక సందర్భంలో వాడిన పేరు. ఎవరో తెలియదు కాని మల్లీప్రియ నాగరాజు పేరుతో సాహిత్య విమర్శ చేశాడొకాయన. ఒకే పేరు ఇద్దరు రచయితలకు ఉన్నప్పుడు వాళ్లను గుర్త్తించడానికి వేరు వేరు పద్ధతులు అనుసరించడం కనిపిస్తుంది. ఇస్మాయిల్ పేరుతో ఇద్దరు రచయితల ప్రసిద్ధులు. ఒకరు స్మైల్ అయినాడు. ఒకే కుటుంబానికి సంబంధించిన వారైతే సీనియర్, జూనియర్ అని చేర్చడం కనిపిస్తుంది. సముద్రాల సీనియర్, సముద్రాల జూనియర్, వేదం వేంకటశాస్ర్తీ జూనియర్ ఇలాంటివే. పూర్తిపేరుతోనే రచనలు చేసినా ఇంటిపేరుతో కొందరు రచయితలు ప్రచారంలో ఉంటారు. కందుకూరి, గురజాడ, దేవులపల్లి, విశ్వనాధ, అనిశెట్టి, గొల్లపూడి, మునిమాణిక్యం, ఏల్చూరి, దాశరథి, కుందుర్తి, కాళోజీ, కొవ్వలి, నార్ల, సలంద్ర ఇలా ఎన్నైనా చెప్పవచ్చు. ఎలకూచి బాల సరస్వతి పదిహేడవ శతాబ్దపు తెలుగు వైయాకరణుడు. ఎలకూచి ఇంటిపేరుగల ఎలకూచి వెంకటరమణ ‘బాలసరస్వతి’ కలంపేరుగా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది.
శ్రీశ్రీ, ఆరుద్ర మొదలుకుని కలం పేరుతో ప్రసిద్ధులైన రచయితలెందరో ప్రత్యేక సందర్భాల్లో ఎన్నో మారుపేర్లతో వ్యాసాలు రాసి, శీర్షికలు నిర్వహించారు. ఒకేపత్రికలో వేరు వేరు శీర్షికలు నిర్వహించవలసి వచ్చినప్పుడు వేరు వేరు పేర్లను ఉపయోగించిన వాళ్లున్నారు. కొందరు ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కలం పేరు వాడారు. పండితుడు, విమర్శకుడు అక్కిరాజు ఉమాకాన్తమ్ 1913-14 మధ్య ‘ఆర్యుడు’ అనే పేరుతో త్రిలిఙ్గ పత్రికలో కథలు రాశారు.
తెలుగు సృజనాత్మక రచయితలలో ఎక్కువగా మారుపేర్లతో రచనలు చేసిన వాళ్లలో రాచకొండ విశ్వనాధ శాస్ర్తీని చెప్పుకోవాలి. రచయితలు రచనలు చేస్తున్న తొలినాళ్లలో ఆత్మవిశ్వాసం లేకపోవడంవల్లనో, బిడియం వల్లనో, ఆర్థిక కారణాల వల్లనో ఒకటి కంటే ఎక్కువ మారుపేర్లు ఉపయోగించడం సాధారణం. నిర్దిష్టంగా ప్రచారంలో లేని కలం పేర్లని అనిర్దిష్ట నామాలని అనవచ్చు. ప్రత్యేక సందర్భాలలో ప్రత్యేక అవసరాలను బట్టి ఉపయోగించుకునే పేర్లివి. వ్యక్తి నామరూపంలోని కలం పేర్లలాగా ఈ పేర్లు ప్రచారంలో ఉండవు. ఇటువంటి పేర్లు సాధారణంగా విశేషణాలై ఉంటాయి. పరిశోధన, విమర్శ, చర్చలు చేసే సందర్భాలలో లేఖకులు ఈ పద్ధతిని అవలంబిస్తారు. చర్చలలో తానెవరో తెలియకుండా ఉండడానికి రచయితలు ఉపయోగించే ప్రత్యేక సంజ్ఞలే అనిర్దిష్ట నామాలు. చర్చకు సంబంధించిన విషయాన్ని, కార్యక్షేత్రాన్ని, రాజకీయాలను, వృత్తిని, ప్రవృత్తిని, వర్గాన్ని, దృక్పథాన్ని, భావ జాలాన్ని, ఆసక్తిని, అభిరుచిని, నిరసనను, స్వభావాన్ని, వైయక్తిక స్థితిని సూచించేట్టు ఉంటాయి ఈ పేర్లు. పాత పత్రికలలో, రచయితల పట్టికలలో కనిపించే కలం పేర్లు కొన్ని ఉన్నాయి.
పరిశోధన, విమర్శ రంగాలలో విస్తృతంగా రాసేవాళ్లు, చర్చలు, వాదోపవాదాలు, ప్రతివాదాలలో పాల్గొనేళ్లు, వివిధ రంగాలలో పనిచేసే అవసరం ఉన్నవాళ్లు రకరకాలుగా మారుపేర్లను, విశేషణ రూపంలో పేర్లను ఉపయోగిస్తారు. చర్చలలో తీవ్రమైన ప్రతిస్పందనలు వ్యక్తం చేసేటప్పుడు పేరుమార్పు తప్పనిసరి అవుతుంది. వీటిని ఒకరకంగా ప్రచ్ఛన్న నామాలు అనవచ్చు. పండితుడు, పరిశోధకుడు, బహుభాషావేత్త, పాత్రికేయుడు తిరుమల రామచంద్రకు పదుల సంఖ్యలో పేర్లున్నాయి. నిరంతరం రాసే కె.వి.రమణారెడ్డి కూడా పదుల సంఖ్యలో పేర్లను ఉపయోగించుకున్నారు. పండిత పరిశోధకుడైన వేటూరి ప్రభాకర శాస్ర్తీ చాలా పేర్లతో రాశారు.
తెలుగు సాహిత్యంలో జంటకవుల సంప్రదాయం ఉంది. పూర్తిగా మారుపేర్లు కావు కాని ఇద్దరు కవుల పేర్లతో ఏదో ఒక సంబంధం కల పేర్లు కలిసి కవుల పేర్లు ఏర్పడతాయి. తిరుపతి వేంకట కవులు, వేంకట పార్వతీశ్వర కవులు, శేషాద్రి రమణ కవులు మొదలైన విధంగా అసలు పేర్లు పూర్తిగానో, పాక్షికంగానో కలిసి పేర్లు ఏర్పడతాయి. పింగళి కాటూరి కవులు వంటివి ఇంటిపేర్లతో ఏర్పడ్డపేర్లు. కవులు సోదరులైతే కొప్పరపు సోదర కవులు, ఆదిపూడి సోదరకవులు, కోట సోదర కవులులా పేర్లేర్పడతాయి. ఇద్దరి కంటే ఎక్కువమంది కవులు కలిస్తే గుంపు కవులు, సమూహ కవులు అనవచ్చు. సమూహ కవులు అందరినీ గుంపుగా గుర్తించే పేరు పెట్టుకుంటారు. నయాగరా కవులు, దిగంబర కవులు, పైగంబర కవులు, తిరుగబడు కవులు, విపశ్యన కవులు ఆధునిక తెలుగు సాహిత్యంలో కనిపించే సమూహ కవులు. పేర్ల తొలి అక్షరాలు కలిపి పెట్టుకున్న అద్వయం, భైకొ, శిరసుల చిక్కుముడి విప్పడం భవిష్యత్తరాల వారికి అంత సులభం కాదు. తెలుగులో మారుపేర్లు, కలం పేర్లను గురించి ఇంతవరకు తెలుసుకోగలిగింది చాలా తక్కువే. మరింత పరిశోధిస్తే మరెన్నో సాహిత్యపరమైన అంశాలు వెలికివచ్చే అవకాశాలున్నాయి. సాహిత్య చరిత్ర నిర్మాణానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది. కలం పేర్ల కథను వివరంగా, విస్తృతంగా తెలుసుకోగోరేవారు కె.పి.అశోక్‌కుమార్, ఎ.ఎన్.రాజు కూర్చిన గ్రంథం తెలుగులో మారుపేరు రచయతలు ప్రధాన భాగంలోకి వెళ్లాలి మరి. 
-కె.కె.రంగనాథాచార్యులు ( నేటి ఆంధ్రభూమి నుండి )

No comments:

Post a Comment