Tuesday, November 8, 2011

ఇకనైనా ఆడపిల్ల " లక్ష్మి దేవి " అందాం- లింగ వివక్షను రూపుమాపుదాంలింగవివక్షతను తగ్గించడంలో మన దేశం ఆశాజనకమైన పాత్ర ఏమీ నిర్వహించడం లేదని యునెటైడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ పోగ్రాం (యుఎన్‌డిపి) రూపొందించిన తాజా నివేదికలోని లెక్కలను చూస్తే తేలిగ్గానే తెలిసిపోతుంది. మన దేశంలో తిష్ట వేసిన లింగవివక్షతను రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ చైతన్యంతో ముందడుగు వేయవలిసిన సమయం ఇది.

లింగవివక్షత అనేది ఎప్పటికప్పుడు కొత్తగా వినిపిస్తున్న పాత పదం. యుఎన్‌డిపి జెండర్ ఇన్‌ఈక్వాలిటి ఇండెక్స్‌లో మన దేశానికి 134 ర్యాంక్ వచ్చిన నేపథ్యంలో లింగవివక్షత మరోసారి చర్చల్లోకి వచ్చింది. లింగవివక్షత అనేది కేవలం ఉపరితల సమస్య కాదు. దాని మూలాలు మన ఆర్థిక,సామాజిక, సాంస్కృతిక రంగాల్లో బలంగా వేళ్లూనుకొని ఉన్నాయి.

ఇక్కడే మొదలవుతుంది.... 
‘‘అయ్యో! అమ్మాయి పుట్టింది’’ అని బాధ పడే వారు ఈ కాలంలోనూ ఉన్నారు. ఆడబిడ్డకు జన్మనిచ్చేందనే కారణంతో భార్యలను హింసపెట్టే భర్తలు కూడా ఉన్న కాలం ఇది.
అమ్మాయి పుట్టినప్పుడు వచ్చే స్పందనకు, అబ్బాయి పుట్టినప్పుడు వచ్చే స్పందనకు మధ్య కనిపించే తేడాతోనే లింగ వివక్షతకు తొలి బీజం పడుతుంది. ‘అమ్మాయి పుట్టింది’ అని భయపడడానికి ఆర్థికవిషయాలు కూడా ఒక కారణం అవుతున్నాయి. ఫలానా పని అబ్బాయిలే చేయాలి, ఫలాన పని అమ్మాయిలే చేయాలి అనే కృత్రిమవర్గీకరణ వలన లింగవివక్షత మొదలవుతుంది. లింగవివక్షతకు తొలిబీజం కుటుంబంలోనే పడుతుంది.
‘‘మగరాయుడిలా ఆ సైకిల్ తొక్కడం ఏమిటి?’’ అని విసుక్కుంటారు.
(సైకిల్ తొక్కడం మీద అబ్బాయికు మాత్రమే పేటెంట్ ఉన్నట్లు!)
కాస్త గట్టిగా మాట్లాడితే-‘‘అమ్మాయిలా అణకువగా మాట్లాడు’’ అని తిడతారు.
జ్ఞానం ప్రవహించే బడిలో కూడా మనకు తెలియకుండానే వివక్ష ప్రతిఫలిస్తుంది.
‘‘ఈ ప్రశ్నకు జవాబు చెప్పకపోతే అమ్మాయిల చేత చెంపదెబ్బలు వేయిస్తాను’’ అని బెదిరిస్తారు. ఈ బెదిరింపులో ‘అమ్మాయిల చేత దెబ్బ తినడం సిగ్గుచేటు’ అనే పక్కదారి పట్టించే సందేశం ఉంది.

తాతాముత్తాతల కాలంతో పోల్చితే స్త్రీల పరిస్థితి మెరుగుపడవచ్చుగాక, విద్యా ఉద్యోగరంగాల్లో రాణించవచ్చుగాక. అయితే లింగవివక్ష తొలిగిపోయింది అని చెప్పడానికి ఇది మాత్రమే ఆశాజనకమైన ప్రమాణం కాదు. ఇప్పటికీ చాటుమాటుగా లింగనిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. చాలా రాష్ట్రల్లో గ్రామీణప్రాంతాల్లో బాల్యవివాహాలు ఇప్పటికి జరుగుతున్నాయి. ఉన్నతచదువులు చదివినప్పటికీ పెళ్లి కాగానే మహిళలను ఇంటికి పరిమితం చేసే పద్ధతులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
భూమి, ఆర్థికసేవలు, విద్య, మార్కెటింగ్ తదితర రంగాల్లో పురుషులతో సమానంగా స్త్రీలకు ప్రాతినిధ్యం లేదు. ప్రాధాన్యత లేదు. పురుషులతో పాటు స్త్రీలకు కూడా ఆయారంగాల్లో ప్రాతినిధ్యం కల్పిస్తే ఫలితాలు బాగుంటాయని ఆర్థికనిపుణులు చెబుతున్నారు. ‘‘వ్యవసాయరంగంలో పురుషులతో పాటు స్త్రీలకు అవకాశం కల్పిస్తే ఉత్పత్తి భారీగా పెరుగుతుంది’’ అని ఆర్థిక నిపుణులు చెబుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.

ఇప్పుడు చేయాల్సింది ఏమిటి?
లింగవివక్షతను నిర్మూలించడానికి ఎవరో కంకణం కట్టుకోని బయలుదేరాల్సిన అవసరం లేదు. తమ బాధ్యతగా ఎవరి వారు సామాజికస్పృహతో ఉంటే లింగ వివక్ష రెక్కలు విరవచ్చు. వివక్షత లేని సమాజాన్ని నిర్మించ వచ్చు.

2 comments:

  1. ఇవన్నీ చాలా బాగున్నాయి.
    కాని ప్రతిరోజు దూరదర్శినిలో వచ్చే అసంఖ్యాక ధారావాహికల్లో యీ వివక్ష కనిపిస్తోంది కదా? దానిని యెలా యెదుర్కొని తిప్పికొట్టాలి. ముఖ్యంగా యీ ధారావాహికలు చాలా తెలివిగా తప్పును కప్పిపుచ్చుకుంటుంటాయి. అమ్మాయి మీద వివక్షతతోకూడిన లేదా అదిప్రాతిపదికగాకల కధను సాగదీస్తూ, "ప్రతి ఆడపిల్లా తన హక్కులను తాను తెలుసుకోవాలని..... మా చిరు ప్రయత్నం" లాంటి ఉదారమైన బాధ్యతారాహిత్యంతో కూడిన పక్కదారి పట్టించే ప్రకటన ఒకటి వేస్తుంటారు. ఆడవాళ్ళను కేవలం ఆడవాళ్ళయినందుకే రకరకాల హింసలకు గురిచేసే కథాసన్నివేశాలు సృష్టించుకొంటూ పోతూ, వాళ్ళ కష్ఠాలు చూపి మనలో చైతన్యం తెచ్చేందుకే అన్నట్లు చిలకపలుకులు చెబుతారు. ఈ రకమైన ఆటలనీ అరికట్టవలసి ఉంది.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete