Wednesday, October 19, 2011

కన్యాశుల్కంపై పాశ్చాత్య ప్రభావం


 


gurajaada‘కన్యాశుల్కం’ నాటకంపై పాశ్చాత్య ప్రభావాలు, ఆ నాటక రచయిత గురజాడపై సాహిత్య పరిశోధకులకు మేలుబంతి వంటి అంశం. ‘మద యం’ పేరిట గురజాడ జీవితం, సాహిత్యాలపై సమగ్ర పరిశీలన వెలువరించిన కె.వి. రమణారెడ్డి, 1969లో బంగోరె (బండి గోపాలరెడ్డి) మాద్రాసు ఓరియంటల్‌ మాన్యుస్క్రిప్ట్‌‌స లైబ్రరీ నుంచి వెలికి తీసి ప్రచురించిన తొలి ‘కన్యాశుల్కం’, దీనితో పాటుగా వెలువరించిన విపులమైన వ్యాసాలు (ఆరుద్రవి, బంగోరెవి), ఈ నాటకం గురించిన కొంత మౌలిక సమాచారాన్ని వెలుగులోకి తెచ్చాయి.

‘కన్యాశుల్కం’ నాటక రచనా కాలానికి పాశ్చాత్య నాటకరంగంలో శక్తిమంతమైన నాటకాలు వచ్చాయి. 1912-13లలో వెలువడిన ఇంగ్లీష్‌ పుస్తకాలు కూడా గురజాడ ఇంట్లో మిగిలి ఉన్న కొద్దిపాటి ఆయన పుస్తకాలతో కనిపించడం ఆశ్చర్యపరచదు సరికదా 1915లో తాను మరణించేదాకా, సమకాలీన ప్రపంచ సాహిత్యంతో అధ్యయన సాన్నిహిత్యాన్ని గురజాడ కలిగి ఉన్నాడన్న విషయాన్ని సృష్టం చేస్తాయి.
కన్యాశుల్కం నాటకం తొలి డైలాగులోనే ఒక పాశ్చాత్య రెఫరెన్సు తీసుకు వస్తాడు గురజాడ. ‘బుర్ర బద్దలు కొడదమా అన్నంత కోపం వచ్చింది కానీ పూర్‌ రిచ్ఛర్డు చెప్పినట్టు పేషెన్స్‌ ఉంటేనే కాని లోకంలో పని జరగదు’. ఇక్కడ ఈ రిచ్ఛర్డు ఎవరో ఆనాటికి బంగోరెకి అంతుపట్టలేదు. ఆయన అదే తెలుపుతూ ‘ఈ మాట అన్నది యే రిచ్ఛర్డో పరిశోధించవల్సిఉంది. బహుశా షేక్‌స్పియర్‌ గారి రెండో రిచ్ఛర్డా? లేదా ఇది గిరీశం గారి వట్టి బుకాయింపేనేమో!’ అని, లఘుటిప్పణిలో తన బహిరంగ స్వగతం నమోదు చేశారు.

ఈ పూర్‌ రిచ్ఛర్డ్‌‌స బెంజమెన్‌ ఫ్రాంక్లిన్‌. ఈయన పూర్‌ రిచ్ఛర్డ్‌‌స ఆల్మొనాక్‌ పేరిట నడిపే పత్రికలో ఎన్నో సూక్తి పరంపరలుండేవి. మన వేమన పద్యాల వంటివి కావచ్చు, శతకానికి మకుటంగా ఉండే పాదం మినహాగా. దీన్ని అందుకో లేకపోయినా, తాను ముద్రించిన గురజాడ తొలి కన్యాశుల్కం ప్రతిలో ఎన్నో విలువైన ఆలోచనలు, ఆవిష్కరణలు చేశాడు బంగోరె. ఎంతలా తను సమకాలీన సారస్వతం చదువుకున్నాడో వాటి సమయోచిత ప్రస్తావనల ద్వారా గురజాడ నాటకంలో ముఖ్యపాత్రల్లో ఒకటైన గిరీశం కారెక్టర్‌ నిర్మాణంలో విని యోగించాడు. గిరీశం పాత్రకు గల చెడు లక్షణమల్లా జ్ఞానం లేకపోవడం కాదు, తెలిసిన దానికన్నా ఎక్కువే తాను ఎరుగుదునని భావించడం, తెలిసిన జ్ఞానాన్ని వంచన, దబాయింపు, మోసం వంటి చిన్న సైజు నేరాలకు ఉపయోగిస్తూ అనైతిక ప్రయోజనాన్ని ఆశిస్తూ, అందుకై ప్రణాళికలు రచించడమే.


lejends
కన్యాశుల్కం నాటకంలో కొత్తదనం ఏదైనా ఉందీ అంటే, అది గిరీశం ప్రతి నిధిగా నాటకంలో ప్రవేశించిందే అయివుం టుంది. లోకంలోని ఉత్తముల పేర్లూ, చిక్కు లెక్కలు, చిక్కని కవిత్వం, కొంచెం హిస్టరీ, కాస్త జాగర్ఫీ- ఇవన్నీ తన అవకాశవాద ప్రయాసలో వాడుకుంటాడు గిరీశం. కొంచెం శకారుడు, కొంచెం ఫాల్‌స్టాఫ్‌, కొంత ఉత్తర కుమార ప్రగల్భాలు అన్నీ కలగలిస్తే ఒక గిరీశం. గురజాడ గిరీశం పాత్ర సృష్టికి ముందే రష్యన్‌ రచయిత నికొలాయి గొగోల్‌ ‘గవర్నమెంటు ఇన్స్‌స్పెక్టరు’ అనే సుప్రసిద్ధ నాటకంలో క్లెష్టాకోవ్‌ అనే పోజుల రాయుడ్ని, వంచనా శిల్పిని చిత్రణ చేశాడు.

ఒక పట్టణానికి మేయరుగా ఉన్న అవినీతిపరు డు, అతని అనుచర వర్గం- త్వరలో ఒక గవర్న మెంటు ఇన్స్‌స్పెక్టరు తమపై తనిఖీకి తమ ఊరికి రానున్నాడన్న విషయం తెలిసి గాబరా పడతారు. ఈలోగా వారికి తమ ఊళ్ళోనే గత కొద్దిరోజులుగా హోటల్‌లో ఉంటున్న క్లెష్టాకోవ్‌పై దృష్టిపడి, ఇతనే తన అసలు సంగతి పైకి చెప్పకుండా ఉన్న గవర్నమెంటు ఇన్స్‌స్పెక్టర్‌గా భావించి సకల మర్యాదలూ చేస్తారు అతడికీ, అతడి సహాయకుడికి. వీరి కంగారు, భయం గమనించి పొందవలసిన లాభాలన్నీ పొంది క్లెష్టాకోవ్‌ తన సహాయకుడితో నిష్క్రమించాక, అప్పుడు వస్తుంది అసలు వర్తమానం- త్వరలో గవర్నమెంటు ఇన్స్‌స్పెక్టర్‌ రాబోతున్నాడని. జారు చక్రవర్తుల కాలపు రాచరిక వ్యవస్థలోని అవినీతిని ప్రస్ఫుటంగా చిత్రించిన నాటకం ఇది.

గురజాడ కన్యాశుల్క రచన కాలానికి కొన్ని దశాబ్దాల ముందే ప్రపంచ నాటక రంగంలో రష్యాలో నికోలాయి గొగోల్‌, ఇవాన్‌ తుర్జెనీవ్‌, అలెగ్జాండర్‌, ఆస్ట్రోవిస్కీ నాటక రచయితలుగా పేరు గాంచారు. రెవిజర్‌ (గవర్నమెంట్‌ ఇన్స్‌స్పెక్టర్‌)రె గొగోల్‌ 1836లోనూ, ఆస్ట్రావిస్కీ సైతం 1850-1870 మధ్య కాలంలో అరడజను వరకూ సాంఘిక నాటకాలు రాసి ఉన్నారు.
ఇవాళ్టి ఇంటర్‌నెట్‌, ఆధునిక సమాచార ప్రసార వేగం ఏమీ ఇంకా ఏర్పడని కాలంలో ‘బంగోరె’ కన్యాశుల్కంపై పరిశోధకుడిగా విశేష కృషిచేసి, గురజాడకు సమకాలికంగా ఇంకా నాడు ప్రపంచరంగంలో ఫ్రెంచి, స్వీడిష్‌, నార్వీబియన్‌, జర్మన్‌ నాటక రచయితలున్నారని పేర్కొంటూ వారి వివరాలు పొందుపరిచాడు.

బంగోరె మంచి పాఠకుడు కూడా కావడం వల్ల, ఆనాడు ఫ్రాన్సులో రాస్తున్న అలెగ్జాండర్‌ డ్యూమా, విక్టోరియన్‌ సార్డోవ్‌, స్వీడన్‌లో ఆగస్ట్‌ స్ట్రిండ్‌బర్గ్‌, నార్వేలో హెన్రిక్‌ ఇబ్సన్‌, జాన్‌స్టెన్‌ జార్న్‌సన్‌, రష్యాలో ఏరటన్‌ చెవోవ్‌, జర్మనీలో గెర్హార్ట్‌ హాప్ట్‌మన్‌, హెర్మాన్‌ సండర్‌మాన్‌, ఇంగ్లాండులో జార్జి బెర్నార్డ్‌షా, హెన్సీ ఆర్ధర్‌ జోన్స్‌, ఆర్థర్‌వింగ్‌ పినెరో- వీరందనికి ఉటంకిస్తూ ‘వీళ్ళు రాసిన అన్ని నాటకాలను నేను చదవలేదు గానీ, సగటున ఒకొక్కక్కరిదీ ఒక్కక్కటి చొప్పునైనా చదివిన జ్ఞాపకం ఉంది’ అంటాడు బంగోరె.
నిజానికి ప్రపంచ నాటకరంగంలో ‘కన్యాశుల్కం’ స్థానం ఏమిటి అన్న పరిశోధన 1969లో బంగోరెతోనే మొదలయినట్టు భావించాలి. అంత వరకూ మన సాంప్రదాయ నాటక రీతులలో ఎలా ఇముడుతుంది కన్యాశుల్కం? అని జరుగుతూ వచ్చిన ఆలోచనలను విస్తరించినవాడు బంగోరె.
కన్యాశుల్కం విశాలప్రాసంగికత (ఔ్చట్ఛట ్ఛజ్ఛూఠ్చిఛ్ఛి) పై అపార విశ్వాసంగలవాడు, తెలుగుజాతి గర్వపడాల్సిన సాహిత్య పరిశోధకుడు బంగోరె, ఇలా విస్పష్ట ప్రకటన చేస్తాడు: ‘తనకు సమకాలికంగా జీవించి ప్రపంచంలో ఆనాటికే నాగరికులుగా చలామణిలో ఉన్న ఈ నానాదేశాల ఉద్దండ నాటక రచయితల సరసన సగర్వంగా గురజాడ కూర్చోగలరు. వారి నాటకాల మధ్య దివిటీ ముందర ప్రమిద లాగ కాదు, దివిటీ ముందర ఇంకో దివిటీగా భాసించగల సత్తా తెలుగు కన్యాశుల్కానికి ఉందని నమ్మేవాళ్లలో నేనొకడిని’.
ఈ పరిశోధన ఇవాళ నిజమైన రీతిలో విస్తరించాల్సి ఉంది.

ఈ ఆధునిక సమాచార యుగంలో ఇది కష్టసాధ్యం కావచ్చు, కానీ అసాధ్యం మాత్రం కాదు. పరిమిత వనరులతో, సాంకేతికత అంతగా వికాసం చెందని కాలాన బంగోరె చేసిన కృషి, ఇవాల్టి తరాల తెలుగు సాహిత్య పరిశోధకులకు, యువరచయితలకు ఆదర్శం కాగలిగితే, మనం వర్తమాన యుగంలో కన్యాశుల్కం నాటకాన్ని సర్వతోముఖ విపులతతో అందుకోగలుగుతాము. దీనినే కలగంటూ బంగోరె అన్న మాటలు ఇంకా మన ఆచరణకై ఎదురుచూస్తున్నాయి:

‘ఈ అన్ని ప్రపంచ భాషలలోనూ గురజాడకు కాస్త ముందు వెనుకల వచ్చి ఉన్న ఈ నానావిధ నాటకాలన్నీ ఏర్చి గుట్ట కట్టి, అన్నిటిని చదివి, సానుభూతితో, ఆధునిక నాటకంగా కన్యాశుల్కం స్థానమేమిటో తేల్చే విషయం మీదనే ఒక డాక్టరేట్‌ థీసీస్‌ సబ్జెక్టుగా మన మూడు విశ్వవిద్యాలయాలలో (1969 నాటికి) ఒకటైనా ఎన్నిక చేయాలని నా అభిలాష’.
కన్యాశుల్కం నాటక కాలపు భారతీయ నాటక రంగంపై మాన్యులు డా యు.ఎ. నరసింహమూర్తి విపుల గ్రంథం వచ్చింది కానీ దీని పరిధి దేశీయమైనది. ప్రపంచ స్థాయిలో ఈ బేరీజు వేసే బృహత్‌ కార్యం ఇంకా జరుగవలసి ఉంది. టాగూర్‌ 150వ జయంతి వెనువెంటనే గురజాడ 150వ జయంతి వస్తుంది. ఎందుకంటే ఇద్దరి పుట్టుకకు ఒక ఏడాది మాత్రమే తేడా. గురజాడను ఈ 150వ జయంతి వత్సరంలో నూతన మూల్యాంకనాలకై స్మరించుకోవడం, విశ్లేషణలు, కొత్త సమాచారాన్ని జోడించడం అనేది మన తరం రచయితలు పూనికతో చేయాల్సిన పని.

jagaddhatriఇది గురజాడకే కాక ఆయన సాహిత్య పరిశీలకులు, పరిశో ధకులు అయిన కె.వి.ఆర్‌., బంగోరెలకు కూడా మనం అర్పించే నివాళి అవుతుంది.ఉత్తమ పాత్రికేయులు నార్ల వేంకటేశ్వరరావు ‘ట్రెడిషనల్‌ ఇండియన్‌ కల్చర్‌’లో అన్న విధంగా: ‘సమకాలికం మరియు సార్వత్రికం, స్థానికం మరియు విశ్వజనీనం- అదీ గురజాడ అప్పారావు కళా ధర్మం’. దీన్ని సాకారం చేసుకొనే దిశలో మన ఉత్తమోత్తమ కృషిని నమోదు చేద్దాము.

No comments:

Post a Comment