Thursday, November 14, 2013

బాలల దినోత్సవం ,Children's Day



ప్రతి సంవత్సరం నవంబరు 14న బాలల దినోత్సవం జరుపుకుంటాము. భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం రోజున ఈ ఉత్సవం జరుగుతుంది.భారత తపాళా శాఖ ప్రతి సంవత్సరం ఈ రోజు తపాలా బిళ్ళను విడుదల చేస్తుంది.ఈ బాలల దినోత్సవం నాడు ప్రతి పాఠశాలలోనూ ప్రత్యేకంగా వేడుకలను నిర్వహిస్తారు.అందరూ అనుభవించే బాల్యం.. భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం. అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు. అటువంటివారి పేరిట బాలల దినోత్సవం వేడుకను నిర్వహించటం వారిలో నూతనోత్తేజాన్ని...ఈ సందర్భంగా చిన్నారులకు వివిధ రకాల పోటీలు, సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాలల్లో ఉండే నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని పాఠశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి.

పేద, నిరుపేద కుటుంబాలకు చెందిన కొంతమంది చిన్నారులు అతి చిన్న వయసులోనే పలకా బలపం పట్టాల్సిన చేతులతో తట్ట, పార పట్టి పనులకు వెళ్లడం ప్రతినిత్యం మనం చూస్తునే ఉన్నాం. దీనికి ఆ తల్లి దండ్రుల్లో ఉన్న నిరక్షరాస్యత కొంత కారణమైతే ఆ కుటుంబాలు ఆర్ధిక స్ధితి గతులు మరో కారణంగా చెప్పవచ్చు. మారుమూల గ్రామాల్లో ముఖ్యంగా యాదవ, మత్య్సకార ఇతర కులాలకు చెందిన చిన్నారులను బడికి పంపకుండా పనుల్లో పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతేకాకుండా పిల్లలకు మూడో సంవత్సరం రాగానే బుడి బుడి నడకలతోనే మోయలేని పుస్తకాల మోతతో పట్టణాల్లో, మండల కేంద్రాల్లోను ఆ పిల్లలు బాల్యం మోయలేని భారంగా మారుస్తున్నారు. నేటి బాలలే రేపటి పౌరులని ప్రకటనలు గుప్పిస్తున్న నేతలు, అధికారులు ఇళ్లల్లో ఎక్కువగా పనులలో బాలలే కనిపిస్తున్నా ఏ ఒక్కరికీ అది తప్పుగాను, చట్టవిరుద్దంగాను కనిపించకపోవడం పలువురికి ఆశ్చర్యం కల్గిస్తుంది.

ఒకసారి బాలల దినోత్సవం చరిత్రను మననం చేసుకుందాం. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం బాలల దినోత్సవాన్ని నవంబర్ 20న అధికారికంగా జరుపుకుంటుంటారు. అయితే 1959కి ముందు అక్టోబర్ నెలలో బాలల దినోత్సవాన్ని జరుపుకునేవారు. ఐక్యరాజ్యసమితి నిర్ణయించిన ప్రకారం బాలల దినోత్సవాన్ని మొదటిసారిగా 1954లో ప్రపంచమంతటా నిర్వహించారు.1959 నవంబర్ 20న బాలల హక్కుల ప్రకటనను ఐరాస సర్వసభ్య సభ రూపొందించిన సందర్భంగా బాలల దినోత్సవాన్ని ప్రపంచ మంతటా జరుపుకోవాలని నిర్ణయించారు. 1989లో పిల్లల హక్కులపై నవంబర్ 14న ఓ బిల్లును ఐరాస ఆమోదించింది. ఈ బిల్లును ఆమోదిస్తూ 191 దేశాలు సంతకాలు పెట్టాయి కూడా.పిల్లలు తమ భావాలను, సమాచారాన్ని పంచుకోవడాన్ని, పరస్పర అవగాహనను పెంచుకోవడాన్ని ప్రోత్సహించేందుకు గాను ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ బాలల దినోత్సవానికి రూపకల్పన చేసింది. ప్రపంచమంతటా పిల్లల సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకోసం పలు చర్యలు చేపట్టడం ఈ దినోత్సవం లక్ష్యం.



నవంబర్‌ 14 భారతీయ బాలలకు ఎంతో ఇష్టమైన రోజు. ప్రభుత్వం అధికారికంగా వారికోసం కేటాయించిన ఒక్కగానొక్క రోజది. అయితే బాలల దినోత్సవాన్ని మనలాగా ప్రపంచదేశాలన్నీ అదే రోజున జరుపుకోవు. ఒక్కో దేశం ఒక్కో రోజున జరుపుకుంటుంది. చైనాలో జూన్‌ 1వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు. శుభాకాంక్షలు చెప్పుకుని పాఠశాలల్లో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోజు పాఠశాలలు తెరిచివున్నా తరగతులు జరగవు. మన పొరుగు దేశమైన పాకిస్తాన్‌లో నవంబర్‌ 20వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు. ఆరోజున పాఠశాలలు మామూలుగానే నడుస్తాయి. టీవీలు, రేడియోల్లో మాత్రం ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తారు. జపాన్‌లో మే 5న జరుపుకుంటారు. ఆరోజున మగపిల్లలున్న వారు చేప ఆకారంలో వున్న గాలిపటాలను ఎగురవేస్తారు. అంతేకాక యుద్ధవీరుల బొమ్మలతో కొలువు ఏర్పాటుచేస్తారు. ఆరోజు జాతీయ సెలవుదినంగా కూడా ప్రకటిస్తారు. దక్షిణ కొరియాలో మే 5వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు. ఆరోజున ఇక్కడ పిల్లలకోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. వారు ఎప్పుడూ గుర్తుంచుకునేలా పెద్దలు పిల్లలకోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఎక్కడికైనా బయటకు తీసుకెళతారు. పోలాండ్‌లో జూన్‌ 1న బాలల దినోత్సవం చేసుకుంటారు. ఆరోజున స్కూళ్లల్లోనే రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. పార్కుల్లో, వినోద కేంద్రాలలో పిల్లలకోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. శ్రీలంకలో అక్టోబర్‌ 1 అంటే పండుగే. పెద్దలు తప్పనిసరిగా వారిని బయటకు తీసుకెళతారు. ఇళ్లల్లో వారికోసం ప్రత్యేకంగా స్వీట్లు చేస్తారు. ఇవేకాక వివిధ దేశాలలో బాలలదినోత్సవాలను ఒక్కోరోజు జరుపుకుంటున్నారు.

Children's Day in India:

మనకు చాలా మంది దేశ నాయకులుండగా జవహర్‌లాల్‌ నెహ్రూ పుట్టినరోజునే బాలల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటావో తెలుసా... పిల్లలంటే ఆయనకు చాలా చాలా ప్రేమ కాబట్టి! నెహ్రూ మన దేశానికి మొదటి ప్రధానమంత్రి. ఆ పదవిలో ఉండేవారికి ఎన్నో బాధ్యతలుంటాయి. తీరిక అస్సలే ఉండదు. కానీ ఆయన మాత్రం అంత పని వత్తిడిలోనూ ఎలాగోలా వీలు చేసుకొని పిల్లలతో మాట్లాడేవారు. పిల్లలంతా ఆయన్ని ప్రేమగా 'చాచా' అని పిలిచేవారు. నెహ్రూ గురించి ......

నెహ్రూ పూర్వీకులు కాశ్మీర్‌ నుంచి వచ్చి ఢిల్లీలో స్థిరపడ్డారు. వారి కుటుంబం ఢిల్లీలో ఒక కాలువ ఒడ్డున ఉండేది. హిందీలో కాలువను 'నెహర్‌' అంటారు. అలా వారికి నెహ్రూ అనే పేరు ఇంటిపేరుగా మారింది. నిజానికి వారి ఇంటి పేరు 'కౌల్‌'.
* నెహ్రూ తల్లిదండ్రులు స్వరూపరాణి, వోతీలాల్‌. అలహాబాద్‌లో పేరు పొందిన న్యాయవాది వోతీలాల్‌ చాచాకు ఇద్దరు చెల్లెళ్లు... విజయలక్ష్మి, కృష్ణ. నెహ్రూ అలహాబాద్‌లో స్కూల్‌కి వెళ్లి చదివింది తక్కువ. ఇంటి దగ్గరకే మాష్టార్లు వచ్చి కొడుక్కి పాఠాలు చెప్పేలా ఏర్పాటుచేశారు వోతీలాల్‌. ఒక విదేశీ టీచర్‌ నెహ్రూకు సైన్సు, ఇంగ్లిష్‌ పాఠాలు బోధించేవారు. చాచాకు ఇష్టమైన సబ్జెక్టులు కూడా అవే. కొడుకు కోసం వోతీలాల్‌ ఇంట్లోనే సైన్సు ప్రయోగశాలను ఏర్పాటుచేశారు. 15 ఏళ్లపుడు నెహ్రూ చదువుకోసం ఇంగ్లండ్‌ వెళ్లారు. అక్కడ ఎనిమిదేళ్లు చదువుకొని న్యాయశాస్త్రంలో పట్టాతో స్వదేశం వచ్చారు. నెహ్రూకు 27వ ఏట కమల కౌల్‌తో వివాహమయింది.
* నెహ్రూకు ఒకే ఒక్క కుమార్తె. ఆమే ఇందిరాగాంధీ. స్వాతంత్య్రం కోసం నెహ్రూ పోరాటం చేసినపుడు ఆంగ్లేయులు ఆయన్ని ఎన్నోసార్లు జైల్లో పెట్టారు. దాంతో తన ముద్దుల కుమార్తె ఇందిరకు ఆయన ఎప్పుడూ దూరంగానే ఉండాల్సివచ్చేది. అందుకు నెహ్రూ ఎంతో బాధపడేవారు. ఇందిర తన దగ్గరే ఉంటే ఏమేం చెప్పాలనుకునేవారో వాటన్నిటినీ ఉత్తరాల్లో రాసేవారు. ఇందిర ఆ ఉత్తరాల్ని చదివి భద్రపరిచి తండ్రి చెప్పినట్టే నడుచుకునేవారు. ఆ ఉత్తరాల్ని 'Letters from a father to his daughter' పేరుతో పుస్తకంగా ముద్రించారు. అంటే మీరూ చదవొచ్చన్నమాట.
* నెహ్రూ కోటుపై ఎర్ర గులాబీ చూశారుగా! అది పెట్టుకోవడం ఆయనకు ఎలా అలవాటైందంటే... ఒకరోజు మీలాంటి ఓ చిన్నారి ఆయనకు గులాబీని బహుమతిగా ఇస్తే కోటుకు పెట్టుకున్నారు. అదిచూసి ఆనందంతో నవ్విన చిన్నారీ అరవిరిసిన గులాబీ ఆయనకు ఒక్కలాగే కన్పించాయట. తనకు అంత ఇష్టమైన పిల్లలగుర్తుగా ఆ తర్వాత నుంచి రోజూ కోటుపై గులాబీ పెట్టుకోవడం ఆయనకు అలవాటైందని చెబుతుంటారు. సెలవు రోజుల్లో నెహ్రూ పిల్లల్ని తన నివాసానికి పిలిచి మిఠాయిలు పంచేవారు. కబుర్లు చెప్పేవారు. పిల్లలు చాచాకు ఇష్టమైన గులాబీలను బహుమతిగా ఇచ్చేవారు.
* ఓసారి జపాన్‌కు చెందిన బాలలు ఏనుగు కావాలని చాచాకు ఉత్తరం రాశారు. వెంటనే ఆయన వారికొక ఏనుగును పంపించి, 'భారతదేశంలోని పిల్లలందరి తరఫునా మీకు ఈ కానుకను పంపిస్తున్నా' అని ఉత్తరం రాస్తే వారెంతో సంతోషించారట. ఆ ఏనుగు రెండు దేశాల మధ్య స్నేహాన్ని పెంచింది.
* పిల్లలంతా బడికి వెళ్లాలనేది చాచా కోరిక. ఓసారి బాలల సినిమా చూసిన చాచా అందులో నటించిన ఏడేళ్ల పాపాయిని మెచ్చుకుంటూ షేక్‌హ్యాండ్‌ ఇచ్చారు. అయితే ఆ పాపకి తిరిగి 'థ్యాంక్స్‌' చెప్పడం కూడా రాలేదు. దాంతో చాచాకు సందేహం వచ్చి 'పాపను బడికి పంపడం లేదా' అని వాళ్ల అమ్మను అడిగారు. లేదని చెప్పేసరికి, ఆమెను కోప్పడి, పాపను వెంటనే బడిలో చేర్పించమని చెప్పారు.
* ఓసారి ఢిల్లీలో స్కూల్‌ పిల్లలు ఎగ్జిబిషన్‌ ఏర్పాటుచేశారు. ప్రధాని నెహ్రూని కూడా ఆహ్వానించారు. ఆయన అక్కడ ఒక ఆట కూడా ఆడారు. గోడపైన తోకలేని ఏనుగు బొమ్మను అతికించారు పిల్లలు. దాన్ని దూరం నుంచి చూశాక కళ్లు మూసుకొని కాగితపు తోకను ఏనుగు బొమ్మకు అంటించాలి... అదీ గేమ్‌. నెహ్రూ కూడా గంతలు కట్టుకొని తోక అతికించడానికి ప్రయత్నించారు. కానీ అంగుళం దూరంలో అంటించారు. ఆ గేమ్‌ ఆడినందుకు అక్కడున్న పిల్లాడు రెండు అణాలు ఫీజు అడిగితే నెహ్రూ ముందు ఆశ్చర్యపోయినా, తరవాత సరదాగా నవ్వేశారట. తన సహాయకులనడిగి డబ్బు ఇప్పించుకొని ఫీజు చెల్లించారట.
ఇలా పిల్లలతో చాచాకు ఉన్న అనుబంధం గురించి ఎన్ని విషయాలైనా చెప్పుకోవచ్చు. పిల్లలకు ఎంతో ఇష్టమైన, పిల్లలంటే ప్రాణమైన నెహ్రూ 1964లో కన్నుమూశారు. చిన్నారులపట్ల ఆయనకున్న ప్రేమానురాగాలను గుర్తుచేసుకోవడానికి ఆ సంవత్సరం నుంచి ఆయన పుట్టినరోజైన నవంబరు 14ను బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
మీకందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు...
Thanks to the author of original Article:  http://daycelebrations.blogspot.in/2010/04/childrens-day.html
His Website: Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment