Thursday, February 7, 2013

ఘంటసాల వారి భగవద్గీత - సేకరణ

001 పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేనస్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వ్యైతమృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం అంబ! త్వామనుసందధామి భగవద్గీతే భవ ద్వేషిణీం భగవద్గీత. మహాభారతము యొక్క సమగ్ర సారాన్శము. భక్తుడైన అర్జునునకు ఒనర్చిన ఉపదేశమే గీతా సారాన్శము. భారత యుద్ధము జరుగరాదని సర్వ విధముల భగవానుడు ప్రయత్నించెను. కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయెను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథియై నిలిచెను. యుద్ధ రంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మితృలను చూచి, హృదయము ద్రవించి,
002 న కాఙ్క్షే విజయఁ కృష్ణ న చ రాజ్యఁ సుఖాని చ కిఁ నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా (01:32) స్వజనమును చంపుటకు ఇష్టపడక “నాకు విజయమూ వలదు, రాజ్య సుఖమూ వలదు” అని ధనుర్బాణములను క్రింద వైచె. దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ,
003 అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాఁశ్చ భాషసే గతాసూనగతాసూఁశ్చ నానుశోచంతి పణ్డితాః (02:11) దుఃఖింప తగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి గాని, నిత్యములూ, శాశ్వతములూ అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపరు.
004 దేహినోస్మిన్యథా దేహే కౌమారఁ యౌవనఁ జరా తథా దేహాంతరప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి (02:13) జీవునకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము యెట్లో, మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుకు ఈ విషయమున ధీరులు మోహము నొందరు.
005 వాసాఁసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సఁయాతి నవాని దేహీ (02:22) మనుష్యుడు, ఎట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించునో, అట్లే, ఆత్మ – జీర్ణమైన శరీరమును వదలి క్రొత్త శరీరమును ధరించుచున్నది. 006 నైనఁ చ్హిందంతి శస్త్రాణి నైనఁ దహతి పావకః న చైనఁ క్లేదయంత్యాపో న శోషయతి మారుతః (02:23) ఆత్మ నాశనములేనిది. ఆత్మను శస్త్రములు చ్హేదింపజాలవు, అగ్ని దహింప జాలదు. నీరు తడుపజాలదు. వాయువు ఆర్పివేయనూ సమర్థము కాదు. ఆత్మ నాశనములేనిది.
007 జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువఁ జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే న త్వఁ శోచితుమర్హసి (02:27) పుట్టిన వానికి మరణము తప్పదు. మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు.
008 హతో వా ప్రాప్స్యసి స్వర్గఁ జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః (02:37) యుద్ధమున మరణించినచో వీర స్వర్గమును పొందెదవు. జయించినచో రాజ్యమును భోగింతువు. కావున అర్జునా, యుద్ధమును చేయ కృతనిశ్చ్యుడవై లెమ్ము. 009 కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూర్మా తే సఙ్గోస్త్వకర్మణి (02:47) కర్మలను ఆచరించుటయందే నీకు అధికారము కలదు కాని, వాని ఫలితము పైన లేదు. నీవు కర్మ ఫలమునకు కారణము కారాదు. అట్లని, కర్మలను చేయుట మానరాదు.
010 దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే (02:56) దుఃఖములు కలిగినపుడు దిగులు చెందని వాడును, సుఖములు కలిగినపుడు స్పృహ కోల్పోని వాడును, రాగమూ, భయమూ, క్రోధమూ పోయినవాడును స్థిత ప్రజ్ఞుడని చెప్పబడును.
011 ధ్యాయతో విషయాంపుఁసః సఙ్గస్తేషూపజాయతే సఙ్గాత్సఁజాయతే కామః కామాత్క్రోధోభిజాయతే (02:62) క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్స్మృతివిభ్రమః స్మృతిభ్రఁశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి (02:63) విషయ వాంచ్హలను గూర్చి సదా మననము చేయువానికి, వానియందనురాగ మధికమై, అది కామముగా మారి, చివరకు క్రోధమగును. క్రోధము వలన అవివేకము కలుగును. దీనివలన జ్ఞాపకశక్తి నశించి, దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును.
012 ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మనిర్వాణమృచ్చ్హతి (02:72) ఆత్మజ్ఞాన పూర్వక కర్మానుష్ఠానము, బ్రహ్మ ప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సన్సారమున బడక, సుఖైక స్వరూపమైన ఆత్మ ప్రాప్తిని చెందగలడు.
013 లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘ జ్ఞానయోగేన సాఙ్ఖ్యానాఁ కర్మయోగేన యోగినాం (03:03) అర్జునా! ఈ లోకములో ఆత్మానాత్మ వివేకముగల సన్యాసులకు జ్ఞానయోగము చేతను, చిత్తశుద్ధిగల యోగీశ్వరులకు కర్మయోగము చేతను ముక్తి కలుగు చున్నదని సృష్టి ఆదియందు నాచే చెప్పబడియున్నది.
 014 అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః (03:14) అన్నమువలన జంతుజాలము పుట్టును. వర్షము వలన అన్నము సమకూడును. యజ్ఞము వలన వర్షము కలుగును. ఆ యజ్ఞము కర్మ వలననే సంభవము.
015 ఏవం ప్రవర్తితఁ చక్రం నానువర్తయతీహ యః అఘాయురింద్రియారామో మోఘం పార్థ స జీవతి (03:16) పార్థా! నాచే నడుపబడు ఈ లోకము అను చక్రమునుబట్టి, ఎవడు అనుసరింపడో వాడు ఇంద్రియలోలుడై పాప జీవనుడగుచున్నాడు. అట్టివాడు వ్యర్థుడు. జ్ఞాని కానివాడు సదా కర్మలనాచరించుచునే యుండవలెను.
 016 యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే (03:21) ఉత్తములు అయినవారు దేని నాచరింతురో, దానినే ఇతరులును ఆచరింతురు. ఉత్తములు దేనిని ప్రమాణముగా అంగీకరింతురో, లోకమంతయూ దానినే అనుసరింతును.
017 మయి సర్వాణి కర్మాణి సఁన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః (03:30) అర్జునా! నీవొనర్చు సమస్త కర్మలనూ నాయందు సమర్పించి, జ్ఞానముచే నిష్కాముడవై, అహంకారము లేనివాడవై, సంతాపమును వదలి యుద్ధమును చేయుము.
 018 శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనఁ శ్రేయః పరధర్మో భయావహః (03:35) చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మముకన్న, గుణము లేనిదైననూ స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించిననూ మేలే. పరధర్మము భయంకరమైనది. ఆచరణకు అనుచితమైనది. 019 ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతం (03:38) పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత శిశువు యెట్లు కప్పబడునో, అట్లే కామముచేత జ్ఞానము కప్పబడియున్నది. 020 యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం (04:07) పరిత్రాణాయ సాధూనాఁ వినాశాయ చ దుష్కృతాం ధర్మసఁస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే (04:08) ఏ కాలమున ధ్రమమునకు హాని కలుగునో, అధరమము వృద్ధి నొందునో, ఆయా సమయములయందు శిష్టరక్షణ, దుష్టశిక్షణ, ధర్మసన్రక్షణముల కొఋకు ప్రతి యుగమున అవతారమును దాల్చుచున్నాను.
021 వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః (04:10) అనురాగమూ, భయమూ, క్రోధమూ వదిలి నాయందు మనస్సు లగ్నము చేసి ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగముచేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరి.
022 యే యథా మాం ప్రపద్యంతే తాఁస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః (04:11) ఎవరెవరు యేయే విధముగా నన్ను తెలియగోరుచున్నారో, వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను. కాని, ఏ ఒక్కనియందును అనురాగము కాని, ద్వేషము కాని లేదు.
 023 యస్య సర్వే సమారంభాః కామసఙ్కల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధకర్మాణఁ తమాహుః పణ్డితం బుధాః (04:19) ఎవరి కర్మాచరణములు కామ సంకల్పములు కావో, ఎవని కర్మలు జ్ఞానమను నిప్పుచే కాల్పబడినవో, అట్టివానిని పండితుడని విద్వాన్సులు పల్కుదురు.
024 బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా (04:24) యజ్ఞపాత్రము బ్రహ్మము. హోమద్రవ్యము బ్రహ్మము. అగ్ని బ్రహ్మము. హోమము చేయువాడు బ్రహ్మము. బ్రహ్మ కర్మ సమాధిచేత పొందనగు ఫలము కూడా బ్రహ్మమనియే తలంచవలయును.
025 శ్రద్ధావా్ల్లభతే జ్ఞానం తత్పరః సఁయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచిరేణాధిగచ్చ్హతి (04:39) శ్రద్ధ, ఇంద్రియనిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్థుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును. ఇది భగవద్గీత యందు బ్రహ్మవిద్యయను యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునునకుప దేశించిన విషాద, సాంఖ్య, కర్మ, జ్ఞాన యోగములు సమాప్తము. *******
 026 సఁన్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మసఁన్యాసాత్కర్మయోగో విశిష్యతే (05:02) కర్మ సన్యాసములు రెండునూ మోక్షసోపానములు. అందు కర్మ పరిత్యాగము కన్న కర్మానుష్ఠానమే శ్రేష్టమైనది.
 027 బ్రహ్మణ్యాధాయ కర్మాణి సఙ్గఁ త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా (05:10) ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక, బ్రహ్మార్పణముగా కర్మలనాచరించునో, అతడు తామరాకున నీటిబిందువులు అంటని రీతిగా పాపమున చిక్కుబడడు.
028 జ్ఞానేన తు తదజ్ఞానం యేషాఁ నాశితమాత్మనః తేషామాదిత్యవజ్జ్ఞానం ప్రకాశయతి తత్పరం (05:16) ఎవని అజ్ఞానము జ్ఞానముచేత నశింపబడునో, అతనికి జ్ఞానము సూర్యుని వలె ప్రకాశించి, పరమార్థ తత్వమును చూపును.
029 విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శుని చైవ శ్వపాకే చ పణ్డితాః సమదర్శినః (05:18) విద్యా వినయ సంపన్నుడగు బ్రాహ్మణునియందునూ, శునకమూ, శునకమాంసము వండుకొని తినువానియందునూ పండితులు సమదృష్టి కలిగియుందురు.
 030 శక్నోతీహైవ యః సోఢుం ప్రాక్శరీరవిమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం స యుక్తః స సుఖీ నరః (05:23) దేహత్యాగమునకు ముందు యెవడు కామక్రోధాది అరిష్డ్వర్గముల జయించునో, అట్టివాడు యోగి అనబడును.
031 యతేంద్రియమనోబుద్ధిర్మునిర్మోక్షపరాయణః విగతేచ్చ్హాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః (05:28) ఎవడు ఇంద్రియములను జయించి, దృష్టిని భ్రూమధ్యమున నిలిపి, ప్రాణాపాన వాయువులను స్తంభింపజేసి, మనస్సునూ, బుద్ధినీ స్వాధీనమొనర్చుకొని మోక్షాసక్తుడై ఉండునో, అట్టివాడే ముక్తుడనబడును.
032 భోక్తారం యజ్ఞతపసాఁ సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాఁ జ్ఞాత్వా మాఁ శాంతిమృచ్చ్హతి (05:29) సకల యజ్ఞ తపః ఫలములను పొందువానిగనూ, సకల ప్రపంచ నియామకునిగనూ నన్ను గ్రహించిన మహనీయుడు మోక్షమును పొందుచున్నాడు.
033 యం సఁన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాణ్డవ న హ్యసఁన్యస్తసఙ్కల్పో యోగీ భవతి కశ్చన (06:02) అర్జునా! సన్యాసమని దేనినదురో, దానినే కర్మయోగమనియూ అందురు. అట్టి యెడ సంకల్పత్యాగ మొనర్పనివాడు యోగి కాజాలడు.
 034 యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా (06:17) యుక్తాహార విహారాదులు, కర్మాచరణము గలవానికి ఆత్మసమ్యమన యోగము లభ్యము.
035 యథా దీపో నివాతస్థో నేఙ్గతే సోపమా స్మృతా యోగినో యతచిత్తస్య యుఞ్జతో యోగమాత్మనః (06:19) గాలిలేనిచోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగుననే, మనో నిగ్రహముకల్గి, ఆత్మయోగ మభ్యసించినవాని చిత్తము నిశ్చలముగా నుండును. 036 సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః (06:29) సకల భూతములయందూ సమదృష్టి కలిగినవాడు, అన్ని భూతములు తన యందునూ, తనను అన్ని భూతములయందునూ చూచుచుండును.
 037 అసఁశయం మహాబాహో మనో దుర్నిగ్రహఁ చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే (06:35) అర్జునా! ఎట్టివానికైననూ మనస్సును నిశ్చలముగా నిల్పుట దుస్సాధ్యమే. అయిననూ, దానిని అభ్యాస, వైరాగ్యములచేత నిరోధింపవచ్చును.
 038 యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాంభజతే యో మాఁ స మే యుక్తతమో మతః (06:47) అర్జునా! పరిపూర్ణ విశ్వాసముతో నన్నాశ్రయించి, వినయముతో ఎవరు సేవించి భజింతురో వారు సమస్త యోగులలో ఉత్తములు.
039 మనుష్యాణాఁ సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాఁ కశ్చిన్మాఁ వేత్తి తత్త్వతః (07:03) వేలకొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కొఋఅకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమే నన్ను యదార్థముగా తెలుసు కొనగలుగుచున్నాడు.
040 భూమిరాపోనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహఁకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా (07:04) భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా మాయాశక్తి ఎనిమిది విధములైన బేధములతో ఒప్పి యున్నదని గ్రహింపుము.
041 మత్తః పరతరం నాన్యత్కిఁచిదస్తి ధనఁజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ (07:07) అర్జునా! నా కన్న గొప్పవాడుగాని, గొప్పవస్తువుగాని మరేదియూ ప్రపంచమున లేదు. సూత్రమున మణులు గ్రుచ్చబడినట్లు యీ జగమంతయూ నాయందు నిక్షిప్తమై ఉన్నది.
 042 పుణ్యో గంధః పృథివ్యాఁ చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు (07:09) భూమియందు సుగంధము, అగ్నియందు తేజము, యెల్ల భూతములయందు ఆయువు, తపస్వులయందు తపస్సు నేనుగా నెరుగుము. 043 దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే (07:14) పార్థా! త్రిగుణాత్మకము, దైవ సంబంధము అగు నా మాయ అతిక్రమింప రానిది. కాని, నన్ను శరణుజొచ్చిన వారికి ఈ మాయ సులభసాధ్యము. 044 చతుర్విధా భజంతే మాఁ జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ (07:16) ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్థకాములు, జ్ఞానులు అను నాలుగు విధములైన పుణ్యాత్ములు నన్నాశ్రయించుచున్నారు.
 045 బహూనాఁ జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః (07:19) జ్ఞాన సంపన్నుడైన మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట, విజ్ఞానియై నన్ను శరణము నొందుచున్నాడు.
046 అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సఁశయః (08:05) ఎవడు అంత్యకాలమున నన్ను స్మరించుచూ శరీరమును వదలుచున్నాడో, వాడు నన్నే చెందుచున్నాడు.
047 అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యఁ యాతి పార్థానుచింతయన్ (08:08) కవిం పురాణమనుశాసితారం అణోరణీయఁసమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్యరూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ (08:09) అర్జునా! ఎవడు అభ్యాసయోగముతో, ఏకాగ్ర చిత్తమున దివ్యరూపుడైన మహాపురుషుని స్మరించునో, అట్టివాడు ఆ పరమపురుషునే చెందుచున్నాడు. ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు; పురాణ పురుషుడు; ప్రపంచమునకు శిక్షకుడు; అణువు కన్నా అణువు; అనూహ్యమైన రూపము కలవాడు; సూర్య కాంతి తేజోమయుడు; అజ్ఞానాంధకారమునకన్న ఇతరుడు.
048 అవ్యక్తోక్షర ఇత్యుక్తస్తమాహుః పరమాఁ గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ (08:21) ఇంద్రియ గోచరము కాని పరబ్రహ్మపదము శాశ్వతమైనది. పునర్జన్మ రహితమైన ఆ ఉత్తమపదమే పరమపదము.
 049 శుక్లకృష్ణే గతీ హ్యేతే జగతః శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిమన్యయావర్తతే పునః (08:26) జగత్తునందు శుక్ల కృష్ణము లనెడి రెండు మార్గములు నిత్యములుగా ఉన్నవి. అందు మొదటి మార్గము వలన జన్మరాహిత్యము, రెండవ దానివలన పునర్జన్మము కలుగు చున్నవి. 050 వేదేషు యజ్ఞేషు తపఃసు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం (08:28) యోగియైనవాడు వేదాధ్యయనము వలన, యజ్ఞతపోదానాదుల వలన కలుగు పుణ్యఫలమును ఆశింపక, ఉత్తమ పదమైన బ్రహ్మపదమును పొందగలడు.
051 సర్వభూతాని కౌంతేయ ప్రకృతిఁ యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం (09:07) పార్థా! ప్రళయకాలమున సకల ప్రాణులును నా యందు లీనమగుచున్నవి. మరల కల్పాది యందు సకల ప్రాణులనూ నేనే సృష్టించు చున్నాను. 052 అనన్యాశ్చింతయంతో మాఁ యే జనాః పర్యుపాసతే తేషాఁ నిత్యాభియుక్తానాఁ యోగక్షేమం వహామ్యహం (09:22) ఏ మానవుడు సర్వకాల సర్వావస్థలయందు నన్నే ధ్యానించు చుండునో అట్టివాని యోగక్షేమములు నేనే వహించు చున్నాను.
053 పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చ్హతి తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః (09:26) ఎవడు భక్తితో నాకు పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను, ఉదక మైనను ఫలాపేక్ష రహితముగా సమర్పించుచున్నాడో, అట్టివానిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను.
 054 మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాఁ నమస్కురు మామేవైష్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణః (09:34) పార్థా! నా యందు మనస్సు లగ్నము చేసి యెల్ల కాలములయందు భక్తి శ్రద్ధలతో స్థిరచిత్తుడవై పూజించితివేని నన్నే పొందగలవు. ఇది ఉపనిషత్తుల సారాన్శమైన యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునునకుప దేశించిన కర్మసన్యాస, ఆత్మసంయమ, విజ్ఞాన, అక్షర పరబ్రహ్మ, రాజ విద్యా రాజగుహ్య యోగములు సమాప్తము. ********
055 మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాతా యేషాఁ లోక ఇమాః ప్రజాః (10:06) కశ్యపాది మహర్షి సప్తకము, సనక సనందనాదులు, స్వయంభూవాది మనువులు నా వలననే జన్మించిరి. పిమ్మట వారి వలన ఎల్ల లోకములందలి సమస్త భూతములును జన్మించెను.
056 మచ్చిత్తా మద్గతప్రాణా బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాఁ నిత్యఁ తుష్యంతి చ రమంతి చ (10:09) పండితులు నాయందు చిత్తముగలవారై నా యందే తమ ప్రాణములుంచి నా మహిమానుభావ మెరింగి ఒకరికొకరు ఉపదేశములు గావించుకొంచు బ్రహ్మా నందమును అనుభవించుచున్నారు. 057 అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యఁ చ భూతానామంత ఏవ చ (10:20) సమస్త భూతముల మనస్సులందున్న పరమాత్మ స్వరూపుడను నేనే. వాని ఉత్పత్తి, పెంపు, నాశములకు నేనే కారకుడను.
058 వేదానాఁ సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా (10:22) వేదములలో సామవేదము, దేవతలలో దేవేంద్రుడు, ఇంద్రియములలో మనస్సు, ప్రాణులందరి బుద్ధి నేనే. 059 ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాఁ కాలః కలయతామహం మృగాణాఁ చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం (10:30) రాక్షసులలో ప్రహ్లాదుడు, గణికులలో కాలము, మృగములలో సింహము, పక్షులలో గరుత్మంతుడు నేనే.
060 యద్యద్విభూతిమత్సత్త్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చ్హ త్వం మమ తేజోఁశసంభవం (10:41) లోకమునందు ఐశ్వర్య యుక్తమై, పరాక్రమ యుక్తమై, కాంతి యుక్తమైన సమస్త వస్తువులు నా తేజో భాగము వలననే సంప్రాప్తమగును.
061 పశ్య మే పార్థ రూపాణి శతశోథ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ (11:05) పార్థా! దివ్యములై, నానా విధములై, అనేక వర్ణములై అనేక విశేషములగు నా సస్వరూపమును కన్నులారా దర్శింపుము.
062 పశ్యామి దేవాఁస్తవ దేవ దేహే సర్వాఁస్తథా భూతవిశేషసఙ్ఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీఁశ్చ సర్వానురగాఁశ్చ దివ్యాన్ (11:15) అనేకబాహూదరవక్త్రనేత్రఁ పశ్యామి త్వాఁ సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిఁ పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప (11:16) దఁష్ట్రాకరాలాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస (11:25) దేవా! ఎల్ల దేవతలూ, ఎల్ల ప్రాణులూ, బ్రహ్మాదులూ, ఋషీశ్వరులూ, వాసుకీ మొదలగుగా గల సర్పములూ నీయందు నాకు గోచరమగుచున్నవి. ఈశ్వరా! నీ విశ్వరూపము అనేక బాహువులతో, ఉదరములతో, ముఖములతో ఒప్పియున్నది. అట్లైయూ నీ ఆకారమున ఆద్యంత మధ్యములను గుర్తింప జాల కున్నాను. కోరలచే భయంకరమై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుటవలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో! నాయందు దయ యుంచి నాకు ప్రసన్నుడవు గమ్ము. కృష్ణా! ప్రసన్నుడవు గమ్ము. అర్జునా!
063 కాలోస్మి లోకక్షయకృత్ప్రవృద్ధో లోకాన్సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాఁ న భవిష్యంతి సర్వే యేవస్థితాః ప్రత్యనీకేషు యోధాః (11:32) అర్జునా! ఈ ప్రపంచమునెల్ల నశింపజేయు బలిష్ఠమైన కాల స్వరూపుడను నేనే. ఈ యుద్ధమునకు సిద్ధపడిన వారిని నీవు చంపకున్ననూ – బ్రతుక గలవారిందెవ్వరునూ లేరు.
064 ద్రోణఁ చ భీష్మఁ చ జయద్రథఁ చ కర్ణఁ తథాన్యానపి యోధవీరాన్ మయా హతాఁస్త్వఁ జహి మావ్యథిష్ఠా యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్ (11:34) ఇప్పటికే ద్రోణ, భీష్మ, జయద్రధ కర్ణాధి యోధ వీరులు నాచే సంహరింపబడిరి. ఇక మిగిలిన శతృ వీరులను నీవు సంహరింపుము.
 065 కిరీటినం గదినఁ చక్రహస్తం ఇచ్చ్హామి త్వాఁ ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే (11:46) అనేక భుజములుగల నీ విశ్వరూపమును ఉపసంహరించి కిరీటము, గద, చక్రము ధరించిన నీ సహజ సుందరమైన స్వరూపమును దర్శింపగోరు చున్నాను కృష్ణా!
066 సుదుర్దర్శమిదం రూపం దృష్ట్వానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యఁ దర్శనకాఙ్క్షిణః (11:52) అర్జునా! నీవు దర్శించిన ఈ నా స్వరూపమును ఎవ్వరునూ చూడజాలరు. ఈ విశ్వరూపమును దర్శింప దేవతలందరునూ సదా కోరుచుందురు.
067 మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః (12:02) ఎవరు నాయందే మనస్సు లగ్నము చేసి, శ్ర్ద్ధాభక్తులతో నన్ను ధ్యానించు చున్నారో, అట్టివారు అత్యంతమూ నాకు ప్రీతిపాత్రులు. వారే ఉత్తమ పురుషులు.
068 శ్రేయో హి జ్ఞానమభ్యాసాజ్జ్ఞానాద్-ధ్యానం విశిష్యతే ధ్యానాత్కర్మఫలత్యాగస్త్యాగాచ్చ్హాఁతిరనంతరం (12:12) అభ్యాసయోగముకన్న జ్ఞానము, జ్ఞానము కన్న ధ్యానము, దానికన్న కర్మ ఫలత్యాగమూ శ్రేష్ఠము. అట్టి త్యాగమువల్ల సన్సార బంధనము తొలగి మోక్షప్రాప్తి సంభవించుచున్నది.
069 అనపేక్షః శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః సర్వారంభపరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః (12:16) ఎవడు కోరికలు లేనివాడై, పవిత్రుడై, పక్షపాత రహితుడై భయమును వీడి కర్మఫ్ల త్యాగియై నాకు భక్తుడగునో అట్టివాడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు.
 070 సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణసుఖదుఃఖేషు సమః సఙ్గవివర్జితః (12:18) తుల్యనిందాస్తుతిర్మౌనీ సఁతుష్టో యేన కేనచిత్ అనికేతః స్థిరమతిర్భక్తిమాన్మే ప్రియో నరః (12:19) శత్రుమిత్రులయందును, మానావ మానములయందును, శీతోష్ణ సుఖ దుఃఖాదులయందును సమబుద్ధి కలిగి, సంగరహితుడై, నిత్య సంతుష్టుడై, చలించని మనస్సు కలవాడై, నాయందు భక్తి ప్రపత్తులు చూపు మానవుడు నాకు ప్రీతిపాత్రుడు.
071 ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః (13:02) అర్జునా! దేహము క్షేత్రమనియూ, దేహమునెరిగినవాడు క్షేత్రజ్ఞుడనియూ పెద్దలు చెప్పుదురు.
072 అధ్యాత్మజ్ఞాననిత్యత్వఁ తత్త్వజ్ఞానార్థదర్శనం ఏతజ్జ్ఞానమితి ప్రోక్తమజ్ఞానం యదతోన్యథా (13:12) ఆత్మ జ్ఞానమునందు మనస్సు లగ్నము చేయుట, మౌక్షప్రాప్తి యందు దృష్టి కలిగియుండుట జ్ఞాన మార్గములనైయూ, వానికి ఇతరములైనవి అజ్ఞానములనియూ చెప్పబడును.
 073 కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే (13:21) ప్రకృతిని “మాయ” యని యందురు. అది శరీర సుఖదుఃఖాదులను తెలియజేయును. క్షేత్రజ్ఞుడు ఆ సుఖ దుఃఖములను అనుభవించుచుండును.
074 సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరం వినశ్యత్స్వవినశ్యంతఁ యః పశ్యతి స పశ్యతి (13:28) శరీరము నశించిననూ తాను సశింపక యెవడు సమస్త భూతములందున్న పరమేశ్వరుని చూచునో వాడే యెరిగినవాడు.
075 అనాదిత్వాన్నిర్గుణత్వాత్పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే (13:32) అర్జునా! గుణ నాశన రహితుడైనవాడు పరమాత్మ. అట్టి పరమాత్మ దేహాంత ర్గతుడయ్యునూ కర్మల నాచరించువాడు కాడు.
076 యథా ప్రకాశయత్యేకః కృత్స్నఁ లోకమిమం రవిః క్షేత్రఁ క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత (13:34) పార్థా! సూర్యుడొక్కడే యెల్ల జగత్తులనూ ఏ విధముగా ప్రకాశింపజేయుచున్నాడో ఆ విధముగనే క్షేత్రజ్ఞుడు యెల్ల దేహములనూ ప్రకాశింపజేయుచున్నాడు. ఇది ఉపనిషత్తుల సారాన్శమైన గీతాశాస్త్రమందు శ్రీకృష్ణుడు అర్జునునకుప దేశించిన విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము, భక్తి యోగము, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగములు సమాప్తము. *******
077 పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాఁ జ్ఞానముత్తమం యజ్జ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః (14:01) జ్ఞానార్జనమున మహనీయులైన ఋషీశ్వరులు మోక్ష్మును పొందిరి. అట్టి మహత్తరమైన జ్ఞానమును నీకు ఉపదేశించుచున్నాను.
078 సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిరహం బీజప్రదః పితా (14:04) అర్జునా! ప్రపంచమున జన్మించు ఎల్ల చరాచర సమూహములకు ప్రకృతి తల్లి వంటిది. నేను తండ్రి వంటివాడను.
079 తత్ర సత్త్వం నిర్మలత్వాత్ప్రకాశకమనామయం సుఖసఙ్గేన బధ్నాతి జ్ఞానసఙ్గేన చానఘ (14:06) అర్జునా! త్రిగుణములలో సత్త్వగుణము నిర్మలమగుటంజేసి సుఖ జ్ఞానాభి లాషలచేత ఆత్మను దేహమునందు బంధించుచున్నది.
080 రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసఙ్గసముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసఙ్గేన దేహినం (14:07) ఓ కౌంతేయా! రజోగుణము కోరికలయందు అభిమానమూ, అనురాగమూ పుట్టించి ఆత్మను బంధించుచున్నది.
 081 తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్యనిద్రాభిస్తన్నిబధ్నాతి భారత (14:08) అర్జునా! అజ్ఞానమువలన పుట్టునది తమోగుణము. అది సర్వ ప్రాణులనూ మోహింపజేయునది. ఆ గుణము మనుజుని ఆలస్యముతోనూ, అజాగ్రత్తతోనూ, నిద్ర తోనూ బద్ధుని చేయును.
082 మానాపమానయోస్తుల్యస్తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభపరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే (14:25) మానావ మానములయందు, శత్రుమిత్రులయందు సమమైన మనస్సు గలవానిని త్రిగుణాతీతుడందురు.
083 ఊర్ధ్వమూలమధఃశాఖమశ్వత్థం ప్రాహురవ్యయం చ్హందాఁసి యస్య పర్ణాని యస్తఁ వేద స వేదవిత్ (15:01) బ్రహ్మమే మూలముగా, నికృష్ణమైన అహంకారము కొమ్మలుగాగల అశ్వత్థ వృక్షము అనాది అయినది. అట్టి సన్సార వృక్ష్మునకు వేదములు ఆకులువంటివి. అట్టి దాని నెరింగినవాడే వేదార్థ సార మెరింగినవాడు.
084 న తద్భాసయతే సూర్యో న శశాఙ్కో న పావకః యద్గత్వా న నివర్తఁతే తద్ధామ పరమం మమ (15:06) పునరావృత్తి రహితమైన మోక్షపథము, సూర్య చంద్రాగ్నుల ప్రకాశమున కతీతమై, నా ఉత్తమ పథమై యున్నది.
085 అహఁ వైశ్వానరో భూత్వా ప్రాణినాఁ దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నఁ చతుర్విధం (15:14) దేహులందు జఠరాగ్ని స్వరూపుడనై వారు భుజించు భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య పదార్థముల జీర్ణము చేయుచున్నాను.
086 తేజః క్షమా ధృతిః శౌచమద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీమభిజాతస్య భారత (16:03) దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానఁ చాభిజాతస్య పార్థ సంపదమాసురీం (16:04) పార్థా! సాహసము, ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరుల వంచింపకుండుట, కావరము లేకయుండుట, మొదలగు గుణములు దైవాన్శ సంభూతులకుండును. అట్లే, దంబము, గర్వము, అభిమానము, క్రోధము, కఠినపు మాటలాడుట, అవివేకము మొదలగు గుణములు రాక్షసాన్శ సంభూతులకుండును.
087 త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్ (16:21) కామ, క్రోధ, లోభములు ఆత్మను నాశనము చేయును. అవి నరక ప్రాప్తికి హేతువులు కావున వానిని వదిలి వేయ వలయును.
088 యః శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం (16:23) శాస్త్ర విషయముల ననుసరింపక ఇచ్చ్హా మార్గమున ప్రవర్తించువాడు సుఖ సిద్ధులను పొందజాలడు. పరమపదము నందజాలడు.
 089 త్రివిధా భవతి శ్రద్ధా దేహినాఁ సా స్వభావజా సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాఁ శృణు (17:02) జీవులకు గల శ్రద్ధ పూర్వ జన్మ వాసనా బలము వలన లభ్యము. అది రాజసము, సాత్త్వికము, తామసములని మూడు విధములగా ఉన్నది.
090 యజంతే సాత్త్వికా దేవాన్యక్షరక్షాఁసి రాజసాః ప్రేతాంభూతగణాఁశ్చాన్యే యజంతే తామసా జనాః (17:04) సత్త్వగుణులు దేవతలను, రజోగుణులు యక్ష రాక్షసులను, తమోగుణులు భూత ప్రేత గణంబులను శ్రద్ధా భక్తులతో పూజించుదురు.
091 అనుద్వేగకరం వాక్యఁ సత్యం ప్రియహితఁ చ యత్ స్వాధ్యాయాభ్యసనఁ చైవ వాఙ్మయం తప ఉచ్యతే (17:15) ఇతరుల మనస్సుల నొప్పింపనిదియూ, ప్రియమూ, హితములతో కూడిన సత్య భాషణమూ, వేదాధ్యన మొనర్చుట వాచక తపస్సని చెప్పబడును.
092 కామ్యానాఁ కర్మణాఁ న్యాసం సఁన్యాసం కవయో విదుః సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః (18:02) జ్యోతిష్ఠోమాది కర్మల నాచరింపకుండుట సన్యాసమనియూ, కర్మఫలము యీశ్వరార్పణ మొనర్చుట త్యాగమనియూ పెద్దలు చెప్పుదురు.
093 అనిష్టమిష్టం మిశ్రఁ చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య న తు సఁన్యాసినాఁ క్వచిత్ (18:12) కర్మఫలములు ప్రియములూ, అప్రియములూ, ప్రియాతిప్రియములూ అని మూడు విధములు. కర్మఫలమునలు కోరినవారు జన్మాంతరమందు ఆ ఫలములను పొందుచున్నారు. కోరనివారు ఆ ఫలములను జన్మాంతరమున పొందజాల కున్నారు.
094 ప్రవృత్తిఁ చ నివృత్తిఁ చ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షఁ చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్త్వికీ (18:30) అర్జునా! కర్మ మోక్ష మార్గముల, కర్తవ్య భయాభయముల, బంధ మోక్షముల ఏ జ్ఞానమెరుగుచున్నదో అది సత్త్వగుణ సముద్భవమని ఎరుగుము.
095 ఈశ్వరః సర్వభూతానాఁ హృద్దేశేర్జున తిష్ఠతి భ్రామయన్సర్వభూతాని యంత్రారూఢాని మాయయా (18:61) ఈశ్వరుడు యెల్ల భూతములకు నియామకుడై, ప్రాణుల హృదయమందున్నవాడై, జంత్రగాడు బొమ్మలనాడించు రీతిగా ప్రాణుల భ్రమింపజేయుచున్నాడు.
096 సర్వధర్మాంపరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్ష్యయిష్యామి మా శుచః (18:66) సమస్త కర్మలను నాకర్పించి, నన్నే శరణు బొందిన, ఎల్ల పాపములనుండి నిన్ను విముక్తుని గావింతును. నీవు చింతింపకుము.
 097 య ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్యసఁశయః (18:68) ఎవడు పరమోత్కృష్టమైన, పరమ రహస్యమైన యీ గీతాశాస్త్రమును నా భక్తుల కుపదేశము చేయుచున్నాడో, వాడు మోక్షమున కర్హుడు.
098 కచ్చిదేతచ్చ్హ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞానసంమోహః ప్రనష్టస్తే ధనఁజయ (18:72) ధనంజయా! పరమ గోప్యమైన యీ గీతా శాస్త్రమును చక్కగా వింటివా? నీ యజ్ఞాన జనితమైన అవివేకము నశించినదా? కృష్ణా!
099 నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గతసఁదేహః కరిష్యే వచనం తవ (18:73) అచ్యుతా! నా అవివేకము నీ దయ వలన తొలగెను. నాకు సుజ్ఞానము లభించినది. నాకు సందేహములన్నియూ తొలగినవి. నీ ఆజ్ఞను శిరసావహించెదను. 100 యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ (18:78) యోగీశ్వరుడగు శ్రీకృష్ణుడు, ధనుర్ధారియగు అర్జునుడు యెచటనుందురో అచట సంపద, విజయము, ఐశ్వర్యము, స్థిరమగు నీతియుండును. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ త్రయతత్కుమాన్ విష్ణొపద మవాప్నోతి భయ శోకాది వర్జితః గీతాశాస్త్రమును ఎవరు పఠింతురో వారు భయ శోకాది వర్జితులై విష్ణు సాయుజ్యమును పొందుదురు. ఇది ఉపనిషత్తుల సారాన్శమైన గీతాశాస్త్రమందు శ్రీకృష్ణుడు అర్జునునకుప దేశించిన గుణత్రయ విభాగ, పురుషోత్తమ ప్రాప్తి, దేవాసుర సంపద్విభాగ, శ్రద్ధాత్రయ విభాగ, మోక్షసన్యాస యోగములు సర్వమూ సమాప్తము. ఓం సర్వేజనా సుఖినో భవంతు సమస్త సన్మగళాని భవంతు అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శంతి శ్శాంతి శ్శాంతిః
Originally written by : http://suryamahavratayajula.wordpress.com/%E0%B0%98%E0%B0%82%E0%B0%9F%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%AD%E0%B0%97%E0%B0%B5%E0%B0%A6%E0%B1%8D%E0%B0%97%E0%B1%80%E0%B0%A4/

1 comment:

  1. బ్లాగులను ప్రచురించడంలో కూడలి వారు పక్షపాతం చూపుతున్నారు. వారికి నచ్చిన బ్లాగులను ముందుగా ప్రచురించడం నచ్చని (రాజకీయ) బ్లాగులను రెండు గంటలు ఆలస్యంగా ప్రచురించడం నేను గమనించాను

    ReplyDelete