Saturday, February 15, 2014

హైదరాబాదు బిర్యానీ @ ప్యారడైజ్

http://www.thehindu.com/multimedia/dynamic/01102/HY03BIRYANI01_1102730g.jpgహైదరాబాదు బిర్యానీ రుచి చూడాలంటే.. ఆ హోటల్ కు వెళ్లాల్సిందే. 1953వ సంవత్సరంలో సికింద్రాబాదులో ‘ప్యారడైజ్ టాకీస్’ పేరిట సినిమా థియేటర్ ఉండేది. సినిమా హాలుకు అనుబంధంగా చాయ్, సమోసా, బిస్కట్ అమ్మే చిన్న టీ దుకాణం ఉండేది. ఇరాన్ నుంచి వలస వచ్చిన హుస్సేన్ హిమ్మతీ దాన్ని నడిపేవారు. కాలానుక్రమంలో ప్యారడైజ్ టాకీస్ కనుమరుగైపోయింది. కానీ, హుస్సేన్ హిమ్మతీ టీ స్టాల్ మాత్రం మెల్లగా ఎదగటం మొదలుపెట్టింది. ప్రారంభంలో 10 మందికి పని కల్పించిన ఆ టీ స్టాల్ ప్రస్తుతం.. 800 మందికి పైగా ఉద్యోగాలు కల్పించిన ప్యారడైజ్ హోటల్ గా ఎదిగింది. హుస్సేన్ తర్వాత ఆయన కొడుకులు అలీ హిమ్మతీ, డాక్టర్ ఖాజీం హిమ్మతీలు ప్యారడైజ్ హోటల్ కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కేలా హోటల్ ను తీర్చిదిద్దారు. జంట నగరాల్లో ఇప్పుడు మొత్తం 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్యారడైజ్ హోటళ్లు విస్తరించాయి. సికింద్రాబాదులోని ఈ హోటల్ నుంచి బిర్యానీ పార్శిల్స్ దుబాయ్, ముంబై, చెన్నై నగరాలకు విమానాల్లో వెళ్తుంటాయి.

కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ హైదరాబాదు నగర పర్యటనలో ప్యారడైజ్ బిర్యానీ రుచి చూశారంటే.. ఈ బిర్యానీ ఎంత ప్రసిద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఎంపీలు ప్రియాదత్, జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, దివంగత ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి, మర్రి చెన్నారెడ్డి.. ఇలా చాలా మంది ప్రముఖులు తమ బిర్యానీని ఆప్యాయంగా ఆరగించినట్లు ఖజీం హిమ్మతీ చెప్పారు.

ప్రస్తుతం సికింద్రాబాదు ప్యారడైజ్ తో పాటు హైదరాబాదులో ఆరు ప్యారడైజ్ హోటళ్లున్నాయి. హైటెక్ సిటీ, మాసబ్ ట్యాంక్, ఎన్టీఆర్ గార్డెన్స్, కూకట్ పల్లి, బేగంపేటల్లో ఇవి రుచికరమైన బిర్యానీని నగర వాసులకు అందిస్తున్నారు. త్వరలో దిల్ సుఖ్ నగర్, నాంపల్లి, ఎర్రగడ్డ ప్రాంతాల్లో హోటళ్లు ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు.

No comments:

Post a Comment