Tuesday, March 13, 2012

ఉత్తరాఖండ్ కాంగ్రెసులో అప్పుడే ముసలం, కేంద్ర మంత్రి రాజీనామా





ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ఉత్తరాఖండ్ కాంగ్రెసులో ముసలం బయలుదేరింది. అది యుపిఎ ప్రభుత్వాన్ని తాకింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవిని ఆశించి భంగపడిన కేంద్ర సహాయ మంత్రి హరీష్ రావత్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అందించినట్లు సమాచారం. తనను విస్మరించి, పార్లమెంటు సభ్యుడు విజయ్ బహుగుణను ముఖ్యమంత్రి పదవికి అధిష్టానం ఎంపిక చేయడంపై అసంతృప్తికి గురైన హరీష్ రావత్ రాజీనామా చేశారు.

ముఖ్యమంత్రి ఎవరనేది శాసనసభ్యులు నిర్ణయించుకుంటారని, విజయ్ బహుగణను ముఖ్యమంత్రి పదవికి ఎన్నుకున్నారని కాంగ్రెసు సీనియర్ నేత, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ చెప్పారు. రావత్ రాజీనామా చేశారనే వార్తను ప్రధాని కార్యాలయం తోసిపుచ్చింది. ముఖ్యమంత్రి పదవికి రావత్‌ను విస్మరించడం ఇది రెండోసారి. గతంలో హరీష్ రావత్‌ను తోసిపుచ్చి ఎన్డీ తివారీకి కాంగ్రెసు నాయకత్వం మఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టింది. ఇది ఒత్తిడి రాజకీయమని, దాన్ని పరిష్కరిస్తామని బహుగుణ చెప్పారు.

1 comment:

  1. ముఖ్యమంత్రి ఎవరనేది శాసనసభ్యులు నిర్ణయించుకుంటారని, కాంగ్రెసు సీనియర్ నేత ఆజాద్ చెప్పారు!

    ఎంత మాట ఎంత మాట! ముఖ్యమంత్రి యెవరనేది రాసి సీల్డుకవరులో శాసనసభకు పంపే కాంగ్రెసు అధిష్టానమేనా యీ మాట ఇప్పుడు చెప్పేది?

    ReplyDelete