Monday, March 12, 2012

ప్రపంచ దేశాలతో పోల్చితే భారత ఆర్ధిక రంగం మెరుగ్గా ఉంది:రాష్ట్రపతి ప్రతిభాపాటిల్

ప్రపంచ దేశాలతో పోల్చితే భారత ఆర్ధిక రంగం మెరుగ్గా ఉందని రాష్ట్రపతి ప్రతిభాపాటి ల్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగిస్తూ ప్రపంచ దేశాలకు 2011 సంవత్సరం ఆర్థికంగా కలిసి రాలేదని, ఆర్థిక అస్తిరత్వం మధ్య ప్రభుత్వం సగం పదివీకాలం పూర్తి చేసిందని ఆమె అన్నారు. నిజాయితీ, పారదర్శకతతో కూడిన మార్గదర్శక పాలన అందిస్తామని ప్రతిభాపాటిల్ తెలిపారు.

త్వరలో 8 నుంచి 9 శాతం ఆర్థిక వృద్దిరేటు సాధిస్తామన్నారు. నల్లధనాన్ని అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నల్లధనం నియంత్రణకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని రాష్ట్రపతి పేర్కొన్నారు. అవినీతి నియంత్రణకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఈ- గవర్నెన్స్ ద్వారా ప్రజా సేవలు మెరుగుపరుస్తామని ఆమె తెలిపారు. వికలాంగుల కోసం ప్రతే ్యక శాఖ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయన్నారు.

మైనార్టీలకు సబ్‌కోటా అమలు చేస్తామని రాష్ట్రపతి తెలిపారు. ఆరోగ్యరంగంలో సిబ్బంది కొరత ఉందని ప్రతిభాపాటిల్ అన్నారు. భారత్‌ను పోలియో రహిత దేశంగా గుర్తించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయం తీసుకుందని ఆమె ప్రకటించారు. డిసెంబర్ 2014 నాటికి దేశవ్యాప్తంగా డిజిటల్ కేబుల్ ప్రసారాలు ప్రారంభమవుతాయని ఆమె తెలిపారు. ప్రజా పంపిణీ విధానాన్ని కంప్యూటరీకరణ చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు.

వచ్చే ఐదేళ్లలో యూరియా ఉత్పత్తిలో స్వాలంబన సాధిస్తామన్నారు. రైల్వే ఆధునికీకరణ పనులు వేగవంతం చేస్తామన్నారు. పన్నుల సంస్కరణలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, పన్నుల చెల్లింపుదారుల సమస్యలను పరిష్కరించేందుకు సింగిల్ విండో ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్రపతి తెలిపారు. దేశ వ్యాప్తంగా అన్ని గ్రామపంచాయితీలను బ్రాండ్‌బాండ్ ద్వారా అనుసంధానిస్తామన్నారు.

వచ్చే పదేళ్లలో విద్యుత్ అవసరాలు పెరుగుతాయని అంచనా ఉందని, విద్యుత్ డిమాండ్ ను తట్టుకునేందుకు అదనంగా 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తున్నామని ఆమె తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం వల్లే దేశంలో ధరలు పెరిగాయని రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ పేర్కొన్నారు.

No comments:

Post a Comment