Tuesday, March 13, 2012

కుర్రకారు తప్పులకు పెద్దలదే బాధ్యత


ఉదయం నుంచి సాయంత్రం వరకూ తమ పిల్లలు చదువుల్లో బిజీగా వున్నారని సంబరడిపోవటమే కానీ వారేమైనా దురలవాట్లకు లోనవుతున్నారా అని ఆలోచించట్లేదు. దీనికితోడు ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్‌ఫోన్‌లు వుంటాయి. చెడిపోవటానికి సులభమార్గం ఇవేనని వారు గుర్తించటంలేదు. ఇక సెలవుదినాల్లో చెప్పనక్కర్లేదు. సినిమాలు, పార్టీలు, టీవీ చానెళ్లు ఇదీ వారి ప్రపంచం. ముఖ్యంగా పదిహేడు సంవత్సరాలు దాటినవారి సంగతి చెప్పనక్కర్లేదు. నూటికి డెబ్భై శాతం మంది పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు.

ఈ-మెయిల్‌లు, ఎస్సెమ్మెస్‌లు, ఫేస్‌బుక్స్, పార్టీలు, ఫ్రెండ్స్, పెద్దవాళ్లు చెప్పింది వినకపోవటం, ఎదురు సమాధానాలు చెప్పడం- ఇవి ఈనాటి యువతలో ఎక్కువగా కనిపిస్తున్నాయ. పిల్లలు చిన్నతనంలో తెలియక అల్లరి చేస్తే ఒక అందం, మరి యుక్తవయస్సులో టీనేజ్ పిల్లలు పెద్దల మాట వినకపోతే, వారు మొండిగా తయారై ఎందుకూ పనికిరాకుండాపోతారు. కొందరు ఆకతాయితనంతో చదువుని నిర్లక్ష్యం చేస్తూ వీడియోగేమ్స్, టీవీ చానెల్స్‌తో తమ అమూల్యమైన కాలాన్ని వృథా చేస్తూ, వారి బంగారు భవిష్యత్తును పాడుచేసుకుంటున్నారు. దీనికంతటికీ మూల కారణం ఎవరు? పిల్లలా లేక పెద్దవారా? అని ప్రశ్నిస్తే కచ్చితంగా పెద్దవారే అని చెప్పవచ్చు.
పాశ్చాత్య దేశాలలో తల్లిదండ్రులు పిల్లలను అంతగా పట్టించుకోరని అంటారు. ఎందుకంటే అవన్నీ అభివృద్ధిచెందిన దేశాలు. అక్కడ ప్రతి ఒక్క రూ కష్టపడి పనిచేయాలి. కాబట్టి వారికి పిల్లలను పట్టించుకునే తీరికుండదు. కానీ మన దేశం అలా కాదు. ఇక్కడ సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. కాబట్టే పిల్లల విషయంలో జాగ్రత్త పడుతుంటారు. కానీ నేటి సమాజంలో పిల్లలను సక్రమంగా ఎంతమంది పెంచుతున్నారు? ప్రతిఒక్కరూ తమ కొడుకు గానీ, కూతురు గానీ ఏ సాఫ్ట్‌వేర్ ఇంజనీరో, డాక్టరో అవ్వాలని కోరుకుంటూ సంపాదనలో పడిపోతున్నారే తప్ప వారిని సరైన మార్గంలో పెంచుతున్నామా? లేదా? అని ఆలోచించేవారు లేరు. దీని ఫలితం పిల్లలు, ముఖ్యంగా టీనేజ్ వయసు వారు చెడు మార్గాలను అనుసరిస్తున్నారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకూ తమ పిల్లలు చదువుల్లో బిజీగా వున్నారని సంబరడిపోవటమే కానీ వారేమైనా దురలవాట్లకు లోనవుతున్నారా? అని పెద్దలు ఆలోచించట్లేదు. దీనికితోడు అమ్మాయలైనా, అబ్బాయలైనా ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్‌ఫోన్‌లు వుంటాయి. చెడిపోవటానికి సులభమార్గం ఇవేనని వారు గుర్తించటంలేదు. ఇక సెలవుదినాల్లో చెప్పనక్కర్లేదు. సినిమాలు, పార్టీలు, టీవీ చానెళ్లు... ఇదీ వారి ప్రపంచం. ముఖ్యంగా పదిహేడు సంవత్సరాలు దాటినవారి సంగతి చెప్పనక్కర్లేదు. నూటికి డెబ్భై శాతం మంది పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. తాగుడు, సిగరెట్లు కాల్చడం, బ్లూఫిల్మ్‌లు చూడటం వంటి వ్యసనాలకు బానిసలవుతున్నారు. ఇక కొందరు అమ్మాయిల సంగతి చెప్పనక్కర్లేదు. చిన్నవయసులోనే ప్రేమ పేరుతో అబ్బాయిల వెంబడి తిరుగుతున్నారు. పెద్దవారు ఇవేం పట్టించుకోవటంలేదు. ఇలా చెడు అలవాట్లకు గురయ్యే పిల్లలు ఎవరినీ పట్టించుకోవట్లేదు. తల్లిదండ్రులను లక్ష్యపెట్టడం లేదు. ఇంత జరిగిన తరువాత గానీ పెద్దవాళ్లకు జ్ఞానోదయం కలగదు. ఈ పరిణామాలన్నింటికీ కారణం పెద్దలకూ, పిల్లలకూ మధ్య తగిన అవగాహన లేకపోవటమే. వీరు పిల్లలకు కావలసినంత ప్యాకెట్‌మనీ ఇవ్వడం తప్ప కనీస ప్రేమాభిమానాలను అందించటంలేదు, వారి కదలికలను పట్టించుకోవటంలేదు. ఇంత కష్టపడేది వారికోసమే కదా.. అని సమర్థించుకుంటున్నారు.
సంపాదన మోజులోపడి పెద్దవాళ్లు పిల్లలను పట్టించుకోకపోతే అదివారికే కాదు సమాజానికి కూడా తీరని నష్టం. చెడు అలవాట్లకు బానిసలయినవారు సంఘ విద్రోహులుగా మారుతున్నారు. పిల్లలు చెడిపోతే వారిని బాగు చేసే ప్రయత్నం చేయాలే కానీ, అలా వదిలేస్తే వారు సమాజానికి చీడపురుగుల్లా తయారవుతారు. ఈ సమస్యకు కొంత పరిష్కారం ఉమ్మడి కుటుంబాలు. నేటి ఆధునిక యుగంలో ఇవి చాలా తక్కువగా ఉన్నాయి. పిల్లలను తల్లిదండ్రులు పట్టించుకోకపోయినా కనీసం వారి తాతలు, నాయనమ్మలు, మిగిలినవారు చూస్తారు. దీనివల్ల కొంత మార్పు రావచ్చు. ఇంట్లో అందరూ కలిసిమెలిసి వుండటంవలన పిల్లలకు ప్రేమానురాగాల విలువ తెలుస్తుంది. వారు దారితప్పే అవకాశాలు తక్కువవుతాయి. పెద్దవారంటే వినయం, విధేయతలు పెరుగుతాయి. ఉమ్మడి కుటుంబాల వలన సంప్రదాయాలు, సంస్కృతి మరిచిపోకుండా వుంటారు. ఇంకా విద్యా సంస్థలు కూడా కొంతవరకు కృషి చేయవచ్చు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ పిల్లలతో గడిపే ఉపాధ్యాయులకు పిల్లల ప్రవర్తన మీద అవగాహన వుంటుంది. కనీసం వారానికొకసారైనా సమావేశాలు ఏర్పాటు చేసి తల్లిదండ్రులతో పిల్లల గురించి చర్చించాలి. ఇలా చేస్తే ప్రతి ఒక్కరికీ తమ తమ పిల్లల మీద తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశం వుంటుంది. తల్లిదండ్రులకూ, పిల్లలకూ మధ్య ఒక గట్టి బంధం వుందని, అది ఎంత లాగినా సాగుతుందే గానీ ఊడిపోదు అని తెలుసుకోగలగాలి. పిల్లలతో కనీసం రోజుకు ఒక గంటయినా గడపటానికి కేటాయించాలి. వారితో కలిసి భోజనం చేయటం, టీవీ చూడటం, ఇండోర్ గేమ్స్ ఆడుకోవటం, సరదాగా ఎక్కడికైనా వెళ్లడం చేస్తే వారి ప్రవర్తనలో మార్పు వస్తుంది. వారు ఏదైనా తప్పులు చేస్తే నెమ్మదిగా మందలించటానికి ప్రయత్నించాలి. చెడు అలవాట్లు వుంటే ఎలా మార్పించాలో ఆలోచించాలి. వారితో స్నేహితుల్లా మెలగాలి. అపుడే వారు అన్ని విషయాలు పేరెంట్స్‌కు చెప్పగలరు. వారేమన్నా మంచి చేస్తే వారి ముందరే పొగడవద్దు. చెడుచేస్తే మాత్రం మందలించాలి. వారిని క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నించాలి కాని అది మితిమీరకూడదు. ఏదైనా అతిగా వుంటే పిల్లలు తొందరగా చెడిపోతారు. విచ్చలవిడిగా డబ్బు ఇవ్వద్దు. వారు ఖర్చుపెట్టే తీరు గమనిస్తూ వారికి డబ్బువిలువ తెలియజేయండి. పిల్లలకు నీతి, నిజాయితీ, తెలివితేటలు, అందరితో కలిసిమెలసి వుండటం వంటి మంచి లక్షణాలు నేర్పించండి. వారు మీ రూపాలకి ప్రతిబింబాలన్న సంగతి మరచిపోవద్దు. తల్లిదండ్రులూ... మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే వుందన్న సంగతి గుర్తుంచుకోండి. అలాగే, తమ బాధ్యతలను తెలుసుకుని క్రమశిక్షణతో జీవితాన్ని సాగించాలని యువత కూడా అర్థం చేసుకోవాలి.
-సుబ్బలక్ష్మి ( in Andhrabhoomi)

No comments:

Post a Comment