Friday, April 19, 2013

పేదల్లో మూడోవంతు భారత్‌లోనే: ప్రపంచబ్యాంకు

ప్రపంచంలోని నిరుపేదల్లో మూడింట ఒక వంతు మంది భారతదేశంలోనే ఉన్నారని ప్రపంచబ్యాంకు నివేదిక వెల్లడించింది. రోజుకు జీవన వ్యయం రూ. 65(1.25 అమెరికన్ డాలర్లు)కన్నా తక్కువగా ఖర్చుచేస్తున్న 120 కోట్ల(1.2 బిలియన్) మందిని నిరుపేదలుగా ఇది పరిగణనలోకి తీసుకుంది. వారిలో మూడో వంతు అంటే దాదాపు 40 కోట్ల మంది భారతీయులే ఉండటం గమనార్హం. పేదలు, నిరుపేదలు ఎక్కడున్నారనే ప్రాంతాలవారీ గణాంకాల ఆధారంగా రూపొందించిన ప్రపంచ అభివృద్ధి సూచికల ప్రకారం... అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నిరుపేదల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది.

1981లో ప్రపంచ నిరుపేదల్లో సగం మంది ఇక్కడే ఉండగా, అది 2010 నాటికి 21 శాతానికి తగ్గింది. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాల జనాభా మాత్రం 59 శాతం పెరిగింది. అయితే గురువారం ప్రపంచబ్యాంకు వెల్లడించిన నివేదిక ప్రకారం 120 కోట్ల మంది అత్యంత పేదరికంలో ఉన్నారు. వారిలో మూడో వంతు కన్నా ఎక్కువ మంది ఆఫ్రికాలోని ఉప సహారా ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నారు. 2030 నాటికి పేదరికాన్ని పూర్తిగా తగ్గించాలని పేర్కొన్నారు. ఇప్పటికీ ప్రపంచ జనాభాలో దాదాపు ఐదో వంతు మంది దారిద్య్రరేఖకు దిగువనే ఉన్నారని ప్రపంచబ్యాంకు సీనియర్ ఉపాధ్యక్షుడు, ఆర్థికవేత్త కౌశిక్ బసు వెల్లడించారు. ఆఫ్రికా ఉప సహారా ప్రాంతంలో అత్యంత పేదరికం స్థాయి 1999తో పోలిస్తే 2010 నాటికి పది పాయింట్లు తగ్గి, 48 శాతం ఉంది. ప్రపంచం మొత్తం మీద పేదల సంఖ్య క్రమేపీ తగ్గుతుంటే ఒక్క ఈ ప్రాంతంలో మాత్రం క్రమక్రమంగా పెరుగుతోంది. 

సాక్షి దినపత్రిక నుండి 

సీసా బల్బుతో.. కరెంటు ఫ్రీ!

ఒక సీసా.. కొంచెం నీరు.. కొంచెం బ్లీచింగ్ పొడి.. కొన్ని మెరిసే పదార్థాల ముక్కలు.. అంతే. ముంబై సమీపంలోని స్కూళ్లు వెలిగిపోతున్నాయి! సీసా కాంతులతో తరగతి గదులు కాంతులీనుతున్నాయి! సూర్యకాంతిని గ్రహించి తిరిగి కాంతులను వెదజల్లే ప్లాస్టిక్ ‘సీసా బల్బు’లతో ఈ వెలుగులు సాకారమవుతున్నాయి. కాలుష్యం లేదు. ఖర్చు లేదు. ఎంత వాడుకున్నా తరగదు. ఇంకేం.. పర్యావరణ అనుకూలమైన, సుస్థిర ‘విద్యుత్ కాంతులు’ రెడీ అన్నమాట. ముంైబె లోని వాడా, థానేలకు సమీప గ్రామాలైన కుదుస్, దేవ్‌గావ్‌లలోని మూడు పాఠశాలల్లో ఈ విద్యుత్తు కాని విద్యుత్తు వెలుగులు ప్రసరిస్తున్నాయి. ఓ శీతల పానీయాల కంపెనీ ఇందుకు తోడ్పాటునిస్తోంది.

ఎలా పనిచేస్తుందంటే..? 
ఓ బాటిల్‌ను తీసుకుని దాంట్లో కొంత నీరు నింపుతారు. అందులో బూజులు, ఇతర సూక్ష్మజీవులు పెరగకుండా కొంత బ్లీచింగ్ పొడి కలుపుతారు. వీటితోపాటు కాంతిని ప్రతిఫలించే కొన్ని రకాల పదార్థాలనూ కలుపుతారు. తర్వాత పాఠశాల పైకప్పుపై సీసా పైసగం ఎండలో ఉండేలా, కింది సగం పైకప్పు కింద గదిలోకి ఉండేలా అమర్చుతారు. దీంతో పైభాగంలో పడే ఎండను అందులోని పదార్థాలు గ్రహించి కిందివైపునకు కాంతిని ప్రతిఫలింపజేస్తాయి. ఇంకేం.. అచ్చం కరెంటు వెలుగుల్లా గది వెలిగిపోతుందన్నమాట. 

ఒక సీసా బల్బుతో.. 55 వాట్ల కాంతి! 
పానీయాల కోసం ఉపయోగించే పెట్ సీసాలను పునర్వినియోగించే దిశగా దృష్టిపెట్టిన ఓ కంపెనీ ఈ మేరకు గతేడాది నవంబర్‌లో ఈ ప్రాజెక్టును చేపట్టింది. కంపెనీ ప్లాంటుకు సమీప గ్రామాల్లోని మూడు స్కూళ్లలో వీటిని ఈ వేసవిలో ఏర్పాటుచేసింది. 30 సీసా బల్బులను ఒక్కొక్కటి రూ. 300 చొప్పున ఖర్చుతో ఏర్పాటు చేసింది. ఒక్కో సీసా నుంచి 55 వాట్ల కాంతి వెలువడుతుందని హెచ్‌సీసీబీ అధికారి దుర్గేశ్ తెలాంగ్ వెల్లడించారు. దేశంలోని స్కూళ్లలో తగినంత వెలుతురు లేక విద్యార్థుల చదువులకు ఇబ్బంది ఏర్పడుతోందని, తరగతి గది మంచి వెలుగులతో ఉంటే వారి అభ్యాసం కూడా మెరుగవుతుందని పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం.. ఇప్పటికీ మనదేశంలో 40 శాతం ఇళ్లకు విద్యుత్తే లేదట. అందువల్ల మారుమూల గ్రామాల్లోని ఇళ్లలో ఏర్పాటుకు కూడా ఇవి అనుకూలమంటున్నారు. 
సాక్షి దినపత్రిక నుండి