Thursday, March 1, 2012

నవ్వు నాలుగు విధాల మేలు

నవ్వు నాలుగు విధాల చేటు- అని ఓ సామెత వుంది. నిజమే కాని అది కారణం లేకుండా నవ్వేవారికే వర్తిస్తుంది. అసలు మనిషి నవ్వకపోతే ఆరోగ్యానికే హాని కలుగుతుందంటున్నారు వైద్యులు. మనిషి తన బాధలను మరిచిపోగలిగేది ఒక నవ్వుతో మాత్రమే అనేది నిజం. కష్టాలనేవి అందరికీ వుంటాయి. ఎవరైతే తమ కష్టాలను మరిచిపోయి హాయిగా మనసారా నవ్వుకోగలుగుతారో వారిని మించిన ఆరోగ్యవంతులు ఎవరుంటారు చెప్పండి. నవ్వు అనేది ఏ మనిషికైనా వారి వ్యక్తిత్వం మీద ఆధారపడి వుంటుంది. కొంతమంది ఎప్పుడు తాము నవ్వుతూ అందరినీ నవ్విస్తూ వుంటారు. మరికొందరు నవ్వటమే పాపం అన్నట్టు విచారంగా వుంటారు. వైద్యనిపుణుల అభిప్రాయం ప్రకారం ఎవరైతే హాయగా నవ్వగలుగుతారో వారి దరికి ఎలాంటి అనారోగ్యాలు చేరవు. పౌల్ ఎక్మాన్ అనే మానసిక శాస్తవ్రేత్త 1960లో నవ్వుమీద పరిశోధన చేసి, ప్రతి మనిషి ముఖంలో సుమారు 43 కండరాలు నవ్వటానికి సహాయపడతాయని చెప్పారు. నవ్వుగురించి ప్రత్యేకంగా పేషియల్ ఏక్షన్ కోడింగ్ సిస్టమ్స్ అనే పద్ధతిని కనిపెట్టి అందుకు సంబంధించి మన శరీరంలో 18 రకాలైన గ్రంధులు ఉంటాయని తేల్చారు.
మనిషి శరీరంలోని రక్తప్రసరణను క్రమబద్ధీకరించే శక్తి ఒక నవ్వుకు మాత్రమే వుంది. ప్రాణవాయువు, న్యూట్రిషన్స్ శరీరానికి ఎంత అవసరమో, నవ్వు కూడా అంతే అవసరమంటున్నారు ఆరోగ్య నిపుణులు. బిగ్గరగా నవ్వడంవలన ఉదరం, కాళ్లు, చేతులు, ముఖ కండరాలు అన్నింటికీ వ్యాయామం చేసిన ఫలితం దక్కుతుంది. శరీరానికి ఆహారం ద్వారా తీసుకున్న క్యాలరీలు ఖర్చు కావాలంటే నవ్వు తప్పనిసరి. నవ్వు మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతోపాటు మానసిక బలాన్నికూడా అందిస్తుందనడంలో సందేహం లేదు. మనిషిలోని స్వచ్ఛమైన నవ్వుకి, ముఖంలోని హావభావాలకి దగ్గరి సంబంధం వున్నట్లే శరీరంలో జరిగే పలు రసాయనిక మార్పులకి కూడా సంబంధం వుంది. శరరంలో ఎంజైములు, హార్మోనులు విడుదల కావడానికి ఆరోగ్యవంతమైన నవ్వు దోహదపడుతుంది. ఎంజైములు, హార్మోన్లు శరీర అవయవాల పనితనాన్ని మెరుగుపరుస్తాయి. రక్తపోటును క్రమబద్దీకరించుకోవడానికి మందులతో పనిలేకుండా ప్రతి రోజు కాసేపన్నా మనసారా నవ్వుతుంటే రక్తపోటు సాధారణ స్థితికి చేరుకుంటుందని పరిశోధకులు సూచించారు. దీంతో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా వుంటారు. హార్మోన్లలో అసమానతల కారణంగా, ఒత్తిడి, ఆందోళనకు గురవుతారు. నవ్వు శరీరంలోని హార్మోను ఉత్పత్తుల హెచ్చుతగ్గులను క్రమబద్ధీకరిస్తుంది. మనసారా నవ్వడంవలన ఒత్తిడి, ఆందోళన మాయమవుతాయి.
వయసు తగ్గించుకోండి..
వయసు పెరిగేకొద్దీ ముఖంపై ముడతలు ఏర్పడుతుంటాయి. వీటిని నివారించేందుకు నిత్యం చిరునవ్వుతో ఆనందంగా వుంటే వయసు అంతగా తెలియదంటున్నారు ఆరోగ్య నిపుణులు. భావాలను వ్యక్తీకరించడంతోపాటు, నిత్యం చిరునవ్వును చిందిస్తుంటే అందంగా కనపడుతుంటారని పరిశోధకులు అంటున్నారు. నవ్వు ముఖానికి మంచి వ్యాయామం లాంటిది. నవ్వు ముఖంలోని కండరాలు ముడతలు పడకుండా వుండేందుకు దోహదపడుతుంది. ముఖం మరింతగా అందంగా కనపడాలంటే నిత్యం చిరునవ్వును చిందిస్తుండాలి. వీలు చిక్కినప్పుడల్లా కాస్త బిగ్గరగా నవ్వుతుంటే, ముఖానికి మంచి వ్యాయామం కలుగుతుందంటున్నారు పరిశోధకులు. ప్రతిరోజు నవ్వును ఓ వ్యాయామంలా చేస్తుండాలి.
ప్రతిరోజు నవ్వడంవలన మనసుకు ఏకాగ్రత కలుగుతుంది. దీంతో మీకు తెలియకుండా మీలో ఉత్సాహం వెల్లివిరుస్తుంది. అలాగే మీ వ్యక్తిత్వంలో మార్పు వచ్చి నిత్య యవ్వనులుగా కనపడతారు. ప్రతిరోజు నవ్వటం నేర్చుకుంటే ఆరోగ్యంతోపాటు మనిషి నిత్య యవ్వనంగా వుంటారంటున్నారు పరిశోధకులు. నవ్వుతో శరీరంలోని ఎలాంటి జబ్బునైనా మటుమాయం చేయవచ్చంటున్నారు. నవ్వే శక్తి కేవలం మానవునికి మాత్రమే సాధ్యపడుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. మనిషి ఎప్పుడూ నవ్వుతూ వుంటే కనుక వారి ఆరోగ్యం బాగుండి ఎక్కువ కాలం జీవించి ఉండగలుగుతారు. నవ్వు ఎంత ప్రధానమైనదంటే మన మెదడులోని నరాలు శరీరంలోని కండరాలను నవ్వు ద్వారానే నియంత్రిస్తాయి. అందుకనే మనిషి హాయిగా నవ్వగలిగితే కండరాలన్నీ గట్టిపడి దృఢమైన ఆరోగ్యం మన సొంతమవుతుంది.
-సుబ్బలక్ష్మి ( From Andhrabhoomi )

No comments:

Post a Comment