Thursday, March 1, 2012

మద్యం స్కాం లో ప్లేటు పిరాయించిన రమణ

రాష్ట్రంలో మద్యం ముడుపుల దుమారాన్ని లేపిన ఖమ్మం జిల్లాకు చెందిన మద్యం వ్యాపారి నున్నా రమణ ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించాడు. అసలు తనకు మద్యం వ్యాపారంతో సంబంధమే లేదని, మంత్రికే కాదు ఎవరికీ పైసా ఇవ్వలేదని చెప్పి అందరిని కంగుతినిపించాడు. ఈ అంశం ఇప్పుడు అత్యంత చర్చనీయాంశంమైంది. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఎసిబి కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటీషన్‌లో ఈ అంశాలను పేర్కొనడం రాజకీయ, అధికార వర్గాల్లో ఒక్కసారిగా కలవరం సృష్టించింది.
మద్యం ముడుపుల కేసులో ఎసిబి అధికారులు అరెస్టు చేయడంతో ప్రస్తుతం రమణ జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నాడు. ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణకు 10 లక్షల రూపాయలు చెల్లించినట్లు ఎసిబి విచారణ సందర్భంగా రమణ వెల్లడించి సంచలనం సృష్టించాడు. ఈ కేసుకు సంబంధించి మంత్రికి ముడుపులు ముట్టినట్లు పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగింది. స్వయంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అసెంబ్లీలో మంత్రులకు మద్యం ముడుపులతో సంబంధం లేదని ప్రకటించారు. మద్యం ముడుపుల అంశం చిచ్చు ఇంకా రగులుతుండగానే రమణ తాజాగా కోర్టుకు తెలిపిన వివరాలు మరో సంచలనానికి దారితీసింది.
తనపై థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఎసిబి అధికారులు ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నాడు. నిందితుడు చెప్పిన విషయాలు, ఎసిబి అధికారులు కేసులో పేర్కొన్న అంశాల్లో ఏది నిజమన్నది తేలాల్సి ఉంది. బలవంతంగా ఎసిబి అధికారులు తనతో చెప్పించి ఆ వాంగ్మూలాన్ని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారని బెయిల్ పిటీషన్‌లో పేర్కొన్నాడు. తాను మంత్రికి గానీ మరెవరికి గాని సొమ్ములు చెల్లించలేదని స్పష్టం చేశాడు. మద్యం వ్యాపారంతో సంబంధం లేదని, తాను వ్యవసాయం చేసుకుంటుంటానని పేర్కొన్నాడు. అనవసరంగా మద్యం కేసులో తనను ఇరికించిన ఎసిబి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.

No comments:

Post a Comment