Monday, March 19, 2012

ఎండాకాలంలో ఆరోగ్యం కాపాడుకోవడం ఎలాగో తెలుసుకుందాం....



ఎండాకాలంలో వడదెబ్బ చాలా ప్రమాదకరమైన ఆరోగ్య సమస్య. మద్యం తాగేవారిలో, వయసు మళ్లిన వారిలో ఈ సమస్య ఎక్కువగా రావొచ్చు. ఎండల్లో ఎక్కువగా తిరగడం వల్ల ఈ సమస్య వస్తుంది. వడదెబ్బ వచ్చిన వ్యక్తికి శరీరం ఎర్రగా, వేడిగా, పొడిగా ఉంటుంది. చెమటపట్టదు. చివరికి చంకలు కూడా తడిగా ఉండవు. శరీర ఉష్ణోగ్రత 110 డిగ్రీల ఫారన్‌ హీట్‌ వరకు పెరిగే అవకాశముంది. శ్వాసపీల్చడం పెరుగుతుంది. గుండె కొట్టుకునే వేగం అధికమవుతుంది. రక్తపోటు ఎక్కువైతుంది. కొందరు స్పృహ కూడా తప్పొచ్చు. వడదెబ్బ వచ్చిన వ్యక్తికి వెంటనే చికిత్స మొదలు పెట్టాలి. ఆలస్యమైతే మెదడు దెబ్బతినొచ్చు.మరణం సంభవించొచ్చు. గంటలో ఉష్ణోగ్రత బాగా తగ్గించే చర్యలు తీసుకోవాలి. వడదెబ్బ లక్షణాలు కలిగిన వ్యక్తిని వెంటనే నీడలోకి తీసుకెళ్లాలి. బట్టలు బాగా వదులు చేయాలి. తడి బట్టతో శరీరాన్ని చుట్టాలి. ఫ్యాన్‌ దగ్గర పడుకోబెట్టాలి. ఫ్యాన్‌లేకపోతే విసనకర్రతో విసరాలి. చల్లనీరు తాగించాలి. ఈ చికిత్స తర్వాత అవసరమనిపిస్తే ఆసుపత్రికి తీసుకెళ్లాలి.

అలసటతో తగ్గే రక్తపోటు

ఎండల్లో ఎక్కువగా పనిచేయడం వల్ల నీరసం, అలసట కలుగుతుంది. వీరిలో చెమట ఎక్కువ పడుతుంది. రక్తపోటు తగ్గుతుంది. నాడీబలహీనంగా ఉంటుంది. ఈ లక్షణాలు గలవారిని వెంటనే చల్లని ప్రదేశానికి తీసుకెళ్లాలి. తలకంటే కాళ్లు ఎత్తుగా ఉండేట్టు పడుకోబెట్టాలి. కాళ్లు, చేతులు బాగా రుద్దాలి. ఒక లీటరు నీళ్లలో ఒకటే స్పూను ఉప్పు కలిపి కొంచెం కొంచెం తరచుగా పెట్టాలి. అపస్మారక స్థితి ఉంటే, ఎలాంటి ఆహారం ఇవ్వకుండా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. వీరు ఎక్కువ రోజులు అదనంగా ఉప్పు వాడాలి.

కండరాల నొప్పులు

ఎండాకాలం శరీరంలో లవణాల శాతం తగ్గిపోవడం వల్ల కండరాల నొప్పులు వస్తాయి. ఎక్కువగా ఎండల్లో పనిచేస్తూ, చాలా ఎక్కువగా నీరు తాగే వారిలో ఈ సమస్య రావొచ్చు. పనివేళల్లో సాయంత్రపూట ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. వీరికి ఒక లీటరు నీళ్లలో ఒక టీ స్పూను ఉప్పుకలిపి కొంచెం-కొంచెం తరచూ పట్టాలి. ఉప్పు కలిపిన నీటితో వీరికి తొందరగా ఉపశమనం కలుగుతుంది. ప్రథమ చికిత్స తర్వాత అవసరమనుకుంటే ఆసుపత్రికి తీసుకెళ్లాలి.

చెమటకాయలు

ఎండల్లో కొందరికి చెమట కాయలు రావొచ్చు. ఇలాంటి వారుదురద లేకుండా 'కెలడ్రిల్‌' పూత మందు వాడవచ్చు. ఎక్కువ భాగం చల్లటి ప్రదేశాలలో ఉండాలి. నూలుబట్టలు ధరించాలి. చెమట ఎక్కువగా కలిగించే వేపుడు పదార్థాలు, మద్యపానానికి దూరంగా ఉండాలి.

ఎండాకాలంలో గ్లూకోజు ?

ఎండాకాలంలో చాలా మంది చల్లదనం వస్తుందని గ్లూకోజు నీటిలో కలిపి తాగుతుంటారు. ఇది అశాస్త్రీయం. గ్లూకోజుకు ఎండలకు ఎలాంటి సంబంధం లేదు. గ్లూకోజు కూడా ఇతర పిండి పదార్థాల్లాగానే ఒక పిండి పదార్థం. గ్లూకోజు శరీరానికి చల్లదనం ఇవ్వదు.

నీటికాలుష్య రోగాలు

ఎండాకాలం బావుల్లో, తాగునీటి వనరుల్లో నీరు ఇంకి కలుషితం అవుతుంది. ఇందు వల్ల నీళ్ల విరేచనాలు, చీము రక్త విరేచనాలు, కలరా, టైఫాయిడ్‌, అమీబియాసిస్‌, కొన్ని రకాల పచ్చకామెర్లు, నుళిపురుగుల వ్యాధులు, పోలియో వ్యాధి రావొచ్చు. నీళ్లు బాగా మరగకాచి, చల్లార్చి తాగితే ఈ వ్యాధులు నిరోధించొచ్చు.

ఆరోగ్యంగా ఉండటానికి....

* ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వీలైతే ఎండలో తిరగరాదు.

* నూలు, వదులు బట్టలు ధరించాలి.

* బయటికి వెళ్లినప్పుడు టోపి పెట్టుకోవాలి.

* మంచినీరు ఎక్కువగా తాగాలి.

* సాధారణ నీటితో తరచూ స్నానం చేయాలి.

* రోజూ వాడే ఉప్పుకంటే అదనంగా ఉప్పు వాడాలి.

కాచి చల్లార్చిన నీళు ్లతాగాలి

అందరూ ఆరోగ్యంగా ఉండాటానికి మంచినీరు అన్నిటికంటే ఎక్కువ పాత్ర నిర్వహిస్తుంది. రక్షిత మంచిన నీరు అందరికీ అందించడం ప్రభుత్వం చేయాల్సిన మొదటి బాధ్యత. ఇక్కడ మన ప్రభుత్వాలు దాదాపు ఫెయిలైనట్లే. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాలా ప్రకారం నీరు-పారిశుధ్యలోపాల వల్ల మన దేశంలో ఏటా 78 లక్షల మంది చనిపోతున్నారు. దీన్ని గురించి ఏడస్తూ కూర్చోకుండా, వ్యక్తులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. మనలో చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేస్తారు. నీరు వేడి చేసినప్పుడు సూక్ష్మజీవులు చనిపోతాయి. అంటే ఆ నీరు శుభ్రమైన నీరు. అశుభ్రమైన నీటితో స్నానం చేస్తాం. వేడి నీటితో స్నానం చేస్తే శరీరానికి ఆట్టే ప్రయోజనం లేదు. వేడి నీటితో స్నానం చేయడానికి ఎక్కువ నీరు కావాలి. ఎక్కువ ఇంధనం కావాలి. ఎక్కువ సమయం పడుతుంది. వేడి నీటి స్నానం వల్ల కాలం, ఇంధనం, డబ్బు వృధా అవుతుంది. మనలో చాలా మంది మనకు సాధారణంగా లభించే నీటిని ఏ చర్యలు చేయకుండా తాగుతాం. మనం తాగే నీటిలో వ్యాధులు కలిగించే ఎన్నోరకాల సూక్ష్మజీవులుంటాయి. అంటే మనం కలుషిత నీరు తాగుతున్నామన్నమాట. ఇందువల్ల నీళ్ల విరేచనాలు, చీము-రక్తవిరేచనాలు, కలరా, టైఫాయిడ్‌, అమీబియాసిస్‌, కొన్ని రకాల పచ్చకామెర్లు, నుళిపురుగుల వ్యాధులు, పోలియో రావొచ్చు. నీళ్లు బాగా కాచి, చల్లార్చి తాగితే ఈ వ్యాధులు రావు. నీరు మరిగేటప్పటి నుండి 15 నిమిషాలు కాచాలి. ఏ పాత్రలో కాచుతారో అదే పాత్రలో చల్లారనీయాలి. తాగటానికి స్నానం కంటే తక్కువ కావాలి. తాగేనీరు కాచటానికి తక్కువ సమయం పడుతుంది. ఆరోగ్యమూ వస్తుంది. వెరసి మనం పరిశుభ్రమైన నీరు స్నానం చేయడానికి, అపరిశుభ్రమైన నీరు తాగడానికి వాడి జబ్బులు, మరణాలు, తెచ్చుకుంటున్నాం. కాలం, ఇంధనం, డబ్బు వృధా చేస్తున్నాం. ఈ పద్ధతి మార్చుకుంటే ఆరోగ్యం, ఇంధనం మిగులు, డబ్బు మనకు వచ్చే లాభాలు. వెంటనే ఇప్పుడున్న పద్ధతులు రివర్స్‌ చేసుకోండి. తాగటానికి బాగా కాచి చల్లార్చిన నీరు, స్నానానికి మామూలుగా లభించే నీరు. ఈ ఎండాకాంలోనే ఈ మార్పుకు శ్రీకారం చుట్టాలి.

డాక్టర్‌ ఆరవీటి రామయోగయ్య

ఆర్గనైజేషన్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ సోషల్‌ డైమెన్షన్స్‌ ఆఫ్‌ హెల్త్‌

హైదరాబాద్‌.
( Courtesy: Prajasakthi)

No comments:

Post a Comment