Wednesday, October 31, 2012

ఓటర్ల నమోదుకు గడువు పొడిగింపు

ఓటర్ల జాబితా సవరణలో భాగంగా జిల్లాలో చేపట్టిన ఓటర్ల నమోదుకు గడువు పెంచారు. 2013 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే యువజనులతో పాటు, ఓటర్ల జాబితాలో పేర్లు లేనివారు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అక్టోబర్ 1నుంచి ఓటర్ల నమోదు చేపట్టిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ ప్రక్రియ 31వ తేదీతో ముగియాలి. అయితే నమోదు గడువును నవంబర్ 15 వరకు పెంచుతూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.

Tuesday, October 30, 2012

స్త్రీ శక్తికి సాక్షి "ఇందిరా గాంధీ"

"భారతదేశంలో మహిళలకు అత్యంత గౌరవిస్తారు. స్త్రీని శక్తిస్వరూపిణిగా పూజిస్తారు. స్త్రీ సృష్టికి, శక్తికి మూలం. "ఇందిరాగాంధీ అంటే ఒక శక్తి" ఆడది (క్షమించాలి. . . ) పరిపాలన ఏం చేయగలదు!" అంటూ పెదవి విరిచిన పురుషపుంగవులు దిగ్భ్రాంతి చెందేలా అత్యంత సమర్ధవంతంగా సుధీర్ఘ కాలంపాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించడమేకాక, శత్రుభీకరంగా దేశాన్ని తీర్చిదిద్దటానికి ప్రయత్నించారు.

దేశం గౌరవించే నెహ్రూల కుటుంబంలో జవహర్‌లాల్ నెహ్రూ- కమలానెహ్రూ దంపతులకు 19న నవంబర్, 1917వ సంవత్సరం అలహాబాద్‌లో 'ఇందిరా ప్రియదర్శినీ జన్మించింది. చిన్నతనంలో తల్లి అనారోగ్యం, తండ్రి దాదాపు చాలాకాలం జైలుజీవితం గడపడం లేదా ఉద్యమాల్లో పాలుపంచుకోవడానికి వెళ్ళడంతో ఇందిర ఒంటరితనాన్ని గడపడం లేదా బొమ్మలతో ఆడుకోవడంతో గడిచిపోయింది. మోతీలాల్ నెహ్రూ, జవహర్‌లాల్ నెహ్రూ వంటి ఉన్నతశ్రేణి స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో జన్మించిన ఇందిరాప్రియదర్శిని సహజంగానే స్వాతంత్ర్య ఉద్యమం వైపు ఆకర్షితురాలైంది. వారిని, వారి సహచరులను సమీపం నుంచి గమనించగలగడం, వారి కార్యక్రమాల గురించి వినడం వంటివాటి నుంచి స్ఫూర్తి పొందిన ఇందిర స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాలు పంచుకున్నారు. తరువాతికాలంలో ఇందిర ఇంగ్లాండ్‌కు వెళ్ళడం జరిగింది. అక్కడే ఇందిర ఫిరోజ్ గాంధీని కలవడం, ప్రేమలో పడటం, పెళ్ళి జరిగాయి. (భావావేశంలో వయసు ప్రభావం వలన ఇందిర అతన్ని ప్రేమించిందని, తరువాత అందుకు పశ్చాత్తాప పడిందని అంటారు. వారు ఎక్కువ శాతం విడివిడిగానే గడిపారు.)

ఇందిర 1955వ సంవత్సరం నుండి భారత జాతీయ కాంగ్రెస్‌లో కీలక సభ్యురాలిగా ఎదిగారు. 1959వ సంవత్సరంలో పార్టీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. నెహ్రూ మరణాంతరం లాల్‌బహుదూర్ శాస్త్రీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ ప్రభుత్వంలో సమాచార ప్రసారశాఖ మంత్రిగా ఇందిర బాధ్యతలు స్వీకరించారు. 1966వ సంవత్సరంలో లాల్‌బహుదూర్ శాస్త్రి ప్రధానిగా వుండగానే తాష్కెంట్ సమావేశం జరుగుతున్నపుడు గుండెపోటుతో హఠాత్తుగా మృతిచెందటంతో, ఇందిరాగాంధీ ప్రధాని పదవిని స్వీకరించారు. ఇందిర ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, ఆమె పరిపాలనేం చేయగలుగుతుందని పలువురు నేతలు బహిరంగంగానే దాదాపు 17 సం||ల సుధీర్ఘ కాలంపాటు ప్రధానిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారు. ఇందిర సుదీర్ఘ ప్రధాని పదవీ కాలంలో మెరుపులే కాదు మరకలు కూడా బాగానే వున్నాయి. భారతదేశానికి తొలి (మరియు ఏకైక) మహిళా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన ఇందిర మహిళాలోకానికి గర్వకారణాంగా నిలిచారు.

ప్రధానమంత్రిగా వున్న సమయంలో ఇందిర అధికారపరంగా, పాలనాపరంగా, రాజకీయపరంగా అనేక సవాళ్ళు ఎదుర్కున్నారు. 1971వ సంవత్సరంలో తూర్పు బెంగాల్ రాష్ట్రం సమస్య విషయంలో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో విజయం సాధించడం, బంగ్లాదేశ్ ఏర్పడటం జరిగాయి. పాలనాపరంగా సాధించిన విజయాలు, పార్టీలో, ప్రభుత్వంలో ఎదురులేకపోవడం వంటి కారణాల వలన ఇందిరలో ఆత్మవిశ్వాసంతోపాటు, అహంకారం కూడా పెరిగిపోయింది. అంతే కాక చుట్టూ భజనపరులు చేరి "ఇందిరే ఇండియా. ఇండియాయే ఇందిర" అంటూ- ఆమెలోని అహంభావపు స్థాయిని పెంచారు. దాంతో తానే సర్వస్వమని భావించిన ఇందిర నియంతలా ప్రవర్తించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించిన నాయకులు అందరినీ అరెస్ట్‌ చేసి, దేశంలో ' ఎమర్జెన్సీ' విధించారు. ఆ కాలం భారత చరిత్రలో చీకటిదశ, ఇందిర జీవితానికి మాయని మచ్చగా మిగిలింది. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో జయప్రకాష్ నారాయణ్ ప్రమేయంతో ఇందిర ఓటమిపాలైంది. కానీ, త్వరలోనే తనను కమ్మిన మబ్బులను తొలగించుకున్న ఇందిర తరువాత జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి, తిరిగి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.

పాలనాపరంగా ఎన్నో సంచలన నిర్ణయాలు ఇందిర తీసుకున్నారు. బ్యాంకులను జాతీయం చేయడం, సంస్థానాధీశులకు యిచ్చే భరణాలను రద్దు చేయడం, అణు పరీక్షలకు అనుమతినివ్వడం, బంగ్లాదేశ్ అవతరణకు సైన్యసహకారమందించడం వంటి పలుసంచలనాత్మక నిర్ణయాలు ఇందిర సాహసపూరిత వ్యక్తిత్వానికి అద్దం పడతాయి. పంజాబ్‌లో సంభవించిన హింసను అణచివేయడానికి చేపట్టిన అపరేషన్ 'బ్లూస్టార్' సిక్కుల మనోభావాలను దెబ్బతీసింది. సిక్కుల పవిత్ర దేవాలయం అయిన అమృతసర్‌లోని 'స్వర్ణ' దేవాలయ ప్రాంగణంలో కాల్పులు జరగడం వారిని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఇందిరాగాంధీ 1984వ సంవత్సరంలో ఒకరోజు ఇంటినుండి ఆఫీస్కు వస్తుండగా, ఆమె బాడీగార్డు అయిన ఒక సిక్కు ఆమెను కాల్చిచంపాడు. "స్త్రీ బలహీనురాలు" అన్నది తప్పని నిరూపించి, స్త్రీ శక్తికి, మనోస్థైర్యానికి ప్రతీకగా నిలిచిన ఇందిరా గాంధీ ఆదర్శనీయురాలు.

మూలం: భారతీయం, ఆదెళ్ళ శివకుమార్, ఓం పబ్లికేషన్స్.

Originally at: telugudanam

Saturday, October 20, 2012

సరస్వతీ నమస్తుభ్యం.!!

సరస్వతీ నమస్తుభ్యం.!!
వరవీణా మృదు పాణీ...నమోస్తుతే...గీర్వాణీ..
సంగీతామృత తరంగిణీ.సారస్వతపుర సామ్రాజ్ఞి
మంద్రస్వర వీణ గాన ప్రియే... మంజుల చరణ శింజినీ నాదమయే
పాలయమాం..పరిపాలయమాం.. పాలయమాం..పరిపాలయమాం...
1.       అక్షర రూపిణి-అక్షర దాయిని-భాషా లక్ష్మీ భావమయి
అగణిత పదయుత అద్భుత పదనుత విద్యాదేవీ వాక్య మయి
అతులిత జ్ఞాన ప్రదాయిని భారతి –మేధావిని హే వేద మయి
          పాలయమాం..పరిపాలయమాం.. పాలయమాం..పరిపాలయమాం...

2.       సుస్వర మార్దవ –మాధుర్యాన్విత –గాత్రప్రదాయిని గానమయి
శ్రుతిలయ పూరిత –భావగర్భిత-నాదవినోదిని మోదమయి
రాగ తాళ సమ్మేళన గీతా-వాణీ మహదను రాగమయి
          పాలయమాం..పరిపాలయమాం.. పాలయమాం..పరిపాలయమాం...
 

శనివారం, శుద్ధ పంచమి, ఉదయం 638 ని..ల వరకూ తరువాత షష్ఠి, మూలా నక్షత్రం శ్రీ సరస్వతీ దేవి అవతా రం. శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉంది. చదువుల తల్లి సరస్వతీ రూపంతో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు ఇది. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీ దేవిని పురాణాలు వర్ణిస్తున్నాయి. శ్వేత పద్మాన్ని ఆసనంగా అధి ష్టించి... వీణ, దండ, కమండలం, అక్ష మాల ధరించి, అభయ ముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను ఈ దేవి సంహరిస్తుంది. వ్యాసుడు, వాల్మీకి, కాళిదాసు మొదలైన లోకోత్తర చరి్త్రులకు ఈమె వాగ్వైభ వాన్ని వరంగా ఇచ్చింది. ఈమెను కొలిస్తే విద్యార్థు లకు చక్కని బుద్ధి వికాసం జరుగుతుంది. త్రిశక్తి స్వరూపాల్లో ఈమె మూడో శక్తిరూపం. సంగీత, సాహిత్యాలకు అధిష్టాన దేవత. సకల జీవుల జిహ్మాగ్రంపై ఈమె నివాసం ఉంటుంది.

చిలుకవాక్కులకు సంకేతం అందుకే వాగ్దేవతను ఆశ్రయించి ఉంటుంది. సరస్వతి బాలచంద్రుని కుసుమంగా ధరించింది. పాటకు తోడుగా బంగారు వీణ మ్రోగుతుంది. బ్రహ్మదేవుని ముఖపద్మాలు ఆమెకు కేళీ గృహాలు. నాలుగు ముఖాలు నాలుగు వేదేలు. వేదాలు వాక్కుకు మూలాలు. బ్రహ్మాముఖంలో సరస్వతి ఉన్నదని శాస్త్రోక్తి. హంసవాహనం గల నాద స్వరూపిణి దేవి చదుర్ధశభువనాధీశ్వరి. పాండిత్యమూ... పతనమమేది రెండూ సరస్వతి అధీనంలోనివే అన్న విషయం అందరూ గమనించాలి. అమ్మవారిని నేడు తెలుపు లేదా తెలుపు గోధుమ రంగుల వస్త్రాలతో అలంకరిస్తారు. అమ్మవారికి ఇష్ట మైన దద్దో్ననం, శెనగపప్పు, కొబ్బరి నివేదన చేయాలి.

‘‘వాణీం పూర్ణనిశాకరోజ్జ్వల ముఖీం కర్పూర కుంద ప్రభాం చంద్రార్థాం కిత మస్తకాం నిజకరై స్సంచిబ్రతీ మాదరాత్‌.. వర్ణాకుక్షగుణం సుదాద్యకలశం వద్యాంచ ఉత్తుంగ స్తనీం..దివ్యై రాభరణై ద్విభూషిత తను సింహాది రూడాం భజే’’ ఈ శ్లోకం క్రమం తప్పకుండా ఉదయ సమయంలో 18 సార్లు పఠిస్తే జ్ఞాపకశక్తి, స్ఫూర్తి, మేధాశక్తి వృద్ధిచెంది విద్యాజయం కలుగుతుంది. ఈ రోజు ప్రభుత్వం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
Sria

Thursday, October 18, 2012

‘కెమెరామన్ గంగతో రాంబాబు’ రివ్యూ

నటీనటులు- పవన్ కళ్యాణ్, తమన్నా, గాబ్రియల్, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు
సంగీతం- మణిశర్మ
నిర్మాత- డీవీవీ దానయ్య
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం- పూరి జగన్నాథ్

ఎంతైనా పూరి జగన్నాథ్ బతకనేర్చిన దర్శకుడు. మంచి ‘టైమింగ్’ ఉన్న దర్శకుడు కూడా. ‘దూకుడు’తో అమాంతం పెరిగిపోయిన మహేష్ బాబు ఇమేజ్ ని చక్కగా క్యాష్ చేసుకుని చక్కగా ‘బిజినెస్ మేన్’ చేశాడు. ఇప్పుడు ‘గబ్బర్ సింగ్’తో ఆకాశంలో ఉన్న పవన్ కళ్యాణ్ క్రేజ్ ను క్యాష్ చేసుకుని ‘కెమెరామన్ గంగతో రాంబాబు’ తీశాడు. ఈ రాంబాబు కూడా ‘బిజినెస్ మేన్’ టైపే. సూర్య చెప్పేయగా మిగిలిపోయిన పూరి జగన్నాథ్ ‘ఫిలాసఫీ’నే ఇప్పుడు రాంబాబు వల్లించాడు. కాకపోతే ఆ ‘ఫిలాసఫీ’తో పోలిస్తే ఈ ‘ఫిలాసఫీ’ కాస్త బెటర్. పూరి జగన్నాథ్ సినిమాల్లో కథంటూ పెద్దగా ఏం ఉండదు.
దాదాపుగా అన్నీ సింగిల్ లైన్ స్టోరీలే ఉంటాయి. హీరో క్యారెక్టరైజేషన్, డైలాగులతో నెట్టుకొచ్చేయడం పూరి స్టయిల్. ఇందులోనూ అంతే. మొత్తం మూడు ముక్కల్లో చెప్పేయగల కథ. అది కూడా మొత్తం హీరో చుట్టూనే తిరుగుతుంది. రోజూ పత్రికల్లో, టీవీల్లో వచ్చే వార్తలు చూసి.. రెస్పాండయ్యే మెకానిక్ రాంబాబు. ఎక్కడో ఎవరో పాపను వదిలేశారంటే తీసుకొచ్చి పెంచుకుంటాడు. ఇంకెక్కడో ఓ కొడుకు తల్లిదండ్రుల్ని సరిగా చూసుకోవడం లేదంటే వెళ్లి బాది వచ్చేస్తాడు. అలా ఇంకో సంఘటన చూసి రాంబాబు రెచ్చిపోతుండగా మీడియావాళ్లు షూట్ చేసి మంచి పబ్లిసిటీ ఇచ్చేస్తారు. తర్వాత ఓ ఛానెల్ లో పనిచేసే కెమెరామన్ గంగ.. రాంబాబు మీద స్పెషల్ స్టోరీ చేసేయడమే కాక, అతనికి తమ ఛానెల్లో రిపోర్టర్ గా ఉద్యోగమిప్పిస్తుంది. అలా ‘కెమెరామన్ గంగతో రాంబాబు’ ప్రస్థానం మొదలవుతుంది. ఇదిలా ఉంటే ప్రతిపక్ష నాయకుడైన జవహర్ నాయుడు (కోట శ్రీనివాసరావు), అతని కొడుకు రాణా బాబు (ప్రకాష్ రాజ్) ఆగడాలకు అడ్డుపడతాడు రాంబాబు. ఆ క్రమంలో వారితో శత్రుత్వం మొదలవుతుంది. తర్వాత రాణా ముఖ్యమంత్రి కావడానికి చేసే ఎత్తులు.. అతణ్ని అడ్డుకోవడానికి రాంబాబు చేసే ప్రయత్నం.. చివరికి ఎవరు గెలిచారన్నది మిగతా కథ.
పూరి ఏదో జనాల్ని ఆకర్షించడానికి ‘కెమెరామన్ గంగతో రాంబాబు’ అని టైటిల్ పెట్టాడు కానీ.. ఇందులో కెమెరామన్ గంగకు ఏమాత్రం సీన్ లేదు. తమన్నాది ఏమాత్రం ప్రాధాన్యం లేని పాత్ర. కథంతా రాంబాబు చుట్టూనే తిరుగుతుంది. ప్రతి సినిమాలోనూ మీడియా గురించి కామెంట్లు విసిరే పూరి.. ఈ సినిమాకు మీడియానే నేపథ్యంగా ఎంచుకున్నాడు. హీరోను రిపోర్టర్ చేశాడు. కానీ.. హీరో ఎక్కడా రిపోర్టర్ లా ప్రవర్తించడం.. హీరోలాగే ప్రవర్తిస్తాడు. మైకు పట్టుకుని కాబోయే సీఎంను ఇంటర్వ్యూ చేస్తూ ఆవేశం తెచ్చుకుని, అరేయ్ ఒరేయ్ అంటూ లైవ్ లో నోరు పారేసుకోవడానికి అతణ్ని రిపోర్టర్ని చేయడమెందుకు? ఫస్టాఫ్ వరకూ చూస్తే ప్రేక్షకుల్నే కాదు.. పవన్ ఫ్యాన్స్ ని కూడా ఆకట్టుకునే విశేషాలేమీ లేవు. హీరో ఇంట్రడక్షన్ సహా ప్రారంభ సన్నివేశాలన్నీ ఏమాత్రం లాజిక్ కు అందకుండా, బోరింగ్ గా సాగుతాయి. సామాన్యుడైన హీరో గురించి బ్రేకింగ్ న్యూస్ లు, పెద్ద పెద్దగా స్టోరీలు వేసేయడం.. వెంటనే అతను రిపోర్టరైపోవడం.. అక్కడ కూడా రిపోర్టింగ్ చేయడం మాని కనిపించినోళ్లందరిపై నోరు పారేసుకోవడం, చేయి చేసుకోవడం.. అంతా అర్ధరహితంగా సాగుతుంది. ఐతే పూరి తన పైత్యాన్ని సెకండాఫ్ లోనూ కొనసాగించి ఉంటే రాంబాబు భరించడం కష్టమే అయ్యుండేది. కానీ సెకండాఫ్ సినిమాను నిలబెట్టింది. రాణానాయుడు రాజకీయ అరంగేట్రం నుంచి సినిమా ట్రాక్ ఎక్కుతుంది. ప్రాంతీయ విధ్వేషాల్ని రెచ్చగొట్టేలా ప్రసంగం చేసే సన్నివేశంలో ప్రకాష్ రాజ్ నటన, ఆ సన్నివేశంలో పూరి డైలాగులు.. తదనంతర సన్నివేశాలు ఆసక్తి రేపి, తొలిసారి ప్రేక్షకుణ్ని సినిమాలో ఇన్వాల్వ్ చేస్తాయి. విలన్ కు హీరో కౌంటర్ ఇచ్చే ‘తెలుగు తల్లి’ సన్నివేశం కూడా పండింది. అమ్మాయిలు ఎక్సట్రార్డినరీ కాదు.. ఆర్డినరీ అంటూ పవన్ చెప్పే సన్నివేశం, బ్రహ్మానందంతో వార్తలకు మసాలాలు అద్దించే సన్నివేశం ఆకట్టుకుంటాయి. డైలాగుల విషయంలో ఈసారి పూరి కాస్త హద్దుల్లో ఉన్నాడు. వివాదాస్పదమైన అంశాలపైనే బ్యాలెన్స్డ్ గా డైలాగులు రాశాడు. ముఖ్యంగా పైన సెకండాఫ్ కు హైలైట్లని చెప్పుకున్న సన్నివేశాలన్నింటిలో డైలాగులు బాగున్నాయి. ప్రి క్లైమాక్స్ లో పవన్ చెప్పే మాటలు కూడా పేలాయి. క్లైమాక్స్ అంత ఆకట్టుకునేలా లేదు. చివర్లో హీరో తన తల్లి గురించి చెబుతూ ఈ రాష్ట్రాన్ని నేను పట్టించుకుంటాను అని చెప్పే సన్నివేశం అనవసరం.
సినిమాను నడిపించింది పవన్ కళ్యాణ్ పెర్ఫామెన్స్, కొన్ని సన్నివేశాల్లో పూరి డైలాగులు. పవన్ ఫ్యాన్స్ కి మరోసారి పండగే. కొన్ని సన్నివేశాలు మాస్ కు ఎక్కుతాయి. కానీ క్లాస్ ఆడియన్స్ కి, నాన్-ఫ్యాన్స్ కి ఈ సినిమా ఎక్కకపోవచ్చు. పవన్ ఇలాంటి సీరియస్ పాత్రల కంటే సరదాగా ఉండే పాత్రల్ని ఎంచుకుంటేనే మేలు. అతని నుంచి జనాలు ఎక్కువగా వినోదాన్నే ఆశిస్తారు. తమన్నాది వ్యర్థ పాత్ర. ఆ క్యారెక్టర్ తో బూతులు మాట్లాడిస్తూ, మందు తాగిస్తూ పూరి ఏం చెప్పదలుచుకున్నాడో అర్థం కాదు. ప్రకాష్ రాజ్ ఆకట్టుకున్నాడు. కోట కూడా ఓకే.
ఐతే పూరి సహా మన దర్శకులు కొన్ని ప్రాథమిక విషయాల గురించి పట్టించుకుంటే మంచిది. ఓ కథాంశాన్ని ఎంచుకున్నపుడు దాని గురించి కనీస పరిశీలన చేయడం, కాస్త అవగాహన పెంచుకోవడం అవసరం. రాజకీయ నాయకులు అంటే ఇలా ఉంటారని, మీడియా అంటే ఇలా ఉంటుందని జనరల్ గా ఉన్న ఒపీనియన్స్ ని తెరమీద చూపిస్తే ఇక ఆ దర్శకుడి ప్రత్యేకత ఏముంది? ఈ ‘రాంబాబు’ సినిమాలో మీడియా గురించి, రాజకీయ నాయకుల గురించి, ప్రభుత్వం గురించి పూరి అలాగే చూపించాడు. రాంబాబు సినిమా తీసే ముందు పూరి ‘రంగం’ సినిమాను ఓసారి చూడాల్సింది. మీడియా నేపథ్యంలో తీసిన ఆ సినిమాలో క్యారెక్టర్లు చాలా సహజంగా ఉంటాయి. మీడియా, రాజకీయాలకు సంబంధించిన సన్నివేశాలు కూడా వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. అందులో హీరో ఓ ఫొటోగ్రాఫర్ లాగే ప్రవర్తిస్తాడు. కానీ హీరో అవుతాడు. కానీ రాంబాబువన్నీ నేలవిడిచి సాము చేసే పనులే. హీరోను అలా చూపించాలనుకున్నపుడు ఇక రిపోర్టర్ అవతారమెత్తించడమెందుకు? రంగంలో దర్శకుడి పరిశీలన, అవగాహన స్పష్టంగా తెరమీద కనిపిస్తుంది. కానీ పూరి మాత్రం కాస్తయినా అవగాహన లేకుండా తానేమనుకుంటే అది తీసేసి జనాల మీదికి వదిలాడు. రాంబాబే కాదు.. ఈ మధ్య అతని సినిమాలన్నీ అలాగే తయారయ్యాయి. పేపర్లో చదివిన వార్తలతో కథ అల్లేయడం.. తనకు ఇష్టం వచ్చినట్లు ఓ పద్ధతీ పాడూ లేకుండా క్యారెక్టర్లు రాసేసుకోవడం.. కాసిన్ని నీతులు, కాస్తంత ఫిలాసఫీ.. (పైత్యం కూడా అనొచ్చు) జోడించి జనాల మీదికి వదలడం.. ఇదీ పూరి చేస్తున్న పని. బిజినెస్ మేన్ లో మహేష్ మేనియా పనిచేసినట్లే.. రాంబాబులో పవన్ పవర్ పనిచేయొచ్చు. సినిమా ఓ మోస్తరుగా ఆడేయొచ్చు. కానీ పూరి జిమ్మిక్కులు ఇంకెంతో కాలం నడవవన్నది మాత్రం సత్యం.
రేటింగ్- 2.5/5
Originally published at : http://namastheamerica.com/?p=18708

Sunday, October 14, 2012

దేవీ నవరాత్రులు

ప్రతీ సంవత్సరం ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దేవీ నవరాత్రులు / శరన్నవరాత్రులని అంటారు. ఈ 9రోజులు దుర్గాదేవిని వివిధ రూపాలతో అలంకరించి షోడశోపచారాలతో పూజించడం అనుసృతంగా వస్తున్న సంప్రదాయం. శరన్నవరాత్రులు అని ఎందుకన్నారంటే ఆశ్వీయుజ మాసం నుండి వర్ష ఋతువు వెళ్ళి, శరత్ ఋతువు ప్రారంభం అవుతుంది కనుకనే.
ఈ నవరాత్రులు దుర్గా దేవికి ప్రత్యేక పూజలు శాంతి హోమాలు జరుపుట ఆనవాయతి. ంఅహిషాశురుని మర్దించి శక్తి స్వరూపిని అయిన దుర్గా దేవి అవతారాలని ప్రతిష్టించి పూజలు జరుపుకుంటారు. కొంతమంది తమ ఇంట్లో ఆహవనీయ అగ్ని, గ్రహపత్య అగ్ని, దక్షిని అగ్ని అను హోమాలు రోజూ జరుపుకుంటారు. ఇవే కాకుండా అదిత్య హొమము మహాసూర్య మంత్రాలను పఠిస్తూ జరుపుతారు. ఈ హొమములు చేయుట వలన ఇంటి ఆవరణం మహా శక్తి మయమై, ఇంటి వాతావరణం ఎల్లప్పుడు స్వచ్చంగా వుండును.

1వ రోజు -ఆశ్వయుజ పాడ్యమి - శ్రీ స్వర్ణ కవచాలంక్రుత దుర్గా దేవి
2వ రోజు - ఆశ్వయుజ విదియ - శ్రీ బాలా త్రిపురసుందరీదేవి
3వ రోజు - ఆశ్వయుజ తదియ - శ్రీ గాయత్రి దేవి
4వ రోజు - ఆశ్వయుజ చవితి - శ్రీ అన్నపూర్ణా దేవి
5వ రోజు - ఆశ్వయుజ పంచమి - శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి - లలిథ పంచమి
6వ రోజు - ఆశ్వయుజ షష్టి - శ్రీ మహా లక్ష్మీ దేవి - మహాషష్టి
7వ రోజు - ఆశ్వయుజ సప్తమి - శ్రీ మహా సరస్వతీ దేవి - మహా సప్తమి
8వ రోజు - ఆశ్వయుజ అష్టమి - శ్రీ దుర్గా దేవి - దుర్గాష్టమి
9వ రోజు - ఆశ్వయుజ మహానవమి - శ్రీ మహిషాసురమర్దిని - మహార్ణవమి
10వ రోజు - ఆశ్వయుజ దసమి - శ్రీ రాజరాజేశ్వరి - విజయదసమి


ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమిలో నవరాత్రుల కలశ స్థాపన చేయాలి. ఇది తొమ్మిది రోజులు చేసే పూజా కార్యక్రమం. అందుకనే 'దేవీనవరాత్రులు ' అని పిలవ బడుచున్నవి. పూజా మందిరంలో కలశ స్థాపన చేయుటకు వేదికను తయారు చేసుకోవాలి. గోమయంతో(ఆవు పేడతో) నలుచదరంలా అలికి, పసుపు కుంకుమలతో అలంకరించాలి. పూజాసామాగ్రితో పాటు పంచపల్లవాలు అనగా (ఐదు రకాల లేత చిగుళ్ళు కల్గిన చెట్టుకొమ్మలు) దూర్వాంకురములు (గరిక పోచలు) తయారుగా ఉంచుకోవాలి.

పూజా విధానము: ఆ తరువాత తెల్లవారుఝామునే లేచి అభ్యంగన స్నానం (తలస్నానం) చేసి, నామం ధరించి, పట్టు వస్త్రములు కట్టుకొని, చేతికి పవిత్రం ధరించి పూజకు ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఆసనంపై జింక చర్మం లేదా వ్యాఘ్రచర్మము లేదా తెల్లని పట్టుబట్ట గాని ఎర్రని పట్టు పంచ గాని, ఆసనం పైన వేసి, లేని వారు (పీట మీద) తూర్పు ముఖంగాని, ఉత్తర ముఖం గాని కూర్చుండ వలెను.

ముమ్మారు ఆచమనం చేసి ఓంకారంతో గురువునూ, పరమాత్మను ప్రార్థించి, పది నిమషములు ధ్యానించి, గాయత్రి మంత్రం జపించిన తరువాత మహా సంకల్పం చెప్పవలెను. గృహస్తులైనవారు సతీ సమేతంగా సంకల్పము చేయవలెను.

ముందుగా విఘ్నేశ్వర పూజ జరిపి స్వస్తిపుణ్యాహమలు చెప్పవలెను. ఆతరువాత బ్రాహ్మణులకు వరణనిచ్చి తొమ్మిది రోజులు (నవ రాత్రి) గాని లేదా ఏడు రోజులు గాని హీన పక్షం మూడు రోజులు కాని లేదా ఒక్క రాత్రి దీక్షగాని శ్క్యానుసారము దీక్ష చేయవలెను. పూజాకాలములో రోజుకొకసారి భుజించి ఏకభుక్త వ్రతము చేయవలెను. తొమ్మిది రోజుల పూజ అయ్యేవరకూ, అఖండ దీపారాదన రాత్రింబగళ్ళు వెలుగవలెను.

ఆయుధ పూజ: పూర్వము పాండవులు సమి వృక్షమి పైన తమ ఆయుధములను దాచి, అగ్నాతవాసము చేసినారు. వర్రి అజ్ఞాతవాసము అర్జునుడు సమి వృక్షము పైనుండు తన గాండీవమును దించి కౌరవులతో యుధము చేయటముతో ముగిసినది. విజయదసమి నాడు వారి అగ్నాతవాసము యొక్క గడువుముగిసినది. కనుక ఆయుధ పూజ రోజున సమి వృక్షనికి ఒక ప్రత్యేకత ఏర్పడింది.రాజులకు ఈ నవమి నాదు తమ ఆయుధములను పూజించు పద్ధతియే నేటికీ ఆయుధ పూజగా చేయబదుతున్నది. ఆ ఆయుధములతో పాటు ఛత్రచామరములు రాజలాంఛనములు తానెక్కిన వాహనములు గజము, అశ్వము వాహనములను లేదా తాను పని చేయు యంత్రములను పూజించవలెను.

అపరాజితా శమీపూజ: శమీ శమతే పాపం శమీ శతృ వినాశనం
అని మంత్రంతో శమీ(జమ్మి) వృక్షమును పూజించ వలెను. అపరాజితాదేవిని పూజించి ఊరుపొలిమేరను దాటి సీమోంల్లంఘనము చేయవలెను. గ్రామమునకు ఈశాన్యంగా చేసి, అపరాజితా దేవిని ఈ విధముగ పూజించాలి:

మధ్యే అపరాజితాయై నమః ఇత్యవరాజితామావాహ్య
తద్దక్షిణే క్రియా శ్క్యైనమః ఇతి జయాం నామతః
ఉమాయైనమః ఇతి విజయామా వాహ్మ అపరాజితా
యైనమః జయాయైనమః విజయాయై నమహ్



అపరాజితా దేవిని పూజించి రాజులు పట్టాభిషేకమును విజయదశమి నాడు చేయుదురు. విదేశములు వెళ్ళువారుకూడా ఈ విజయముహూర్తమే శ్రేష్ఠము. కాని ఏకాదశి స్పర్శ ఉండరాదు.
Courtesy links: http://gurugeetha.blogspot.in/2011/09/blog-post_28.html
http://www.teluguvaramandi.net