Tuesday, March 20, 2012

ఊరపిచ్చుకలారా మీరెక్కడ? :నేడు ప్రపంచ ఊరపిచ్చుకల దినోత్సవం


ఒకప్పుడు ఊర పిచ్చుకలు లేని ఊరులేదంటే అతిశయోక్తి కాదు. గ్రామీణ ప్రాంతాల్లో ఏ వాడ చూసినా, ఏ ఇల్లు చూసినా గుంపులు గుంపులుగా ఊరపిచ్చుకలు దర్శనమిచ్చేవి. పిచ్చుకలు, మానవులు ఒకే కుటుంబసభ్యులుగా సహజీవనం చేసేవారు. మిగతా పక్షులకు భిన్నంగా ఊరపిచ్చుకల జీవితాలు మానవ జీవితాలతో పెనవేసుకున్నాయి. ఆహారం కోసం, నివాసం కోసం, గూడు కోసం పూర్తిగా మానవులపై ఆధారపడతాయి అవి. మనుషులతో సన్నిహితంగా మెలుగుతాయి. చిన్న చిన్న పురుగులు, ధాన్యం గింజలు తిని జీవిస్తాయి ఊరపిచ్చుకలు.

ఊరపిచ్చుకలను తెలంగాణలో ఊరబిస్కలు అంటారు. చాలా బక్కపలచగా ఉన్న వాళ్లను ఊరబిస్క ప్రాణంతో పోలుస్తారు. డాబాపైన చుట్టూ ఉండే గోడను పిట్టగోడ అంటారు... అంటే చిన్న గోడ అని అర్థం. ఈ విధంగా ఊరపిచ్చుకలకు సంబంధించిన పదజాలం తెలుగు భాషలో ఇమిడిపోయింది. తెల్లవారితే చాలు కిచ కిచ అంటూ సందడి చేసే ఊరపిచ్చుకలు ఆహారం కోసం ఇళ్లచుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటాయి. కడుపు నిండిన తర్వాత ఇంటిముందు బట్టలు ఆరేయడానికి కట్టిన దండెంపైనో, పిట్టగోడపైనో, కరెంట్ తీగపైనో వాలి కాస్త విశ్రాంతి తీసుకుంటాయి. గోడకు వేలాడదీసిన అద్దంలో ప్రతిబింబం చూసి ముక్కుతో పదే పదే పొడుస్తాయి. కానీ ఇప్పుడు ఊరపిచ్చుకల సందడి తక్కువైంది. గ్రామీణ చిత్రపటం నుంచి మెల్లగా అవి కనుమరుగవుతున్నాయి. చాలా పక్షుల మాదిరిగానే ఇవీ అంతరించే ప్రమాదం ఉంది. ఊరపిచ్చుకల జనాభా తగ్గడానికి అనేక కారణాలున్నాయి. పెరుగుతున్న జనాభావల్ల ఇళ్లు ఇరుకుగా మారుతున్నాయి. ఇళ్ల ముందు ఖాళీ స్థలం ఉండటం లేదు. గూణ ఇండ్లస్థానంలో కాంక్రీట్ స్లాబ్ ఇండ్లు వచ్చేశాయి. గూణ ఇండ్ల చూరు పిచ్చుకల గూడు నిర్మాణానికి అనువుగా ఉండేవి. స్లాబ్ ఇళ్ళల్లో పిచ్చుకల నివాసానికి స్థానం లేదు. మట్టి ప్రహరీగోడల వెంబడి కూడా అవి గూళ్లు కట్టుకునేవి.

ప్రతి ఇంటిలో చేదబావి ఉండేది. చేదబావి సొరికల్లోనూ గూడుకట్టుకునేవి. బావి తవ్వేటప్పుడు కూలీలు పైకి కిందికి దిగడానికి కాళ్ల పట్టుకోసం అక్కడక్కడా కొంచెం లోతుగా తవ్వేవారు. పిచ్చుకలు వాటిని గూళ్లుగా మార్చుకునేవి. ఇప్పుడు వాటి స్థానంలో గొట్టం బావులు వచ్చాయి. ఇలా వాటి స్థావరాలు ధ్వంసం కావడంతో నిలువనీడ లేకుండా పోయింది. అధిక దిగుబడి కోసం రైతులు విపరీతమైన పురుగుమందులను పంటపొలాలపై చల్లుతున్నారు. దీనివల్ల కూడా పిచ్చుకలు కనుమరుగవుతున్నాయి. ఊరూరా వెలసిన సెల్‌ఫోన్ టవర్ల నుంచి వెలువడుతున్న రేడియేషన్ కూడా పిచ్చుకల పాలిట శాపంగా మారింది. పట్టణాలలో అపార్ట్‌మెంట్ సంస్కృతి పెరిగిపోవడం, చెట్లను నరికివేయడం వల్ల ఊరపిచ్చుకలకు ఆహార భద్రత కరువైంది. పాలిథిన్ సంచులలో, డబ్బాల్లో, ధాన్యాన్ని నిలువచేయడం లాంటివి కూడా పక్షుల పతనానికి కారణమవుతున్నాయి.

ఊరపిచ్చుకలు ఉంటే ఊర్లు పచ్చగా ఉంటాయని రైతులు నమ్మేవారు. అందుకే పిచ్చుకలను జీవ సూచికలుగా వాడతారు. అప్పట్లో వరి కంకులను కోసి ఇంటి చూరుకు తగిలించేవారు రైతులు. ఊరబిస్కలు వాటిపై వాలి, మెల్ల మెల్లగా రోజుల తరబడి ఆహారం తీసుకునేవి. అవి గింజలను తన బలమైన ముక్కుతో తింటూ ఉంటే పిల్లలు, పెద్దలు చూసి ఆనందించేవారు. పాలిచ్చే తల్లులు మారం చేస్తున్న పిల్లలకు వాటిని చూపిస్తూ అన్నం తినిపించేవారు. నేడు ఆ దృశ్యాలు అదృశ్యమయ్యాయి. గూడు చెదిరిపోయి, నిలువనీడలేని నిర్వాసితులయ్యాయి ఊరపిచ్చుకలు. ఈ వేగవంతమైన యాంత్రిక జీవితాల్లో వాటి గోడును, గూడును పట్టించుకునే వారెవ్వరు? వాటిని ఆదుకునే వారెవ్వరు? ఊరపిచ్చుకల జనాభా తగ్గటం పట్ల పక్షి ప్రేమికులు, శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు ఆధునిక నాగరికత పుణ్యమాని పల్లెల్లోనూ పాతతరం ఇళ్లు కనుమరుగవుతున్నాయి. ఈ నేపథ్యంలో పిచ్చుకలకు ఆహారం లభించడం లేదు. మరోవైపు సెల్ టవర్లను ఇష్టానుసారం ఏర్పాటు చేయడంతో పక్షులు బతికే వీలు లేకుండా పోతోంది. సెల్‌టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ ప్రభావం వీటి పాలిట శాపమైంది. పరిమితికి మించి ఎలక్ట్రో మేగ్నటిక్ రేడియేషన్ తరంగాలు సెల్ టవర్ల నుంచి వెలువడుతున్నందున పిచ్చుకల్లో నాడీ వ్యవస్థను, గాలిలో ఎగిరే సామర్థాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయి. ఈ టవర్ల సమీపంలో గూళ్లను వదిలి, పిచ్చుకలు కనిపించకుండాపోతున్నాయి. సాధారణంగా 10 నుంచి 14 రోజుల్లోపు పిచ్చుక గుడ్ల నుంచి పిల్లలు బయటకు వస్తాయి. అయితై, సెల్ టవర్ల చు ట్టుపక్కల గూళ్లలో నెలరోజులు గడిచినా గు డ్లు అలాగే ఉంటున్నాయని శాస్తజ్ఞ్రులు గు ర్తించారు. అలాగే, గడ్డితో నిండిన ఆరుబయ లు స్థలాలు లేకపోవడం, తోటలపై రసాయనాల వినియోగం, వాతావరణంలో వేడి పెరగడం, పూరిళ్లకు బదులు పల్లెల్లోనూ కాంక్రీ టు వనాలు వెలుస్తుండడం వంటి పరిణామాలతో పిచ్చుకల మనుగడ ప్రశ్నార్థకమైంది.

పిచ్చుకల జాతిని పరిరక్షించాలనే సంకల్పతో ఏటా మార్చి 20వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ‘అంతర్జాతీయ పిచ్చుకల దినం’ పాటిస్తున్నారు. 2010లో ఈ సాంప్రదాయం ప్రారంభమైంది. వీటి మనుగడ కోసం తగు చర్యలు చేపట్టాలని వివిధ దేశాల్లో స్వచ్ఛంద సంస్థలు, విద్యాలయాలు, పర్యావరణ సంస్థలు ఉత్సవాలను జరుపుతున్నాయ. వీటిపై జనచైతన్యం కోసం www. worldsparrowday.org ఫేరిట ఒక వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. నేచర్ ఫరెవర్ సొసైటీ.. సేవ్ అవర్ స్పారోస్ (మన పిచ్చుకులను పరిరక్షించండి) పేరిట ఒక ప్రాజెక్టును ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆసక్తి కలిగిన పౌరులకు, సంస్థలకు బర్డ్ ఫీడర్లు అందజేయాలని సంకల్పించింది. వాటిని ఉచితంగా అందించాలని నిర్ణయించింది. వాటిని ఇంటి బాల్కనీలలో ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రపంచ ఊర పిచ్చుకల రోజును పురస్కరించుకొని, పక్షి ప్రేమికులు, పర్యావరణ అభిమానులు అందరూ ఊరపిచ్చుకల పరిరక్షణకు నడుంకట్టాలి. బర్డ్స్ నెస్ట్స్ (పక్షి గూళ్లు) కర్రతో చేసిన డబ్బాలాంటి గూళ్లను బాల్కనీలో వేలాడదీయాలి. కొద్ది రోజుల తర్వాత అవి మెల్లగా వాటిని గూడుగా మార్చుకుంటాయి. ఎండకాలంలో నీరు, ధాన్యం గింజలను సమకూర్చితే చాలు. పిచ్చుకల సందడి మళ్లీ మొదలవుతుంది. ప్రయత్నిద్దాం. తిరగి ఊర పిచ్చుకలతో స్నేహం చేద్దాం.
( Sources : Andhrabhoomi and namasthetelangana )

2 comments:

  1. మా పీఠ ఆవరణలో ఉన్నాయి

    ReplyDelete
  2. అవునండీ ..ఒకప్పుడు స్వేచ్చగా తిరగగలిగే ఈ పక్షులు ఇప్పుడు గుడులకి, పాడుబడిన భవనాలకే అంకితమైపోయాయి.. పల్లెల్లో ఇప్పటికీ ఎంతో ప్రేమగా చూడబడుతున్నాయి

    ReplyDelete