Thursday, March 8, 2012

చిత్రకళకు తెలుగు ప్రతీక- దామెర్ల!


గోదావరి తీరాన 1897 మార్చి 8న రాజమండ్రిలో జన్మించిన దామెర్ల రామారావు, ఆధునిక దృష్టితో పెరిగి మహాసౌందర్యాన్ని విరగబూసి తెలుగు వాళ్లకి మరొకటి ఏదీ తోచనీయకుండా చేశారు. గురజాడ కన్యాశుల్కం, గిరజాలజుత్తు, భావకవుల మహా విహారం, తెలుగునాట అన్ని ప్రాంతాలా విప్లవ తిరు గుబాటు జెండాలూ... వీటన్నిటి మధ్యా తెలుగు ఆధునిక చిత్రకళకు దారిచూపెట్టిన నిలువెత్తు కాగడా దామెర్ల.

చిన్నారి సంపెంగ మొగ్గదశ లోనే వెళ్లిపోకపోతే ప్రపంచస్థాయిలోనే తెలుగు చిత్రకళకి ‘లోగో’ ఒకటి స్థాపించి, ఇక కానీండర్రా అనేసి ఉండేవారేమో! ఓ చెంపన చెంపపెట్టు లాగ కలోనియల్ ఆంగ్ల సిల్వర్ పాయింట్ చిత్రాలు, మరోవైపు చైనా, జపాన్ కొండగాలిలాంటి వాష్ ఇంక్ చిత్రకళ బెంగాల్ దాటిరావటం, ఇంకోవైపున ఇటాలియన్, కలోనియల్ మలయాళీ సుందరాంగుల రూపంలో రవివర్మగారి నూనెరంగుల ‘అదనపు ఆకర్షణ’! ఇంకెలాగా? అసలే తెలుగువాళ్ల ఇళ్లకి తలుపులుండవాయె! అందునా చిత్రకళ ఉక్కిరిబిక్కిరయే వేళ! అదిగో అప్పుడొచ్చారు కూల్డ్రే దొరవారు. పాపం బహు దొడ్డవారే! దామెర్ల రామారావనే అర్భక కుర్రవాడి వేళ్లు అరిగేలా డ్రాయింగులు చేయించారాయన.

అజంతా, లేపాక్షి, తోలు బొమ్మలు, కలంకారీ మొదలైన వాటి ఊపిరిపీలుస్తూ ఇటు పూర్తిగా ‘ఆంగ్లసైజు’ కాకుండా డ్రాయింగులు పుట్టించేదెలా? దేశంలో వివిధ ప్రాంతాలు చూసి నేర్చింది, బొంబాయి జేజే ఆర్ట్ కళాశాల పరిచయం చేసిందీ, కూల్డ్రే (క్రమ)శిక్షణ అంతా ఒక భాగమైతే దామెర్ల పరిశీ లనాశక్తి, చదువూ గొప్ప భాగమైంది. అందుకే తెలుగు సిద్ధార్థుడు, తెలుగు అర్జునుడు, తెలుగు ఊర్వశీ దామెర్ల చేతిలో చెప్పిన మాటవిన్నారు. ఇంకా ప్రస్ఫుటంగా నిలువెత్తు అద్భుతాన్ని చిత్రించేసత్తా చేరి మహావృక్షమయ్యే తీరు కనబడేలోగానే ఆధునిక వైద్యం లేక అన్యాయంగా వెళ్లిపోయారు రామారావు.

రవీంద్రనాథ్ టాగూర్ నుంచీ రాజమండ్రిలో సోడాలు అమ్ముకునే కష్టజీవి పిల్ల వరకు దామెర్ల చేసిన ముఖచిత్రాల రేఖలు, రంగులు, వాష్‌లూ అసమాన్యమై నవి. సౌందర్య దృష్టి బలం తప్ప శారీరక బలం లేకపోయిందాయనకు. 1925, ఫిబ్రవరి 6న ఆయన శాశ్వితంగా వెళ్లిపోయాక దేశవిదేశీ పత్రికలన్నీ బావురుమన్నాయి. ఐతే అంత బాధ గల ప్రపంచం ఆయన చిత్రాల్ని పెద్దసైజులో, మంచి రంగుల్లో అచ్చువేసి ప్రచారం చేయలేక పోయింది. దాదాపు 34 ఆయిల్ పెయింటింగ్‌లు, 1,390 వాటర్ కలర్ బొమ్మలు, వందల కొద్దీ స్కెచ్ బుక్‌లు రాజమండ్రిలో ఆయన పేరిట ఏర్పడ్డ ఆర్ట్ గేలరీలో ఉన్నాయి.

తెలుగు అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయం, ఆంధ్రా యూనివర్సిటీ, లలితకళా అకాడమీ పెద్దలు ఇందరుండి మంచి భారీసైజులో దామెర్ల వారి చిత్రాలు అచ్చువేసి కారుచౌక ధరలో జనానికి అందజేయగల పరిస్థితి లేదా? ఇదేనా మన గొప్ప? అని ఈ రోజు దామెర్ల జర్మదినాన తల పట్టుకు కూర్చోవలసివస్తోంది గదూ? చేసింది చాలదు. దామెర్ల ఆర్ట్ గ్యాలరీలో పాడైన, పాడవు తున్న, పాడవబోయే ఆ మహనీయుడి బొమ్మల్ని కాపాడకపోతే... మరుమాట అనవసరం! దామె ర్లకు తలవంచి నమస్కరించడం చేయగలం కదూ!
శివాజీ హైదరాబాద్
(నేడు దామెర్ల రామారావు 115వ జయంతి)
From Sakshi blogs

No comments:

Post a Comment