Friday, March 23, 2012

ప్రయత్నం మంచిదే..కానీ..: "బ్లాగు పుస్తకం" గురించి ఓ విశ్లేషణ


ఈ మధ్య కాలంలో మనం కంప్యూటర్ పరిచయ పుస్తకాలనే ఎక్కువగా చూస్తున్నాం. వీటికి భిన్నంగా బ్లాగు పుస్తకం అనేది తాజాగా మార్కెట్‌లోకి వచ్చింది. 109 పేజీల్లో రూపొందిన ఈ రచనల్లో బ్లాగంటే ఏమిటి?, వర్డ్‌ప్రెస్‌లో బ్లాగునెలా రూపొందించుకోవాలి?, బ్లాగునెలా చదవాలి(???), బ్లాగునెలా కొనసాగించాలి. తెలుగులో టైపుచేయటం ఎలా, - ఈ విషయాలన్నీ తెలియజేసే ప్రయత్నం చేసారీ పుస్తక రచయిత్ర(్త)లు. అసలు బ్లాగ్ అంటే ఏమిటి- బైనఠీ లాగింగ్. అంటే 0,1- బైనరీ అంకెలతో సూచించడంగా లాగ్ చేయడం. అంటే మనం అనుకునే ప్రతి అంశాన్నీ డిజిటల్‌గా నమోదు లేదా రికార్డుచేయడం. ఈ బైనరీ లాగింగే బ్లాగ్‌గా రూపొందింది. అంటే, డిజిటల్‌గా డైరీని రాసుకోవడమే. బ్లాగింగ్ చేయడానికి బ్లాగర్.కామ్, వర్డ్‌ప్రెస్, బ్లాగ్ సిటీ, లైవ్‌జర్నల్- ఇలా పలు సౌకర్యాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో వర్డ్ ప్రెస్‌ను ఉదాహరణగా తీసుకుని ఎలా బ్లాగింగ్ చేయవచ్చో తెలియజేసే ప్రయత్నమే ఈ పుస్తకం. చిత్రాలన్నిటినీ రంగుల్లో ముద్రించడంతో అవి పుస్తకానికి వనె్నతెచ్చిపెట్టాయి. ఐతే, పుస్తకం డిజైనింగ్ లోపంవల్లా, వాడిన భాష సరిగ్గా లేనందువల్లా చదివేవారికి ఇబ్బందిగానే ఉంటుంది.
కొత్తగా బ్లాగులను ఏర్పాటుచేసుకోవడం మొదలుపెట్టేవారికి ఈ పుస్తకం కరదీపికగా ఉండటం అటుంచితే, ఇందులో వాడిన పదాలు- వేగు, తెరపట్టు, అనుకోలు, అంతర్జాలం, విహారిణి, వాడుకరి పేరు, మొదటిసారి టపాకట్టడం (???), టపా పాఠ్యం, ప్రచురించుమీట, కుడి పట్టీ, ఎడమ పట్టీ, పాద పీఠిక, శరీరం, ఉప పేరు, బ్లాగుట, దిద్దువాణి, జాల చిరునామా, మనుజూపు, మాఫీ, మాఫీ రద్దు, సంకలినులు, శోధన యంత్రాలు, అప్రమేయంగా, దస్త్రాలు, తోకలు- ఇలా సాగిపోతూ తికమకనూ, విసుగునూ కలగజేస్తాయి. తెలుగులో ఇలా పదాలను వాడేస్తే రచయితలకెంత తెలుగు భాషాభిమానమో అనుకొనే వారుంటారేమో గానీ, మొదటిసారి టపాకట్టడం లాటి ప్రయోగాలు నవ్వులపాలవుతాయి. ఇది చదివే కొద్దిమందికీ కూడా విసుగూ, చికాకునూ, కలిగించక మానవు. పోనీ, అట్లని పూర్తిగా తెలుగే వాడారా అంటే లేదు. ఇంగ్లీషునీ యధేచ్ఛగా వాడారు. అలాటప్పుడు వారు అవస్థపడుతూ, చదువరులను అవస్థపెట్టడం ఎందుకో అర్థంకాదు. అసలు రచయితకు (రచయిత్రికి) తెలుసోతెలీదో- లోగడ (అంటే 2010)లో కంప్యూటర్ విజ్ఞానం తెలుగు మాసపత్రిక ఈ బ్లాగుపై ఒక బోనస్ బుక్ ప్రచురించింది. అందులో బ్లాగర్.కామ్ వాడి ఎలా బ్లాగ్ ఏర్పాటుచేయవచ్చో వివరించారు. (దీనికి బ్లాగర్.కామ్‌లో ఉండే హెల్ప్ ఆధారం). 64 పేజీల పరిచయ పుస్తకం అది.
ఇంటర్నెట్‌ను ఇంటర్నెట్ అనీ, బ్రౌజర్‌ను బ్రౌజర్ అనీ అంటే చాలా సౌకర్యం. అంతే కానీ, అంతర్జాలం (మార్జాలం అన్నట్టు) అనీ, శోధకం లేదా విహారిణి అనీ తికమక పడటం ఎందుకు? ఇమెయిల్‌ను ఇమెయిల్ అంటే సులభంగా అర్థం అవుతుంది కదా! మొదటిసారిగా పోస్టుచేయడం అనడానికి మొదటిసారి టపా కట్టడం అనడం ఏమన్నా బావుందా? (మొదటిసారి టపా కట్టడం అంటే అర్థం ఏమిటో తెలియకుండా వాడారని నేను అనుకోను).
ఇంకో సంగతి. రచయిత(త్రి) ఎడమకీ, కుడికీ తికమక పడ్డారు. (చూ.పేజీ 31). ఎడమకి కుడి అనీ, కుడికి ఎడమ అనీ (అటునించి చూసుకోవాలేమో..) సూచించారు. అసలు తెలుగు బ్లాగులకే ఎలాటి మార్గదర్శకాల్లేవు. ఇక వాటి గురించి రాసే పుస్తకాలకేం ఉంటాయి? ఆ సంగతి అలా ఉంచితే, 109 పేజీల పుస్తకానికి ధర 230 రూపాయలు చాలా ఎక్కువే. ఒక చక్కని ఇతివృత్తాన్ని తీసుకుని సరిగ్గాతీయలేకపోయిన సినిమాలా మిగిలిందీ పుస్తకం.

Original Link : http://andhrabhoomi.net/content/d-1097

5 comments:

  1. "...మొదటిసారి టపాకట్టడం..."

    ఇలాంటి హాస్యం కూడా ఉన్నదా ఈ పుస్తకంలో! బ్లాగు తయరుచేసుకోవటానికి పుస్తకం కావాలా, ఏ పుస్తకం చూసి ఇన్ని బ్లాగులు తయారయ్యాయి.

    ReplyDelete
  2. ఒక పుస్తకం మార్కెట్లోకి వచ్చాక దాని గురించి అనుకూలంగానో, ప్రతికూలంగానో ఏ రకంగానైనా అభిప్రాయాలు వ్యక్తం కావొచ్చు. అయితే ‘బ్లాగు’ పదం వివరణలో ఈ సమీక్షకుడు పాఠకులను గందరగోళ పరచకుండా ఉంటే బాగుండేది.

    ‘‘... బైనరీ లాగింగే బ్లాగ్‌గా రూపొందింది.’’ అని ఈ సమీక్షలో రాశారు. కానీ వాస్తవం ఏమిటి? వెబ్ లాగ్ అనేది బ్లాగ్ గా రూపాంతరం చెందింది!

    శివ గారూ! ‘బ్లాగు తయరుచేసుకోవటానికి పుస్తకం కావాలా, ఏ పుస్తకం చూసి ఇన్ని బ్లాగులు తయారయ్యాయి’ అన్న మీ వ్యాఖ్యతో ఏకీభవించను.

    సాంకేతిక పరిజ్క్షానం ఉన్నవారి సంగతి వేరు. కానీ సగటు పాఠకులు బ్లాగులు ప్రారంభించాలంటే వారికి ఏదో ఒక సహకారం అందాల్సిందే కదా? ‘ఈనాడు’లో బ్లాగుల గురించిన వ్యాసం చదివి, ఆ సూచనలు పాటించి బ్లాగు ఓపెన్ చేశాను. నాలాగా చాలామంది చేశారు. అయితే పేపర్లలో వచ్చే వ్యాసం జీవితకాలం ఒక రోజే. అందుకే బ్లాగుల గురించిన సాంకేతిక, ప్రాథమిక అంశాలు పుస్తకరూపంలో రావటం ఔత్సాహికులకు చాలా ఉపయోగకరం. ఈ పుస్తకం టార్గెట్ రీడర్లు సాంకేతిక అంశాలు ఏమీ తెలియని పాఠకులే. అందుకే ‘తెలుగులో టైపు చేయటం’ దగ్గర్నుంచి, ‘ఈ-మెయిల్ అకౌంట్ తయారుచేసుకోవటం’ వరకూ ప్రాథమిక అంశాలు దీనిలో ఇచ్చారు. రాతల్లో, వ్యాఖ్యల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచనలు కూడా ఉన్నాయి. ఇవి కొత్తగా బ్లాగులు ప్రారంభించినవారికి ఉపయోగం.

    ఏమైనా పుస్తకం చదివాకే దాని మంచి చెడ్డల గురించి మాట్లాడుకోవటం సమంజసం. మీరీ బ్లాగు పుస్తకం చదివి వ్యాఖ్య చేసుంటే బాగుండేది!

    ReplyDelete
  3. "...మీరీ బ్లాగు పుస్తకం చదివి వ్యాఖ్య చేసుంటే బాగుండేది...."

    బ్లాగు తయారుచేసుకోవటానికి పుస్తకం చదివితే కాని తయారు చేసుకోలేనంత కష్టమేమీ కాదు, అలా ఐతే ఇన్ని బ్లాగులు ఈ పుస్తకం రాక ముందు ఎలా తయారయ్యాయి అని నా అభిప్రాయం వ్యక్తపరిచాను. బ్లాగులు తయారు చేసుకోవటానికి పుస్తకమే అక్కర్లేదని నేను అనుకుంటూ ఉంటే, నేనేదో ఇక్కడ సమీక్ష చేయబడ్డ గొప్ప గ్రంధం చదవకుండా కామేంట్ చేశానని, చదివి చేసి ఉంటే బాగుండునని మీరు బంగారు అభిప్రాయం శలవివ్వటం చాలా చిత్రంగా ఉన్నది వేణూ గారూ.

    ReplyDelete
  4. అసలు బ్లాగ్ అంటే ఏమిటి- బైనఠీ లాగింగ్. అంటే 0,1- బైనరీ అంకెలతో సూచించడంగా లాగ్ చేయడం. అంటే మనం అనుకునే ప్రతి అంశాన్నీ డిజిటల్‌గా నమోదు లేదా రికార్డుచేయడం. ఈ బైనరీ లాగింగే బ్లాగ్‌గా రూపొందింది. అంటే, డిజిటల్‌గా డైరీని రాసుకోవడమే.




    గిది నీ సొంత పైత్యమా?

    ReplyDelete
  5. hii.. Nice Post Great job. Thanks for sharing.

    Best Regarding.

    www.ChiCha.inMore Entertainment

    ReplyDelete