Wednesday, January 11, 2012

జీవితంలో పోటీ అవసరమే...కానీ

అన్ని విషయాల్లో అందరూ పోటీపడే పరిస్థితులు ఉండకపోవచ్చు. ఇందులో ఎన్నో భేదాలుంటాయి. ‘‘మా కోడలికి నాతో అన్నిట్లో పోటీయే...’’ అని వాపోతుంది ఓ అత్తగారు. ఇదెలా సాధ్యం? ఇద్దరూ ఆడవాళ్ళేనన్న సారూప్యం, ఇద్దరూ ఒకింటివారేనన్న సామీప్యం తప్ప... మిగతా అన్నిట్లోనూ వైరుధ్యమే కనిపిస్తుంది. వయసు రీత్యా అత్తగారికి తప్పకుండా ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. అయితే, ప్రస్తుత ప్రపంచపు పోకడలు గుర్తించలేని ఆవిడకు కోడలి మాటలు, చేష్టలు అన్నీ విచిత్రంగానూ, విడ్డూరంగానూ కనిపిస్తాయ. ఏదో చిన్నమాటతో పోటీ ప్రారంభమవుతుంది.
జీవితంలో పోటీ అవసరమే. పోటీలేకుండా థ్రిల్ ఉండదు. పోటీవల్ల ఉత్సాహం పెరుగుతుంది. సమర్థత పెరుగుతుంది. అయితే ఇది వస్తువుల ఉత్పత్తి విషయంలో ఫర్వాలేదు కానీ మనుషుల మధ్య కొంత అగాధాన్ని సృష్టించవచ్చు. వ్యక్తుల మధ్య పోటీ ఆరోగ్యకరంగా ఉండటం లేదు. అత్తా కోడళ్ళ మధ్య పోటీ, భార్యాభర్తల మధ్య పోటీ, ఆడబిడ్డా వదినెల మధ్య పోటీ ఆఖరికి అక్కా చెల్లెళ్ళమధ్య కూడా పోటీ వాతావరణం ఉంటున్న పరిస్థితులు నేడు మనం చూస్తున్నాం.
పోటీ ఉండటంలో తప్పు లేదు.. కానీ పోటీపడే పరిస్థితుల్లో గెలుపనేది ఎవరో ఒకరికే దక్కుతుందన్న విషయాన్ని ముందుగా దృష్టిలో ఉంచుకోవాలి. లేకపోతే కోపాలు, తాపాలు, అలగటాలు, ఆఖరికి ఒకరంటే ఒకరికి ఈర్ష్యాద్వేషాలు కలిగించే ప్రమాదకర అంశాలు చోటుచేసుకునే అవకాశాలు లేకపోలేదు.
ప్రతి ఓటమినీ స్పోర్టివ్‌గా తీసుకునే మనస్తత్వాలు తగ్గిపోతున్నాయి. పండక్కి తోడికోడలికన్నా ఖరీదైన చీర కొని కట్టుకోవాలని ఉంటుంది. తీరా చూస్తే తమ ఆర్థిక పరిస్థితి అందుకు అంగీకరించదు. తోడికోడలే ఖరీదైన చీరలో మెరిసిపోతూ దర్శనమిచ్చేసరికి ఉక్రోషం, బాధ, అసూయ, ఓర్చుకోలేనితనం కక్షగా మారిపోతుంది. ఎప్పటికేది ప్రస్తుతమో ఆ పరిస్థితులనుబట్టి సర్దుకుపోయే మనస్తత్వం ఉన్నవారికి తిరుగేలేదు. ఉన్నంతలోనే సంతృప్తి పడి తాము ఎవరికీ పోటీ కాదు. తాము ఎవరితోనూ పోటీపడం... అనుకునేవారు జీవితంలో ఎలాంటి ఇబ్బందులూ పడరు. పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడం, ఉద్యోగ విజయాలు ఇవన్నీ ఎంతో కొంత పోటీ పడి పాల్గొనవలసిన అంశాలే. ఎపుడూ విజయాలే వరించవు. ఓటములు కూడా విశ్వవిజేతలైనవారి జీవితాల్లో ఉంటూనే ఉంటాయి. అయితే బ్యాలెన్స్‌డ్‌గా ఉండగలగడంలోనే ఉంది వారి సక్సెస్ రహస్యం.
కథల పోటీకి ఇద్దరు రచయిత్రులు పోటీపడి కథలు రాసి పంపారు. ఒకామె కథ పెద్ద బహుమతి గెల్చుకుంది. మరొకావిడ కథ సాధారణ ప్రచురణకు ఎన్నికయింది. ఇద్దరూ స్నేహితురాళ్లు కావడంతో వారిలో వారు అంతర్గతంగా పోటీపడ్డారు. ఎవరికి వాళ్లు తెలిసినవాళ్ళు కాకపోయి వుంటే పోటీ మామూలుగా ఉండేది. బహుమతి పొందిన రచయిత్రిపైన సాధారణ ప్రచురణకు ఎన్నికైన కధారచయిత్రి అగ్గిబుగ్గయిపోయింది. కథల ఫలితాల్లో ‘మ్యాచ్ ఫిక్సింగులు’ జరిగాయని వాపోయింది. తన కథే అత్యుత్తమయినదని మరీ బాధపడింది. ఇలా బాధపడటం లాంటి లక్షణాలు అసూయవల్లనే జరుగుతాయి. వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకుని తన కథను విశే్లషించుకుని ఆ రచయిత్రి కథను పరిశీలించాలి. చాలావరకూ కథల ఫలితాలు సంపాదకులు నిర్ణయించిన న్యాయనిర్ణేతల ఎంపికపై ఆధారపడి ఉంటాయన్న సూక్ష్మాన్ని మరువకూడదు.
పోటీ పడడం వరకే మనకున్న అర్హత... ఫలితాలు మన చేతుల్లో ఉండవు. గెలుపు అయనా, ఓటమి అయినా ఒకేలా స్వీకరించగలిగే మనస్తత్వాన్ని అలవరచుకుంటేనే పోటీపడడం మంచిది. అలా కాకుండా ఆశించింది అందుకోలేకపోయామని ఎదుటివారిపైన నిందలు వేయడం మంచి లక్షణం కాదు. అందుకే పోటీపడండి.. కానీ.. ఎలాంటి ఫలితాలకైనా సంసిద్ధులు కండి.
(-హిమజా రమణ, In Andhrabhoomi )

No comments:

Post a Comment