Friday, January 20, 2012

ప్లానింగ్ ఉంటేనే చక్కని చదువులు

ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులూ లేనివారి సంగతి అలా ఉంచితే.. మధ్యతరగతి వారూ.. పేదవారూ ఎదిగిన పిల్లల భారం.. పెరిగిన చదువుల భారం భరించి తగిన విధంగా సర్దుబాటు చెయ్యాలంటే బ్రహ్మప్రళయంగా ఉంటుంది.
రేపటి భవిష్యత్తు అంతా తగిన విద్యార్హతలతోనే ముడిపడి ఉంది. మంచి క్వాలిఫికేషన్స్ లేకుండా ప్రభుత్వ రంగ సంస్థ అయినా, ప్రైవేటు సంస్థ అయినా ఈ పోటీ ప్రపంచం పిలిచి ఉద్యోగాలిచ్చే ప్రసక్తే లేదు.
పేరున్న కార్పొరేట్ కళాశాల్లో పిల్లల్ని చదివించాలంటే బస్తాలకొద్దీ డబ్బుకావాల్సిందే. పిల్లలకు ఉన్నత చదువులు చెప్పించి మంచి భవిష్యత్‌ను అందించాలని పేరెంట్సూ ఆరాటపడతారు. పిల్లల లక్ష్యం, పెద్దల కలలు ఏమైనా వాటికి ఆర్థిక భారం రాను రానూ పెరిగిపోతున్నది. ఐదేళ్ళ వయసున్న పిల్లలే ఉన్నారనుకోండి. వారికి పద్దెనిమిదేళ్ళు వచ్చేసరికి ఏ ఇంజనీరింగ్ దశకో వస్తారు.
సుమారుగా ప్రస్తుతం ఇంజనీరింగ్ విద్య ఖర్చు నాలుగు సంవత్సరాలకూ వెరసి ఏడెనిమిది లక్షలు అనుకుంటే సంవత్సరానికి పది శాతం చొప్పున మీ పిల్లలకి పద్దెనిమిదేళ్ళు వయసు వచ్చేసరికి అంటే మరో పదమూడేళ్ళకి 30 లక్షలపైమాటే కానీ తక్కువ ఏ మాత్రం ఉండదు.
ఒక మధ్యతరగతి పేరెంట్స్ ఇంత డబ్బును రెడీ చేసుకోవాలంటే దుర్లభం. ఆ సమయానికి అప్పుల కోసం ప్రయత్నించడం తప్పదు. అటు క్యాపిటలిజం ఇటు సోషలిజం మిళితమై ఉన్న ఈ దేశంలో అటు హైక్లాస్ వాళ్ళకు ఇటు లోక్లాసు వాళ్ళకూ ఉన్న సదుపాయాలు, సౌకర్యాలు మిడిల్ క్లాస్‌కు ఏ మాత్రం లేకపోవడం విచారించతగ్గ విషయం.
మరి ప్రతి ఏడూ పెరిగిపోతూన్న నిత్యావసరాల ధరలు.. ఇంకా అనేక ఖర్చులను తట్టుకుంటూ కార్పొరేట్ కాలేజీ చదువులు రాబోయే రోజుల్లో చెప్పించగల స్థోమత మధ్యతరగతి వాళ్ళకు ఉండటం చాలా కష్టం.
అందుకే పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పటినుంచే పొదుపు చర్యలు పాటించి భవిష్యత్‌లో వాళ్ళు చదువులకు అవసరమయ్యే విధంగా తగిన ప్లానింగ్ ఉండటం తప్పనిసరి.
ముందుగా తమ పిల్లల్ని ఏ చదువు చెప్పించాలనుకుంటున్నారో ఆ చదువుకు అయ్యే ఖర్చును అంచనా వేసుకోవాలి. అంచనా అనేది తప్పనిసరి. ఎందుకంటే మీరనుకునేదానికి చాలా ఎక్కువ రెట్లు డబ్బు అవసరం అయిందనుకోండి. అపుడు పూర్తిగా డిజప్పాయింట్ కావలసిందే.
అందుకే నెలవారీ ఖర్చులు పోను మిగిలిన డబ్బును అంచనాల ప్రకారం దేనిలో పెట్టుబడులు పెడితే అవసరానికి సరిపోయినంత డబ్బు సమకూరుతుందో... అందులో పెట్టుబడి పెట్టాలి. ఇక్కడ మీరు పెట్టుబడి పెడుతున్న డబ్బుకు తగిన గ్యారంటీ ఉండే దానిలోనే పెట్టాలి.
పిల్లల తాలూకు సేవింగ్స్ ఎకౌంట్స్‌లో ఎలాంటి రాజీ పడకుండా ప్రతినెలా కొంత డబ్బు జమ చేస్తుండాలి. రిస్క్ లేని ఆస్తుల కొనుగోళ్లయితే భద్రతతోపాటు చాలా రెట్లు విలువ పెరిగే అవకాశాలుంటాయి. అంటే ఇపుడు మన దగ్గరున్న ఓ ఐదు లక్షలతో ఏదైనా కొద్దిగా స్థలం కొని సుమారు పది సంవత్సరాల తర్వాత అమ్మితే 15 నుంచి 30 లక్షల దాకా కూడా రావచ్చు. ఇది చాలా లోతుగా ఆలోచించి జాగ్రత్తగా తీసుకోవలసిన నిర్ణయం
ఇక పోస్టల్ రికరింగ్ డిపాజిట్లు.. నేషనల్ సేవింగ్స్ సర్ట్ఫికెట్స్ బ్యాంకులో డిపాజిట్స్.. మ్యూచువల్ ఫండ్స్ లాంటివి బంగారం.. వెండి లాంటివి ఉండనే ఉన్నాయి. ఇవన్నీ ఎంతో కొంత సంవత్సరం గడిచేకొద్దీ పెరిగేవి లాభాలు వచ్చేవే. అయితే ప్రైవేట్ స్కీమ్స్‌లో మాత్రం ఏ మాత్రం ఇనె్వస్ట్ చేయవద్దు. ఏ సంస్థ ఎపుడు బోర్డు తిప్పేస్తుందో కూడా తెలియని రోజులు.
పిల్లల కోసం కష్టపడి పైచదువులకోసం దాచుకునే డబ్బు తగినంత భద్రత.. పెరుగుదల చూసి ఇనె్వస్ట్ చేయడం తప్పనిసరి. లక్షలతోకానీ పూర్తికాని పిల్లల పైచదువుల గురించి ప్రతి తల్లిదండ్రులూ తప్పనిసరిగా మంచి ప్లానింగును కలిగి ఉండటం అనేది తప్పనిసరి.. లోన్లు.. అప్పులు.. ఆస్తులు అమ్మటాలు చాలావరకూ తగ్గించవచ్చు. అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చదివించవచ్చు

(-రమణ, From Andhrabhoomi)

No comments:

Post a Comment