Tuesday, October 18, 2011

అవస్థల్లో ‘ఆకాశవాణి’ సిబ్బంది!

నెహ్రూ వారసులమని గొప్పలు చెప్పుకుంటున్న వారు, ఆయన కలలుగన్న శ్రేయోరాజ్య భావనకు నీళ్లొదలడం విచారకరం. కాలానికి అనుగుణంగా ‘దేశాభివృద్ధి’ కోసమే, ప్రథమ భారత ప్రధాని నెహ్రూ రూపొం దించిన విధానాలకు సెలవు ప్రకటించక తప్పలేదని సన్నాయి నొక్కులు నొక్కడం విడ్డూరం కలిగించే విషయం. జాతి గర్వించదగ్గ ఆణిముత్యాల వంటి ఎన్నో ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించి కోట్లాది మంది కడుపుకోతకు కార కులవుతున్నారు. ప్రజా ‘సంక్షేమ’బాటను వీడి వ్యాపారీకరణ పాట పాడుతున్నారు. చివరకు జాతి ప్రసారసాధనాలుగా ఖ్యాతిగడించిన ఆకాశవాణి, దూరదర్శన్‌లను సైతం వదలక వెంటాడటం విచారకరం.

కొండకోనల్లోని ఆదివాసీ జీవన విధానాన్నీ, మారుమూల పల్లెల్లోని గ్రామీణ సంస్కృతినీ, రైతుల కష్టాలనూ, కార్మికుల గోడును కళ్లకు కట్టడమే కాక, వారి అభివృద్ధిని కాంక్షస్తూ అందరికీ అర్థమయ్యే చక్కటి ‘కబుర్లు’ రూపంలో అద్భుత కార్యక్రమాలను రూపొందించిన చరిత్ర ఆకాశవాణి, దూరదర్శన్‌లకే సొంతం. వికాసవంతమైన జాతి నిర్మాణంలో ప్రసారమాధ్యమాల పాత్ర అనన్యం. అవసరమైన సమాచారాన్ని ప్రజలకు అందించి, తద్వారా వారిని అభివృద్ధిలో భాగస్వాములను చేయడం ప్రభుత్వరంగ సంస్థలుగా కొనసాగే ప్రచారసాధనాలకే సాధ్యం. వ్యాపార దృష్టికి అది సాధ్యం కాదు.

ముఖ్యంగా వ్యవసాయం, ఆరోగ్యం, నిరక్షరాస్యత, బడి చదువులు వంటి మౌలిక విషయాల్లో ప్రజలను చైతన్య పరచి, దేశ ఆర్థిక ప్రగతిలో వారిని మమేకం చేయడం కీలకమైన అంశం. సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో ఆకాశవాణి, దూర దర్శన్‌లను పూర్తి స్థాయిలో సంస్కరించాలని ప్రభుత్వం నిర్ణయించడం, ఆ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కష్టాలకు కారణభూతమైంది. సంస్కరించడమంటే ప్రైవేటీకరణ, వ్యాపారీకరణలకు గురిచేసి, ఔట్‌సోర్సింగ్ విధానాలతో సంస్థను బలహీనపరచడం, ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం కాకూడదు. దీంతో కార్యక్రమాల్లో పటిష్టత లోపించిందన్నది కూడా వాస్తవం. ఈ లోపాలను అధిగమించి కార్యక్రమాల్లో స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను పెంపొందించేలా ఆకాశవాణి, దూరదర్శన్‌లను తీర్చిదిద్దడానికే ‘ప్రసారభారతి’ వ్యవస్థను రూపొందించామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఆచరణ దానికి పూర్తి విరుద్ధంగా తయారయిందన్నది కళ్లకు కడుతున్న వాస్తవం. దేశంలో నేడు 745 చానళ్లు రంగప్రవేశం చేయడమే దానికి పెద్ద ఉదాహరణ.

ప్రసారభారతి నిర్వహణ లోపభూయిష్టంగా మారడంతో ఉద్యోగులకు సకాలంలో జీతాలు, అలవెన్సులు చెల్లించడం లేదు. 1989 నుండి పదోన్నతులు కరువై ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు తయారైంది. ఉద్యోగుల్లో అభద్రతాభావం నెలకొంది. మరోవైపు, ఆర్థిక స్వావలంబన పేరుతో రిక్రూట్‌మెంట్‌కూ, ప్రమోషన్లకూ స్వస్తి చెప్పారు. ఈ లోటుపాట్లను ప్రశ్నిస్తున్న ఉద్యోగ సంఘాలపై అధికారులు కన్నెర్రచేయడం పరిపాటిగా మారింది.

ఎందరో మహానుభావులైన జాతి నేతలు పెంచి పోషించిన ప్రజా ప్రసారసాధనాలను దెబ్బతీయెద్దన్నందుకే ఇంతటి శిక్షను విధించడం అమానుషం. ఇటీవల ఆకాశవాణి, దూరదర్శన్‌లకు చెందిన 9 ఉద్యోగ సంఘాల గుర్తింపును ఒక్క కలంపోటుతో రద్దుచేయడం దానికి పరాకాష్ట. ప్రజా వాణినీ బాణినీ వినిపించే సంస్థలను రక్షించుకోవడానికి విజ్ఞులు చొరవ చూపాలని మనవి.
సాక్షి లో :
-వలేటి గోపీచంద్ రాష్ట్ర కార్యదర్శి,
ప్రోగ్రాం స్టాఫ్ అసోసియేషన్ ఆలిండియా రేడియో - దూరదర్శన్, హైదరాబాద్

No comments:

Post a Comment