Tuesday, October 25, 2011

మంచి గుణాలు పెంపొందించుకోండి!

మన మాటలు ఎంతో మందిని బాధిస్తాయనే విషయాన్ని మర్చిపోయి అవాకులు చెవాకులు పేలుతూంటాం. సరదాకో, పొద్దుపోవడానికో, కాలక్షేపానికో మాట్లాడుకునే మాటల్లో మనకు తెలియకుండానే ఎవరెవరినో నిందిస్తూంటాం. ఏ ఇద్దరు కలిసినా మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోవటం సర్వసాధారణమైంది. అయితే ఈ మాటలు ఎవరిని బాధించినా, బాధించకపోయినా ఈ అలవాట్లు వ్యక్తిలోని ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీస్తాయంటున్నారు మానసిక వైద్యులు.
మన మాటలు మనకి సరదాగా ఉండొచ్చు. ఈ అలవాటు ఒక దశ వరకు బాగానే ఉంటుంది. అయితే తర్వాత తర్వాత మనల్ని కూడా ఎవరైనా నిందిస్తారేమోననే ఆలోచన మొదలవుతుంది. దీనితో లోలోపల మధనపడటం మొదలవుతుంది. పరోక్షంగా ఇది ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీస్తుంది. దీనివల్ల ఎవరో ఒకరికి అనుకూలంగా మాట్లాడే మాటలు మమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతాయి. అప్పుడు మీ వద్ద ఎవరైనా వ్యతిరేక వ్యాఖ్యలు చేయడానికి జంకుతారు. మీ స్వభావం వల్ల మీకు దగ్గరయ్యే వాళ్లు చాలామందే ఉంటారు. ప్రతి దానిని స్పోర్టివ్‌గా తీసుకోవాలి. మనలో లోటుపాట్లు ఏమైనా ఉన్నాయంటే సరిచేసుకోవటానికి ప్రయత్నించాలి.
అనేక మంది చేసే పనులను వాయిదా వేస్తూంటారు. దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. ఉన్నత పదవుల్లో రాణించాలనుకునే వారికి ఇది మరింత సమస్యగా మారుతుంది. ఇలాంటి వాయిదా తత్వం వల్ల సామర్థ్యం లోపిస్తుంది. కాబట్టి చేయాల్సిన ప్రతి అసైన్‌మెంట్‌ని నిర్ణయించుకున్న సమయం కంటే ముందే పూర్తి చేయడం అలవరచుకోవాలి. మీరు చేసే పనిని మీరే ప్రశంసించుకుంటే ఇంకా మెరుగ్గా పని చేయగలుగుతారు. మొదటగా ప్రణాళికాబద్ధంగా ఇచ్చిన పనిని షెడ్యూల్ ప్రకారం చేసుకుంటూ పోతే తప్పక మనం లక్ష్యాన్ని చేరుకోవచ్చు. లేకపోతే అందరిలాగానే వెనుకబడిపోతాం. అనుకున్న పనిని నేను చేయగలనని ఆత్మవిశ్వాసం మనలో ఉండాలి. అప్పుడే ఆ పనిని పూర్తి బాధ్యతగా చేయగలుగుతాం.
అందరి గుర్తింపు పొందాలని, అతి మొహమాటాన్ని ఎప్పుడూ ప్రదర్శించకూడదు. అలాగని ప్రశంసలని తోసిపుచ్చకూడదు. ఈ రెండింటి పైనా మంచి పట్టు సాధించాలి. కొన్నిసార్లు ప్రశంసలు విలువలు పెంచుతాయనే విషయాన్ని మరువకూడదు. ఎవరు పొగిడినా చిన్న థాంక్స్‌తో సరిపెట్టండి. అతి ఊహించుకుని, నేను తప్ప ఈ పని చేయగలిగిన వారెవరూ లేరనుకుంటే అది పొరపాటు. ఆరోగ్యకరమైన పోటీ తత్వం మరింత పనితనాన్ని పెంచుతుంది. అయితే ప్రతి చిన్న విషయానికి ఇతరులతో పోటీ పడటం వల్ల ఈర్ష్యాద్వేషాలు తలెత్తే అవకాశం ఉంది. గెలుపు ఓటములను సమానంగా తీసుకునే తత్వాన్ని చిన్నప్పట్నుంచీ అలవాటు చేసుకోవాలి. ఆరోగ్యకరమైన పోటీ ఉండాలే తప్ప ఒకరిని దెబ్బతీసే భావనలను తుడిచేయాలి.
-పి.ఎం.( ఆంధ్ర భూమి నుండి )

No comments:

Post a Comment