Saturday, October 22, 2011

ప్రగతి బాటలో ఎస్సీ,ఎస్టీలు,ముస్లింలు:భారత మానవాభివృద్ధి నివేదిక -2011

మానవాభివృద్ధి సూచిక (హెచ్‌డీఐ)లో భారత్ గడిచిన పదేళ్లలో పురోగతి సాధించింది. దేశంలో అంతర్రాష్ట్ర అసమానతలు తగ్గుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలు, ముస్లింలు సామాజిక ప్రమాణాల్లో ప్రగతి పథం వైపు పయనిస్తున్నారు. 2004-05, 2009-10లో వినియోగం, వేతనాల్లో వృద్ధి నమోదైంది. మూడింట రెండొంతులు ప్రజలు పక్కా గృహాల్లో నివసిస్తున్నారు. మూడొంతుల మంది గృహావసరాలకు విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. దేశంలో హెచ్‌డీఐ 21 శాతం పెరిగి 0.467కు చేరుకుంది. అత్యధిక అక్షరాస్యత, మెరుగైన వైద్య సేవలు, ప్రజల వినియోగ వ్యయంలో కేరళ తొలి స్థానంలో నిలిచింది. ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, గోవాలు వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఈ సూచికలో ఆంధ్రప్రదేశ్‌కు 15వ ర్యాంకు దక్కింది.

ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, అస్సాంలు హెడ్‌డీఐ జాతీయ సగటు 0.467కన్నా వెనకబడి ఉన్నాయి. కేంద్ర ప్రణాళిక సంఘానికి చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ అప్లయిడ్ మ్యాన్‌పవర్ రీసెర్చ్ ఈ నివేదికను రూపొందించింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్ (ఢిల్లీ) ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా ‘ఇండియా హ్యూమన్ డెవలప్‌మెంట్ రిపోర్ట్-2011: టువర్డ్స్ సోషల్ ఇన్‌క్ల్లూషన్’ను ఆవిష్కరించారు. అనంతరం మాంటెక్‌సింగ్ మాట్లాడుతూ నివేదికలో రాష్ట్రాల మధ్య అసమానతలపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించారని అన్నారు.


‘నివేదికలో మరో రెండు అసమానతలు స్పష్టమయ్యాయి. ఒకటి దేశంలో విభిన్న మతాలు, కులాల మధ్య అంతరాలు కాగా, మరొకటి ధార్మిక సముదాయాల మధ్య అంతరాలు. 11వ పంచవర్ష ప్రణాళిక అభివృద్ధి లక్ష్యంగా నివేదిక కేంద్రీకృతమైంది. గడిచిన పదేళ్లలో దేశంలోని వెనకబడిన వర్గాలు అభ్యున్నతిని సాధించాయి. వారి అభివృద్ధి జాతీయ సగటుకు చేరువైంది. వెనకబడిన రాష్ట్రాలు కూడా అభివృద్ధి విషయంలో చాలా వరకు పురోగతిలో పయనిస్తున్నాయి’ అని వివరించారు. ఈ నివేదిక ప్రస్తావించిన అంశాలపై నేడు జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో చర్చిస్తామన్నారు.

అంతకుముందు ఐఏఎంఆర్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ సంతోష్ మెహరోత్ర మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు అభివృద్ధిలో జాతీయ సగటుకు చేరువయ్యే దిశగా పయనిస్తున్నారని చెప్పారు. గడిచిన 8 ఏళ్లతో పోలిస్తే భారత మానవాభివృద్ధి సూచికలో 21 శాతం వృద్ధి జరగగా, చైనాలో 17 శాతం వృద్ధి నమోదైందన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేశ్ మాట్లాడుతూ ఆరోగ్యం, విద్య విషయంలో సత్ఫలితాలు సాధిస్తున్నప్పటికీ తాగునీటి సరఫరా, వైద్యం, పారిశుద్ధ్యం, పౌష్టికాహారం విషయంలో ఇంకా సవాళ్లు ఎదురవుతున్నాయని అన్నారు.

మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్‌లలో 75 శాతం కుటుంబాలు ఇప్పటికీ ఆరుబయట బహిర్భూమికి వెళ్తుండటం పారిశుద్ధ్యానికి సవాళ్లు తెచ్చిపెడుతున్నాయన్నారు. పారిశుద్ధ్యం మెరుగు కోసం కేంద్రం రూ. 1200 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 700 కోట్లు నిధులు కేటాయిస్తున్నాయని తెలిపారు. కాగా, దేశవ్యాప్తంగా మహిళల్లో సగం మందికిపైగా రక్తహీనతతో బాధపడుతున్నారని ఈ నివేదికలో వెల్లడైంది. అలాగే దేశంలో అక్షరాస్యత శాతం ప్రస్తుతానికి 74 శాతంగా నమోదైంది.

No comments:

Post a Comment