Monday, April 9, 2012

"వైయస్సార్ కంగ్రెస్ గెలిస్తే తెలంగాణా వస్తుంది": కాంగ్రెస్ క్రొత్త వ్యూహం

రాబోయే ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాంగ్రెస్ నాయకత్వం, ఎన్నికల ప్రచార వ్యూహాన్ని ఇప్పటినుంచే సిద్ధం చేస్తోంది. ఉప ఎన్నికలు జరగనున్న నియోజక వర్గాల్లో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రభుత్వ పరంగా రకరకాల వరాలు ప్రకటిస్తూనే, రాజకీయంగా వైఎస్సార్ కాంగ్రెస్‌ను దెబ్బ తీసే వ్యూహానికి పదును పెడుతోంది. తమ ప్రాంతంలో ఉప ఎన్నికలు జరగనున్న తరుణంలో తెలంగాణ నాయకులు ప్రత్యేక రాష్ట్రం కోసం ఒత్తిడి చేయడం తమకు ఇబ్బందిగా ఉంటుందని సీమాంధ్ర నేతలు అంటున్నారు. ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు జిల్లాలవారీగా నిర్వహించిన సమావేశాల్లో సీమాంధ్ర నేతలు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, తెలంగాణ నేతల దూకుడు తగ్గించాలని కోరారు. అయితే అదే తెలంగాణ అంశాన్ని ఉప ఎన్నికల్లో తమకు అనుకూలంగా మలచుకోవాలని ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు నిర్ణయించారు. సీమాంధ్ర ప్రాంతంలో పదిహేడు నియోజకవర్గాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు విజయావకాశాలు ఉండవచ్చునని భావిస్తున్న కాంగ్రెస్ నాయకత్వం, తెలంగాణ అంశాన్ని బూచిగా చూపించి వైఎస్సార్ కాంగ్రెస్‌కు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించని పక్షంలో రాష్ట్ర విభజనకు అనుకూలంగా హైకమాండ్ నిర్ణయం తీసుకునే ప్రమాదం ఉంటుందని ప్రచారం చేయటం ద్వారా సీమాంధ్ర ప్రజల్లో ఉన్న సమైక్యాంధ్ర సెంటిమెంటును ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఉప ఎన్నికల ప్రచారంలో ఈ అంశం గురించే ప్రధానంగా ప్రస్తావించేలా కాంగ్రెస్ నేతలకు, పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ నాయకత్వం చెప్పనుంది. సమైక్యాంధ్ర కొనసాగాలంటే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాల్సిందిగా పెద్దఎత్తున ప్రచారం చేయాలని భావిస్తున్నారు. చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేశ్ ఇప్పటికే ఈ కోణంలో ప్రచారం ప్రారంభించారు. ఆదివారం తిరుపతిలో మాట్లాడుతూ, ఉప ఎన్నికల్లో జగన్ పార్టీ గెలిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని వ్యాఖ్యానించారు.
ప్రత్యేక తెలంగాణ అంశం కాంగ్రెస్, టిడిపిలను ఇరకాటంలో పెట్టినంతగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పెట్టడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని సీమాంథ్రకు మాత్రమే పరిమితమైన పార్టీగా భావిస్తున్నారు. తెలంగాణ వాదులు కూడా ప్రత్యేక రాష్ట్రం విషయంలో కాంగ్రెస్, టిడిపిలపై తెస్తున్నంతగా వైఎస్సార్ కాంగ్రెస్ మీద ఒత్తిడి తేవకపోవడం గమనార్హం.
తెలంగాణలో మాదిరిగానే సీమాంధ్రలోనూ కాంగ్రెస్ బలహీనంగా ఉందని హైకమాండ్ భావిస్తే, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ద్వారా తెలంగాణలోనైనా పార్టీని పటిష్టం చేయవచ్చుని అనుకునే ప్రమాదం ఉందని, దీనివల్ల సమైక్యాంధ్రనే కొనసాగించాలంటూ సీమాంధ్ర ప్రజలు చేపట్టిన ఉద్యమం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని కాంగ్రెస్ నాయకులు ఉప ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు. అదే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే తెలంగాణలో పార్టీ దెబ్బతిన్నా సీమాంధ్రలో పటిష్టంగా ఉందన్న ఉద్దేశంతో రాష్ట్ర విభజనకు హైకమాండ్ అంగీకరించక పోవచ్చని వారు ప్రచారం చేయనున్నారు.

2 comments:

  1. కాంగ్రెస్ ఓడిపోయాక అదేమీ లేదని, ప్రజలు తెలంగాణకు వోట్లేయలేదని ఎటు తిరిగీ మాట మారుస్తారు లెండి.

    తెరాస గెలిచినప్పుడే ఇతర పార్టీలకు పడ్డవి, అసలు వోట్లే వెయ్యని వాళ్ళని సమై"ఖ్యాం"ధ్ర వైపు లెక్కెట్టే పరకాల లాంటి ప్రబుద్దులు ఉన్నంత కాలం బలవంతపు ఐక్యతా వాదానికి లేని బలం కనిపుస్తూనే ఉంటుంది.

    ReplyDelete
  2. "మేము సమైక్యాంధ్రకే అనుకూలం కానీ తెలంగాణా ఏర్పడితే అడ్డుకోము" అని చెప్పిన సూడో కమ్యూనిస్ట్ పార్టీ CPMకి తెలంగాణాలో కొన్ని వోట్లు పడితే తెలంగాణాలో సమైక్యవాదులున్నారు అని నిరూపించడానికి ప్రయత్నించాడు తెలకపల్లి రవి అనే మేతావి. కాంగ్రెస్‌కి కూడా అలాంటి అతి తెలివితేటలే ఉంటాయి.

    ReplyDelete