Sunday, July 31, 2016

హోదాపై తెలుగుదేశం కార్యాచరణ ఏమిటో తేలేది నేడే


hoda
ప్రత్యేక హోదా అంశంపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భవిష్యత్తు కార్యాచరణకు సిద్ధమవుతోన్నది, అందులో భాగంగా ఆదివారం పార్టీ ఎంపీల సమావేశం నిర్వహించనున్నారు. కేంద్రంపై ఒత్తిడి తేవడం ఒక్కటే పరిష్కారమని ముఖమంత్రి చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం ఎమ్‌పిల సమావేశ తీరుతెన్నులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, ఆ వ్యూహాన్ని అమలు చేయాలన్నదే ముఖ్యమంత్రి ముందున్న ప్రశ్న. కేంద్రంతో సత్సంబంధాలకు విఘాతం కలుగకుండా అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీలేకుండా పోరాటం చేయాలని ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఎమ్‌పిలపై చంద్రబాబు గుర్రుగా ఉన్నారు. గతరెండ్రోజులుగా పార్లమెంట్‌లో ఎమ్‌పిల ప్రవర్తనాశైలి ఆయన్ను మెప్పించలేక పోయింది. శుక్రవారమైతే ప్రత్యేకంగా టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి మరీ ఎమ్‌పిల్ని తిట్టిపోశారు. ఇది బయటకు పొక్కకుండా ఎమ్‌పిలు చేసిన ప్రయత్నం ఫలించలేదు. పైగా ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ మిత్రపక్షం బిజెపి వైఖరిపై చంద్రబాబు తన అసమ్మతి ప్రకటించారు. ఈ దశలో జరుగుతున్న ఎమ్‌పిల సమావేశం పార్టీతో పాటు పొత్తుపై కూడా దిశానిర్దేశం చేసేదిగా ఉంటుందని అంచనాలేస్తున్నారు. కొందరైతే హోదాపై మాటమార్చిన బిజెపితో తెగతెంపుల రీతిలోనే తెలుగుదేశం వ్యవహరించే విధంగా ఈ సమావేశంలో చంద్రబాబు ఎమ్‌పిలకు సూచనలిస్తారని భావిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తెగతెంపులంత ఆషామాషీకాదు. ప్రభుత్వంలో భాగస్వామిగా లేనిపక్షంలోచంద్రబాబుకు కూడా మోడి అపాయింట్‌మెంట్‌ దొరికే అవకాశాల్లేవు. అదీకాక మంత్రి సుజ నాచౌదరిపై ఆర్ధిక ఆరోపణలున్నాయి. మంత్రి పదవి నుంచి వైదొలిగితే అవి ఆయన్ను చుట్టుముడతాయి. దీంతో ఆయన తరపున చంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి వచ్చే అవకాశముంది. హోదా విషయంలో తెలుగుదేశం వైఖరి సందిగ్ధంలో పడింది. అటు మిత్రపక్షాన్ని ఒప్పించలేక అలాగని తానొవ్వలేక తీవ్రంగా సతమతమౌతుంది. పార్లమెంట్‌ సమావేశాల్లో తన వైఖరి ద్వారా ప్రజల విశ్వాసాన్ని పునరుద్దరించుకోవడం ఇప్పుడాపార్టీకి అత్యవసరం. గత రెండేళ్ళుగా చంద్రబాబు భవిష్యత్‌ పట్ల ఆశలు చూపుతూ ప్రజల్ని నమ్మించగలిగారు. కేంద్రం నుంచి సాయమందుతుందన్న భ్రమల్లో పెట్టారు. ఇప్పుడాయకు కూడా భ్రమలు తొలగిపోయాయి. హోదా కాదు ఆఖరకు పోలవరానిక్కూడా నిధులిచ్చే అవకాశాల్లేవని తేలిపోయింది. దీనికి రాష్ట్ర ప్రజలు చంద్రబాబునే బాధ్యులుగా భావించే అవకాశముంది. ముందునుంచి కేంద్రంపై ఒత్తిడి తేవడంలో రాష్ట్రం విఫలమైందన్న ప్రచారం ఇప్పటికే మొదలైంది. పైగా విపక్షాలు దీన్ని వీలైనంతగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నాయి. ఈ దశలో ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లో ఎమ్‌పిల వ్యవహారశైలిని ప్రతిఒక్కరు నిశితంగా గమనించనున్నారు. విభజనకు ముందు కాంగీయుల అసమర్ధతను రాష్ట్ర ప్రజలు ఛీదరించుకున్నారు. వారిలో ఏ ఒక్కరికి తిరిగి పోటీ చేసే ధైర్యం కలగలేదు. పోటీ చేసిన కొందరు డిపాజిట్లు సైతం కోల్పోయారు. ఆ స్థాయిలో ప్రజలు వారిపై కక్షతీర్చుకున్నారు. కాగా ఇప్పుడు తెలుగుదేశం ఎమ్‌పిల వ్యవహారశైలిని కూడా ప్రజలు తదేకంగా వీక్షించి వారి పట్ల ఓ అభిప్రాయాన్నేర్పర్చుకోనున్నారు. ఇందుకనుగుణంగానే బిజెపికి పూర్తిగా దూరం కాకుండా అలాగని దగ్గరగా ఉన్నట్లు కనిపించకుండా అంశాల ప్రాతిపదికన వ్యవహరించాలంటూ ఎమ్‌పిలకు చంద్రబాబు సూచించే అవకాశాలున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

No comments:

Post a Comment