Friday, December 28, 2012

అఖిల పక్షంలో ఎవరేమన్నారు ?

న్యూఢిల్లీ : తెలంగాణపై నిర్వహించిన అఖిలపక్షం పనికిమాలిన మీటింగ్ అని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిలపక్షం ముగిసిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. అఖిలపక్షంతో ఒరిగేందేమి లేదన్నారు. ప్రధాన పార్టీలు తెలంగాణపై స్పష్టత ఇవ్వలేదని పేర్కొన్నారు. ప్రధాన పార్టీలైనా కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్‌సీపీ మళ్లీ పాతపాటే పాడాయని ధ్వజమెత్తారు. అప్పుడు చిదంబరం నాలుగు వారాలు అన్నడు, ఇప్పుడు షిండే నెల రోజులు అంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ప్రధానితో మాట్లాడి నిర్ణయం చెప్పొచ్చని అన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం లేదన్నారు. కేంద్రం తెలంగాణపై నాటకాలాడుతున్నదని మండిపడ్డారు. ఇంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న కేంద్రానికి చీమకుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఆ పార్టీకి రాజీనామా చేస్తారని భావిస్తున్నానని చెప్పారు. తెలంగాణ జేఏసీతో చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని పేర్కొన్నారు. 


తెలంగాణపై నెల రోజుల్లో నిర్ణయం : షిండే
న్యూఢిల్లీ : తెలంగాణపై నెల రోజుల్లో నిర్ణయం వస్తుందని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటించారు. తెలంగాణపై అఖిలపక్ష సమావేశం ముగిసిన అనంతరం షిండే మీడియాతో మాట్లాడారు. అఖిలపక్షంలో ఎనిమిది రాజకీయ పార్టీలు పాల్గొన్నాయని తెలిపారు. ప్రతి పార్టీ నుంచి ఇద్దరు చొప్పున పాల్గొన్నారని చెప్పారు. అన్ని పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించాయని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని కోరాయని తెలిపారు. అందరి అభిప్రాయాలను క్షుణ్ణంగా విన్నానని, పార్టీల అభిప్రాయాలను కేంద్రానికి నివేదించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామన్నారు. సమస్య పరిష్కారానికి నిర్ణయం తీసుకుంటామని, యువత సంమయనం పాటించాలని కోరారు. ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు కొందరు ఆమోదిస్తారు, మరికొందరు వ్యతిరేకిస్తారన్నారు. తెలంగాణపై ఇదే చివరి సమావేశమని చెప్పారు. 


2008 లేఖకు కట్టుబడి ఉన్నాం : టీడీపీ 
న్యూఢిల్లీ : అఖిలపక్ష సమావేశంలో టీడీపీ ప్రతినిధులు మళ్లీ పాత పాటే పాడారు. 2008లో ప్రణబ్‌కు ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేకు టీడీపీ ప్రతినిధులు చెప్పారు. ఆ లేఖపై తాము వెనక్కు తగ్గలేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించలేదన్నారు. తెలంగాణ సమస్యను కేంద్రం సత్వరమే పరిష్కారించాలని డిమాండ్ చేశారు. 


విభజన అనివార్యమని చెప్పాం:నారాయణ 
న్యూఢిల్లీ : అఖిలపక్ష సమావేశంలో రాష్ట్ర విభజన అనివార్యమని చెప్పామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. తెలంగాణపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేను కోరామని తెలిపారు. సమావేశంలో ముఖ్యమంత్రి ఏం మాట్లాడలేదని చెప్పారు. సమావేశం సంతృప్తికరంగా సాగిందన్నారు. తెలంగాణపై ఇదే చివరి సమావేశమని షిండే హామీ ఇచ్చారని నారాయణ పేర్కొన్నారు. 

సమైక్యంగా ఉండాలని చెప్పాం : రాఘవులు
న్యూఢిల్లీ : రాష్ట్రం సమైక్యంగా ఉండాలని అఖిలపక్షంలో చెప్పామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు చెప్పారు. తెలంగాణ విషయంలో ఇదే చివరి సమావేశం కావాలని షిండేను కోరామని తెలిపారు. సమస్యను నాన్చకుండా నెల రోజుల్లోపు శాశ్వత పరిష్కారం చూపాలని షిండేకు విజ్ఞప్తి చేశామన్నారు. షిండే కూడా నెల రోజుల్లో ఒక స్పష్టమైన ప్రకటన చేస్తామని చెప్పారని పేర్కొన్నారు. 

తెలంగాణ ఏర్పాటు చేస్తారనిపిస్తోంది:సురేశ్‌రెడ్డి 
న్యూఢిల్లీ : కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తారని అనిపిప్తోందని కాంగ్రెస్ నేత కేఆర్ సురేశ్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్ని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు. నెల రోజుల్లో నిర్ణయం తెలుపుతామని షిండే అనడం మంచిదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ అనుకూలంగా ఉందని షిండే చెప్పారని తెలిపారు. అనంతరం మిగతా పార్టీలు తమ అభిప్రాయాలను చెప్పాయని చెప్పారు. అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ ఇస్తే అభ్యంతరం లేదు : వైసీపీ 
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వైఎస్సార్ సీపీ ప్రతినిధులు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తామని వారు పేర్కొన్నారు. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని, తెలంగాణ సమస్యను పరిష్కారించాల్సిందే కేంద్రమే అని చెప్పారు. తెలంగాణ విషయంలో ప్లీనరీలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని తేల్చిచెప్పారు. 

పార్లమెంట్‌లో బిల్లు పెట్టండి : బీజేపీ 
న్యూఢిల్లీ : తెలంగాణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేను కోరామని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తెలిపారు. అఖిలపక్షం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక సమావేశాలు మానుకోని ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో బిల్లు పెడితే తాము మద్దతిస్తామని స్పష్టం చేశారు. బిల్లు పెడితే ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. 

రాయల తెలంగాణకు ఓకే : ఓవైసీ 
న్యూఢిల్లీ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఎంఐఎం పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. అఖిలపక్షం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాయల తెలంగాణను ఏర్పాటుకు తాము ఓకే అని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా గానీ, కేంద్ర పాలిత ప్రాంతంగా గానీ చేయడాన్ని అంగీకరించమని స్పష్టం చేశారు. 

రేపు తెలంగాణ బంద్ : కేసీఆర్ 
న్యూఢిల్లీ : అఖిలపక్ష సమావేశంలో ప్రధాన పార్టీలు తమ నిర్ణయాన్ని చెప్పకపోవడాన్ని నిరసిస్తూ రేపు తెలంగాణ బంద్‌కు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్ సీపీలు స్పష్టత ఇవ్వలేదని కేసీఆర్ తెలిపారు. ఈ మూడు పార్టీల తీరుపై కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీల వైఖరికి నిరసనగా బంద్‌ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, తెలంగాణవాదులకు ఆయన పిలుపునిచ్చారు. బంద్‌కు అన్ని సంఘాలు మద్దతిచ్చాయి.

No comments:

Post a Comment