Saturday, December 29, 2012

తెరపైకి మళ్లీ మూడవ కూటమి

దేశంలో మళ్లీ మూడవ కూటమి ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు జనతాదళ్‌(ఎస్‌) నేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ ప్రకటించారు. దాంతో ఈ అంశపై చర్చకు తెరతీసినట్లైంది. మన దేశంలో మూడవ కూటమి ఏర్పడటం అంటే మాటలుకాదు. దానికి కాంగ్రెస్, బిజెపిలను వ్యతిరేకించడం ఒక్కటే సరిపోదు. భావసారూప్యతతోపాటు విధానపరమైన ఏకాభిప్రాయం కూడా కావాలి. 2009లో కూడా మూడవ కూటమి ఏర్పాటుకు వామపక్షాలతోపాటు దేవెగౌడ్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్రంగా కృషి చేసి విఫలమయ్యారు. మళ్లీ ఇప్పుడు కూడా దేవెగౌడ ఈ అంశం పట్ల ఆసక్తి చూపుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలు అవినీతి, అక్రమాలు, కుంభకోణాల్లో మునిగితేలుతున్నాయని, దీంతో ఆ పార్టీలపై ప్రజలు విసిగుచెందారని ఆయన చెప్పారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం చెప్పేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నది ఆయన అభిప్రాయం. మూడవ కూటమి ఏర్పాటుకు ఇదే మంచి సమయం అని ఆయన అన్నారు. 

దేవెగౌడ్ చెప్పినట్లు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యుపిఏ ప్రభుత్వం భారీ కుంభకోణాల ఊబిలో చిక్కుకుంది. దానికితోడు అన్ని ధరలు పెరిగిపోయాయి. పెట్రోల్, డీసెల్, గ్యాస్, రైలు ఛార్జీలు.......అన్నీ పెంచేశారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. యుపిఏ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బిజెపి ప్రభుత్వం కూడా అందుకు భిన్నంగా ఏమీలేదు. బిజెపి అధికారంలో ఉన్న కర్ణాకట పరిస్థితి అందరికీ తెలిసిందే. గుజరాత్ లో మోడీ హవాతో మళ్లీ అధికారంలోకి వచ్చినప్పటికీ హిమాచల్ ప్రదేశ్ లో ఘోరంగా ఓడిపోయింది. ఇతర రాష్ట్రాలలో కూడా ఆ పార్టీ అంత బలంగా ఏమీలేదన్నది అందరికీ తెలిసిన విషయమే. ప్రధాని అభ్యర్థి విషయంలో ఆ పార్టీలోనూ, ఎన్ డిఏ కూటమిలోనూ అభిప్రాయభేదాలు ఉన్నాయి. ఈ పరిస్థితులలో ప్రజలు మూడవ ప్రత్యామ్నాయంవైపు చూస్తున్న మాట వాస్తవం. అయితే దేవెగౌడ్ గత చరిత్ర తెలిసినవారెవరూ ఆయన ప్రయత్నాలు ఫలిస్తాయని అనుకోరు. బిజెపిని తీవ్రంగా వ్యతిరేకించిన దేవెగౌడ గతంలో తన కుమారుడు కుమారస్వామి బిజెపితో పొత్తు కుదుర్చుకుంటే రాజీపడ్డారు. ఆ తరువాత తన కుమారునికి మంత్రి పదవి కోసం మూడవ కూటమికి గుడ్‌బై చెప్పి యుపిఎకి మద్దతు పలికారు. అటువంటి నిలకడలేని రాజకీయ వేత్త ప్రయత్నాలు ఫలించే అవకాశాలు చాలా తక్కువ. అయితే ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులలో వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలతో మూడవ కూటమి ఏర్పడటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపై నడిపించడానికి చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నించిన్పటికీ ఫలితం దక్కలేదు. 

ఈ 'మూడవ' అనేదాన్లో మరో అంశం చర్చించవలసి ఉంది. కాంగ్రెస్, బిజెపియేతర పక్షాల కూటమి అనేది ఒకటైతే, వామపక్షాల ఆధ్వర్యంలో మూడవ ఫ్రంట్ అనేది మరొకటి వినస్తుంది. దీనినే విధాన ప్రత్యామ్నాయం అంటారు. వామపక్షాలు అంటే విధాన పరమైన అంశాలకు ప్రధాన్యత ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ దిశగా కూడా ప్రయత్నాలు జరిగే అవకాశాలు లేకపోలేదు. కాంగ్రెస్‌-బిజెపి యేతర పార్టీలను కలుపుకొని మూడవ కూటమి ఏర్పాటు చేసి, గత ప్రభుత్వాల విధానాలనే అవలంభించడం తమ ఉద్దేశం కాదని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. అలా కాకుండా కార్యక్రమ ఆధారిత విధాన ప్రత్యామ్నాయానికి తాము కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. సోషలిజంను అంగీకరించాలనే షరతు విధించకపోయినప్పటికీ వారు భూ సంస్కరణలు, ధరల అదుపు, తాగు నీరు, విద్య, వైద్యం ప్రైవేటీకరణ నిలుపుదల, గనులు, నీరు, భూములు, అడవుల లూటీ నిరోధం, శక్తివంతమైన లోక్‌పాల్‌ చట్టం, తదితర అంశాలతో పాటు, విదేశాంగ, ఆర్థిక విధానాలపై స్పష్టతతో కూడిన ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తారు. ఈ ప్రత్యామ్నాయ ప్రయత్నాలలో ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ క్రమంలో జయలలిత, మమతా బెనర్జీ, మాయావతి, మూలాయం సింగ్ యాదవ్, నవీన్ పట్నాయక్, నితీష్ కుమార్, మన రాష్ట్రం నుంచి వైఎస్ జగన్మోహన రెడ్డి, చంద్రబాబు ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. 

ఇదిలా ఉంటే, మన దేశంలో మూడవ ఫ్రంట్ కు అవకాశమేలేదని చెప్పేవారు కూడా చాలా మంది ఉన్నారు. గతకాల అనుభవాలే వారితో ఆ మాటలు అనిపిస్తున్నాయి. కేంద్రంలో కాంగ్రెసేతర, బిజెపియేతర ఫ్రంట్‌ ఏర్పడితే అది ఎంతో కాలం నిలవదని గతంలో ఏర్పడిన యునైటెడ్ ఫ్రంట్ నిరూపించింది. యునైట్‌ ఫ్రంట్‌ ఆధ్వర్యంలోని ప్రభుత్వం రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాకుండా ఇద్దరు ప్రధాను(హెచ్‌.డి.దేవెగౌడ,ఐ.కె.గుజ్రాల్‌)లను మార్చింది. సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, వామపక్షాలు కలిసి ఏర్పాటు చేసిన 'పీపుల్స్‌ ఫ్రంట్‌' కూడా ఎంతోకాలం నిలవలేదు. ఈ నేపధ్యంలో 'భారత రాజకీయాల్లో మూడవ ఫ్రంట్‌ అత్యంత శాశ్వత ఎండమావి' అని ఏఐసిసి అధికార ప్రతినిధి మనీష్‌ తివారీ వ్యాఖ్యానించారు. మూడవ ఫ్రంట్‌కు అవకాశమే లేదన్న అభిప్రాయాన్ని జెడి-యు నేత శివానంద తివారీ వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల తరువాత ఏర్పడబోయే ప్రభుత్వాన్ని నిర్ణయించేది బిజెపి నేతృత్వంలోని కూటమి గాని, కాంగ్రెస్‌ పార్టీగాని అవుతుందని ఆయన అన్నారు. 

పార్టీల మధ్య విధానపరమైన సారూప్యత, ప్రజా సంక్షేమం పట్ల అంకితభావం, కలసి పనిచేయాలన్న బలమైన వాంఛలేకపోతే గత ఎన్నికల సమయంలో మన రాష్ట్రంలో ఏర్పడిన మహాకూటమిలా ఉంటుంది పరిస్థితి. ఆ మహాకూటమికి కాంగ్రెస్ ను ఓడించడమే ఏకైక లక్ష్యం. అంతకు మించిన భావసారూప్యత వాటిమధ్య ఏదీలేదు. అందుకే ఎన్నికలు ముగిసేవరకు కూడా ఆ మహాకూటమి నిలబడలేదు. రాజకీయ పార్టీల నిలకడ లేని వైఖరికి అది నిదర్శనం. ఆ మహాకూటమిని భవిష్యత్ లో అందరూ ఒక గుణపాఠంగా తీసుకోవలసిన అవసరం ఉంది.

Friday, December 28, 2012

అఖిల పక్షంలో ఎవరేమన్నారు ?

న్యూఢిల్లీ : తెలంగాణపై నిర్వహించిన అఖిలపక్షం పనికిమాలిన మీటింగ్ అని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిలపక్షం ముగిసిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. అఖిలపక్షంతో ఒరిగేందేమి లేదన్నారు. ప్రధాన పార్టీలు తెలంగాణపై స్పష్టత ఇవ్వలేదని పేర్కొన్నారు. ప్రధాన పార్టీలైనా కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్‌సీపీ మళ్లీ పాతపాటే పాడాయని ధ్వజమెత్తారు. అప్పుడు చిదంబరం నాలుగు వారాలు అన్నడు, ఇప్పుడు షిండే నెల రోజులు అంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ప్రధానితో మాట్లాడి నిర్ణయం చెప్పొచ్చని అన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం లేదన్నారు. కేంద్రం తెలంగాణపై నాటకాలాడుతున్నదని మండిపడ్డారు. ఇంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న కేంద్రానికి చీమకుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఆ పార్టీకి రాజీనామా చేస్తారని భావిస్తున్నానని చెప్పారు. తెలంగాణ జేఏసీతో చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని పేర్కొన్నారు. 


తెలంగాణపై నెల రోజుల్లో నిర్ణయం : షిండే
న్యూఢిల్లీ : తెలంగాణపై నెల రోజుల్లో నిర్ణయం వస్తుందని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటించారు. తెలంగాణపై అఖిలపక్ష సమావేశం ముగిసిన అనంతరం షిండే మీడియాతో మాట్లాడారు. అఖిలపక్షంలో ఎనిమిది రాజకీయ పార్టీలు పాల్గొన్నాయని తెలిపారు. ప్రతి పార్టీ నుంచి ఇద్దరు చొప్పున పాల్గొన్నారని చెప్పారు. అన్ని పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించాయని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని కోరాయని తెలిపారు. అందరి అభిప్రాయాలను క్షుణ్ణంగా విన్నానని, పార్టీల అభిప్రాయాలను కేంద్రానికి నివేదించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామన్నారు. సమస్య పరిష్కారానికి నిర్ణయం తీసుకుంటామని, యువత సంమయనం పాటించాలని కోరారు. ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు కొందరు ఆమోదిస్తారు, మరికొందరు వ్యతిరేకిస్తారన్నారు. తెలంగాణపై ఇదే చివరి సమావేశమని చెప్పారు. 


2008 లేఖకు కట్టుబడి ఉన్నాం : టీడీపీ 
న్యూఢిల్లీ : అఖిలపక్ష సమావేశంలో టీడీపీ ప్రతినిధులు మళ్లీ పాత పాటే పాడారు. 2008లో ప్రణబ్‌కు ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేకు టీడీపీ ప్రతినిధులు చెప్పారు. ఆ లేఖపై తాము వెనక్కు తగ్గలేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించలేదన్నారు. తెలంగాణ సమస్యను కేంద్రం సత్వరమే పరిష్కారించాలని డిమాండ్ చేశారు. 


విభజన అనివార్యమని చెప్పాం:నారాయణ 
న్యూఢిల్లీ : అఖిలపక్ష సమావేశంలో రాష్ట్ర విభజన అనివార్యమని చెప్పామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. తెలంగాణపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేను కోరామని తెలిపారు. సమావేశంలో ముఖ్యమంత్రి ఏం మాట్లాడలేదని చెప్పారు. సమావేశం సంతృప్తికరంగా సాగిందన్నారు. తెలంగాణపై ఇదే చివరి సమావేశమని షిండే హామీ ఇచ్చారని నారాయణ పేర్కొన్నారు. 

సమైక్యంగా ఉండాలని చెప్పాం : రాఘవులు
న్యూఢిల్లీ : రాష్ట్రం సమైక్యంగా ఉండాలని అఖిలపక్షంలో చెప్పామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు చెప్పారు. తెలంగాణ విషయంలో ఇదే చివరి సమావేశం కావాలని షిండేను కోరామని తెలిపారు. సమస్యను నాన్చకుండా నెల రోజుల్లోపు శాశ్వత పరిష్కారం చూపాలని షిండేకు విజ్ఞప్తి చేశామన్నారు. షిండే కూడా నెల రోజుల్లో ఒక స్పష్టమైన ప్రకటన చేస్తామని చెప్పారని పేర్కొన్నారు. 

తెలంగాణ ఏర్పాటు చేస్తారనిపిస్తోంది:సురేశ్‌రెడ్డి 
న్యూఢిల్లీ : కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తారని అనిపిప్తోందని కాంగ్రెస్ నేత కేఆర్ సురేశ్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్ని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు. నెల రోజుల్లో నిర్ణయం తెలుపుతామని షిండే అనడం మంచిదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ అనుకూలంగా ఉందని షిండే చెప్పారని తెలిపారు. అనంతరం మిగతా పార్టీలు తమ అభిప్రాయాలను చెప్పాయని చెప్పారు. అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ ఇస్తే అభ్యంతరం లేదు : వైసీపీ 
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వైఎస్సార్ సీపీ ప్రతినిధులు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తామని వారు పేర్కొన్నారు. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని, తెలంగాణ సమస్యను పరిష్కారించాల్సిందే కేంద్రమే అని చెప్పారు. తెలంగాణ విషయంలో ప్లీనరీలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని తేల్చిచెప్పారు. 

పార్లమెంట్‌లో బిల్లు పెట్టండి : బీజేపీ 
న్యూఢిల్లీ : తెలంగాణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేను కోరామని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తెలిపారు. అఖిలపక్షం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక సమావేశాలు మానుకోని ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో బిల్లు పెడితే తాము మద్దతిస్తామని స్పష్టం చేశారు. బిల్లు పెడితే ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. 

రాయల తెలంగాణకు ఓకే : ఓవైసీ 
న్యూఢిల్లీ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఎంఐఎం పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. అఖిలపక్షం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాయల తెలంగాణను ఏర్పాటుకు తాము ఓకే అని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా గానీ, కేంద్ర పాలిత ప్రాంతంగా గానీ చేయడాన్ని అంగీకరించమని స్పష్టం చేశారు. 

రేపు తెలంగాణ బంద్ : కేసీఆర్ 
న్యూఢిల్లీ : అఖిలపక్ష సమావేశంలో ప్రధాన పార్టీలు తమ నిర్ణయాన్ని చెప్పకపోవడాన్ని నిరసిస్తూ రేపు తెలంగాణ బంద్‌కు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్ సీపీలు స్పష్టత ఇవ్వలేదని కేసీఆర్ తెలిపారు. ఈ మూడు పార్టీల తీరుపై కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీల వైఖరికి నిరసనగా బంద్‌ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, తెలంగాణవాదులకు ఆయన పిలుపునిచ్చారు. బంద్‌కు అన్ని సంఘాలు మద్దతిచ్చాయి.

Thursday, December 27, 2012

సంపాదన వన్.. టూ.. త్రీ!

‘ఒకరు లేక ఇద్దరు చాలు’ ఈ ప్రకటన చాలామందికి సుపరిచితం. రెండు మూడు దశాబ్దాల క్రితం -పిలకలేసుకున్న పిల్లల బొమ్మలతో వీధి గోడలమీదో, థియేటర్లలో స్లైడ్ షో మాదిరిగానో కనిపించేవి. కుటుంబ నియంత్రణ శాఖ హోరెత్తించే ఈ ప్రకటనలు రేడియో ప్రసారాల్లో, పత్రికా ప్రకటనల్లోనూ కనిపించేవి. ప్రకటనల మహత్యమో, బతుకుదెరువు ప్రాబ్లమో తెలీదు కానీ, ‘ఒంటికాయ సొంఠికొమ్ము’ స్టయిల్‌కు నానో కుటుంబాలు ఎప్పుడో అలవాటుపడ్డాయి. అందుకే -కుటుంబ నియంత్రణ శాఖ ప్రకటనలూ కనిపించకుండా పోయాయి. ‘సంతానం ఒక్కరే అయితే ఫరవాలేదు. సంపాదన మాత్రం రెండు మూడుండాలి’ అంటూ గ్లోబల్ మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ చేస్తున్న సూచనలనే సరికొత్త పాఠంగా ఆచరించాల్సిన పరిస్థితి వచ్చింది. అవును -నిజం. లైఫ్‌లో ఒకింత ఫైనాన్స్ రిలాక్స్ ఉండాలంటే -ఒక సంపాదన సరిపోదు. రెండు సంపాదనలైతే మంచిది. మూడునాలుగైతే మరీ బెటర్. -‘మేం చేసేది బల్లకిందా పైనా చేతులు పెట్టి రెండుచేతులా సంపాదించే ఉద్యోగం కాదుగా? బహుళజాతి సంస్థలో ఐటి ఉద్యోగం’ అన్న అనుమానాలు చాలామందికి కలగొచ్చు. అలాంటి డౌట్లు ఎవరికి మందొస్తే, వాళ్లే ముందుగా కొన్ని సూత్రాలు పాటించాలి మరి. లేదంటే.. లైఫంతే! *** మూడు పదుల సీనియారిటీతో రిటైరయ్యే నాన్నకు వచ్చే బెనిఫిట్స్ మొత్తం కంటే -పాతికేళ్ల వయసున్న కొడుకు మొదటి నెలలో సంపాదిస్తున్న జీతం ఎక్కువగా ఉంటున్న రోజులివి. సంపాదన బాగానే ఉంటుంది. మరి -ఆ సంపాదన ఎప్పుడూ అలాగే ఉండిపోతుందా? అంటే గెడ్డం కింద చేయి, మూతిమీద వేలు వేసుకుని ఆలోచించాల్సిన పరిస్థితి. ఒకవేళ ఆ జీతం తలకిందులైతే అన్న డౌటు మొదలైందనుకోండి, అప్పుడు స్టార్టవుతుంది అసలు టెన్షన్. -రష్యాలో వానపడితే మన కమ్యూనిస్టులకు జలుబు చేస్తుందంటూ గతంలో జోకులు వినిపించేవి. కానీ ఇప్పుడు -ఇరాక్‌పై అమెరికా దాడి చేస్తే దాని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. ఆ దెబ్బకు -హైటెక్ సిటీలో పని చేసుకునే అమలాపురం కుర్రాడు కొన్ని ఖర్చులను సర్దుకోవాల్సి వస్తుంది. ఏమంటే -‘కంపెనీ కాస్ట్ కటింగ్’ అంటాడు. తీవ్రత ఎక్కువై ఉద్యోగం ఊడితే -తట్టాబుట్టా సర్దుకుని ఇంటికెళ్లిపోవాల్సి రావచ్చు. ఈరోజుల్లో -ఈరోజు జీతం ఎంతైనా కావచ్చు. రేపటి జీతం, జీవితం రెండూ మన చేతుల్లో ఉండవు. అందుకే వారన్ బఫెట్ (ఆయనెవరూ అని అడిగితే మాత్రం మీరు చాలా సూత్రాలు చదువుకోవాల్సి ఉంటుంది) చెప్పిన మొదటి సూత్రం -ఒకే ఆదాయంపై ఆధారపడకు. ఉద్యోగంలో చేరిన కొత్తలోనే జీతంనుంచి సాధ్యమైనంత వరకు పొదుపు పెట్టుబడులు పెట్టాలిట. క్రమంగా జీతంపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలట. నిజమే -ఉద్యోగం చేయడం వేరు. జీతంపై ఆధారపడటం వేరు. అందుకే -‘మన పెట్టుబడులు మన జీతాన్ని మించి ఆదాయాన్ని కల్పించే విధంగా వ్యూహం ఉండాలి’ అంటాడాయన. మనం చేసే పనికి లభించేది -జీతం. పెట్టుబడులపై లభించేది -అదనపు ఆదాయం. అంటే -రెండో సంతానం. ఒకవేళ కొంతకాలానికి ఉద్యోగంలో తేడావచ్చి జీతం తగ్గినా, రాకున్నా -బెదిరిపోవాల్సిన పనిలేకుండా అదనపు ఆదాయం మీద ఆధారపడొచ్చు అంటాడాయన. అచ్చంగా -ఇలాగే ఉండాలని లేదు. ఆయన చెప్పేదేమంటే -‘అవకాశాలను బట్టి ఒకటికిమించి ఆదాయాలను మనమే కల్పించుకోవాలి’ అని. ** ఇక -సంపాదించడమే కాదు, ఖర్చు పెట్టడమూ కళే! ‘అనవసర వస్తువులు కొనడం హాబీ చేసుకుంటే -అవసరమైన వస్తువులు అమ్ముకోవడం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది’ అన్నది బఫెట్ చేసే పెద్ద హెచ్చరిక. మార్కెట్‌లో ఏది కొత్తగా అనిపిస్తే అది కొనడం కొందరికి అలవాటుతో కూడిన హాబీ. ఆరంభంలోనే ఐదంకెల జీతాలు తీసుకుంటున్న కుర్రాకారు చాలామందిలో ఈ వ్యవసం కనిపిస్తోందన్న సర్వేలూ వెలువడుతున్నాయి. వస్తువు తప్పనిసరైతే కొనడంలో అర్థముంది. కానీ వ్యసనంగా కొనడం మొదలెడితే ఆర్థిక క్రమశిక్షణ లేక దెబ్బతింటారు. ఆఫీసులో పక్కవారి వద్ద కొత్త మొబైల్ చూసి, మనం ‘స్మార్ట్’్ఫన్ కొనడానికి పరుగులు తీయడం అవసరమా? ‘స్క్రీన్’ వ్యాపారంలో కోట్లు సంపాదిస్తున్న హీరో రజనీకాంత్ వద్ద బేసిక్ మొబైల్ మాత్రమే ఉండటాన్ని ఓ సినీ జర్నలిస్టు గుర్తించాడట. అంతే, ఆశ్చర్యంగా ముఖం పెట్టి ‘అదేంటీ? మీరు ఇలాంటి ఫోన్ వాడుతున్నారు?’ అని ప్రశ్నించాడట. దానికి రజనీ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? -‘నేను మాట్లాడేందుకు, ఎదుటివారు మాట్లాడింది వినడానికి సెల్‌ఫోన్ వాడతాను. ఆ పనులకు ఇది బాగానే పని చేస్తుంది’ అని. గొప్పల కోసం వృధా ఖర్చులు అనవసరం అన్నది -జగమెరగాల్సిన సత్యం. *** పిల్లల చదువు కోసమో, వృద్ధాప్యంలో కష్టనివారణకో ఉద్యోగంలో చేరినప్పటి నుంచే పొదుపు చేయవచ్చు. వివిధ పథకాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఇలా చేయడం వల్ల తరువాత కాలంలో మీరు మోసే భారాన్ని ఇప్పటి నుంచే సులభతరం చేసుకోవచ్చు. మీ జీతంలో కనీసం పదిశాతం పొదుపు క్రమానుగతి పెట్టుబడిపై పెట్టండి. కనీసం ఐదేళ్ళు అలా చేయాలి. ఐదేళ్ల కాలంలో మీకొక అవగాహన వస్తుంది. రిటర్స్న్ ఏమేరకు వస్తున్నాయో, రిస్క్ ఎంతవరకు తీసుకోవచ్చో తెలుస్తుంది. పెట్టుబడులు ఎలా ఉండాలి? అనే దానికి వారెన్ బఫెట్ ఓ చక్కని మాట చెప్పారు. పెద్ద పళ్లెంలో మొత్తం అన్నం మాత్రమే ఉంటే ఎలా ఉంటుంది. పళ్లెంలో అన్నీ ఉంటేనే చూడడానికి బాగుంటుంది. తినడానికి అంతకన్నా బాగుంటుంది. అంతే తప్ప ఒక్క అన్నం మాత్రమే ఉంటే ఏం లాభం. అలానే మీ పెట్టుబడుల్లో సైతం అన్ని రుచులు ఉండాలి. స్టాక్స్, బాండ్స్, నేషనల్ సేవింగ్స్ సర్ట్ఫికెట్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటివన్నీ ఉండాలి. చివరగా బఫెట్ చెప్పిన మరో ముఖ్యమైన సూత్రం -ఎవరిపైనా ఎక్కువ నమ్మకం పెట్టుకోవద్దని. ఆర్థిక వ్యవహారాల్లో ఇతరులపై ఎక్కువ నమ్మకాలు పెట్టుకుంటే మరీమరీ దెబ్బతింటామని. నమ్మకాలు వద్దు, ఎదుటి వ్యక్తులపై అనుమానాలూ వద్దు. డబ్బును డబ్బుగానే చూడాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బందులూ ఉండవ్. ఇంకెందుకు ఆలస్యం? మరో మూడువారాల్లో ఎలాగూ జీతం అందుకోబోతున్నారు కదా! ముహూర్తాలు చూడకుండా, పొదుపు పెట్టుబడులు ప్రారంభించండి. ఆర్థిక సూత్రాలు విప్పిచెప్పిన బఫెట్ అంతటి వాళ్లం కాకపోయినా, బాగుపడతామని ఆశించడంలో ఎలాంటి సందేహాలూ అక్కర్లేదు. 
-మురళి ( From Andhrabhoomi.net )

Sunday, December 23, 2012

క్రిస్మస్‌ చెట్టు కథ!

'కిస్మ్రస్‌ చెట్టుగా పచ్చని 'కొనిఫెరన్‌'ను ఉపయోగించటం ఆనవాయితీగా వస్తోంది. 16వ శతాబ్ధంలో జర్మనీలోనూ, 15వ శతాబ్ధంలో లివోనియా (ప్రస్తుతం ఈస్తోనియా, లాత్వియా)లో మొదట క్రిస్మస్‌ చెట్టును అలంకరించడం అనే సంప్రదాయం మొదలైందంటారు.
క్రిస్మస్‌ రోజుల్లో ఈ చెట్టుని ఇంటికి తెచ్చి కొవ్వొత్తులు లేదా విద్యుద్దీపాలతో, రకరకాల వస్తువులతో అందంగా అలంకరిస్తారు. క్రిస్మస్‌ చెట్టు పైభాగంలో నక్షత్రా (స్టార్‌) న్ని ఏర్పాటు చేస్తారు.
చారిత్రకంగా క్రిస్మస్‌ చెట్టుని పరిశీలిస్తే ఈ సంప్రదాయం 1781లో బెన్షివిక్‌ సైనికుల ద్వారా కెనడాలోకి ప్రవేశించిందంటారు. 'జనరల్‌ ఫెడరిక్‌ అడాల్ఫ్‌ రెడిజిల్‌' అనే సైనికాధికారి ఇచ్చిన క్రిస్మస్‌ విందులో అతిథులను అబ్బురపరచటం కోసం 'ఫర్‌' చెట్టుని కొవ్వొత్తులతో, పండ్లతో అలంకరించాడట! 19వ శతాబ్ద ప్రారంభంలో ఈ సంప్రదాయం ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత రష్యాలాంటి దేశాల్లోనూ సంపన్న కుటుంబాలవారు క్రిస్మస్‌ చెట్టుని ఉపయోగించటం మొదలుపెట్టారు. 1816లో 'నస్సావో-విల్‌బర్గ్‌' యువరాణి 'హెన్‌రేటా' క్రిస్మస్‌ చెట్టుని వియన్నా దేశానికి పరిచయం చేసింది. ఆతర్వాత కాలంలో ఈ సంప్రదాయం ఆస్ట్రియాకి విస్తరించింది. ఫ్రాన్స్‌ దేశంలోకి 1840లో డచ్‌ వారి ద్వారా ఈ చెట్టు వచ్చింది. బ్రిటన్‌ దేశంలోకి 19వ శతాబ్ద ప్రారంభంలో క్రిస్మస్‌ సంప్రదాయంలో భాగమైంది.
రాణి విక్టోరియా.. తనకు చిన్నప్పటి నుంచి ఈ చెట్టుతో అనుబంధం ఉన్నట్లు ఒక పత్రికలో పేర్కొన్నారు. ఆ తర్వాత కాలంలో ప్రపంచవ్యాప్తంగా కిస్మస్‌చెట్టు ప్రసిద్ధిచెందింది.
ఈ క్రిస్మస్‌ చెట్టు చరిత్ర ఇలా వుంటే మరో కథ ఒకటి చెప్తారు. ఆ కథేంటంటే..
''చాలా ఏళ్ళ క్రితం క్రీస్తు పుట్టినరోజున చర్చికి వెళ్లి, రకరకాల బహుమతులు ఇచ్చే సంప్రదాయం ఉండేది. అలా ఒక ఊరిలో ఉండే ప్లాబో అనే పేద పిల్లవాడికి ఏమివ్వాలో తెలియలేదు. ఏది కొనాలన్నా చేతిలో పైసా లేదు. ఏం చేయాలో తోచని ప్లాబో తన ఇంటిముందు ఓ అందమైన మొక్క కనిపించింది. దానిని తీసి, ఓ చిన్న కుండీలో పెట్టుకుని చర్చికి తీసికెళ్లాడు. అక్కడ ఎన్నో విలువైన కానుకలతో వచ్చిన వారంతా ప్లాబో చేతిలోని కుండీని చూసి ఎగతాళి చేశారు. ప్లాబో సిగ్గుపడుతూనే దానిని క్రీస్తు ప్రతిమ దగ్గర పెట్టాడు. ఆశ్చర్యంగా.. ఆ చిన్న మొక్క అప్పటికప్పుడు పెద్ద మొక్కగా ఎదిగి, బంగారు వృక్షంగా మారిపోయిందట! ప్రేమతో ఆ పేద బాలుడు తెచ్చిన కానుకే విశిష్టమైనది అయ్యింది. అందరూ ఆ బాలుడిని ఎగతాళి చేసినందుకు సిగ్గుపడ్డారు. మంచి మనస్సుతో ఇవ్వడం ముఖ్యమని అందరూ తెలుసుకున్నారు. ఇక అప్పటి నుంచి ప్రతిఏటా అందరూ క్రిస్మస్‌ చెట్టుని అలకరించడం మొదలుపెట్టారంట!''

Friday, December 21, 2012

జనవరి 18 లోగా కాంగ్రెస్‌ ప్ర్రక్షాళన !

న్యూఢిల్లి: కాంగ్రెస్‌ పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి, పునర్‌ వ్యవస్థీకరించనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వెల్లడించారు. జనవరి 18, 19 తేదీల్లో జైపూర్‌లో నిర్వహించనున్న మేధోమథనం సదస్సు కంటే ముందే కాంగ్రెస్‌ పార్టీ పునర్‌ వ్యవస్థీకరణ ఉంటుందని సోనియా గాంధీ సూచనప్రాయంగా తెలిపారు. పార్టీలో రాహుల్‌గాంధీకి ఎలాంటి పాత్ర పోషించనున్నారు, ఏపదవి అప్పగించను న్నారా అన్న మీడియా ప్రతినిధులు ప్రశ్నకు, రాహుల్‌ అభిప్రా యాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని సోనియా స్పష్టం చేశారు.
హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లిd ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడం పట్ల పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సంతోషం వ్యక్తంచేశారు. గుజరాత్‌లో కూడా మంచి ఫలితాలు సాధించామని ఆమె పేర్కొన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు. త్వరలోనే పార్టీలో చర్చించి నిర్ణయిస్తామని సోనియా స్పష్టం చేశారు. పిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌ సీఎం రేసులో ముందువరుసలో ఉన్నారు.
గుజరాత్‌ ఫలితాలు కేంద్రంలో అధికారంలోని యుపీఏ ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర పరిస్థితులు కల్పించాయి. 2014 ఎన్నికలకు యూపీఏ సన్నద్ధమవుతుండగా, గుజరాత్‌ ఫలితాలు తీవ్ర నిరాశపరిచాయనే అభిప్రాయం కాంగ్రెస్‌ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. 2013లో తొమ్మిది రాష్ట్రాల్లో జరుగనున్న అసెంబ్లిd ఎన్నికలపై కాంగ్రెస్‌ దృష్టి సారించింది. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా, మరికొన్నింటిలో ప్రతిపక్షంలో ఉంది. రాష్ట్రాల అసెంబ్లిd ఎన్నికల్లో కాంగ్రెస్‌ పాగా వేసి, వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధం కావాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. అందులో భాగంగానే కాంగ్రెస్‌ అధిష్టానం చింతన్‌ బైఠక్‌, మినీ మేధోమథనం, మేధో మథనం పేరుతో సదస్సులు నిర్వహిస్తూ కాంగ్రెస్‌ శ్రేణులను సన్నద్ధం చేస్తోంది. ఇటీవల సూరజ్‌ ఖండ్‌లో మినీమేధో మథనం సదస్సు నిర్వహించి, రాహుల్‌ గాంధీ నేతృత్వంలో 2014 ఎన్నికల ప్రచార బాధ్యతల నిర్వహణ కమిటీని ఏర్పాటు చేశారు. ఓ వైపు రాహుల్‌గాంధీని భవిష్య ప్రధానిగా ప్రచారం చేస్తూ, మరోవైపు పార్టీలో రాహుల్‌ క్రియాశీలక బాధ్యతలు (కార్యనిర్వాహక అధ్యక్షుడు) అప్పగించడానికి యత్నాలు సాగుతున్నాయి. 2013 జనవరి 18, 19 తేదీల్లో జైపూర్‌లో నిర్వహించనున్న మేధోమథన సదస్సులో రాహుల్‌కు క్రియాశీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని పార్టీవర్గాల సమాచారం. త్వరలో పార్టీ ప్రక్షాళన చేస్తున్నట్లు అధినేత్రి సోనియాగాంధీ చేసిన ప్రకటన ప్రాధాన్యత ఏర్పడింది.

Saturday, December 15, 2012

త్యాగధనుడు పొట్టి శ్రీరాములు

ఆంధ్రమాత ముద్దు బిడ్డలైన మహా పురుషులలో ఒకరు పొట్టి శ్రీరాములు. ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవియైన మహాపురుషుడు, పొట్టి శ్రీరాములు, ఆంధ్రులకు సదా:స్మరణీయుడు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు. పొట్టి శ్రీరాములు.

పొట్టి శ్రీరాములు వారి తల్లిదండ్రులు గురవయ్య, మహాలక్ష్మమ్మ. వారి పూర్వీకులది ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని పడమటిపాలెం గ్రామం. పేదరికం వలన వారు మద్రాసు సమీపంలో పొన్నేరి ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ఆర్ధికంగా వెసులుబాటు దొరకటంతో మద్రాసులోని జార్జిటౌను, అణ్ణాపిళ్ళె వీధిలోని 165వ నంబరు ఇంటికి చేరారు. అక్కడే 1901 మార్చి 16న పొట్టి శ్రీరాములు జన్మించారు.

ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసు లోనే జరిగింది. తరువాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగు చదివాడు. తరువాత "గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే"లో చేరి దాదాపు నాలుగేళ్ళు అక్కడ ఉద్యోగం చేసాడు. అతని జీతం వెలకు 250 రూపాయలు.

1928లో వారికి కలిగిన బిడ్డ చనిపోవడం జరిగింది. తరువాత కొద్ది రోజులకే అతని భార్య కూడా చనిపోయింది. 25 యేండ్ల వయసు కలిగిన శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేసాడు. ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టి, గాంధీజీ అనుయాయిగా సబర్మతి ఆశ్రమం చేరాడు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు.

పొట్టి శ్రీరాములు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. తర్వాత మళ్ళీ 1941-42 సంవత్సరాల్లో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుశిక్ష అనుభవించాడు.

1943-44ల్లో నెల్లూరు జిల్లాలో చరఖా వ్యాప్తికి కృషిచేసాడు. కులమతాల పట్టింపులు లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేసేవాడు. 1946లో నెల్లూరు మూలపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశంకోసం నిరాహారదీక్ష బూని, సాధించాడు. మరోసారి నిరాహారదీక్ష చేసి, మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింపజేసాడు. దీని ఫలితంగా వారంలో కనీసం ఒకరోజు హరిజనోద్ధరణకు కృషి చెయ్యవలసిందిగా ప్రభుత్వం కలెక్టర్లకు ఉత్తరువులు ఇచ్చింది.

1946 నవంబరు 25న ఈ గాంధీ శిష్యుడు మద్రాసు ప్రొవిన్సులోని అన్ని దేవాలయాలలోనూ హరిజనులకు ప్రవేశం కల్పించాలని ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించాడు. కొద్ది రోజుల్లోనే స్వాంతంత్ర్యం రావచ్చునన్న ఆశాభావంతో కాంగ్రెసు నాయకులు, సభ్యులందరి దృష్టీ ఆ స్వాతంత్ర్యోద్యమంపైనే ఉంది. కనుక శ్రీరాములు దీక్షను మానుకోవాలని వారు సూచించినా అతను వినకపోయేసరికి ఇక వారు గాంధీని ఆశ్రయించారు. ఎలాగో గాంధీ శ్రీరాములుకు నచ్చజెప్పి దీక్ష విరమింపజేశాడు.

మద్రాసు రాజధానిగా వుండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహారదీక్ష ప్రారంభించాడు. చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష, క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. ఆంధ్ర కాంగ్రెసు కమిటీ మాత్రం దీక్షను సమర్ధించలేదు. ప్రజలు మాత్రం శ్రీరాములుకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా విస్పష్ట ప్రకటన చెయ్యలేదు. చివరికి 1952 డిసెంబర్ 15 అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు, తన ఆశయసాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యాడు.

ఆగ్రహావేశులైన ప్రజలు హింసాత్మకచర్యలకు పాల్పడ్డారు. మద్రాసులో జరిగిన ఆయన శవయాత్రలో నినాదాలతో ప్రజలు ఆయన త్యాగనిరతిని కొనియాడారు. తదుపరి జరిగిన పరిణామాలలో మద్రాసు నుండి విశాఖపట్నం వరకు ఆందోళనలు, హింస చెలరేగాయి. పోలీసు కాల్పుల్లో ప్రజలు మరణించారు.

చివరికి డిసెంబర్ 19న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేస్తూ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రకటన చేసాడు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే ఒక్క రోజు కూడా ఆంధ్రులు మద్రాసులో రాజధాని పెట్టుకోటానికి వీల్లేదని మరునాడే వెళ్ళిపోవాలని చక్రవర్తుల రాజగోపాలాచారి తెగేసి చెప్పాడు. అయితే కాకతీయులు పాలించిన వరంగల్లు రాజధానిగా బాగుంటుందని అంబేద్కర్ సూచించారు. రాజమండ్రి కూడా మంచిదేనన్నారు. విజయవాడ కమ్యూనిస్టుల కంచు కోట కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు వొప్పుకోలేదు. నెల్లూరు, చిత్తూరు నాయకులు మాకు మద్రాసు దగ్గరగా వున్న సౌకర్యం వదులుకోవాలా అని అలిగారు. కోస్తా వాళ్ళను మేము నమ్మం,రాజధాని రాయలసీమలోనే పెట్టాలని, లేకపోతే ఆంధ్ర రాష్ట్రమే వద్దని నీలం సంజీవరెడ్డి తదితరులు ఎదురుతిరిగారు. గత్యంతరంలేక కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచారు.

బళ్ళారి, బరంపురం, హోస్పేట, తిరువళ్ళూరు లాంటి తెలుగు ప్రాంతాలు కూడా వదులుకొని ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచారు. నేటికీ మద్రాసు జనాభాలో 40% మంది తెలుగు వారున్నారు. "మద్రాసు లేని ఆంధ్ర తలలేని మొండెం" అన్నారు శ్రీరాములు. ఆయన ఆశయం నెరవేరలేదు.
(నేడు పొట్టి శ్రీరాములు వర్ధంతి )
Original Post at : http://mana-samskruthi.blogspot.in/2011/03/blog-post_16.html

Friday, December 14, 2012

యోగాసనాలు ఎందుకు వేయాలి : యోగసాధన వల్ల ఉపయోగాలు


పుట్టినప్పుడు నుండి మనం ఎన్నోసార్లు రకరకాల దుస్తుల్ని ధరిస్తు మారుస్తూ ఉంటున్నాము. ఎన్నోసార్లు ఇల్లు మారుతూ ఉంటాము. అలాగే మనం భుజించే ఆహారం కూడా రకరకాల రుచులతో భుజిస్తున్నాము. కాని మార్పు లేకుండా కడవరకు మనతో ఉండేది మాత్రం మన శరీరం.

మన శరీరాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే, మన కల నెరవేర్చడానికి ఆ శరీరం తోడ్పడుతుంది. మీ మనస్సు మీరు చెప్పిన విధంగా వినకుండా, దాని ఇష్టప్రకారం ఆలోచనలను పెంపొందిస్తుంది.

మీ కలలు నెరవేరాలంటే, మీ మనసు పట్టుదలతో ఉండాలి. మీ మనస్సు, మీ శరీరము మీరు నచ్చినవిధంగా పనిచేయాలని అంటే, మీ మనస్సుని, శరీరాన్ని, మీకు అనుగుణంగా తిప్పుకోవాలి. అలా అనుకూలంగా మనువైపు మరల్చుకొనేదే యోగా.
 వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది . జీవన విధానం శరవేగంతో మారిపోతుంది . ఇడ్లీ సాంబార్ల స్థానం బ్రెడ్ ఆమ్లెట్, పిజ్జా బర్గర్లు ఆక్రమించుకున్నాయి. ఖండాంతర జీవనం అతి మామూలు విషయం అయ్యింది. పెరిగే ఆదాయంతో పాటు పెరుగుతున్న మానసిక ఒత్తిడులు మనల్ని తేలికగా వ్యాధుల బారిన పడేస్తున్నాయి. ఇటువంటి సమయంలో కాస్త సమయం మన సంప్రదాయ ఆరోగ్య పద్ధతులకు కేటాయిస్తే, ఆరోగ్యంతో పాటు, మానసిక ప్రశాంతత కూడా మన సొంతమవుతుంది . అలాంటి పద్ధతుల్లో మనం మొట్ట మొదటగా పేర్కొనవలసింది యోగా.
              యోగాసనాలు ప్రాక్టీస్ చేయాలంటే మీరేమీ పెద్దగా ఖర్చు చేయనక్కరలేదు . దీనికి కావలసినవి మంచి వెంటిలేషన్ వున్న గది, ఒక కార్పెట్ , ఆసనాలు వేయడానికి తేలికపాటి చుడీదార్ లేదా స్పోర్ట్ సూట్ మాత్రమే .

యోగసాధన ఎందుకు

అత్యాధునిక పరికరాలతో ఆకర్షణీయమైన దుస్తుల ధరించి పాశ్చాత్య సంగీతాన్ని వింటూ శరీరపు ఫిట్‌నెస్‌ను చక్కదిద్దే ఫిట్‌నెస్ కార్యక్రమాలు అనేకం ఉండగా యోగసాధన మాత్రమే ఎందుకు చేయాలి అనే సందేహం ఎవరికైనా తలెత్తవచ్చు. సందేహా నివృత్తిలో భాగంగా ఫిట్‌నెస్ కార్యక్రమాలకు, యోగసాధనకు గల వ్యత్యాసాన్ని మీ ముందుంచుతున్నాము.


ఫిట్‌నెస్ కార్యక్రమాలు పరిమిత లక్ష్యానికి మాత్రమే నిర్దేశించబడి ఉండగా, యోగసాధన మానవునికి సంపూర్ణత్వాన్ని ప్రసాదించే పూర్తి స్థాయి ప్రక్రియ. కేవలం శారీరక ఆరోగ్యానికి మాత్రమే ఫిట్‌నెస్ కార్యక్రమాలు పరిమితం కాగా, యోగాతో మనిషి శారీరక, మానసిక మరియు భావోద్వేగపూరిత ఆరోగ్యాన్ని పొందుతాడు. దినసరి ప్రామాణికాలకు లోబడి ఫిట్‌నెస్ కార్యక్రమాలు ఉంటాయి. యోగసాధనతో రోజురోజుకు మీరు చవిచూసే మార్పులు మీకు దివ్యానుభూతిని కలిగిస్తాయి. ఫిట్‌నెస్ కార్యక్రమాల్లో సాధకుల మధ్య అనారోగ్యకరమైన పోటీ తత్వం ఉంటుంది. యోగసాధనలో అంతర్గత శక్తులను చైతన్యపరిచి మానసిక ఆనందాన్ని పొందే మార్గంలో సాధకునికి ఎవరూ పోటీ కాదు.

ఫిట్‌నెస్ కార్యక్రమాలు కేవలం దేహానికి ఇబ్బంది కలిగించే దేహదారుఢ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సాగుతాయి. యోగసాధనతో శారీరక విశ్రాంతి లభిస్తుంది. రోజువారీ లక్ష్యాలను మీరు చేరుకోనట్లయితే ఫిట్‌నెస్ కార్యక్రమంలో మీరు పరాజితుల కింద లెక్క. సాధన చేసే కొద్ది అనిర్వచనీయ ఫలితాలను యోగా అందిస్తుంది.
ఫిట్‌నెస్ కార్యక్రమాలు కండరాలను పెంచి భారీ రూపాన్ని కల్పిస్తే, యోగసాధన అమూల్యమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఫిట్‌నెస్ కార్యక్రమాల ముగింపులో మీరు అలసటను సాధిస్తారు. అదే యోగసాధన చివరి ఘట్టంలో మానసిక ఉల్లాసాన్ని, నిర్మలత్వాన్ని సంతరించుకుంటారు.
యోగాభ్యాసమన్నది మన పూర్వీకులు మనకందించిన అమూల్యమైన ఆరోగ్య విజ్ఞానం అని చెప్పుకోవచ్చు. దీనిని ప్రాక్టీస్ చేయడానికి వయసు పరిమితి లేదు. మూడేళ్ళ పసికందు నుండి, తొంభై ఏళ్ళ పై బడిన వయసు వారి వరకు అందరూ యోగాసనాలు వేయవచ్చు . ఏవైనా తీవ్ర ఆరోగ్య సమస్యలున్నవారు, ఆపరేషన్లు జరిగినవారు మాత్రం వారి డాక్టర్ ను సంప్రదించి మొదలుపెట్టడం మంచిది .
               యోగాను ఒక సైన్స్ గా అభివర్ణించవచ్చు . పతంజలి అనే ఋషిని యోగశాస్త్ర పితామహుడిగా చెప్తారు.  క్రీస్తు పూర్వం నాడే  వర్ధిల్లిన ఈ విజ్ఞానం, క్రీస్తు శకం లోని వారికి కూడా ఆరోగ్యం అందించగలుగుతుంది. ఏరోబిక్స్ వంటి ఆధునిక వ్యాయామ పద్ధతులు శరీరానికి కొంత మేలు చేయగలుగుతున్నా, ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను చేకూర్చడంలో యోగాకి సాటి ఏదీ లేదని చెప్పుకోవచ్చు.
 Sources: http://www.zetacorner.com and http://telugu.webdunia.com...

Wednesday, December 12, 2012

స్టార్ స్టార్ సూపర్ స్టార్... రజనీకాంత్

సౌతిండియా నెం.1 హీరో, దక్షిణభారత దేశంలో పరిచయం అక్కర్లేని పేరు.. అతనే శివాజీరావ్‌ గైక్వాడ్‌ అలియాస్ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. ఈరోజు ఆయన పుట్టినరోజు. 62 సంవత్సరాలు పూర్తి చేసుకుని 63 వ ఏట అడుగుపెడుతున్న ఆయన జీవితంలో ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇలాంటి తేదీ (12-12-12) వచ్చేది ఈ ఒక్కరోజే కాబట్టి. ఈ ప్రత్యేక తేదీని పురస్కరించుకుని ఆయన అభిమానులు ఈ వేడుకలను స్పెషల్ గా నిర్వహిస్తున్నారు.

ఆయన జీవితం చూస్తే సినిమా కష్టాలు అంటాం కాని అంతకంటే ఎక్కువగానే ఓ విజయవంతమైన సినిమాకు సరిపడే చరిత్ర రజనీకి ఉంది. అయిదేళ్ల వయసులోనే ఆయన తల్లిని పొగొట్టుకున్నారు. తిండికి నానా పాట్లు పడుతూ ప్రభుత్వ పాఠశాలలో కన్నడ మీడియంలో చదువుకున్నారు. తరువాత జీవన సమరంలో అనేక కష్టాలు పడ్డారు. మూటలుమోసే కూలిగా పనిచేశారు. ఆ తరువాత బస్‌ కండక్టర్‌గా పనిచేశారు.రజనీకాంత్‌ మొదట పాపులర్‌ కన్నడ నాటకాల రచయిత, దర్శకులు టోపి మునియప్ప వద్ద నటనలో శిక్షణపొందారు. ఆయన నాటకాల్లో పలు పాత్రల్లో నటించారు. 1973లో ఆయనతో కలిసి నాటకాలు చేసిన రాజ్‌ బహదూర్‌ అనే స్నేహితుడు రజనీకాంత్‌ను మద్రాస్‌ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరి నటనలో శిక్షణపొందాలని సూచించారు. దీంతో ఈ ఇనిస్టిట్యూట్‌లో చేరిన రజనీకాంత్‌కు రెండు సంవత్సరాల పాటు అవసరమైన ఆర్థిక సహాయం కూడా రాజ్‌బహదూర్‌ చేశాడు. ఒకసారి రజనీకాంత్‌ నాటక ప్రదర్శనను ప్రముఖ దర్శకులు కె.బాలచందర్‌ చూశారు. అనంతరం రజనీ నటనకు మెచ్చుకొని తమిళం నేర్చుకోవాలని సూచించారు. తమిళం నేర్చుకున్న అనంతరమే ఆయనకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.
సినిమాల్లోకి...
1975లో విడుదలైన అపూర్వ రాగాంగల్‌ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు రజనీకాంత్‌. ఈ సినిమా ఆయనకు నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డును తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు కె.బాలచందర్‌ దర్శకత్వం వహించారు. క్రమక్రమంగా ఆయన తమిళ సినీ రగంలో సూపర్‌స్టార్‌గా ఎదిగారు. ఆతర్వాత ఇతర భాషా చిత్రాల్లో కూడా నటించారు. బాలీవుడ్‌లో సైతం హిట్‌ సినిమాలతో తనదైన ముద్ర వేశారు. 2007లో విడుదలైన శివాజీ చిత్రంలో నటించినందుకు గాను ఆయనకు 26 కోట్ల రూపాయల పారితోషికం చెల్లించడం విశేషం. దీంతో ఆసియాలో హీరో జాకీ ఛాన్‌ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకున్న రెండవ హీరో అయ్యారు. సినిమాల్లో హీరోగానే కాకుండా నిర్మాతగా, స్క్రీన్‌రైటర్‌గా కూడా చేశారు. ఇక ఇటీవల విడుదలైన రోబో చిత్రం రజనీకి ఎంతో పాపులారిటీ తీసుకువచ్చింది. చంద్రముఖి, భాషా, శివాజీ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలు రజనీకాంత్‌కు స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టాయి.
అవార్డులు...
పాపులర్‌ హీరో రజనీకాంత్‌కు 2000 సంవత్సరంలో పద్మ భూషణ్‌ అవార్డు దక్కింది. 1984లో రజనీకాంత్‌కు నల్లవనుకు నల్లవన్‌ అనే తమిళచిత్రానికి గాను ఫిల్మ్‌ఫేర్‌ బెస్ట్‌ తమిళ్‌ యాక్టర్‌ అవార్డు వచ్చింది. మూంద్రు ముగమ్‌, ముత్తు, పదయప్ప, చంద్రముఖి, శివాజీ చిత్రాల్లో నటనకు గాను ఆయనకు తమిళనాడు స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డులు వచ్చాయి. 1984లో కలైమమాని అవార్డు, 1989లో ఎంజిఆర్‌ అవార్డులు దక్కాయి. 1995లో సౌతిండియన్‌ ఫిల్మ్‌ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఆయనకు కలైచెలవమ్‌ అవారును అందజేసి ఘనంగా సత్కరించింది. ఇవేగాకుండా పలు అవార్డులెన్నో ఆయన్ని వరించాయి.
కుటుంబ నేపథ్యం...
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 1950 సంవత్సరం డిసెంబర్‌ 12వ తేదీన బెంగళూర్‌లో జన్మించారు. ఆయన మహరాష్ట్ర కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు రాంభాయ్‌, రామోజీరావు గైక్వాడ్‌లు. వారి సంతానంలో చిన్నవాడు రజనీకాంత్‌. ఇద్దరు అన్నలు, ఒక అక్క ఆయనకు ఉన్నారు. సినిమాల్లోకి రాకముందు ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్‌. ఐదు సంవత్సరాల వయసులో తల్లి మృతిచెందడంతో రజనీకి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ సమ యంలో వారి కుటుంబం ఆర్థిక సమస్యలతో సతమతమైంది. చివరికి చిన్నతనంలోనే రజనీకాంత్‌ చిన్న,చిన్న ఉద్యోగాలె న్నింటోనో చేశారు. కూలీగా సైతం పనిచేశారు. ఆయన బెంగళూర్‌లోని ఆచార్య పాఠశాలలో చదువుకున్నారు. రామ కృష్ణ మిషన్‌ విద్యా సంస్థలలో ఉన్నతవిద్యను అభ్యసించారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత 1966 నుంచి 1973 వరకు బెంగళూర్‌, చెనై్న నగరాల్లో పలుచోట్ల పనిచేశారు. కొంతకాలం బెంగళూర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీస్‌లో బస్‌ కండ క్టర్‌గా సైతం పనిచేశారు రజనీకాంత్‌. ఇక రజనీకాంత్‌ సినిమాల్లోకి వచ్చిన అనంతరం 1981లో మన రాష్ర్టంలోని తిరుపతిలో లతా రంగచారి అనే యువతిని 31 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం 1981 సం వత్సరం ఫిబ్రవరి 26న జరిగింది. వారికి ఐశ్వర్య, సౌందర్య అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఐశ్వర్య వివాహం తమిళ హీరో ధనుష్‌తో జరుగగా, సౌందర్య వివాహం పారిశ్రామికవేత్త అశ్విన్‌ రామ్‌కుమార్‌తో జరిగింది.

Monday, December 10, 2012

మోకాలి నొప్పులు తగ్గించుకోవచ్చు


Kneeనిజానికి మోకాలి నొప్పులు సర్వసాధారణం. 50 ఏళ్ళు పెైబడిన వారికి మోకాలి నొప్పులు సహజం. ఈ నొప్పుల కారణంగా రోజువారీ పనులు చేసుకోలేకపోతారు. సగటున ఇంటికొకరు ఈ వ్యాధితో బాధపడుతు న్నారు. దీనికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. మోకాళ్లే కాదు, కీళ్ళ నొప్పులతో బాధపడేవారూ చాలా మంది ఉన్నారు .సాధారణంగా 50 ఏళ్ల వయసుపెైబడిన వారికి మోకాలి నొప్పులు వస్తాయి. అంతమాత్రాన చిన్న వయసు వారికి మాత్రం రావని అనుకోకూడదు. ఇది ఏ వయసు వారికైనా, ఎవరికైనా రావచ్చు. అయితే వ్యాధి లక్షణాలు, తీవ్రత వేర్వేరుగా ఉంటాయి. పెద్ద వయసు వారు సాధారణంగా ‘ఆస్టియో ఆర్థరెైటిస్‌’తో బాధపడుతుంటారు. ఇది తుంటి, మోకాలి ఎముకలపెై ప్రభావం చూపుతుంది.

‘సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో మనిషి జీవనశెైలిలో ఎంతో మార్పు వచ్చింది. కంప్యూటర్‌, టీవీ, మొబెైల్‌ మొదలెైనవి మనిషిలోని సహజంగా ఉండే పని సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయి. స్థూలకాయంతో ‘ఆస్టియో ఆర్థరెైటిస్‌’ రావచ్చు. ఈ రోజుల్లో చిన్న వయసు వాళ్ళు కూడా మోకాలి నొప్పితో బాధపడుతున్నారని వెైద్యులు తెలిపారు.‘రుమటైడ్‌ ఆర్థరెైటిస్‌’ ఎక్కువగా మహిళల్లో కనిపిస్తుంది. ఇది కీళ్లపెై ప్రభావం చూపుతుంది. ఒక్కోసారి ఉదయం పూట బాధ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మోకాళ్లు, కీళ్ళు బిగుసుకు పోయినట్లు ఉంటాయి.

మోకాలి నొప్పులతో బాధపడే వారిలో 60 శాతం మంది మహిళలేనని తాజా పరిశోధనల్లో వెల్లడెైంది. పోషణ, జీవన విధానం దానికి ప్రధాన కారణంగా పేర్కొనవచ్చు. వయసు పెరిగే కొద్దీ వాజురి ఒంట్లో కాల్షియం తగ్గిపోతుంది. ఎముకలలో బలం తగ్గి నీరసం వచ్చేస్తుంది. ఆర్థరెైటిస్‌ని పూర్తిగా నయం చెయ్యలే కపోయినా చాలా వరకు నియంత్రించే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని చూకూర్చే సమతుల ఆహారం, వ్యాయా మం, సకాలంలో చికిత్సతో వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు. బలవర్ధకమైన పౌష్టికాహారంతో మోకాలి నొప్పులు రాకుండా చూసుకోవచ్చు. దీని కోసం విటమిన్లు, ఖనిజ లవణాలు బాగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

ఊబకాయం రాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కీళ్లు, కండరాలపెై ఎక్కువ ఒత్తిడి లేకుండా జాగ్రత్త వహించాలి. మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి. వెైద్యపరంగా నొప్పి నివారణకు అవసరమైన మందులు వాడాలి. అయితే వీటితో ఆశించిన ఫలితం కనిపించకపోతే సర్జరీ మరో ప్రత్యామ్నాయం. దీనికి సంబంధించి ఎన్నో ఆధునిక పద్ధతులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. వీటితో సర్జరీ చేయించుకుంటే కొంత ఉపశమనం కలుగుతుంది. మోకాలి నొప్పులను అశ్రద్ధ చేసినా, తాత్సారం చేసినా తుంటి లేదా మోకాలి మార్పిడి తప్పనిసరి అవుతుంది.
కాబట్టి ఆర్థరెైటిస్‌ సమస్యను ఆదిలోనే గుర్తించి తగిన చికిత్స చేయించుకోవడం శ్రేయస్కరం.

Source : Suryaa

Saturday, December 8, 2012

శివాలయ సందర్శన విధానం

సాధారణ దేవాలయాల్లో మనం దర్శనం చెసుకునే విధానం,శివాలయంలో విధానం వేరు వేరుగా ఉంటుంది. అందుకే,శివాలయం దర్శిస్తే అందరు దేవుళ్ళని దర్సించినట్లే అని చెప్పబడింది. 
శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి. అందులో నాలుగు ముఖాలు, నాలుగు దిక్కులని చూస్తుంటే, ఐదవ ముఖం ఊర్ద్వముఖమై (పైకి చూస్తు/ఆకాశం వైపు చూస్తూ) ఉంటుంది.

5 ముఖాలకి, 5 పేర్లు న
ిర్దేశించబడ్డాయి. అందుకే శివాలయంలో ఏ దిక్కున కూర్చొని అయినా,పూజ చేయోచ్చు అంటారు.
శివాలయాలు అన్నింటిలో అత్యంత మహిమ కలిగినది, కోరిన కోర్కెలు వెంటనే తీర్చేది, పశ్చిమాభి ముఖమైన శివాలయం. అంటే, మీరు,గుడిలోకి వెల్లగానే, శివలింగం పశ్చిమం వైపు చూస్థూ ఉంటుంది.. అలా శివలింగంకి ఎదురుగా ఉన్న ద్వారం పశ్చిమం వైపు ఉన్నా, లేదా, శివలింగం పశ్చిమం వైపు చూస్తున్నా, దానిని, సద్యోజాతజాత శివలింగం అని అంటారు.
అప్పుడు మనం తప్పకుండా,అటువంటి శివలింగాన్ని చూసినప్పుడు, ఓం సద్యోజాత ముఖాయ నమః అని అనాలి.శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం, సద్యోజాత శివలింగం.
శివలింగం, తూర్పు వైపుకు చూస్తూ ఉంటే, అటువంటి శివలింగాన్ని, తత్పురుష ముఖం అని అంటారు. తత్పురుష ముఖం అనేది మనల్ని తిరోదానాన్ని చేస్తూ ఉంటుంది.. తిరోదానము అంటే చీకటిలో ఉంచటం. అది, మనల్ని మాయ చేత కప్పబడిస్తూ చీకటిలో ఉంచుతూ ఉంటుంది..
ఆ మాయ కమ్మి ఉండడం చేతనే మనం అన్ని రకాల పాపాలు చేస్తూ ఉంటాం.. ఆ మాయని కప్పి ఉంచే ముఖమే ఆ సద్యోజాత ముఖం.
సద్యోజాత ముఖం పూజించ తగినదే,ఏ మాత్రం అనుమానం లేదు.. మనల్ని రక్షించినా,శిక్షించినా, అన్ని ఆ పరమేశ్వరుడేగా.

తూర్పుని చూస్తూ ఉండె శివలింగం, వాయువు (గాలి) మీద అదిష్టానం కలిగి ఉంటాడు.. ...

మనకు ప్రతీ శివాలయంలోనూ ఈ 5 ముఖాలు ఉంటాయి.. శైవాగమనంలో చెప్పినట్లుగా, మనం తప్పకుండా, శివాలయంలో, ఏ దిక్కు వైపు వెలితే,ఆ శివలింగం పేరుని స్మరించాలి.

ముఖాలు, మనకు 5 ఫలితాలని కలుగచేస్తాయి. ఆ 5 ముఖాలలో నుండే, స్ర్రుష్టి, స్థితి, లయ,తిరోదానము,అనుగ్రహము(మొక్షము) ఇవ్వబడతాయి.. అన్ని ముఖాలు,పూజనీయమైనవే.. అన్ని ముఖాలని మనం పుజించి తీరాల్సిందే.శివలింగం, దక్షిణం వైపు చూస్తూ ఉంటే, అటువంటి ముఖం, దక్షిణామూర్తి స్వరూపం. మనకు, శివాలయంలో, దక్షిణం ని చూస్తూ తప్పకుండా దక్షిణామూర్తి ఉంది తీరాలి. అసలు, దక్షిణామూర్తి విగ్రహం లేకుండా, శివాలయాలు కట్టకూడదు.
శివలింగం, దక్షిణానికి చూసే ముఖాన్ని, దక్షిణామూర్తి స్వరూపంగా, చూడమని చెప్తారు. ఆ ముఖాన్నే, అఘోర ముఖం అంటారు. ఈ అఘోర ముఖం , అగ్నిహోత్రానికి అంతటికీ, అధిష్టానం అయ్యి ఉంటుందిఈ సమస్త ప్రపంచాన్ని,లయం చేసే స్వరూపమే,ఈ అఘోర ముఖం. ఈ అఘోర ముఖమే, సమస్త ప్రపంచాన్ని లయం చేసి,మళ్ళీ,మనకు జన్మను ఇస్తూ ఉంటారు. మనకు మృత్యువు పట్ల,భయం పొగొట్టేది,మనకి ఙ్ఞానం ఇచ్చేది ఇదే.
మీరు జాగ్రత్తగా గమనిస్తే, చిన్న పిల్లలకు చదువు దగ్గర నుండి,సంపద(ధనము) దగ్గర నుండి, పెద్దలకు మొక్షము వరకు, దక్షిణా మూర్తి ఇవ్వలేని సంపద,విద్య లేనేలేదు. చదువుకు, సంపదకు, మొక్షముకి అదిష్టానం అయి ఉంటాడు.

ప్రతీరోజూ, ఒక్క 2 నిమిషాలు దక్షిణామూర్తిని ద్యానం చేస్తే, మొక్షము కరతళామలకము. వారి,అంత్యమునందు, సాక్షాత్తు, ఈశ్వరుడే, గుర్తుపెట్టుకొని, మొక్షముని ప్రసాదిస్తాడు.

ద్యానం చేయటానికి అత్యంత మంగళకరమైన స్వరూపం, అందమైన స్వరూపం, శాంతమైన స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం.
ఉత్తరం వైపు చూసే ముఖంని, "వామదేవ" ముఖం అని అంటారు.

ఇప్పటిదాక, 4 దిక్కులని చూస్తున్న, 4ముఖాల గురుంచి తెలుసుకోగలిగాం కదా!..

ఇక చివరి ముఖం, శివలింగం పైన (అంటే, ఆకాశం వైపు చూస్తూ ఉండే ముఖం) ఉండే ముఖం, ఆ ముఖంని "ఈశాన ముఖం" అంటారు. మనం, లింగం పైన చూసి, ఓం ఈశాన ముఖాయ నమః. అని అనాలి.

ఈశాన ముఖ దర్సనం, మనం మిగిలిన 4 ముఖాలని దర్సించిన తర్వతనే దర్సించాలి.. అప్పుడే విశిష్ట ఫలితం అని చెప్పబడింది. మనకు కాశీలో ఉండే ముఖం, అఘోర ముఖం. కాశీలో శివలింగం ఉత్తరం వైపు కూర్చొని, దక్షిణం వైపు చూస్తూ ఉంటుంది.
ఉత్తరం వైపు చూసే "వామదేవ ముఖం" నీటి మీద అధిష్టానం అయి ఉంటుంది. ఈ వామదేవ ముఖమే మనకు సమస్త మంగళమును ఇచ్చే ముఖం.

వామదేవ ముఖం అంటే ఎమిటి అనేది మనకు శివపురణంలో చెప్పబడింది. యదార్ధమునకు అదే విష్ణు స్వరూపం. అందుకే, విష్ణువు శివుడు ఒకరే.. రెండు లేనే లేవు...

శివపురణంలో రాస్తే ఎలా నమ్మాలి అని ఎవరికి సంసయం ఉంటే, ఒకటి గమనించండి.

శివఫురణం ని రాసినది, వేదవ్యాసుడు.. వ్యాసుడే విష్ణువు. విష్ణువే వ్యాసుడు. వ్యాసాయ విష్ణు రూపాయ,వ్యాస రూపాయ విష్ణవే, నమో వైబ్రహ్మ నిధయే వాశిష్టాయ నమో నమః ఉన్న పరమాత్మ ఒక్కడే.. రెండు కాదు.. చాలా మంది, వేరుగా చూస్తూ,పొరపడుతున్నారు..

క్రిష్ణ అని పిలిచినా నేనే పలుకుతాను. మూర్తి అని పిలిచినా నేనే పలుకుతాను.

ఈ వామదేవ ముఖం ని, ఓం వామదేవాయ నమః అని అంటే, మనకు అనారోగ్యం కలగకుండా,చూస్తాడు...

అంతే కాక, ఈ వామదేవ ముఖంని ఓం వామదేవాయ నమః అని అంటే,మనకు 3 ఫలితాలని కూడ ఇస్తుంది..అవి, 1) మీ దగ్గర ఏదైతో ఉందో, అది మీ చేయి జారి పోకుండ,మీతోనే ఉంచుతాడు. ఉదా: మీ దగ్గర ఒక కోటి రూపాయలు ఉన్నాయి (లేదా) ఒక మంచి ఉద్యోగంలో ఉన్నారు, ఎటువంటి కారణము చేతనూ,మీరు అవి కోల్పోకుండా కాపాడుతూ ఉంటాడు. 2) మనకు ఉత్తరోత్తరాభివృద్ధిని అయనే ఇస్తారు. ఉదా: అంటే, ఉన్న కోటిని, ద్ధర్మబద్దంగా, 2కోట్లు చేస్తారు. (edo saradagaa,meeku ardam kaavali ani alaa 2kotlu annanu,thappuga anukokandi.. )3) మనకు ఉన్నదానిని అనుభవించే ఆరోగ్యమ్ని ప్రసాదిస్తాడు. ఉదా: ఇప్పుడు, తీపి పదార్దాలని కొనగలిగే శక్తి ఉండి, తినలేని స్దితిలో (షుగర్ ఉందనుకోండి.) ఉంటే, అప్పుడు, ఉన్న దానిని అనుభవించటం అని అనరు కదా. అటువంటి స్థితి కలుగకుండ కాపడతాడు.

తదుపరి,ఈశాన ముఖము. శివాలయలో లింగ దర్శనం అయ్యాక, ఒక్కసారి, పైకి చూసి, ఓం ఈశాన ముఖాయ నమః అని అనాలి. ఆ ఈశాన ముఖమే మనకు మొక్షాన్ని ప్రసాదించేది. ఈ ఈశాన ముఖం ఆకాశంకి అధిష్టానం అయ్యి ఉంటుంది.
శివలయంలో మనకు బలిపీఠం అని ఉంటుంది. అక్కడికి ప్రదక్షిణంగా వెల్లినప్పుడు, మనలో ఉండే, అరిషట్ వర్గాలని మనం అక్కడ బలి ఇస్తున్నట్లుగా సంకల్పం చేసుకోని ముందుకు సాగాలి.

శివాలయలో పురుషులకి, ప్రత్యేకమైన వస్త్రధారణ నిర్దేసించబడింది. పురుషులు కేవలం పంచ మాత్రమే ధరించి, పైన ఉండే ఉత్తర్యం ని, నడుముకు కట్టుకొని మాత్రమే ప్రదక్షిణలు చేయాలి. అలా ఎవరైతే చేస్తారో, వారి పట్ల పరమశివుడు అత్యంత ప్రసన్నమవుతాడు. ముందుగా చెప్పినట్లు, పదఘట్టన వినపడకూడదు జాగ్రత్త.

మీరు శివాలయంలో, ఎట్టి పరిస్థితులలోను, విభూధిని కాని, బిల్వ పత్రాలనికాని, కుంకుమ కాని,ప్రసాదం కాని ఎట్టి పరిస్థితులలోను, నందీశ్వరుడి మీద పెట్టరాదు. సాధారణంగా, చాలా మంది, నంది మీద విభూధిని, బిల్వ ఆకులని వేస్తూ ఉంటారు. అది చాలా మహా పాపంగా పరిగణించబడింది. వీలైతే, అందరూ, శివరాత్రి రోజు, శివమహిమ్నా స్తోత్రం చదవండి.. శివస్తొత్రాలు అన్నింటిలోకి, చాలా ప్రాముఖ్యమైనది "శివమహిమ్నా స్తోత్రం"

 
 
ఈ పోస్ట్ ను వ్రాసినది :


Wednesday, December 5, 2012

నార్వే కోర్టు తీర్పు ఓ హెచ్చరిక


కన్నబిడ్డను మందలించిన కేసులో తెలుగు దంపతులకు నార్వేలోని ఓస్లో జిల్లా కోర్టు విధించిన శిక్ష మనకు ఓ హెచ్చరిక. ముందు వెనుక ఆలోచించకుండా విదేశాలకు వెళ్లేవారికి కనువిప్పు కలిగించే తీర్పు ఇది. కన్నబిడ్డను మందలించిన కేసులో ప్రవాసాంధ్ర దంపతులు వల్లభనేని చంద్రశేఖర్, అనుపమలను దోషులుగా నిర్ధారించిన ఓస్లో జిల్లా కోర్టు మంగళవారం వారికి శిక్షను ఖరారు చేసింది. తండ్రి చంద్రశేఖర్‌కు 18 నెలలు, తల్లి అనుపమకు 15 నెలల జైలుశిక్ష విధించింది. ఈ తీర్పుపై ఎగువ కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు వారికి రెండురోజుల సమయం ఇచ్చింది. ఈ తీర్పు ఇక్కడ మనల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కాని అక్కడ చట్టప్రకారం కోర్టు ఆ శిక్ష విధించింది. ఇటువంటి విషయాలలో మనకు అన్యాయం అనిపించింది వారికి న్యాయం అనిపిస్తుంది. 

సంస్కృతీ సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లతోపాటు చట్టాలు ఒక్కో దేశంలో ఒక్కోరకంగా ఉంటాయి. ఇతరుల సంస్కృతీ సంప్రదాయాలను, భాషలను మనం ఎలా గౌరవిస్తామో అదేవిధంగా చట్టాలను గౌరవించాలి. అది తప్పనిసరి. అక్కడి అలవాట్లు, కట్టుబాట్లను అనుసరించి మనం నడుచుకోవాలి. ఇక్కడ నేర ప్రవృత్తి ఎక్కువ. అవినీతి అంతకంటే ఎక్కువ. మన దేశంలో మాదిరి అక్కడ వ్యవహరిస్తే కుదరదు. ఏ దేశంలోనైనా అక్కడి ఆచారాలు, అలవాట్లు, కట్టుబాట్లు, అవసరాలు, పరిస్థితులు, సంప్రదాయాలు, మానవసంబంధాలు, జనాభా ఎక్కువ, తక్కువ..... ఇలా అనేక అంశాలపై ఆధారపడి చట్టాలను రూపొందిస్తారు. అలాగే వాటిని ఎంతో గౌరవిస్తారు. తప్పనిసరిగా చట్టప్రకారం నడుచుకుంటారు. మనకు ఆ అలవాటు లేదు. అందు వల్ల విదేశాలకు వెళ్లినప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మన దేశంలోనూ చట్టాలు ఉన్నాయి. శిక్షలూ విధిస్తారు. అయితే ఇక్కడ వాటిని అమలు చేసే తీరువేరు. నియమ నిబంధనలను, చట్టాలను అతిక్రమించడం ఇక్కడ సర్వసాధారణం. ఇక్కడ అవినీతి ఎక్కువ. దాంతో ఏ పనైనా చిటికలో అయిపోతుంది. ఇక్కడ చట్టాలను అంతగా గౌరవించరు. కొన్ని దేశాలలో చట్టం పట్ల పౌరులకు ఎంతో గౌరవం ఉంటుంది. చట్టాలను అతిక్రమించడం అంటే వారు పెద్ద నేరంగా భావిస్తారు. చట్టం చేసుకున్నది దేనికి? తప్పనిసరిగా అనుసరించడానికి అనేది వారి సమాధానం. 

ఉన్నత చదువుల కోసం, ఉద్యోగం, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లేవారు అక్కడి చట్టాలను తప్పనిసరిగా తెలుసుకోవలసిన అవసరాన్ని ఈ తీర్పు గుర్తు చేస్తోంది. అలాగే విదేశాలకు వెళ్లేవారికి ఆయా దేశాల సంప్రదాయాలు, చట్టాలపై అవగాహన కలిగించవలసిన అవసరాన్ని విదేశాంగ శాఖ గుర్తించాలి. చట్టాలను వారు ఎంత గౌరవిస్తారో కూడా తెలియజెప్పవలసి అవసరం ఉంది. అలాగే విదేశాలలోని ప్రవాసభారతీయుల హక్కులను కాపాడటంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వారికి న్యాయసహాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు అంతర్జాతీయ కంపెనీలు (ఎంఎన్ సి) తమ ఉద్యోగులను ఉద్యోగ రీత్యా కొద్ది కాలం విదేశాలకు పంపడం ఎక్కువయింది. చంద్రశేఖర్‌,అనుపమలు కూడా అలా వెళ్లినవారే. ఈ విధంగా తమ ఉద్యోగులను విదేశాలకు పంపించే సమయంలో ఆయా కంపెనీలు వారికి ఆయా దేశాల సంస్కృతీ సంప్రదాయాలతోపాటు అక్కడి చట్టాలపై అవగాహన కలిగించవలసిన అవసరం ఉంది. చట్టాలు ఒక్కో దేశంలో ఒక్కోరకంగా ఉంటాయి. గల్ఫ్ దేశాలలో శిక్షలు కఠినంగా ఉంటాయి. మహిళల పట్ల ఏమాత్రం అమర్యాదగా ప్రవర్తించినా కఠినంగా శిక్షిస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన ప్రవాస భారతీయులు అనేక మందికి అక్కడి చట్టాల గురించి తెలియదు. దాంతో మనం చిన్నచిన్నవి అనుకునే తప్పులు చేసి కఠిన శిక్షలు అనుభవించారు. ఇంకా అనుభవిస్తున్నారు. అక్కడ సంప్రదాయాలు, చట్టాలు తెలియక అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఇతర దేశాలలోని చట్టాలకు, మన దేశంలోని చట్టాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. మన చట్టాల ప్రకారం చిన్నచిన్న తప్పులు అనుకునే విషయాలు, అక్కడ వారు పెద్ద నేరాలుగా పరిగణిస్తారు. ఇప్పుడు నార్వేలో జరిగింది అదే. చిన్న పిల్లలను మందలించడం, అదుపులో పెట్టడం ఇక్కడ నేరంకాదు. కానీ అక్కడ నేరం. అందువల్ల మనం ఏ దేశం వెళ్లాలనుకున్నా ముందుగా అక్కడి ఆచారాలు, అలవాట్లు, పద్దతులు, చట్టాలు తెలుసుకొని వెళ్లడం మంచిది. విదేశాలకు వెళ్లడం తప్పుకాదు. విజ్జాన సముపార్జనకు, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లడం తప్పనిసరి అయింది. ప్రసార మాధ్యమాలు, ప్రయాణ సౌకర్యాలు, కమ్యూనికేషన్ ... అందరికీ అందుబాటులోకి రావడంతో ప్రపంచం చాలా చిన్నదైపోయింది. అయినప్పటికీ కొన్ని దేశాలలో ఆచారాలు, కట్టుబాట్లు, చట్టాలు చాలా పురాతనమైనవే ఉంటాయి. ఆ చట్టాలలో మార్పు రావడానికి ఇంకా ఎన్నో ఏళ్లు పడుతుంది. అందువల్ల మన జాగ్రత్తలో మనం ఉండాలి. 
link here

Sunday, December 2, 2012

జగన్ను దగ్గర చేసుకోవాలని కాంగ్రెస్ ఆలోచిస్తుందా?

దేశంలో హేమాహేమీలనే పాదాక్రాంతం చేసుకున్న కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీనే సవాల్‌ చేసి, తన సత్తా చాటుతూ ఆ పార్టీని కళ్లు బైర్లు కమ్మి స్తున్న జగన్‌తో కాంగ్రెస్‌ పార్టీ జతకట్టేందుకు సిద్ధమవు తోందా? పాత విభేదాలు మరచి పోయేందుకు మానసికంగా తయారవు తోందా? జగన్‌ వస్తే కాంగ్రెస్‌ బలపడుతుందని భావిస్తోందా? బుజ్జగించి, తగిన హామీలిస్తే ఆయన తిరిగి పార్టీ గూటికి చేరుతారన్న విశ్వాసంతో ఉందా?.. శనివారం నాటి రాజకీయ పరిణామాలు పరిశీలిస్తే ఈ అనుమానం నిజమనించక మానదు.

దేశంలో మళ్లీ యుపీఏ అధికారంలోకి వచ్చేందుకు రాహుల్‌ చేస్తున్న కసరత్తులో భాగంగా కొంతమంది విశ్వసనీయులను నియమించుకుని, వారి ద్వారా సరైన అభ్యర్ధుల ఎంపికపై ఇప్పటినుంచే దృష్టి సారిస్తున్నారు. ఆ క్రమంలో శనివారం రాష్ట్రానికి పరిశీలకులుగా వచ్చిన జితేంద్ర దేశ్‌ ప్రభు, విశ్వజిత్‌ రాణే సీఎల్పీలో పార్టీ నేతలతో మంతనాలు జరిపారు. పార్టీ స్థితిగతులు, భవిష్యత్తుపై చర్చించారు. లోక్‌సభ-శాసనసభ ఎన్ని కలు ఒకేసారి నిర్వహించాలా? విడిగా నిర్వహించాలా? అని అభిప్రాయ సేకరణ నిర్వహించారు. మంత్రులు కాసు కృష్ణారెడ్డి, టిజి వెంకటేశ్‌, మహీధర్‌రెడ్డి, పితాని, డొక్కా, అహ్మదుల్లా, ఏరాసు, సీనియర్‌ ఎమ్మెల్యే జెసి దివాకర్‌రెడ్డి, విజయకుమార్‌ తదితరులు వారిని కలిసి, తమ అభి ప్రాయాలు వెల్లడించారు. ముఖ్యమంత్రి కిరణ్‌, పీసీసీ చీఫ్‌ బొత్స కూడా వారితో చర్చించారు. ఆ తర్వాత బొత్స స్వయంగా ఎమ్మెల్యేలను వారి వద్దకు పంపించడం ప్రస్తావనార్హం.

ఇదిలాఉండగా... తన పార్టీని సవాల్‌ చేసి, బయటకు వెళ్లి రాష్ట్రంలో రాజకీయ ఉనికినే సవాల్‌ చేస్తున్న జగన్‌ను మచ్చిక చేసుకునేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నాలు ప్రారంభిస్తోందన్న సంకేతాలు పరిశీలకుల వ్యాఖ్యలతో స్పష్టమవుతున్నాయి. జగన్‌ తిరిగి పార్టీలోకి వస్తే పార్టీ బలపడుతుందన్న సూచనలు తమకు ఎక్కువ సంఖ్యలో వచ్చాయని, దానిపై మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించారు. అసలు జగన్‌ పార్టీలోకి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయా? వస్తే ఎలా ఉంటుంది? అని తన వద్దకు వచ్చిన వారి వద్ద ఆరా తీశారు. జగన్‌ ఏ పరిస్థితిలో పార్టీ నుంచి బయటకు వెళ్లారు? రాష్ట్రంలో ప్రస్తుతం పార్టీ పరిస్థితి ఏమిటి? అని అడిగారు.

దానికి స్పందించిన కొందరు మంత్రులు జగన్‌ తిరిగి వస్తే బాగానే ఉంటుందని, పార్టీ బలపడుతుందని వారికి చెప్పారు. అయితే కొందరు మాత్రం జగన్‌ మనస్తత్వం ప్రకారం మళ్లీ పార్టీలోకి వచ్చే ప్రసక్తే ఉండదని, అంతగాకాకపోతే, 2014 ఎన్నికల తర్వాత తనకు సంఖ్యాబలం తగ్గితే అప్పుడు ముఖ్యమంత్రి పదవి ఇస్తే, తాను కేంద్రానికి మద్దతునిస్తానన్న షరతు పెట్టే అవకాశం లేకపోలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్‌ ఒకసారి అభిప్రాయానికి వస్తే దానిని మార్చుకోవడం కష్టమని చెప్పారు. తన కోసం ఎవరైనా దిగి రావల్సిందేనని, తనకంటే ఎవరూ గొప్ప కాదని, తానొక దైవాంశసంభూతిడినని, తనకు తప్ప మిగిలిన వారికి ఏమీ తెలియదన్న ధోరణి ఉన్న జగన్‌ దారికి వస్తారన్న నమ్మకం తమకు లేదని విశ్లేషించారు.

జగన్‌ ఎప్పుడు తనకు తాను రాహుల్‌గాంధీ కంటే ఎక్కువ గ్లామర్‌, జనబలం ఉన్న నేతగా ఊహించుకుంటారని, తనది సోనియాగాంధీ కంటే ఎక్కువ స్థాయి అన్న భావనతో పాటు, తనకేమి తక్కువ, తాను ఇంకొకరిపై ఎందుకు ఆధారపడాలన్న స్వతంత్ర భావనలు ఎక్కువగా ఉన్న జగన్‌ తిరిగి పార్టీలోకి వస్తారనుకోలేమని వివరించారు. జగన్‌ వస్తే మంచిదేనని అయితే ఆయన మనస్తత్వం తెలిసిన వారెవరూ తిరిగి వస్తారని అనుకోరని అభిప్రాయపడ్డారు. ఒకసారి ఒక నిర్ణయానికి వస్తే ఇక దానికే కట్టుబడి ఉంటారని, తన వద్దకు వస్తానని ఎవరైనా రాకపోతే ఇక ఆ తర్వాత వారు వచ్చినా మాట్లాడరని, అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వరని, ఇలాంటి మానసిక కోణాన్ని పార్టీ నాయకత్వం పరిగణనలోకి తీసుకుని, దానిపై ఒక నిర్ణయానికి వస్తే మంచిదని సూచించారు.

అయితే, కేంద్రానికి తన ఎంపీలు ఇచ్చి, రాష్ట్రం తనకు ఇవ్వాలన్న షరతు విధిస్తారని ఇంకొందరు వెల్లడించారు. జగన్‌ వస్తే పార్టీ బలపడేమాట నిజమయినప్పటికీ, మళ్లీ కొత్త గ్రూపులు తయారవుతాయని, ఇప్పటివరకూ జగన్‌ను వ్యతిరేకించిన వారి పరిస్థితి ఏమిటని మరికొందరు సందేహం వ్యక్తం చేశారు. జగన్‌ను తిరిగి తీసుకోవాలన్నది పార్టీ విధానమా? లేక కేవలం అభిప్రాయసేకరణ కోసమే అడుగుతున్నారా? వస్తే తీసుకుందామని భావిస్తున్నారా? అని ఒక మంత్రి సందేహం వ్యక్తం చేయగా, అది పార్టీ విధానం కాదని, మీలాంటి వారు ఇచ్చిన సలహాపై చేస్తున్న అభిప్రాయసేకరణ మాత్రమేనని పరిశీలకులు వివరణ ఇచ్చారు.

మాజీ మంత్రి జెసి దివాకర్‌రెడ్డి కూడా జగన్‌ తిరిగి పార్టీలోకి వచ్చే అవకాశాలు తక్కువేనని అభిప్రాయపడ్డారు. 2014 ఎన్నికల్లో జగన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించి, ఆయనపై ఉన్న కేసులు ఎత్తివేస్తే తప్ప పార్టీలోకి రాడని, అది సాధ్యమవుతుందా? అని వారిని ప్రశ్నించారు. కాగా కాసు కృష్ణారెడ్డి, వట్టి వసంతకుమార్‌, డొక్కా మాణిక్యవరప్రసాద్‌, ఏరాసు ప్రతాపరెడ్డి మాత్రం జగన్‌ను తిరిగి పార్టీలోకి వస్తే మంచిదేనన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. లోక్‌సభ-శాసనసభకు ఒే సారి ఎన్నికలు జరపాలన్న ఆలోచన పరిశీలకులు వ్యక్తం చేయగా, దానివల్ల రాష్ట్రంలో నష్టం ఎక్కువ జరుగుతుందని, విడిగానే నిర్వహిస్తే మేలని సూచించారు.

జెసి మాత్రం విడిగానే నిర్వహించాలని, ఈసారి పార్లమెంటుకు కొత్త వారిని ఎంపిక చేయాలని సూచించారు. ఇక తెలంగాణ అంశంపైనా పరిశీలకులు ఆరా తీశారు. తెలంగాణ ప్రకటిస్తే దాని ప్రభావం సీమాంధ్ర మీద ఎలా ఉంటుంది? ఇవ్వకపోతే తెలంగాణలో ఎలా ఉంటుందని అడిగారు. అయితే, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి, బోర్డు ఏర్పాటుచేస్తే సమస్యలు పరిష్కా రమవ ుతున్నాయని, ప్రజలు తెలంగాణతోపాటు అభివృద్ధినీ కోరుకుంటున్నారని చెప్పారు. పార్టీకి సంబంధించి ఎలాంటి సమస్యలు లేవని, ప్రభుత్వం మీదే ప్రజలు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ముగ్గురు మాత్రం కిరణ్‌ మీద ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సీనియర్లను సమన్వయం చేసుకోవడం లేదని ఫిర్యాదు చేశారు.

Saturday, December 1, 2012

ఎయిడ్స్ వ్యాప్తిలో ఆంధ్రప్రదేశ్ రెండొ స్థానం

ప్రతిఏటా డిసెంబర్‌ 01 న ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఎయిడ్స్ గురించి ప్రజలకు అవగాగన కలిగించడానికి " ప్రపంచ ఆరోగ్య సంస్థ " సూచనల మేరకు 1988 నుంచి డిసెంబర్ 01 న " ప్రపంచ ఎయిడ్స్ దినం " గా పాటించడం జరుగుతోంది . 1981 జూన్‌ 5 వ తేదీన మొదటిసారి అమెరికాలో నలుగురు స్వలింగ సంపర్కుల్లో గుర్తించిన ఎయిడ్స్ నేడు ప్రపంచ వ్యాప్తము గా 3.8 కోట్ల మందికి సోకింది . ఇండియాలో మొదటిసారిగా 1986 లో ఎయిడ్స్ ను గుర్తించారు . . భారతదేశము లో " నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాం " అనేది 1987 లో మొదలైనది .

హెచ్.ఐ.వి వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపరాదని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ మహమ్మరి పై తాజాగా రూపొందించిన నివేదికను మూన్ జెనీవాలో విడుదల చేశారు. గడిచిన ఎనిమిది ఏళ్లలో ఈ వ్యాధి 17 శాతం తగ్గుముఖం పట్టిందని నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ నలభై లక్షల మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారని వివరించింది. ఈ సందర్భంగా ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తతో వ్యవహరించాలని కోరింది. లైంగిక సంబంధాల విషయంలో మరింత జాగరూకతతో వ్యవహరించాలని

భారత్‌లో కూడా ఎయిడ్స్ రోగుల సంఖ్య 5.70 నుంచి 2.56 కోట్లకు తగ్గినట్టు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ మండలి సంస్థ (నాకో) ప్రకటించింది. దీనికంతటికీ కారణం.. ప్రభుత్వాలు, ప్రైవేట్, స్వచ్ఛంధ సంస్థలు చేపడుతున్న విస్తృత ప్రచారం కారణంగా ఎయిడ్స్‌పై అవగాహన పెరుగుతోంది. అందువల్లే సంభోగ సమయంలో సురక్షిత పద్దతులను అవలంభిస్తున్నట్టు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి.
కాగా ఎయిడ్స్ మహమ్మారి మన రాష్ట్రంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఎయిడ్స్ పట్ల కనీస అవగాహన పెరిగినా హెచ్ఐవీ బాధితుల సంఖ్య తగ్గకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. మనదేశంలో ఎయిడ్స్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న రాష్టాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉండడం మరింత ఆందోళన పరిచే అంశం. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హెచ్ఐవీ వైరస్ కోరల్లో చిక్కుకుని బతికున్న శవాలవుతున్నారు. నివారణ లేని మాయాదారి జబ్బు బెబ్బులిలా ఇప్పటికీ ఎంతో మంది అమాయాకులను పొట్టన పెట్టుకుంటోంది.

ప్రపంచవ్యాప్తంగా మూడున్నర కోట్ల మందికి హెచ్ఐవి ఉందని జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థ ఆర్గనైజేషన్ అంచనా కట్టింది. ఇప్పటివరకూ సుమారు మూడు కోట్ల మందిని ఈ మహమ్మారి మృత్యుఒడికి చేర్చింది. గత ఏడాదిలోనే 17 లక్షల మంది ఆయువు హరించేసింది. మనదేశంలో గత సంవత్సరంలో 1.48 లక్షల మంది ఎయిడ్స్ కారణంగా మృతిచెందారని ప్రభుత్వ గణంకాలు చెబుతున్నాయి. 2011 గణాంకాల ప్రకారం భారత్ లో హెచ్‌ఐవీ, ఎయిడ్స్ బాధితుల సంఖ్య 21 లక్షలు దాటింది. హెచ్‌ఐవీ బాధితుల్లో 39 శాతం మంది(8.16 లక్షలు) మహిళలే కావడం భయాందోళన గొల్పుతోంది. ఎయిడ్స్ బారిన పడిన వారిలో15 ఏళ్లలోపు పిల్లలు 7 శాతం ఉండగా, 15-49 ఏళ్లలోపువారు 86 శాతం ఉన్నారు.

ఇక భారత్‌లో ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి అత్యధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది. మణిపూర్ రాష్ట్రం 1.22 శాతంతో ప్రథమ స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ 0.75 శాతంతో ద్వితీయ స్థానంలో ఉంది. మిజోరం(0.74 శాతం), నాగాలాండ్(0.73 శాతం), కర్ణాటక(0.52 శాతం), గోవా(0.43 శాతం), మహారాష్ట్ర(0.42 శాతం)లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఎయిడ్స్ వ్యాప్తికి సంబంధించి 2011 ఏడాది గణాంకాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ శుక్రవారం-నవంబర్ 30న- ఢిల్లీలో విడుదల చేశారు. గడిచిన పదేళ్లతో పోలిస్తే హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్లు 57 శాతం తగ్గడమే ఊరట కలిగించే అంశం.

ఎయిడ్స్ లో చనిపోయిన వారిలో తమకు ఈ వ్యాధి ఉందన్న విషయం ఆలస్యంగా తెలియడం ప్రధాన కారణంగా చెబుతున్నారు. సరైన వ్యాధి నిర్దారణ పరీక్షలు అందుబాటులో లేకపోవడం దీనికి కారణమని పరిశోధనల్లో బయటపడింది. అసురక్షిత లైంగిక సంబంధాలు, స్వలింగసంపర్కం, విచ్చలవిడిగా మాదకద్రవ్యాల వాడకంతో హెచ్ఐవీ వ్యాప్తి చెందుతోంది. ప్రజల అవగాహన లోపం ప్రధానంగా ఈ వ్యాధి ప్రబలడానికి హేతువవుతోంది. జనాన్ని చైతన్యవంతులను చేయాల్సిన పాలకులకు చిత్తశుద్ధి కొరవడడంతో ఎయిడ్స్ నియంత్రణ కాగితాలకే పరిమితమవుతోంది. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు యాంటీ రిట్రోవైరల్ మందులను అందుబాటులోకి తేవాలన్న ప్రయత్నం పూర్తిగా అమల్లోకి రావట్లేదు.

ఎయిడ్స్ రాకుండా జాగ్రత్త పాటించడమే తప్పా దీని నుంచి బయటపడేందుకు ఎటువంటి మందులు లేవు. హెచ్ఐవీ బారిన పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ మహమ్మారి నుంచి తప్పించుకోవచ్చు. ఒకవేళ్ల పొరపాటునో, గ్రహపాటునో ఎయిడ్స్ సోకితే ఆరోగ్యకరమైన జీవనవిధానం, వైద్యుల సలహాలు పాటించడం ద్వారా జీవనకాలాన్ని పెంచుకునే వీలుంది. పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒకదశలో ఎయిడ్స్ నివారణపై బాగానే ప్రచారం చేసింది. ఇలీవలకాలంలో ఎయిడ్స్ పై చైతన్య కార్యక్రమాలు అనుకున్నంతగా లేవు. 
 ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిఉన్న ఎయిడ్స్‌ వ్యాధి పట్ల అప్రమత్తతతో పాటు ముందుస్తు చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైన ఉంది . గతంలో ఎయిడ్స్‌ వల్ల చాలా మరణాలు జరిగాయని ఎయిడ్స్‌ వ్యాధికి మందులేదు కాని నియంత్రించే మార్గాన్ని పాటించాల్సిన అవసరం ఎంతైన ఉంది.. విచ్చలవిడి శృంగారం వల్ల ఎయిడ్స్‌ వ్యాధి సంక్రమిస్తుందని వీటిని అరికట్టాల్సిన బాద్యత ప్రతి ఒక్కరి పైన ఉంది . వ్యాధి బారిన పడ్డ వారిని గుర్తించడంతో పాటు వారికి అవసరమైన వైద్య చికిత్సలు అందించడంసుఖజీవనానికి సామాజికభద్రత కల్పించడం జరుగుతుందన్నారు. స్వచ్చంద సంస్థలు చేస్తున్న సేవలను , ప్రభుత్వ పరంగా పలుసౌకర్యాలు కల్పించడం జరుగుతుంది, అలాగే వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటు గ్రామగ్రామాన అవగాహన సదస్సులు నిర్వహించాలి . పాఠశాల స్థాయిలో ఏర్పాటు చేసిన ఎయిడ్సి పట్ల వారి తల్లిదండ్రులు వివరించాల్సిన అవసరం ఎంతైన ఉంది
హెచ్ఐవీ నెమ్మదించిందన్న నిర్లిప్తతతోనే ప్రభువులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఎంతమాత్రం సమర్థనీయం కాదు. మానవాళికి పెను ముప్పుగా మారిన ఎయిడ్స్ ను అడ్రస్ లేకుండా చేస్తేనే జనవాళికి నిశ్చింత!