Monday, February 27, 2012

రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్ పై నాయకుల భయాలు : పార్టీ మారడానికి వ్యూహాలు





రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు పార్టీ నేతలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తుందా? తాము ఎమ్మెల్యేగా గెలుపొందగలమా? అన్న అనుమానాలు నేతలను కలవరపెడుతున్నాయి. పార్టీ భవిష్యత్తుపై ఆశలులేవని భావిస్తున్న కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు కొందరు, రాజకీయాల నుంచి తప్పుకునే యోచనలో ఉన్నారు. తాము రాజకీయాల నుంచి తప్పుకుని తమ వారసుల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చే విషయాన్ని కొందరు నేతలు ఆలోచిస్తున్నారు. ఇంకొందరు ఎన్నికల ముందు మరో పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటానికి తోడు పార్టీకి , ప్రభుత్వానికి అధినేతలుగా ఉంటున్న వారి మధ్య విభేదాలు, ఆధిపత్య పోరు నెలకొనడంతో భవిష్యత్తుపై పార్టీ నేతలు గందరగోళంలో పడుతున్నారు. సీనియర్లకు పార్టీలో తగిన గౌరవం లభించడంలేదన్న అసంతృప్తి కొంతమందిలో ఏర్పడింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు ఈ విషయాన్ని మీడియా సమావేశంలోనే బహిరంగంగా చెప్పారు. సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులైన జెసి దివాకర్‌రెడ్డి, గాదె వెంకటరెడ్డివంటి వారు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ‘ప్రస్తుతం పరిస్థితి ఏమీ బాగాలేదు. ఇక మనం రాజకీయాల నుంచి తప్పుకోవడం మంచిది’ అన్న అభిప్రాయాన్ని ప్రైవేటు సంభాషణల్లో వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహారశైలి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆరోగ్య మంత్రి డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి మంత్రి పదవికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ హైకమాండ్‌కు రాసిన లేఖలో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏమీ బాగాలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డిఎల్ ప్రాతినిధ్యం వహిస్తున్న కడప జిల్లా మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో తన రాజకీయ ప్రత్యర్ధి అయిన మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకుడు రఘురామిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో మైదుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సరైన నాయకుడు కరవయ్యాడు. వచ్చే ఎన్నికల్లో డిఎల్ తెలుగుదేశం అభ్యర్థిగా మైదుకూరు నుంచి పోటీ చేయవచ్చన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని డిఎల్ వద్ద సన్నిహితులు ప్రస్తావించగా ‘నేను తెలుగుదేశం పార్టీలో చేరే ప్రశ్న లేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటే రాజకీయాల నుంచే తప్పుకుంటా. ఎమ్మెల్యే కాకపోతే ప్రాణం ఏమైనా పోతుందా’ అని ప్రశ్నించినట్టు తెలిసింది. దీన్నిబట్టి డిఎల్ కూడా రాజకీయాల నుంచి తప్పుకునే యోచనలో ఉన్నట్టు అర్థమవుతోంది.
రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని పరిశీలిస్తే, తెలంగాణలో తెరాసకు, సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉందన్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు అంగీకరిస్తున్నారు. సీనియర్ ఎమ్మెల్యేలు రాజకీయాల నుంచి తప్పుకుని తమ వారసుల్ని రంగంలోకి దింపే ప్రయత్నంలో ఉండగా యువ ఎమ్మెల్యేలు కొందరు తెరాస, వైఎస్సార్ కాంగ్రెస్ వైపు దృష్టి పెట్టారు. అయితే ఈ విషయం ఇప్పుడే బయటపెట్టకుండా ఎన్నికల సమయంలో బహిర్గతం చేయవచ్చన్న ఆలోచనలో ఉన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఒక పార్టీనుంచి మరో పార్టీకి దూకుతుండటం సహజమే. తెలుగుదేశం పార్టీలో, తెరాసలో చేరేందుకు ఇష్టపడని వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్లే ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ముందుగా కాకుండా ఎన్నికల సమయంలో చేరినట్లయితే తమకు టిక్కెట్టు లభించకపోవచ్చన్న అనుమానం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం తాము చేరబోయే పార్టీ నేతలతో ముందుగానే లోపాయికారీ సంబంధాలు పెట్టుకుంటున్నారు.

<ఆంధ్రభూమి నుంచి>

No comments:

Post a Comment