Wednesday, December 21, 2011

మూడు పదవులు అడుగుతా: చిరు


న్యూఢిల్లీ, డిసెంబర్ 20: రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ జరిగినప్పుడు తన పార్టీకి చెందిన మూడు ప్రాంతాల వారికి ప్రాతినిధ్యం కల్పించవలసిందిగా కోరుతామని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తెలిపారు. పిఆర్పీకి మూడు ప్రాంతాల ప్రజలు ఓట్లు వేసినందున మూడు ప్రాంతాలకు మంత్రి వర్గంలోప్రాతినిధ్యం కల్పించటం భావ్యంగా ఉంటుందని ఆయన అభిప్రాయ పడ్డారు. పర్యాటక శాఖ నిర్వహించిన ఒక సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన చిరంజీవి మంగళవారం తనను కలిసిన విలేఖర్లతో మాట్లాడారు. పిఆర్పీ టికెట్‌పై గెలిచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు దగ్గరైన శోభానాగిరెడ్డికి నోటీసు జారీ చేసే అధికారం తమకు ఉందని చిరు చెప్పారు. కాంగ్రెస్‌లో తమ పార్టీ విలీనమైన ప్రక్రియ శాసనసభ గుర్తింపు పొందనందున అవిశ్వాస తీర్మానంపై ఒటింగ్ జరిగే సమయానికి ఆమె పిఆర్పీ సభ్యురాలేనని ఆయన తెలిపారు. తనకుప్రజాసేవే తప్పించి పదవులు ముఖ్యం కాదని చిరంజీవి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధినాయకత్వం తనకు అప్పగించే బాధ్యతను శక్తిమేరకు నిర్వహించటమే తన ధర్మమని పేర్కొన్నారు. కేంద్రంలో పదవిని ఇస్తారా? రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు అప్పగించాలా? అన్న విషయమై అధినాయకత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తనకు మధ్య అభిప్రాయబేధాలున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.

No comments:

Post a Comment