Saturday, July 13, 2013

మరో ప్రపంచ వింత భోపాల్‌ తాజ్‌మహల్‌

తాజ్‌మహల్‌ పేరుచెప్పగానే మనకు ఆగ్రాలో షాజహాన్‌ నిర్మించిన తాజ్‌మహల్‌ గుర్తొస్తుంది. ముంతాజ్‌ ప్రేమకు గుర్తుగా ఆయన నిర్మించిన కట్టడం ప్రపంచ వింతల్లో చోటు సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే... అరుుతే, అచ్చం అలాగే కాకపోరుునా మనదేశంలో మరో తాజ్‌మహల్‌ కూడా వుంది! ఇది మీకు ఆశ్చర్యమనిపించినా... అక్షరాలా నిజం. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో వున్న ‘తాజ్‌మహల్‌ నెం.2’ విశేషాలు... ఈవారం ‘విహారి’...

ఆగ్రాలో ఉన్న అందమైన కట్టడం తాజ్‌మహల్‌ ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా నిలిచి పేరు తెచ్చుకుంది. ఈ అద్భుత కట్టడం గురించి అందరికీ తెలిసిందే. కానీ మన దేశంలో మరో తాజ్‌మహల్‌ కూడా ఉందన్న విషయం చాలా మందికి తెలియదు ఈ తాజ్‌మహల్‌ భోపాల్‌లో ఉండడం విశేషం. ఒకప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద రాజప్రాసాదంగా పేరుగాంచిన ఈ అద్భుత చారిత్రక కట్టడం ఇది.భోపాల్‌ రాజ్యాన్ని పరిపాలించిన 11వ పరిపాలకురాలు నవాబ్‌ షాజహాన్‌ బేగమ్‌ ఎన్నో అందమైన కట్టడాలను నిర్మించారు.1868 నుంచి 1901 వరకు ఆమె భోపాల్‌ను పరిపాలించి నిర్మించిన కట్టడాల్లో తాజ్‌మహల్‌ కూడా ఒకటి. ఈ తాజ్‌మహల్‌ భోపాల్‌లోని అతిపెద్దదైన మసీదు తాజ్‌-ఉల్‌-మజీద్‌ పక్కన నిర్మితమైంది.

రాజప్రాసాదంగా...
షాజహాన్‌ తన ప్రియురాలి కోసం తాజ్‌మహల్‌ను కట్టించాడు. కానీ భోపాల్‌లోని తాజ్‌మహల్‌ బేగమ్‌ నివాసంగా రూపుదిద్దుకుంది. ఆ కాలంలో 70 లక్షల రూపాయలతో దీన్ని నిర్మించారు. 1871 నుంచి 1884 వరకు 13 సంవత్సరాల కాలంలో ఈ చారిత్రక కట్టడం రూపుదిద్దుకుంది. ఆ కాలంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన రాజప్రాసాదంగా దీన్ని నిర్మించడం విశేషం. మొదట దీన్ని రాజ్‌మహల్‌ పేరుతో పిలిచేవారు. ఆ తర్వాత భోపాల్‌లో నివసించిన బ్రిటీష్‌ పరిపాలకులు దీని నిర్మాణాన్ని చూసి ఎంతో ముగ్ధులయ్యారు. దీని ఆర్కిటెక్చర్‌ పనితనం వారికి బాగా నచ్చి ఈ కట్టడాన్ని కూడా తాజ్‌మహల్‌గా పిలిచారు. ఇక భోపాల్‌ తాజ్‌మహల్‌ నిర్మాణం పూర్తయిన తర్వాత బేగమ్‌ జష్న్‌-ఎ-తాజ్‌మహల్‌ పేరిట మూడు సంవత్సరాల పాటు వేడుకలను నిర్వహించారు.

స్వాతంత్య్రానంతరం
1947లో స్వాతంత్య్రం వచ్చి... దేశవిభజన జరిగిన తరువాత నవాబ్‌ హమీదుల్లా ఖాన్‌ సింధీ కాందిశీకులను ఈ ప్యాలెస్‌లో నివసించేందుకు ఏర్పాట్లు చేశారు. వారు తాజ్‌మహల్‌లో నాలుగు సంవత్సరాలపాటు నివసిం చారు. ఆ తర్వాత భోపాల్‌లోని బైరాఘర్‌కు తమ నివాసాన్ని మార్చారు. ఈ కాలంలో ఈ రాజప్రాసాదం కొంత దెబ్బతిన్నది. ఆ తర్వాత పలువురు భోపాల్‌ రాజవంశీకులు ఈ రాజప్రాసాదంలో నివసించి క్రమక్రమంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. 2008లో ఈ రాజమహల్‌లోని పలు భవనాలు కూలిపోయాయి. 2005లో భోపాల్‌ తాజ్‌హమల్‌ను మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర చారిత్రక వారసత్వ సంపదగా ప్రకటించింది.

అధ్బుత నిర్మాణశైలి
భోపాల్‌ తాజ్‌మహల్‌ను వివిధ రకాల శిల్పకళాపనితనంతో అందంగా నిర్మించారు. బ్రిటీష్‌, ఫ్రెంచ్‌, మొఘల్‌, అరబిక్‌, హిందూ వాస్తు నిర్మాణ పద్ధతులతో దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ ప్యాలెస్‌లో 120 గదులను నిర్మించారు. ఇందులో శీష్‌మహల్‌ (అద్దాల ప్యాలెస్‌), అతి పెద్దదైన సావన్‌ బడో పెవిలియన్‌ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ఏడు అంతస్తుల భవనం ఇక్కడ చూడదగినది. భోపాల్‌ తాజ్‌మహల్‌పై పరిశోధన చేసిన హుస్సేన్‌ (75) ఈ కట్టడంపై ప్రత్యేకంగా ‘ద రాయల్‌ జర్నీ ఆఫ్‌ భోపాల్‌’ అనే పుస్తకాన్ని రాశారు.

భోపాల్‌లోనే అతిపెద్ద ప్యాలెస్‌గా దీన్ని ఆయన అభివర్ణించారు. ఇక భోపాల్‌ తాజ్‌మహల్‌ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. దేశ, విదేశాలకు చెందిన వేలాది మంది పర్యాటకులు ప్రతి ఏటా ఈ కట్టడాన్ని తిలకిస్తున్నారు. ఈ కట్టడం అందాలకు వారు మంత్రముగ్ధులవుతున్నారు. భోపాల్‌ తాజ్‌మహల్‌ అందాలు వర్ణనాతీతం. ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజప్రాసాదంగా నిర్మించిన ఈ కట్టడం వివిధ వాస్తు నిర్మాణ శైలులకు అద్దం పడుతోంది. ఈ కట్టడంలోని వివిధ భవనాలు ఎంతో అందంగా తీర్చిదిద్దారు.

తాజ్‌ పరిరక్షణకు...
ఇక భోపాల్‌ తాజ్‌ను పరిరక్షించేందుకు గత కొన్ని సంవత్సరాలుగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వమిస్తున్న సవితా రాజె కొంతకాలం క్రితం ప్యారిస్‌లోని స్కూల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ డీన్‌ సెర్జ్‌ సాంటెల్లిని ప్రత్యేకంగా భోపాల్‌కు ఆహ్వానించారు. సెర్జ్‌ సాంటెల్లి తాజ్‌మహల్‌లోని పలు భవన సముదాయాలను పరి రక్షించేందుకు కృషిచేస్తున్నారు. ఆయన స్వయంగా ఈ ప్యాలెస్‌ను ప్రపంచంలోని అందమైన ప్యాలెస్‌లలో ఒకదానిగా అభివర్ణించడం విశేషం.
Source:  సూర్య దినపత్రిక

No comments:

Post a Comment