Tuesday, November 27, 2012

'పొగ'బెడుతున్న స్మోకింగ్!

గడచిన వందేళ్లలో(1910-2010) ఒక్క మనదేశంలోనే పదికోట్ల మంది ‘పొగ’కు ప్రాణాలు కోల్పోయారని తాజా అధ్యయనమొకటి వెల్లడించింది.


‘వినుడి వినుడీ సిగరెట్ గాథ...’ అంటూ పాడుకునే పాటలింక చాలించాలంటున్నారు అధ్యయనకర్తలు. ధూమపానంతో ఆయువు అర్థాంతరంగా ఆగిపోతుందని శతవార్షిక గణాంక సహితంగా హెచ్చరిస్తున్నారు. ‘మా చిన్నప్పటి నుంచి ఇలాంటివి ఎన్ని వినలేద’ని తేలిగ్గా తీసుకోకండి. గత నూరేళ్లలో ధూమపానం ఎంతమందిని బలితీసుకుందో తెలిస్తే ఈ మాట అనడానికి ఎవరూ సాహసించరు. పెపైచ్చు పొగ పేరు చెబితే పర్లాంగు దూరం పరుగెత్తుతారు. ధూమపానాన్ని విడిచిపెట్టినా పెట్టొచ్చు!

‘పొగ’లో ఉన్న గమ్మత్తు ఆస్వాదించేవాడికే అవగతమవుతుందంటారు ధూమపాన ప్రియులు. స్మోకింగ్ లేనిదే శ్వాస అందదని చెప్పే మహా ‘పొగ’భిమానులు ఉన్నారంటే అవాక్కవాల్సిన పనిలేదు. రింగులు రింగులుగా పొగ వదలడంతో మొదలయ్యే ధూమపానం వ్యసనంగా మారుతోందన్నది నిష్ఠూర నిజం. ఒకసారి ఈ వ్యసనానికి అల వాటు పడిన ప్రాణం నిత్యం పొగతో పాటు ప్రయాణం చేస్తుంటుంది. ఒక్క క్షణం ‘పొగ’ అందకపోయినా ప్రాణం విలవిల్లాడుతుంది. స్మోకింగ్ జోలికి పోవద్దని ఇలాంటి వారికి ఉచిత సలహా ఇచ్చామనుకోండి-పొగ తాగనివాడు దున్నపోతుగా పుడతాడంటూ శాపిస్తారు.

పొగరాయుళ్లు తమతో పాటు పక్కనున్న వాళ్ల ప్రాణాలకు పొగ పెడుతున్నారు. వారు వదులుతున్న పొగ సాటివాళ్ల ఉసురుకు ఎసరు పెడుతోంది. సిగరెట్, బీడీ వంటి పొగాకు ఉత్పత్తుల వస్తున్న పొగ శరీరంలోని ప్రధానవయవాలను నెమ్మదిగా కబళిస్తుంది. శ్వాస సంబంధమైన రోగాలకు హేతువవుతుంది. విషాదం ఏమిటంటే ఆరోగ్యానికి హానికరమని తెలిసినా పొగ పీలుస్తున్నవారెందరో ఉన్నారు. మృత్యువుకు చేరువవుతున్నారు. మనిషి మెదడుపై స్మోకింగ్ ప్రతికూల ప్రభావం చూపుతుందని లండన్ కింగ్స్ కాలేజీ పరిశోధకులు కనుగొన్నారు. ఆరోగ్యం, జీవన విధానం ఆధారంగా వారీ అంచనాకు వచ్చారు.

గడచిన వందేళ్లలో(1910-2010) ఒక్క మనదేశంలోనే పదికోట్ల మంది ‘పొగ’కు ప్రాణాలు కోల్పోయారని తాజా అధ్యయనమొకటి వెల్లడించింది. వీరిలో ఏడు కోట్ల మంది బీడీలు తాగేవారని తేలింది. స్మోకింగ్ ప్రారంభించిన 30 నుంచి 40 ఏళ్లలోనే పొగరాయుళ్లు చావుకు చేరువవుతున్నారని స్పష్టమయింది. బీడీ, సిగరెట్ తయారీ పరిశ్రమలు సహా 23 ప్రధాన మాధ్యమాల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అధ్యయం సాగింది. ‘పొగ’ ప్రమాదస్థాయిని దాటి వ్యాపిస్తున్న నేపథ్యంలో దేశంలో పొగాకు నియంత్రణ చర్యలపై సత్వరమే సమీక్ష జరపాలని, పొగాకు పరిశ్రమను ప్రోత్సహిస్తున్న విధానాలను ప్రభుత్వం మరోసారి పరీక్షించాలని అధ్యయకర్తలు సూచిస్తున్నారు. ధూమపానానికి ఇకనైనా మంగళం పాడకపోతే పెనుముప్పు తప్పదు.
Source: sakshi

No comments:

Post a Comment