Friday, June 8, 2012

గెలుపు ఎలాగూ దక్కదని డబ్బు పంపిణీని నిలిపివేసిన టిడిపి, కాంగ్రెస్

అత్యంత కీలకంగా భావిస్తున్న ఉప ఎన్నికల్లో వారం రోజులుగా ఉధృతస్థాయిలో ప్రచారం చేస్తున్న అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు ఫలితాలపై స్పష్టతకు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఉప ఎన్నికల్లో నిధుల వరదను నిలిపివేశాయి. అధికార కాంగ్రెస్ అయితే అనుకున్న మొత్తంలో సగం నిధులకు కోత విధించింది. తెలుగుదేశం కూడా ఖర్చును తగ్గించినప్పటికీ, కాంగ్రెస్ కన్నా ఎక్కువే ఖర్చు పెడుతోంది. ఉప ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా ఉండొచ్చని మొదట్లో అనుకున్నారు. పోటీలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నందున ఎన్నికల్లో డబ్బును కూడా భారీగానే ఖర్చు పెట్టవచ్చని భావించారు. ముఖ్యంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు భారీ మొత్తంలోనే ఖర్చు పెట్టేందుకు మొదట్లో ప్రణాళికలు రూపొందించాయి. అనుకున్న మొత్తంలో ఇప్పటి వరకు సగం వరకు ఖర్చు పెట్టారు. మిగిలిన సగం ఖర్చు పెట్టాల్సిన ప్రస్తుత కీలక సమయంలో రెండు పార్టీలు నిలిపివేశాయి. ‘అవసరమైన’ నియోజకవర్గాల్లో మాత్రమే ఖర్చు పెట్టాలని నిర్ణయించాయి.
పద్దెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఒక లోక్‌సభ స్థానానికి 12న ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఫలితాలు ఏకపక్షంగా ఉండవన్న ఉద్దేశంతో రెండు ప్రధాన పార్టీలు భారీ మొత్తంలోనే ఖర్చు పెట్టేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నాయి. ఎంతెంత ఇస్తామన్న విషయాన్ని పోటీలో ఉన్న అభ్యర్థులకు కూడా తెలియజేశాయి. తొలి విడతలో రెండు పార్టీలు ధారాళంగానే ఖర్చుపెట్టాయి. కనీసం ఐదారు స్థానాలను గెలుచుకోగలమన్న నమ్మకంతో రెండు పార్టీలు మొదట్లో ఉన్నాయి. ఎప్పటికప్పుడు సర్వేలు జరిపిస్తూ తాజా పరిస్థితిని రెండు పార్టీలు అంచనాలు వేసుకుంటున్నాయి. కొన్ని స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మధ్య వ్యత్యాసం రెండు, మూడు శాతం ఓట్లు మాత్రమే ఉన్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పర్యటనకు ముందు ఆ పార్టీలు తెప్పించుకున్న సర్వే నివేదికల్లో తేలింది. కొద్దిగా కష్ట పడితే మొదటి స్థానానికి చేరుకోవచ్చని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అనుకున్నాయి. అయితే విజయమ్మ పర్యటన తర్వాత ఆమె ప్రభావం ఎలా ఉందన్న దానిపై తాజాగా సర్వే నివేదికలను తెప్పించుకున్నాయి. గతంలో రెండు, మూడు శాతం ఓట్లు తేడా ఉన్న నియోజకవర్గాల్లో విజయమ్మ పర్యటన తర్వాత ఐదు నుంచి పది శాతం ఓట్లు తేడా ఉన్నట్టు తేలడంతో రెండు పార్టీల నాయకత్వాలు విస్తుపోయాయి. దీంతో పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ రెండు పార్టీలు ఆశలను క్రమంగా వదులుకుంటున్నాయి. ఈ పరిస్థితిలో భారీ మొత్తంలో ఖర్చు పెట్టడం దండగన్న అభిప్రాయానికి రెండు పార్టీలు వచ్చాయి. కాంగ్రెస్‌కు చెందిన కీలక నాయకుడు ఒకరు మూడు స్థానాల్లో తమకు గెలిచే అవకాశం ఉందని చెబుతూంటే, మరో ముఖ్య నాయకుడు ఐదారు స్థానాలను గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో కూడా దాదాపు ఇదే పరిస్థితి. గెలుస్తామన్న స్ధానాల సంఖ్యను ఒక్కోటి తగ్గించుకుంటూ వస్తున్నాయి. క్రమంగా ఫలితాలపై అంచనాకు వస్తున్న పార్టీలు ఆచితూచి ఖర్చు పెడుతున్నాయి. గెలిచేందుకు ఏమాత్రం అవకాశం లేదనుకుంటున్న నియోజకవర్గాలకు నిధుల పంపిణీని పూర్తిగా నిలిపివేశాయి. దీంతో తమకు రెండో విడత నిధులు అందలేదంటూ పోటీలోని అభ్యర్థులు తమతమ నాయకత్వాలపై ఒత్తిడి తెస్తున్నారు. గెలిచేందుకు అవకాశం ఉందనుకుంటున్న నియోజకవర్గాల్లో మాత్రం రెండోవిడత నిధుల విడుదలకు సన్నాహాలు చేస్తున్నాయి.
మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా తిరుపతి
ఉప ఎన్నికలు జరుగుతున్న పద్దెనిమిది నియోజకవర్గాల్లో ఒక్క తిరుపతిని మాత్రం కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మిగిలిన నియోజకవర్గాల్లో కన్నా ఈ నియోజకవర్గంలో నిధులన్ని కొద్ది ఉదారంగానే ఖర్చు పెడుతున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిది, ప్రతిపక్ష నేత చంద్రబాబుది కూడా చిత్తూరు జిల్లా కావడం, తిరుపతి నియోజకవర్గానికి నిన్నటి వరకు చిరంజీవి ప్రాతినిధ్యం వహించిన నేపథ్యంలో తిరుపతిలో గెలుపొందటడం ద్వారా ముగ్గురు ముఖ్య నేతలను దెబ్బ కొట్టవచ్చని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్, చిరంజీవి కూడా తిరుపతిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నియోజకవర్గంపై వారిద్దరూ ప్రత్యేక దృష్టి పెట్టారు. తిరుపతి నియోజకవర్గంలో గెలిచినట్లయితే జగన్‌ను, ప్రతిపక్ష నేత చంద్రబాబును దెబ్బతీసినట్టు అవుతుందని ముఖ్యమంత్రి కిరణ్ అనుకుంటున్నారు. ఇక చంద్రబాబు కూడా తన సొంత జిల్లాలోని నియోజకవర్గం అయినందున ఆయన కూడా ఇక్కడ ప్రత్యేక దృష్టి సారించారు. తిరుపతిలో గెలుపొందినట్లయితే ముఖ్యమంత్రి కిరణ్‌ను నైతికంగా దెబ్బతీసినట్టు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.

This Article Source: Andhrabhoomi Daily.

No comments:

Post a Comment