Thursday, November 3, 2011

సాధించాలంటే సాహసించాల్సిందే

‘సాహసం చేయరా డింభకా రాజకుమారి దక్కుతుంది...’ అంటూ అలనాడు ‘పాతాళభైరవి’ సినిమాలో యస్వీ రంగారావు, రామారావును ప్రేరేపించటం మనకు గుర్తుంది. సాహసంతోనే అసాధ్యాలను సుసాధ్యాలుగా మలచుకొని, తాను వలచిన రాజకుమారిని పెళ్లాడాడు సాధారణ తోటరాముడు. అది సినిమా కావొచ్చు. కల్పన కావొచ్చు. కాని.. సాహసాలు చేసి ఎందరో కొత్త ఆవిష్కరణలకు, అద్భుతాలకు తెర తీశారనటం వాస్తవం.
సాంకేతికపరమైన అంశాలు అందుబాటులో లేని కాలంలో సముద్ర మార్గం ద్వారా ఐరోపా ఖండం చుట్టి.. భారతదేశం చేరుకున్న పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా సాహస యాత్ర.. చరిత్రను ఎన్ని మలుపులు తిప్పిందో మనందరికీ తెలుసు. ఆనాడు ప్రాణాలను పణంగా పెట్టి ఎందరో నావికులు చేసిన సాహస యాత్రల మూలంగా ఎన్నో చీకటి ఖండాలు వెలుగులోకి వచ్చాయి.
సాహసించకపోతే.. టెన్సింగ్ నార్కే మహోన్నత హిమగిరి ఎవరెస్ట్‌ను అధిరోహించి ఉండేవాడా? యూరీ గగారిన్ అంతరిక్ష యాత్ర చేసి ఉండేవాడా? నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రునిపై కాలు మోపగలిగేవాడా?.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో సాహసవంతమైన విజయాలు మనకు కనిపిస్తాయి.
అయితే.. ప్రతి సాహసం వెనుక విజయం ఉండకపోవచ్చు. జయాపజయాలు సాధారణం. సాహసించే ప్రతివారూ విజయం కోసమే తపిస్తారు. విజయ లక్ష్యంగానే సాహసానికి పూనుకుంటారు. ఒక్కోసారి దురదృష్టం వెంటాడి.. ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలూ ఉన్నాయి.
కొన్ని రకాల సాహసాలలో పాల్గొనే వారికి.. అదెంత ప్రమాదకరమైనదో తెలుసు. అదుపు తప్పితే జరిగే పరిణామాలేమిటో తెలుసు. అయినా వారు ఆ సాహసం పట్ల ఆసక్తిని కనపరుస్తారు. అంతేకాదు దానిని వారు ఓ ఛాలెంజ్‌గా తీసుకుంటారు. విజయం తమదేననే భరోసాతోనే ముందుకు సాగుతారు. అపజయాన్ని, ప్రమాదాన్ని ఎవరూ ముందుగా ఆశించరు. తమకన్నా ముందు అలాంటి సాహసకృత్యాలలో ప్రమాదానికి గురై, తీవ్ర గాయాలైన లేదా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసినా.. అదే సాహసకృత్యానికి పూనుకునేవారూ ఉన్నారు. అంతరిక్ష నౌక పేలిపోయినంత మాత్రాన అమెరికా అంతరిక్ష ప్రయోగాలు ఆగిపోయాయా..? మరింత సాంకేతిక జాగ్రత్తలు పెంచుకుంటూ ముందుకు సాగటం లేదా? కల్పనా చావ్లా దుర్మరణం చూసి భయపడి వుంటే.. సునీతా విలియమ్స్ సక్సెస్ సాధించి ఉండేదా? మరి కొంతమంది వ్యోమగాములు అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యేవారా? అందుకే సాహసికులు జరిగిన సంఘటనలకు భీతి చెందరు. అలా భీతి చెందేవారు అసలు అలాంటి సాహసానికి సిద్ధపడరు.
సాహసమే నా ఊపిరి.. విజయమే నా లక్ష్యం అనే సిద్ధాంతం వారిది. అయితే చాలామంది అనుకోవచ్చు - ప్రాణాంతకమైన సాహసకృత్యాలు అవసరమా అని? మరి అవే లేకపోతే.. మానవ జాతి ఇంత ప్రగతి సాధించేదా? అందుకే ప్రతి విజయం వెనుక ఓ సాహసం, ఓ ఉత్సాహం, ఓ ప్రేరణ తప్పనిసరి. అయితే ప్రతి సాహసం పాజిటివ్ దృక్పథం కలిగినదై ఉండాలి.
అయితే సాహసాలకు పూనుకునే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
తాము పూనుకోబోతున్న సాహసం వెనుక ఎలాంటి ప్రమాదాలు ఉండగలవో ముందుగా ఒక అవగాహనకు రావాలి. గతంలో ఏ లోపాల వల్ల ప్రమాదాలు జరిగాయో పరిశీలించాలి. వాటిని లోతుగా విశే్లషించుకోవాలి. దానికి తగిన విధంగా వ్యూహాలను ఆలోచించాలి. ముందస్తు ప్రణాళికను సమగ్రంగా రూపొందించుకోవాలి.
అనుకోకుండా సంభవించే ప్రమాదాలను ఎదుర్కోగలిగే ఆత్మస్థైర్యాన్ని గుండెల నిండా నింపుకోవాలి. చాలినంత టెక్నాలజీని అందుబాటులో ఉంచుకోవాలి. అది అపాయకర వేళ సహకరించేలా చూసుకోవాలి. స్వతహాగా ప్రమాద సమయంలో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండటం మంచిది. సాహసకృత్యాల సమయంలో భయాందోళనలకు గురి కాకూడదు.
ఒక్కో సమయానికి అవే ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. సాధించాలనే స్థిరత్వం, తపనలే చాలావరకు విజయం వైపు నడిపించగలవు.
కాబట్టి సాహసం చేయటం తప్పు కాదు. సాహసాలే విజయానికి సోపానాలు. అయితే తగు జాగ్రత్తలు తప్పనిసరి. చక్కటి ప్రణాళికతో, వ్యూహాత్మక నిర్ణయాలతో.. ముందుకు సాగితే.. మంచి ఫలితాలను సమాజానికి అందించవచ్చు. భావితరాలకు మార్గదర్శకులుగా నిలువవచ్చు.
-కె.ఆదిశేషారెడ్డి ( from ANDHRABHOOMI)

1 comment:

  1. బాగా చెప్పారు. మీరు ఆరంభించండి, మీ వెనకే మేమూ... :))

    ReplyDelete