Monday, June 3, 2013

ఇక తెలుగుదేశం ఫ్లెక్సీల్లో లోకేష్

టిడిపి తరఫున రూపొందించే ఫ్లెక్సీలు, ప్రచార ప్రకటనల్లో నారా లోకేశ్ పొటోను చేర్చారు. టిడిపి అధికారి వెబ్‌సైట్‌లో ఫ్లెక్సీల కోసం ఉపయోగించాల్సిన నారా లోకేశ్ ఫోటోలను చేర్చారు. మొత్తం మూడు రకాల నిలువెత్తు ఫోటోలను పార్టీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ ఫోటోలను డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించాలని సూచించారు. నారా లోకేశ్ ఇప్పటి వరకు పార్టీలో చేరినట్టు ప్రకటించలేదు. లోకేశ్ పార్టీలో చేరుతున్నారా? అని విలేఖరులు చంద్రబాబును ప్రశ్నించగా, మీ అబ్బాయి కూడా చేరవచ్చు అంటూ చంద్రబాబు సమాధానం చెబుతున్నారు. లోకేశ్‌కు పార్టీలో ఏదైనా హోదా కల్పిస్తారా? అంటే అతని పనితీరు బట్టి పార్టీలో స్థానం ఉంటుందని, ఇది వారసత్వం కాదని చెబుతున్నారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పుట్టిన టిడిపిలో వారసునిగా లోకేశ్‌ను ప్రవేశ పెట్టడంపై మీడియా ప్రశ్నిస్తే, బాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది వారసత్వం కాదని, ప్రతిభను బట్టి పనితీరును బట్టి అవకాశాలు ఉంటాయి దీన్ని వారసత్వంగా భావించవద్దు అనేది ఆయన వాదన. వారసత్వం కాదు అంటూనే టిడిపి అధికారిక వెబ్‌సైట్‌లో లోకేశ్‌కు వారసత్వ హోదా కల్పించారు. టిడిపి అధికారిక వెబ్‌సైట్‌లో ఎన్టీఆర్ కుటుంబం, చంద్రబాబు కుటుంబ సభ్యుల ఫోటోలు మాత్రమే ఉంటాయి. పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడైనా, ఎంత పెద్ద నాయకుడైనా వారి ఫోటోలు కనిపించవు. పార్టీ ప్రచారం కోసం నాయకులు రూపొందించే ప్లెక్సీలు, ప్రకటనల్లో ఉపయోగించుకోవడానికి ఆరుగురి ఫోటోలను పొందు పరిచారు. ఎన్టీరామారావు, చంద్రబాబు నాయుడు. హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, లోకేశ్‌ల ఫోటోలను పొందు పరిచారు. ఎన్టీఆర్‌వి ఏడు రకాల బొమ్మలు ఉండగా,చంద్రబాబువి 12 ఫోటులున్నాయి. పచ్చని పొలాన్ని దున్నుతున్న దున్నుతున్న బాబు, నాగిలి భుజాన వేసుకున్న ఫోటోలు వీటిలో ఉన్నాయి. ఇక బాలకృష్ణవి నాలుగు రకాల ఫోటలు ఉండగా, జూనియర్ ఎన్టీఆర్‌వి మూడు, లోకేశ్‌వి నిలువెత్తు ఫోటోలు 3 ఉన్నాయి. హరికృష్ణవి కూడా 2 ఉన్నాయి. రెండేళ్ల క్రితం గండిపేటలో జరిగిన మహానాడులో ప్లెక్సీలపై లోకేశ్ ఫోటోలను ఉపయోగించడంపై హరికృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపైబాబు స్పందిస్తూ ఒకరిద్దరు లోకేశ్ ఫోటోలను ఉపయోగించడం సరికాదని సున్నితంగా మందలించారు. ఇప్పుడు ఏకంగా పార్టీ అధికారిక వెబ్‌సైట్‌లోనే లోకేశ్ ఫోటోలు ప్లెక్సీల కోసం ఎలాంటివి ఉపయోగించాలో సూచించడం విశేషం.

No comments:

Post a Comment