Friday, April 19, 2013

పేదల్లో మూడోవంతు భారత్‌లోనే: ప్రపంచబ్యాంకు

ప్రపంచంలోని నిరుపేదల్లో మూడింట ఒక వంతు మంది భారతదేశంలోనే ఉన్నారని ప్రపంచబ్యాంకు నివేదిక వెల్లడించింది. రోజుకు జీవన వ్యయం రూ. 65(1.25 అమెరికన్ డాలర్లు)కన్నా తక్కువగా ఖర్చుచేస్తున్న 120 కోట్ల(1.2 బిలియన్) మందిని నిరుపేదలుగా ఇది పరిగణనలోకి తీసుకుంది. వారిలో మూడో వంతు అంటే దాదాపు 40 కోట్ల మంది భారతీయులే ఉండటం గమనార్హం. పేదలు, నిరుపేదలు ఎక్కడున్నారనే ప్రాంతాలవారీ గణాంకాల ఆధారంగా రూపొందించిన ప్రపంచ అభివృద్ధి సూచికల ప్రకారం... అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నిరుపేదల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది.

1981లో ప్రపంచ నిరుపేదల్లో సగం మంది ఇక్కడే ఉండగా, అది 2010 నాటికి 21 శాతానికి తగ్గింది. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాల జనాభా మాత్రం 59 శాతం పెరిగింది. అయితే గురువారం ప్రపంచబ్యాంకు వెల్లడించిన నివేదిక ప్రకారం 120 కోట్ల మంది అత్యంత పేదరికంలో ఉన్నారు. వారిలో మూడో వంతు కన్నా ఎక్కువ మంది ఆఫ్రికాలోని ఉప సహారా ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నారు. 2030 నాటికి పేదరికాన్ని పూర్తిగా తగ్గించాలని పేర్కొన్నారు. ఇప్పటికీ ప్రపంచ జనాభాలో దాదాపు ఐదో వంతు మంది దారిద్య్రరేఖకు దిగువనే ఉన్నారని ప్రపంచబ్యాంకు సీనియర్ ఉపాధ్యక్షుడు, ఆర్థికవేత్త కౌశిక్ బసు వెల్లడించారు. ఆఫ్రికా ఉప సహారా ప్రాంతంలో అత్యంత పేదరికం స్థాయి 1999తో పోలిస్తే 2010 నాటికి పది పాయింట్లు తగ్గి, 48 శాతం ఉంది. ప్రపంచం మొత్తం మీద పేదల సంఖ్య క్రమేపీ తగ్గుతుంటే ఒక్క ఈ ప్రాంతంలో మాత్రం క్రమక్రమంగా పెరుగుతోంది. 

సాక్షి దినపత్రిక నుండి 

No comments:

Post a Comment