Thursday, October 18, 2012

‘కెమెరామన్ గంగతో రాంబాబు’ రివ్యూ

నటీనటులు- పవన్ కళ్యాణ్, తమన్నా, గాబ్రియల్, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు
సంగీతం- మణిశర్మ
నిర్మాత- డీవీవీ దానయ్య
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం- పూరి జగన్నాథ్

ఎంతైనా పూరి జగన్నాథ్ బతకనేర్చిన దర్శకుడు. మంచి ‘టైమింగ్’ ఉన్న దర్శకుడు కూడా. ‘దూకుడు’తో అమాంతం పెరిగిపోయిన మహేష్ బాబు ఇమేజ్ ని చక్కగా క్యాష్ చేసుకుని చక్కగా ‘బిజినెస్ మేన్’ చేశాడు. ఇప్పుడు ‘గబ్బర్ సింగ్’తో ఆకాశంలో ఉన్న పవన్ కళ్యాణ్ క్రేజ్ ను క్యాష్ చేసుకుని ‘కెమెరామన్ గంగతో రాంబాబు’ తీశాడు. ఈ రాంబాబు కూడా ‘బిజినెస్ మేన్’ టైపే. సూర్య చెప్పేయగా మిగిలిపోయిన పూరి జగన్నాథ్ ‘ఫిలాసఫీ’నే ఇప్పుడు రాంబాబు వల్లించాడు. కాకపోతే ఆ ‘ఫిలాసఫీ’తో పోలిస్తే ఈ ‘ఫిలాసఫీ’ కాస్త బెటర్. పూరి జగన్నాథ్ సినిమాల్లో కథంటూ పెద్దగా ఏం ఉండదు.
దాదాపుగా అన్నీ సింగిల్ లైన్ స్టోరీలే ఉంటాయి. హీరో క్యారెక్టరైజేషన్, డైలాగులతో నెట్టుకొచ్చేయడం పూరి స్టయిల్. ఇందులోనూ అంతే. మొత్తం మూడు ముక్కల్లో చెప్పేయగల కథ. అది కూడా మొత్తం హీరో చుట్టూనే తిరుగుతుంది. రోజూ పత్రికల్లో, టీవీల్లో వచ్చే వార్తలు చూసి.. రెస్పాండయ్యే మెకానిక్ రాంబాబు. ఎక్కడో ఎవరో పాపను వదిలేశారంటే తీసుకొచ్చి పెంచుకుంటాడు. ఇంకెక్కడో ఓ కొడుకు తల్లిదండ్రుల్ని సరిగా చూసుకోవడం లేదంటే వెళ్లి బాది వచ్చేస్తాడు. అలా ఇంకో సంఘటన చూసి రాంబాబు రెచ్చిపోతుండగా మీడియావాళ్లు షూట్ చేసి మంచి పబ్లిసిటీ ఇచ్చేస్తారు. తర్వాత ఓ ఛానెల్ లో పనిచేసే కెమెరామన్ గంగ.. రాంబాబు మీద స్పెషల్ స్టోరీ చేసేయడమే కాక, అతనికి తమ ఛానెల్లో రిపోర్టర్ గా ఉద్యోగమిప్పిస్తుంది. అలా ‘కెమెరామన్ గంగతో రాంబాబు’ ప్రస్థానం మొదలవుతుంది. ఇదిలా ఉంటే ప్రతిపక్ష నాయకుడైన జవహర్ నాయుడు (కోట శ్రీనివాసరావు), అతని కొడుకు రాణా బాబు (ప్రకాష్ రాజ్) ఆగడాలకు అడ్డుపడతాడు రాంబాబు. ఆ క్రమంలో వారితో శత్రుత్వం మొదలవుతుంది. తర్వాత రాణా ముఖ్యమంత్రి కావడానికి చేసే ఎత్తులు.. అతణ్ని అడ్డుకోవడానికి రాంబాబు చేసే ప్రయత్నం.. చివరికి ఎవరు గెలిచారన్నది మిగతా కథ.
పూరి ఏదో జనాల్ని ఆకర్షించడానికి ‘కెమెరామన్ గంగతో రాంబాబు’ అని టైటిల్ పెట్టాడు కానీ.. ఇందులో కెమెరామన్ గంగకు ఏమాత్రం సీన్ లేదు. తమన్నాది ఏమాత్రం ప్రాధాన్యం లేని పాత్ర. కథంతా రాంబాబు చుట్టూనే తిరుగుతుంది. ప్రతి సినిమాలోనూ మీడియా గురించి కామెంట్లు విసిరే పూరి.. ఈ సినిమాకు మీడియానే నేపథ్యంగా ఎంచుకున్నాడు. హీరోను రిపోర్టర్ చేశాడు. కానీ.. హీరో ఎక్కడా రిపోర్టర్ లా ప్రవర్తించడం.. హీరోలాగే ప్రవర్తిస్తాడు. మైకు పట్టుకుని కాబోయే సీఎంను ఇంటర్వ్యూ చేస్తూ ఆవేశం తెచ్చుకుని, అరేయ్ ఒరేయ్ అంటూ లైవ్ లో నోరు పారేసుకోవడానికి అతణ్ని రిపోర్టర్ని చేయడమెందుకు? ఫస్టాఫ్ వరకూ చూస్తే ప్రేక్షకుల్నే కాదు.. పవన్ ఫ్యాన్స్ ని కూడా ఆకట్టుకునే విశేషాలేమీ లేవు. హీరో ఇంట్రడక్షన్ సహా ప్రారంభ సన్నివేశాలన్నీ ఏమాత్రం లాజిక్ కు అందకుండా, బోరింగ్ గా సాగుతాయి. సామాన్యుడైన హీరో గురించి బ్రేకింగ్ న్యూస్ లు, పెద్ద పెద్దగా స్టోరీలు వేసేయడం.. వెంటనే అతను రిపోర్టరైపోవడం.. అక్కడ కూడా రిపోర్టింగ్ చేయడం మాని కనిపించినోళ్లందరిపై నోరు పారేసుకోవడం, చేయి చేసుకోవడం.. అంతా అర్ధరహితంగా సాగుతుంది. ఐతే పూరి తన పైత్యాన్ని సెకండాఫ్ లోనూ కొనసాగించి ఉంటే రాంబాబు భరించడం కష్టమే అయ్యుండేది. కానీ సెకండాఫ్ సినిమాను నిలబెట్టింది. రాణానాయుడు రాజకీయ అరంగేట్రం నుంచి సినిమా ట్రాక్ ఎక్కుతుంది. ప్రాంతీయ విధ్వేషాల్ని రెచ్చగొట్టేలా ప్రసంగం చేసే సన్నివేశంలో ప్రకాష్ రాజ్ నటన, ఆ సన్నివేశంలో పూరి డైలాగులు.. తదనంతర సన్నివేశాలు ఆసక్తి రేపి, తొలిసారి ప్రేక్షకుణ్ని సినిమాలో ఇన్వాల్వ్ చేస్తాయి. విలన్ కు హీరో కౌంటర్ ఇచ్చే ‘తెలుగు తల్లి’ సన్నివేశం కూడా పండింది. అమ్మాయిలు ఎక్సట్రార్డినరీ కాదు.. ఆర్డినరీ అంటూ పవన్ చెప్పే సన్నివేశం, బ్రహ్మానందంతో వార్తలకు మసాలాలు అద్దించే సన్నివేశం ఆకట్టుకుంటాయి. డైలాగుల విషయంలో ఈసారి పూరి కాస్త హద్దుల్లో ఉన్నాడు. వివాదాస్పదమైన అంశాలపైనే బ్యాలెన్స్డ్ గా డైలాగులు రాశాడు. ముఖ్యంగా పైన సెకండాఫ్ కు హైలైట్లని చెప్పుకున్న సన్నివేశాలన్నింటిలో డైలాగులు బాగున్నాయి. ప్రి క్లైమాక్స్ లో పవన్ చెప్పే మాటలు కూడా పేలాయి. క్లైమాక్స్ అంత ఆకట్టుకునేలా లేదు. చివర్లో హీరో తన తల్లి గురించి చెబుతూ ఈ రాష్ట్రాన్ని నేను పట్టించుకుంటాను అని చెప్పే సన్నివేశం అనవసరం.
సినిమాను నడిపించింది పవన్ కళ్యాణ్ పెర్ఫామెన్స్, కొన్ని సన్నివేశాల్లో పూరి డైలాగులు. పవన్ ఫ్యాన్స్ కి మరోసారి పండగే. కొన్ని సన్నివేశాలు మాస్ కు ఎక్కుతాయి. కానీ క్లాస్ ఆడియన్స్ కి, నాన్-ఫ్యాన్స్ కి ఈ సినిమా ఎక్కకపోవచ్చు. పవన్ ఇలాంటి సీరియస్ పాత్రల కంటే సరదాగా ఉండే పాత్రల్ని ఎంచుకుంటేనే మేలు. అతని నుంచి జనాలు ఎక్కువగా వినోదాన్నే ఆశిస్తారు. తమన్నాది వ్యర్థ పాత్ర. ఆ క్యారెక్టర్ తో బూతులు మాట్లాడిస్తూ, మందు తాగిస్తూ పూరి ఏం చెప్పదలుచుకున్నాడో అర్థం కాదు. ప్రకాష్ రాజ్ ఆకట్టుకున్నాడు. కోట కూడా ఓకే.
ఐతే పూరి సహా మన దర్శకులు కొన్ని ప్రాథమిక విషయాల గురించి పట్టించుకుంటే మంచిది. ఓ కథాంశాన్ని ఎంచుకున్నపుడు దాని గురించి కనీస పరిశీలన చేయడం, కాస్త అవగాహన పెంచుకోవడం అవసరం. రాజకీయ నాయకులు అంటే ఇలా ఉంటారని, మీడియా అంటే ఇలా ఉంటుందని జనరల్ గా ఉన్న ఒపీనియన్స్ ని తెరమీద చూపిస్తే ఇక ఆ దర్శకుడి ప్రత్యేకత ఏముంది? ఈ ‘రాంబాబు’ సినిమాలో మీడియా గురించి, రాజకీయ నాయకుల గురించి, ప్రభుత్వం గురించి పూరి అలాగే చూపించాడు. రాంబాబు సినిమా తీసే ముందు పూరి ‘రంగం’ సినిమాను ఓసారి చూడాల్సింది. మీడియా నేపథ్యంలో తీసిన ఆ సినిమాలో క్యారెక్టర్లు చాలా సహజంగా ఉంటాయి. మీడియా, రాజకీయాలకు సంబంధించిన సన్నివేశాలు కూడా వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. అందులో హీరో ఓ ఫొటోగ్రాఫర్ లాగే ప్రవర్తిస్తాడు. కానీ హీరో అవుతాడు. కానీ రాంబాబువన్నీ నేలవిడిచి సాము చేసే పనులే. హీరోను అలా చూపించాలనుకున్నపుడు ఇక రిపోర్టర్ అవతారమెత్తించడమెందుకు? రంగంలో దర్శకుడి పరిశీలన, అవగాహన స్పష్టంగా తెరమీద కనిపిస్తుంది. కానీ పూరి మాత్రం కాస్తయినా అవగాహన లేకుండా తానేమనుకుంటే అది తీసేసి జనాల మీదికి వదిలాడు. రాంబాబే కాదు.. ఈ మధ్య అతని సినిమాలన్నీ అలాగే తయారయ్యాయి. పేపర్లో చదివిన వార్తలతో కథ అల్లేయడం.. తనకు ఇష్టం వచ్చినట్లు ఓ పద్ధతీ పాడూ లేకుండా క్యారెక్టర్లు రాసేసుకోవడం.. కాసిన్ని నీతులు, కాస్తంత ఫిలాసఫీ.. (పైత్యం కూడా అనొచ్చు) జోడించి జనాల మీదికి వదలడం.. ఇదీ పూరి చేస్తున్న పని. బిజినెస్ మేన్ లో మహేష్ మేనియా పనిచేసినట్లే.. రాంబాబులో పవన్ పవర్ పనిచేయొచ్చు. సినిమా ఓ మోస్తరుగా ఆడేయొచ్చు. కానీ పూరి జిమ్మిక్కులు ఇంకెంతో కాలం నడవవన్నది మాత్రం సత్యం.
రేటింగ్- 2.5/5
Originally published at : http://namastheamerica.com/?p=18708

1 comment: