భారతదేశం గర్వించదగ్గ మహాకవి, రచయిత, స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రసిద్ధ విప్లవకారుడు, రాజనీతికర్త, తాత్వికుడు అరవిందుడు. అరవిందఘోష్ అనే ఈయన క్రీస్తుశకం 1872 ఆగస్టు 15న కృష్ణ్ధనఘోష్, స్వర్ణలతాదేవీల మూడవ కుమారునిగా జన్మించారు. ఇంగ్లండులో విద్యాభ్యాసంలో అశేష ప్రతిభతో కింగ్స్ కాలేజినుంచి ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడయి, తండ్రి కోరికమేరకు ఐ.సి.యస్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఇండియాలోని ఆయన తండ్రికి ఆనందానికి అవధుల్లేవు. సివిల్ సర్వీసులో ఉత్తీర్ణత సాధించడం ఆరోజుల్లో ఒక గొప్ప విషయం. అక్కడ అరవిందుని మనసులో దేశభక్తి భావాలు బీజాలు నాటాయి. అంతే మనసంతా స్వేచ్ఛా విముక్తిపూరిత వాతావరణం అలుముకుంది. సివిల్ సర్వీసు పరీక్షలో ఆఖరి అంశం గుర్రపుస్వారీ. ఉద్దేశ పూర్వకంగా దాన్నుంచి తప్పించుకొని స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఆయన తీసుకున్న నిర్ణయ ఫలితమే భారతదేశానికి ఒక స్వాతంత్య్ర సమరయోధుడు, ఒక మహాజ్ఞాని ఆవిర్భవానికి కారణమయింది. 29 సంవత్సరాల వయసులో (1901)లో అరవిందునికి మృణాళినితో వివాహం జరిగింది. కొంతకాలం కలిసున్నాక బరోడాలో ఉద్యోగానికి అరవిందుడు వెళ్ళాడు. ఆ కాలంలో తన భార్యకు రాసిన లేఖలలో దేశభక్తి, ఆధ్యాత్మికత తొణికిసలాడేవి.
తన భార్యకు రాసిన లేఖలో ‘ఈపాటికి ఎలాంటి విచిత్రమైన వ్యక్తితో జీవితం పంచుకున్నావో నీకు అర్ధమై ఉంటుంది. మూడు రకాల పిచ్చినన్ను వెంటాడుతుంది. 1. ఈ విద్య, విజ్ఞానం, ఆస్తులు అన్నీ భగవంతుడిచ్చినవే. కనుక అన్నీ ఆయనకే చెందుతాయి. మన కుటుంబం గడవటానికి అవసరమైనంతే వుంచుకుని మిగతాదంతా ఆయనకిచ్చేయాలి. 2. నేను ఆ సర్వాంతర్యామిని ముఖాముఖీ చూసి తీరాలి. ఒకవేళ హిందూ సిద్ధాంతం ప్రకారం అందరిలో ఉన్నట్లే ఆయన నాలో కూడా వుండివుంటే ఆ అంతర్ దర్శనాన్ని నేను సాధించి తీరాల్సిందే. 3. నా మాతృదేశం నా కుటుంబానికి సంబంధం లేని ఒక రాక్షసుడు వచ్చి నా తల్లి గుండెలమీద కూర్చుని ఆమె రక్తం త్రాగుతున్నాడు. అది భరిస్తూ నేను నా భార్యతో సుఖంగా గడపగలనా? ఆమె విముక్తికన్నా ఏదీ నాకు ముఖ్యం’ కాదు.
1906దాకా బరోడా కళాశాలలో ఫ్రెంచి, ఆంగ్ల భాషల బోధనా సమయంలోనే ఆయన, బెంగాలీ, సంస్కృతం నేర్చుకుని విపరీతంగా పుస్తకాలు చదివేరు. 1906లో బరోడానుంచి కలకత్తాకు తిరిగి వచ్చాక ‘బందేమాతరం’ పత్రికా సంపాదకునిగా అరవిందుని రచనలు యావద్భారతదేశం దృష్టిని విపరీతంగా ఆకర్షించాయి. 1907లో సూరత్‌లో కాంగ్రెస్ మహాసభలు, మితవాదులు, అతివాదులుగా నాయకుల చీలిక, అక్కడ లాల్,బాల్,పాల్ వారసుడిగా అరవిందులకు గుర్తింపు లభించింది. ఒక బ్రిటీషు జడ్జిని చంపడానికి కుట్ర పన్నారన్న అభియోగంపై ‘బందేమాతరం’ సంపాదకుడు అరవిందుడ్ని, ఆయన సోదరుణ్ని అరెస్టుచేసి, అలీపూర్ జైల్లో పెట్టారు. ఒక ఏడాదిపాటు కొనసాగిన విచారణ అనంతరం అరవిందుడ్ని కోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ, ఆయన సోదరుడికి మాత్రం అండమాన్ దీవుల్లో యావజ్జీవ కారాగారశిక్ష విధించింది. ఈ విచారణ తాలూకు వాదోపవాదాల చివరి దశలో అరవిందుడి కోసం వాదించిన న్యాయవాది చిత్తరంజన్‌దాస్ న్యాయమూర్తి ఎదుట అన్న మాటలు చారిత్రాత్మకమైనవి.
‘‘ఈ కేసులూ, వివాదాలు, స్వాతంత్య్ర పోరాటాలు సమసిపోయాక, ఈయన అజ్ఞాతంలో వున్నా- మరణించినా, ఈ జాతి ఈయన్ని దేశభక్తిని జ్వలింపచేసిన మహాకవిగా, చైతన్యం నిండిన జాతీయతాభావాల ప్రవక్తగా, అపూర్వ మానవతావాదిగా గుర్తిస్తుంది. గౌరవిస్తుంది. ఈయన మరణానంతరం ఈయన బోధనలు ఖండ ఖండాంతరాల్లో ప్రతిధ్వనిస్తాయి.’’ ఆలీపూర్ జైల్లో గడిపిన 13-14 మాసాల కాలం అరవిందుడిలోని ఆధ్యాత్మిక చింతనని ఉద్దీపింపజేసింది. అరవిందుడు జైలునుంచి విడుదలైన తర్వాత 1909 మే 30న ఉత్తర పారాలో సభలో ఆయన చేసిన ప్రసంగం ప్రముఖమైనదే. అందులో నిజమైన సనాతన ధర్మం గురించి మాట్లాడారు. ఆయన మాటల్లో ‘‘మనకు సనాతన ధర్మమే జాతీయత. ఈ జాతి సనాతన ధర్మంతో ముడిపడి వుంది. ఆ ధర్మం క్షీణించిన రోజు మన జాతీయత పతనమవుతుంది. సనాతన ధర్మం వెలుగొందినంత కాలం మన జాతీయత జ్వలిస్తూనే వుంటుంది.’’ ఆలీపూర్ జైలులో అరవిందుడిలో కలిగిన ఆధ్యాత్మిక వికాసం- స్వామి వివేకానంద, సిస్టర్ నివేదితల ప్రోత్సాహంతో ఆయన పాండిచ్చేరి వెళ్ళడానికి (1910), అక్కడ ఆశ్రమవాసంలో ఆధ్యాత్మిక బోధన సాగించడానికి కారణమైంది. ఆయన జన్మదినమైన ఆగస్టు 15న స్వాతంత్య్రం రావడాన్ని విని స్వామి ఇలా స్పందించారు. ‘‘్భరత మాతకి విదేశీ శృంఖలాలు తొలగాయి. ఇప్పుడు ఆమెను రాజకీయంగా,సాంస్కృతికంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా మానవతా విలువలపరంగా ప్రపంచంలోకెల్లా మహోన్నత దేశంగా నిలబెట్టేలా మన ఆలోచనలని, జీవన సరళిని మనమే రూపొందించుకోవాల్సి ఉంది.’’ ఈ దేశంలో రెండు మహత్తరమైన జననాలు ఆగస్టు 15న సంభవించాయి. ఒకటి దేశానికి స్వాతంత్య్రం కాగా, రెండోది అరవిందుని అరుణోదయం. పాండిచ్చేరిలోని అరవిందాశ్రమం నేడు యావత్ ప్రపంచాన్నీ ఆకర్షిస్తున్న అపూర్వ ఆధ్యాత్మిక కేంద్రమై అలరారుతున్నది.
Source : http://andhrabhoomi.net/content/desam-6