Friday, July 27, 2012

యువత చూపు..‘ఫ్యాషన్’ వైపు

ఒకప్పుడు అమ్మాయిలు జీన్‌ప్యాంట్లు, టీషర్టులు ధరిస్తే సమాజం అంగీకరించేది కాదు. కానీ, నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. యువతీ, యువకులు వర్థమాన ఫ్యాషన్ పోకడలను పూర్తిగా ఆస్వాదిస్తున్నారు. గతంతో పోలిస్తే వేషధారణలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కేవలం నగరాలు, పట్టణాల్లోనే కాకుండా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ ఫ్యాషన్లు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంప్రదాయ కోర్సులైన ఇంజనీరింగ్, మెడిసిన్‌లకు దీటుగా ఫ్యాషన్ రంగం కూడా విద్యార్థులను తనవైపు ఆకర్షిస్తోంది. మిగతా కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులతో సమానంగా ఈ రంగంలోనూ ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉండడంతో ఇటీవలి కాలంలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులకు ఆదరణ పెరిగింది. గ్లామర్ ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని తహతహలాడే యువతకు చక్కటి అవకాశాలను ఇస్తూ వారిలోని సృజనాత్మకతను వెలికితీస్తున్నదిగా ఫ్యాషన్ రంగానికి ప్రాముఖ్యత ఉంది. అయితే, ఈ రంగంలో రాణించడానికి కఠోర శ్రమతో పాటు చక్కటి వ్యక్తిత్వం కూడా అవసరమని నిపుణులు సెలవిస్తున్నారు. నైపుణ్యాలే కీలకం ఫ్యాషన్ డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించాలని భావించే యువతకు సహజసిద్ధంగా వచ్చిన కౌశలాలతో పాటు అభ్యసించిన అంశాలపై మంచి పట్టు ఉండాలి. ఎప్పటికప్పుడు మారుతున్న ఫ్యాషన్ ట్రెండ్‌లు, రంగుల కాంబినేషన్లపై అవగాహన, ఆకట్టుకునేలా గార్మెంట్స్ డిజైనింగ్ వంటిని ఇందులో ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. అకడమిక్స్‌లో పెద్దగా రాణించకపోయినప్పటికీ, చక్కటి ఆప్టిట్యూడ్, టాలెంట్‌లు ఉంటే ఈ రంగంలో రాటుదేలడం పెద్ద కష్టమేమీ కాదు. సంస్కృతీ, సంప్రదాయాలకు పెద్దపీట వేసే భారతదేశంలో సైతం కొనే్నళ్ళుగా ఫ్యాషన్ డిజైనింగ్ రంగానికి మంచి ఆదరణ లభిస్తోంది. డ్రాయింగ్, పెయింటింగ్, హోం సైన్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్ వంటి విషయాల పట్ల ఆసక్తి కలిగిన విద్యార్థులు ఫ్యాషన్ రంగంలో కాస్త సులభంగా నిలదొక్కుకోగలరు. వీటితో పాటు కలర్ కాంబినేషన్లు, షేడ్స్, టెక్స్చర్లు, కొత్త డిజైన్లు, ప్యాటర్న్స్ వంటివాటిపై ఎక్కువ సాధన చేయాల్సి ఉంటుంది. కోర్సులు కాస్త ఖరీదే... ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు అభ్యసించాలంటే కాస్త ఖర్చుతో కూడుకున్న పనే. ఫీజులు సంస్థలను బట్టి మారుతుంటాయి. కనీసం ఏడాదికి రూ.60 వేల వరకు ఒక విద్యార్థికి వ్యయమవుతుంది. అయితే, కొన్ని ఫ్యాషన్ అకాడమీలు మెరిట్ ఆధారంగా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేస్తున్నాయి. వీటి ద్వారా ట్యూషన్ ఫీజు భారాన్ని తగ్గించుకునే వెసులుబాటు ఉంటుంది. ఉపాధి అవకాశాలు... ఇప్పుడిప్పుడే మన దేశంలో దూసుకుపోతున్న ఫ్యాషన్ రంగంలో వేలకొద్దీ అవకాశాలు అభ్యర్థుల కోసం సిద్ధంగా ఉన్నాయి. ఫ్యాషన్ డిజైన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు స్వయం ఉపాధి ద్వారా కూడా సంపాదించడానికి బోలెడు మార్గాలు ఉండడం మరో విశేషం. గార్మెంట్ స్టోర్ చైన్లు, టెక్స్‌టైల్ మిల్లులు, లెదర్ కంపెనీలు, బొటిక్‌లు, ఫ్యాషన్ షో ఆర్గనైజర్లు, జువెల్లరీ మాల్స్, మీడియా రంగాల్లో ఫ్యాషన్ డిజైనర్లకు మంచి అవకాశాలు ఉన్నాయి. నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వేతనం ఇచ్చి మరీ నైపుణ్యం ఉన్న ఫ్యాషన్ డిజైనర్లను తీసుకుంటున్న సంస్థలున్నాయి. ఒకసారి ఈ రంగంలో పేరుప్రఖ్యాతులు సంపాదిస్తే ఇక వారి సంపాదనకు ఆకాశమే హద్దని చెప్పాలి. మన దేశానికి చెందిన ఎందరో ప్రముఖ డిజైనర్లు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. భారతీయ గార్మెంట్స్, డిజైనర్ శారీస్, టెక్స్‌టైల్స్‌లకు విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉండడం వీరికి కలిసొస్తోంది. రానున్న పదేళ్ళ కాలంలో భారతదేశంలో ఫ్యాషన్ డిజైనింగ్ పరిశ్రమ టర్నోవర్ వెయ్యికోట్ల రూపాయలకు చేరుకుంటుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. భవిత ఎలా ఉంటుంది... ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు పూర్తి చేసిన వారికి డిజైనర్ వేర్, ప్రొడక్షన్, ఫ్యాషన్ మార్కెటింగ్, ప్లానింగ్, కానె్సప్ట్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో తమ సత్తా చాటుకోవడానికి అవకాశం లభిస్తుంది. వీటితో పాటు ఫ్యాషన్ మీడియా, డిజైన్ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్ యాక్సెసరీ డిజైన్, క్వాలిటీ కంట్రోల్, బ్రాండ్ల ప్రమోషన్‌లోనూ పాలు పంచుకోవచ్చు. కాస్ట్యూమ్ డిజైనర్, ఫ్యాషన్ కన్సల్టెంట్, పర్సనల్ స్టైలిస్ట్, టెక్నికల్ డిజైనర్, గ్రాఫిక్ డిజైనర్, ప్యాటర్న్ మేకర్, ఫ్యాషన్ కోఆర్డినేటర్ వంటి అవకాశాలూ ఈ రంగంలో అభ్యర్థులను రారమ్మంటూ ఆహ్వానిస్తున్నాయి. మంచీచెడులు... కఠోర శ్రమతో పాటు ఆకట్టుకునే సృజనాత్మకత ఉంటేనే ఈ రంగంలో మనగలమని యువత గుర్తించాలి. ప్రాథమిక దశలో పేరొందిన ఫ్యాషన్ డిజైన్ సంస్థలో అసిస్టెంట్‌గా పనిచేసి అనుభవం సంపాదించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆర్థిక స్థోమతను బట్టి సొంతంగా స్టూడియో నెలకొల్పడం ద్వారా సొంతంగా డిజైనింగ్ చేసుకోవచ్చు. ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తే గానీ ఇనె్వస్టర్ల చూపు పడదని గ్రహించాలి. ఎక్కడ అభ్యసించాలి... పాఠశాల విద్య పూరె్తైన తర్వాత కొన్ని కోర్సులు, ఇంటర్ పూర్తయిన తర్వాత మరికొన్ని కోర్సులను ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ టెక్నాలజీ సంస్థలు ఔత్సాహిలకు అందిస్తున్నాయి, జువెల్లరీ డిజైన్, నిట్‌వేర్ డిజైన్, ఫుట్‌వేర్ డిజైన్, లెదర్ డిజైన్‌లు స్పెషలైజేషన్‌లుగా ఈ కోర్సులుంటాయి. మరెన్నో డిప్లమా కోర్సులు కూడా పలు విద్యాసంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. కోర్సులను అందిస్తున్న పలు సంస్థల వివరాలు... * అపీజే ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్, మెహ్రాలీ బాదర్‌పూర్ రోడ్, న్యూఢిల్లీ. (www.appejay.edu) * నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్, పాల్దీ, అహ్మదాబాద్. (www.nid.edu) * నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, న్యూఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై, ఛండీఘర్, బెంగుళూరు. (www.niftindia.com) * పెరల్ అకాడమీ ఆఫ్ ఫ్యాషన్, న్యూఢిల్లీ. ( www.pearlacademy.com) 
-ఠయ్యాల శశికాంత్,Andhrabhoomi.net

No comments:

Post a Comment