Showing posts with label congress. Show all posts
Showing posts with label congress. Show all posts

Friday, August 30, 2013

తెలంగాణాపై త్వరలో మరో అఖిలపక్షం?

రాస్ట్రంలో పరిస్థితులు నానాటికీ దిగజారుతుండడం, సీయం కూడా తరచూ ప్రతిఘటించడం, జగన్ దీక్ష నేపధ్యంలో కాంగ్రెస్ ఒక మెట్టు దిగివచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీమాంధ్ర కేంద్రమంత్రులూ రాజీనామాలకు సిద్దమవడంతో అటు బీజేపీ వైఖరిలోనూ మార్పు వస్తే తాము అవమాన పడడం ఖాయం అని కాంగ్రెస్ గ్రహించింది. కనుక  తెలంగాణా విభజన ఖాయమన్న తమ అభిప్రాయం ఎలాగూ స్పష్టం చేసాము కనుక ప్రస్తుతం వివిధ పార్టీలు తమ తమ ఎజెండాలౌ, క్రొత్త రాష్ట్రానికి ఇవ్వవలసిన ప్యాకేజిలు, జలాల పంపిణీ వంటి సమస్యలపై తమ అభిప్రాయాలు,సూచనలతో ముందుకు రావాలని, దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయబోతున్నామన్న ప్రకటనను కాంగ్రెస్ సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకటన ద్వారా అటు తెలంగాణా వాదులనూ నొప్పించకుండా, సీమాంధ్ర పార్టీలను డిఫెన్స్ లో పడేయవచ్చన్న ఆలోచనతో  కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది.
అటు సీయం క్రొత్తపార్టీ పెట్టబోతున్నారన్న పుకార్లూ ఊపందుకోవడం కాంగ్రెస్ ను కలవర పెడుతున్నాయి. సీయంకు లొంగకుండా కనీసం జగన్ కు పేరురావాలని కాంగ్రెస్ ఆశిస్తుందని కొన్ని వర్గాలు అంటున్నాయి. కేంద్ర స్థాయిలో జగన్ దీక్ష విరమించాలని , అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేస్తామని ప్రకటించబోతున్నారని అనుకుంటున్నారు.
మరి ఈ ప్రకటన ఎలా చేస్తారో, దీని పర్యవసానాలు ఏమిటో వేచిచూడాలి!

Sunday, May 19, 2013

కేసీయార్ పై కాంగ్రెస్ అస్త్రం రఘునందన్ ?

మేము క్రితం పోస్టు ( మన రాష్ట్రంలో " కోదండరాం" తో కూడా అమలుచేసే అవకాశాలు...) లో చెప్పింది నిజమైందా? కానీ ఆ అస్త్రం కోదండరాం కాకుండా రఘునందన్ ని కాంగ్రెస్ ఎంచుకుందా? తెరాసా పతనానికి ,తెరాసాని ప్రజలు అసహ్యించుకొనేలా చేయడానికి కాంగ్రెస్ ఆపార్టీకే చందిన రఘునందన్ ని ఎంచుకుందా? దీనిలో చంద్రబాబు వ్యూహం కూడా ఉందా? మొన్న డిల్లీలో చంద్రబాబు కాంగ్రెస్ పెద్దలతో చర్చించి ఈ వ్యూహ రచన చేసారా/
అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు!  


 తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు కుటుంబంపై ఆరోపణల వర్షం కురిపించడం ద్వారా ఇతర పార్టీల నుండి వచ్చే నాయకులను నిలువరించడంతోబాటు, ఆయన దూకుడుకు కళ్ళెం వేసేందుకు రాజకీయ ప్రత్యర్థులు పకడ్బందీగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఎంపీలకు గాలమేస్తున్న తరుణంలో కాంగ్రెస్‌ అధిష్టానం పక్కా వ్యూహంతో ఒక పద్ధతి ప్రకారం కెసిఆర్‌పై చేతికి మట్టి అంటకుండా కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.
టి.కాంగ్రెస్‌ ఎంపీలకు నాయకత్వం వహిస్తున్న కె.కేశవరావును అధిష్ఠానం చాలా కాలం పెద్దగా పట్టించుకోలేదు. వారం రోజుల క్రితం కేశవరావును ఢిల్లిd పిలిపించుకుని మరీ సోనియాగాంధీ ఆయనతో మాట్లాడారు. అనంతరం టి.కాంగ్రెస్‌ ఎంపీలు మౌన ముద్ర దాల్చడంతోపాటు తెరాసలో చేరే అంశాన్ని కూడా పక్కనబెట్టినట్లు కనిపిస్తోంది.
కెసిఆర్‌పై సీబీఐ విచారణకు కాంగ్రెస్‌ ఎత్తుగడ వేస్తోందన్న వాదనలు వినవస్తున్నాయి. అయితే తమపై వస్తున్న అపవాదులు రాకుండా ఆ పార్టీ నాయకులనే అస్త్రంగా ఉపయోగించు కుని కెసిఆర్‌ కుటుంబంపై ఆరోపణలు చేయడం ద్వారా సిబిఐ విచారణకు మార్గం సుగమం చేయాలని అధిష్ఠానం భావించడం వల్లే రఘునందన్‌రావు వ్యవహారం ప్రారంభమైన ట్లుగా వార్తలు వినవస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో చీలిక తెచ్చేందుకు కెసిఆర్‌ ప్రయోగించిన అస్త్రమైన కేశవరావునే తిరిగి అతనిపైనే తెలివిగా ప్రయోగించేలా కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని బ్రతికించడం, పార్టీ నాయకులను తెరాస వైపుకు వెళ్ళనీయకుండా అడ్డుకుంటే ప్రతిఫలంగా భవిష్యత్తులో ఒక పదవి ఇస్తామని సోనియా కేకేకు హామీనిచ్చినట్లు రాజకీయ వర్గాల్లో వినవస్తున్నది. అందులో భాగంగానే రఘునందన్‌రావు తెరమీదికొచ్చారని, కెసిఆర్‌ కుటుంబంపై ఆయన చేత ఆరోపణలు చేయించారనే ప్రచారం సాగుతోంది.
తెరాస శాసనసభాపక్షం నాయకుడు ఈటెల రాజేందర్‌ కూడా రఘునందన్‌రావు వెనక ముఖ్యమంత్రి హస్తముందని ఆరోపించారు. మెదక్‌ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షుడు కె.సత్యనారాయణ కూడా హరీష్‌రావుపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణల వెనక ప్రత్యర్థుల కుట్ర ఉందని వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల నాయకులను పార్టీలోకి రప్పించడంలో హరీష్‌రావుది అందెవేసిన చేయి. దీంతో ఆయన దూకుడుకు కళ్ళెం వేయాలనే ఆలోచనతోపాటు కెసిఆర్‌కు హరీష్‌రావుకు మధ్య విభేదాలు సృష్టించవచ్చని, కాంగ్రెస్‌ నాయకత్వం రఘును అస్త్రంగా వదిలినట్లు తెలుస్తోంది. పనిలో పనిగా ఈ వ్యవహారంలోకి మరో ఎంపీ విజయశాంతిని కూడా లాగే ప్రయత్నం చేసినట్లు స్పష్టమవుతోంది.
సిబిఐకి రఘునందన్‌రావుచే ఫిర్యాదు చేయించి అనంతరం కెసిఆర్‌పై సిబిఐ విచారణకు కేంద్రం ప్రయత్నించవచ్చని సమాచారం. సోనియా కేకేతో సమావేశమైన తర్వాతే ఈ ప్రణాళికకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తాను కూడా ఎంపీలతో సహా తెరాసలో చేరుతానని, తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నా ఇబ్బందేమీ లేదని, ఒకవేళ తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చిన కేంద్ర మంత్రులపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఒకానొక దశలో అధిష్ఠానానికి ఎదురు తిరిగారు. అయితే తాజా పరిస్థితుల్లో ఆయన మౌనంగా ఉండడమే కాకుండా ఎంపీలు కూడా నోరు మెదపకపోవడం కాంగ్రెస్‌ వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. రఘునందన్‌రావుచే త్వరలో హైకోర్టులో కేసు వేయించడంతోపాటు సిబిఐకి కూడా ఫిర్యాదు చేయించి విచారణ చేయించేలా కాంగ్రెస్‌ పావులు కదుపుతున్నట్లు సమాచారం.
  మరి తెలంగాణా ప్రజలు , మేధావులు ఎలా ఆలోచిస్తారో వేచిచూడాలి ?
Some content from: Andhraprabha

Monday, May 13, 2013

కర్నాటక బిజెపి పతనంలో కాంగ్రెస్ పావు ఎడ్యురప్ప?

కర్నాటక ఎన్నికలలో విజయానికి సర్వ శక్తులూ ఒడ్డిన కాంగ్రెస్ ఎట్టకేలకు విజయం సాధించింది. కానీ ఆ విజయం వెనుక చాలానే వ్యూహాలు పన్నినట్లు అక్కడి మీడియా చెపుతోంది. దక్షిణ భారత దేశంలో తొలిసారి కర్నాటకలో పాగా వేసిన బీజేపీని యడ్యూరప్పతో కొత్త పార్టీ పెట్టించి, ఆ పార్టీని దెబ్బతీసిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 ఇటీవల జరిగిన కర్నాటక ఎన్నికల్లో యడ్యూరప్ప పార్టీతో బీజేపీ మునిగిపోయిన విషయం తెలిసిందే.
కర్నాటక ఎన్నికలలో మొత్తం 3,12,16,708 ఓట్లు పోలయితే.. అందులో కాంగ్రెస్‌కు 1,14,10,737; బీజేపీకి 63, 32,595; యడ్యూరప్ప నేతృత్వంలో కేజీపీకి 30, 68348 ఓట్లు పోలయ్యాయి. అంటే యడ్యూరప్ప పార్టీని వీడి సొంత పార్టీ పెట్టకపోతే 94 లక్షల ఓట్లు బీజేపీకే వచ్చేవి. అప్పుడు శ్రీరాములు బీఎస్సార్‌పార్టీ, ఇండిపెండెంట్ల మద్దతు కీలమయ్యేవి. అంటే అప్పుడు కాంగ్రెస్‌-బీజేపీ అధికారపీఠానికి దగ్గరగా వచ్చేవి. దీన్ని బట్టి కర్నాటకలో యడ్యూరప్ప పార్టీ బీజేపీ కొంపముంచిందని, ఆ పార్టీ చీల్చిన ఓట్లే కాంగ్రెస్‌ను గెలిపించాయని స్పష్టమవుతోంది. చాలాకాలం పాటు బీజేపీలో ఉన్న శ్రీరాములు కూడా పార్టీ పెట్టడం బీజేపీకి నష్టం కలిగించిందని ఫలితాలు స్పష్టం చేశాయి.
ఇదే వ్యూహాన్ని మన రాష్ట్రంలో " కోదండరాం" తో కూడా అమలుచేసే అవకాశాలు ఉన్నట్లు కొన్ని తెలుగు పత్రికలూ చెపుతున్నాయి. చూద్దాం ఏమి జరుగుతోందో?

Sunday, December 2, 2012

జగన్ను దగ్గర చేసుకోవాలని కాంగ్రెస్ ఆలోచిస్తుందా?

దేశంలో హేమాహేమీలనే పాదాక్రాంతం చేసుకున్న కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీనే సవాల్‌ చేసి, తన సత్తా చాటుతూ ఆ పార్టీని కళ్లు బైర్లు కమ్మి స్తున్న జగన్‌తో కాంగ్రెస్‌ పార్టీ జతకట్టేందుకు సిద్ధమవు తోందా? పాత విభేదాలు మరచి పోయేందుకు మానసికంగా తయారవు తోందా? జగన్‌ వస్తే కాంగ్రెస్‌ బలపడుతుందని భావిస్తోందా? బుజ్జగించి, తగిన హామీలిస్తే ఆయన తిరిగి పార్టీ గూటికి చేరుతారన్న విశ్వాసంతో ఉందా?.. శనివారం నాటి రాజకీయ పరిణామాలు పరిశీలిస్తే ఈ అనుమానం నిజమనించక మానదు.

దేశంలో మళ్లీ యుపీఏ అధికారంలోకి వచ్చేందుకు రాహుల్‌ చేస్తున్న కసరత్తులో భాగంగా కొంతమంది విశ్వసనీయులను నియమించుకుని, వారి ద్వారా సరైన అభ్యర్ధుల ఎంపికపై ఇప్పటినుంచే దృష్టి సారిస్తున్నారు. ఆ క్రమంలో శనివారం రాష్ట్రానికి పరిశీలకులుగా వచ్చిన జితేంద్ర దేశ్‌ ప్రభు, విశ్వజిత్‌ రాణే సీఎల్పీలో పార్టీ నేతలతో మంతనాలు జరిపారు. పార్టీ స్థితిగతులు, భవిష్యత్తుపై చర్చించారు. లోక్‌సభ-శాసనసభ ఎన్ని కలు ఒకేసారి నిర్వహించాలా? విడిగా నిర్వహించాలా? అని అభిప్రాయ సేకరణ నిర్వహించారు. మంత్రులు కాసు కృష్ణారెడ్డి, టిజి వెంకటేశ్‌, మహీధర్‌రెడ్డి, పితాని, డొక్కా, అహ్మదుల్లా, ఏరాసు, సీనియర్‌ ఎమ్మెల్యే జెసి దివాకర్‌రెడ్డి, విజయకుమార్‌ తదితరులు వారిని కలిసి, తమ అభి ప్రాయాలు వెల్లడించారు. ముఖ్యమంత్రి కిరణ్‌, పీసీసీ చీఫ్‌ బొత్స కూడా వారితో చర్చించారు. ఆ తర్వాత బొత్స స్వయంగా ఎమ్మెల్యేలను వారి వద్దకు పంపించడం ప్రస్తావనార్హం.

ఇదిలాఉండగా... తన పార్టీని సవాల్‌ చేసి, బయటకు వెళ్లి రాష్ట్రంలో రాజకీయ ఉనికినే సవాల్‌ చేస్తున్న జగన్‌ను మచ్చిక చేసుకునేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నాలు ప్రారంభిస్తోందన్న సంకేతాలు పరిశీలకుల వ్యాఖ్యలతో స్పష్టమవుతున్నాయి. జగన్‌ తిరిగి పార్టీలోకి వస్తే పార్టీ బలపడుతుందన్న సూచనలు తమకు ఎక్కువ సంఖ్యలో వచ్చాయని, దానిపై మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించారు. అసలు జగన్‌ పార్టీలోకి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయా? వస్తే ఎలా ఉంటుంది? అని తన వద్దకు వచ్చిన వారి వద్ద ఆరా తీశారు. జగన్‌ ఏ పరిస్థితిలో పార్టీ నుంచి బయటకు వెళ్లారు? రాష్ట్రంలో ప్రస్తుతం పార్టీ పరిస్థితి ఏమిటి? అని అడిగారు.

దానికి స్పందించిన కొందరు మంత్రులు జగన్‌ తిరిగి వస్తే బాగానే ఉంటుందని, పార్టీ బలపడుతుందని వారికి చెప్పారు. అయితే కొందరు మాత్రం జగన్‌ మనస్తత్వం ప్రకారం మళ్లీ పార్టీలోకి వచ్చే ప్రసక్తే ఉండదని, అంతగాకాకపోతే, 2014 ఎన్నికల తర్వాత తనకు సంఖ్యాబలం తగ్గితే అప్పుడు ముఖ్యమంత్రి పదవి ఇస్తే, తాను కేంద్రానికి మద్దతునిస్తానన్న షరతు పెట్టే అవకాశం లేకపోలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్‌ ఒకసారి అభిప్రాయానికి వస్తే దానిని మార్చుకోవడం కష్టమని చెప్పారు. తన కోసం ఎవరైనా దిగి రావల్సిందేనని, తనకంటే ఎవరూ గొప్ప కాదని, తానొక దైవాంశసంభూతిడినని, తనకు తప్ప మిగిలిన వారికి ఏమీ తెలియదన్న ధోరణి ఉన్న జగన్‌ దారికి వస్తారన్న నమ్మకం తమకు లేదని విశ్లేషించారు.

జగన్‌ ఎప్పుడు తనకు తాను రాహుల్‌గాంధీ కంటే ఎక్కువ గ్లామర్‌, జనబలం ఉన్న నేతగా ఊహించుకుంటారని, తనది సోనియాగాంధీ కంటే ఎక్కువ స్థాయి అన్న భావనతో పాటు, తనకేమి తక్కువ, తాను ఇంకొకరిపై ఎందుకు ఆధారపడాలన్న స్వతంత్ర భావనలు ఎక్కువగా ఉన్న జగన్‌ తిరిగి పార్టీలోకి వస్తారనుకోలేమని వివరించారు. జగన్‌ వస్తే మంచిదేనని అయితే ఆయన మనస్తత్వం తెలిసిన వారెవరూ తిరిగి వస్తారని అనుకోరని అభిప్రాయపడ్డారు. ఒకసారి ఒక నిర్ణయానికి వస్తే ఇక దానికే కట్టుబడి ఉంటారని, తన వద్దకు వస్తానని ఎవరైనా రాకపోతే ఇక ఆ తర్వాత వారు వచ్చినా మాట్లాడరని, అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వరని, ఇలాంటి మానసిక కోణాన్ని పార్టీ నాయకత్వం పరిగణనలోకి తీసుకుని, దానిపై ఒక నిర్ణయానికి వస్తే మంచిదని సూచించారు.

అయితే, కేంద్రానికి తన ఎంపీలు ఇచ్చి, రాష్ట్రం తనకు ఇవ్వాలన్న షరతు విధిస్తారని ఇంకొందరు వెల్లడించారు. జగన్‌ వస్తే పార్టీ బలపడేమాట నిజమయినప్పటికీ, మళ్లీ కొత్త గ్రూపులు తయారవుతాయని, ఇప్పటివరకూ జగన్‌ను వ్యతిరేకించిన వారి పరిస్థితి ఏమిటని మరికొందరు సందేహం వ్యక్తం చేశారు. జగన్‌ను తిరిగి తీసుకోవాలన్నది పార్టీ విధానమా? లేక కేవలం అభిప్రాయసేకరణ కోసమే అడుగుతున్నారా? వస్తే తీసుకుందామని భావిస్తున్నారా? అని ఒక మంత్రి సందేహం వ్యక్తం చేయగా, అది పార్టీ విధానం కాదని, మీలాంటి వారు ఇచ్చిన సలహాపై చేస్తున్న అభిప్రాయసేకరణ మాత్రమేనని పరిశీలకులు వివరణ ఇచ్చారు.

మాజీ మంత్రి జెసి దివాకర్‌రెడ్డి కూడా జగన్‌ తిరిగి పార్టీలోకి వచ్చే అవకాశాలు తక్కువేనని అభిప్రాయపడ్డారు. 2014 ఎన్నికల్లో జగన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించి, ఆయనపై ఉన్న కేసులు ఎత్తివేస్తే తప్ప పార్టీలోకి రాడని, అది సాధ్యమవుతుందా? అని వారిని ప్రశ్నించారు. కాగా కాసు కృష్ణారెడ్డి, వట్టి వసంతకుమార్‌, డొక్కా మాణిక్యవరప్రసాద్‌, ఏరాసు ప్రతాపరెడ్డి మాత్రం జగన్‌ను తిరిగి పార్టీలోకి వస్తే మంచిదేనన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. లోక్‌సభ-శాసనసభకు ఒే సారి ఎన్నికలు జరపాలన్న ఆలోచన పరిశీలకులు వ్యక్తం చేయగా, దానివల్ల రాష్ట్రంలో నష్టం ఎక్కువ జరుగుతుందని, విడిగానే నిర్వహిస్తే మేలని సూచించారు.

జెసి మాత్రం విడిగానే నిర్వహించాలని, ఈసారి పార్లమెంటుకు కొత్త వారిని ఎంపిక చేయాలని సూచించారు. ఇక తెలంగాణ అంశంపైనా పరిశీలకులు ఆరా తీశారు. తెలంగాణ ప్రకటిస్తే దాని ప్రభావం సీమాంధ్ర మీద ఎలా ఉంటుంది? ఇవ్వకపోతే తెలంగాణలో ఎలా ఉంటుందని అడిగారు. అయితే, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి, బోర్డు ఏర్పాటుచేస్తే సమస్యలు పరిష్కా రమవ ుతున్నాయని, ప్రజలు తెలంగాణతోపాటు అభివృద్ధినీ కోరుకుంటున్నారని చెప్పారు. పార్టీకి సంబంధించి ఎలాంటి సమస్యలు లేవని, ప్రభుత్వం మీదే ప్రజలు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ముగ్గురు మాత్రం కిరణ్‌ మీద ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సీనియర్లను సమన్వయం చేసుకోవడం లేదని ఫిర్యాదు చేశారు.

Tuesday, May 22, 2012

ఆతిద్యం ఇచ్చిన వారిపైనే చిరు బుర్రులాడిన చిరు : ' అనంత 'లో చేదు అనుభవం




అనంతపురం, మే 21: ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం నగరంలో సోమవారం పర్యటించిన రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి చేదు అనుభవం ఎదురైంది. నగరంలో ఉదయం నుంచి నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న చిరంజీవి సాయంత్రం యువజన కాంగ్రెస్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ కోగటం విజయభాస్కరరెడ్డి ఇంటికి తేనీటి విందుకు వెళ్లారు. చిరంజీవితో పాటు మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్, ఎంపి అనంత వెంకట్రామిరెడ్డి, పార్టీ అభ్యర్థి ముర్షీదాబేగం ఉన్నారు.
ఇంటికి వచ్చిన అతిథులకు మర్యాద చేయాలన్న ఉద్దేశంతో కోగటం విజయభాస్కరరెడ్డి చిరంజీవి దగ్గరకు వెళ్లి టీ, స్నాక్స్ తీసుకు రమ్మంటారా అని అడిగారు. దీంతో కోపోద్రిక్తుడైన చిరంజీవి ‘‘యూజ్‌లెస్ ఫెలో.. ఇంకా టీ, స్నాక్స్ తీసుకురమ్మని అడుగుతావా, బుద్ది లేదా నీకు, వెంటనే తీసుకు రా ఫో’’ అంటూ గదమాయించారు. చిరంజీవి మాటలతో కోపంతో ఊగిపోయిన కోగటం విజయభాస్కరరెడ్డి ‘‘ఏయ్ బుద్ది లేదా నీకు, తల తిరుగుతోందా, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదా నీకు, ఇదేమైనా నీ ఇల్లు అనుకున్నావా’’ అంటూ ఫైర్ అయ్యాడు. ఇలా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సాకే శైలజానాథ్ మధ్యలో కల్పించుకున్నారు. ‘‘మీకు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదా, ఇలా అయితే ఎలా అంటూ’’ సుతిమెత్తగా చిరంజీవిని హెచ్చరించారు. కోగటం, శైలజానాథ్ మాటలతో మనస్థాపానికి గురైన చిరంజీవి అలిగి వెళ్లిపోతుండగా పార్టీ కార్యకర్తలు, నాయకులు బుజ్జగించారు. కోగటం చేతే టీ, స్నాక్స్ ఇప్పించారు. కోగటం తెచ్చి ఇచ్చిన టీ, స్నాక్స్‌ను చిరంజీవి అయిష్టంగానే స్వీకరించారు.
(చిత్రం) చిరుపైకి దూసుకెళ్తున్న డిసిసి కార్యదర్శి కోగటం విజయభాస్కర్‌రెడ్డిని సముదాయస్తున్న మంత్రి శైలజానాథ్


Source; andhrabhoomi