Showing posts with label birthday. Show all posts
Showing posts with label birthday. Show all posts

Wednesday, December 12, 2012

స్టార్ స్టార్ సూపర్ స్టార్... రజనీకాంత్

సౌతిండియా నెం.1 హీరో, దక్షిణభారత దేశంలో పరిచయం అక్కర్లేని పేరు.. అతనే శివాజీరావ్‌ గైక్వాడ్‌ అలియాస్ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. ఈరోజు ఆయన పుట్టినరోజు. 62 సంవత్సరాలు పూర్తి చేసుకుని 63 వ ఏట అడుగుపెడుతున్న ఆయన జీవితంలో ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇలాంటి తేదీ (12-12-12) వచ్చేది ఈ ఒక్కరోజే కాబట్టి. ఈ ప్రత్యేక తేదీని పురస్కరించుకుని ఆయన అభిమానులు ఈ వేడుకలను స్పెషల్ గా నిర్వహిస్తున్నారు.

ఆయన జీవితం చూస్తే సినిమా కష్టాలు అంటాం కాని అంతకంటే ఎక్కువగానే ఓ విజయవంతమైన సినిమాకు సరిపడే చరిత్ర రజనీకి ఉంది. అయిదేళ్ల వయసులోనే ఆయన తల్లిని పొగొట్టుకున్నారు. తిండికి నానా పాట్లు పడుతూ ప్రభుత్వ పాఠశాలలో కన్నడ మీడియంలో చదువుకున్నారు. తరువాత జీవన సమరంలో అనేక కష్టాలు పడ్డారు. మూటలుమోసే కూలిగా పనిచేశారు. ఆ తరువాత బస్‌ కండక్టర్‌గా పనిచేశారు.రజనీకాంత్‌ మొదట పాపులర్‌ కన్నడ నాటకాల రచయిత, దర్శకులు టోపి మునియప్ప వద్ద నటనలో శిక్షణపొందారు. ఆయన నాటకాల్లో పలు పాత్రల్లో నటించారు. 1973లో ఆయనతో కలిసి నాటకాలు చేసిన రాజ్‌ బహదూర్‌ అనే స్నేహితుడు రజనీకాంత్‌ను మద్రాస్‌ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరి నటనలో శిక్షణపొందాలని సూచించారు. దీంతో ఈ ఇనిస్టిట్యూట్‌లో చేరిన రజనీకాంత్‌కు రెండు సంవత్సరాల పాటు అవసరమైన ఆర్థిక సహాయం కూడా రాజ్‌బహదూర్‌ చేశాడు. ఒకసారి రజనీకాంత్‌ నాటక ప్రదర్శనను ప్రముఖ దర్శకులు కె.బాలచందర్‌ చూశారు. అనంతరం రజనీ నటనకు మెచ్చుకొని తమిళం నేర్చుకోవాలని సూచించారు. తమిళం నేర్చుకున్న అనంతరమే ఆయనకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.
సినిమాల్లోకి...
1975లో విడుదలైన అపూర్వ రాగాంగల్‌ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు రజనీకాంత్‌. ఈ సినిమా ఆయనకు నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డును తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు కె.బాలచందర్‌ దర్శకత్వం వహించారు. క్రమక్రమంగా ఆయన తమిళ సినీ రగంలో సూపర్‌స్టార్‌గా ఎదిగారు. ఆతర్వాత ఇతర భాషా చిత్రాల్లో కూడా నటించారు. బాలీవుడ్‌లో సైతం హిట్‌ సినిమాలతో తనదైన ముద్ర వేశారు. 2007లో విడుదలైన శివాజీ చిత్రంలో నటించినందుకు గాను ఆయనకు 26 కోట్ల రూపాయల పారితోషికం చెల్లించడం విశేషం. దీంతో ఆసియాలో హీరో జాకీ ఛాన్‌ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకున్న రెండవ హీరో అయ్యారు. సినిమాల్లో హీరోగానే కాకుండా నిర్మాతగా, స్క్రీన్‌రైటర్‌గా కూడా చేశారు. ఇక ఇటీవల విడుదలైన రోబో చిత్రం రజనీకి ఎంతో పాపులారిటీ తీసుకువచ్చింది. చంద్రముఖి, భాషా, శివాజీ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలు రజనీకాంత్‌కు స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టాయి.
అవార్డులు...
పాపులర్‌ హీరో రజనీకాంత్‌కు 2000 సంవత్సరంలో పద్మ భూషణ్‌ అవార్డు దక్కింది. 1984లో రజనీకాంత్‌కు నల్లవనుకు నల్లవన్‌ అనే తమిళచిత్రానికి గాను ఫిల్మ్‌ఫేర్‌ బెస్ట్‌ తమిళ్‌ యాక్టర్‌ అవార్డు వచ్చింది. మూంద్రు ముగమ్‌, ముత్తు, పదయప్ప, చంద్రముఖి, శివాజీ చిత్రాల్లో నటనకు గాను ఆయనకు తమిళనాడు స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డులు వచ్చాయి. 1984లో కలైమమాని అవార్డు, 1989లో ఎంజిఆర్‌ అవార్డులు దక్కాయి. 1995లో సౌతిండియన్‌ ఫిల్మ్‌ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఆయనకు కలైచెలవమ్‌ అవారును అందజేసి ఘనంగా సత్కరించింది. ఇవేగాకుండా పలు అవార్డులెన్నో ఆయన్ని వరించాయి.
కుటుంబ నేపథ్యం...
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 1950 సంవత్సరం డిసెంబర్‌ 12వ తేదీన బెంగళూర్‌లో జన్మించారు. ఆయన మహరాష్ట్ర కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు రాంభాయ్‌, రామోజీరావు గైక్వాడ్‌లు. వారి సంతానంలో చిన్నవాడు రజనీకాంత్‌. ఇద్దరు అన్నలు, ఒక అక్క ఆయనకు ఉన్నారు. సినిమాల్లోకి రాకముందు ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్‌. ఐదు సంవత్సరాల వయసులో తల్లి మృతిచెందడంతో రజనీకి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ సమ యంలో వారి కుటుంబం ఆర్థిక సమస్యలతో సతమతమైంది. చివరికి చిన్నతనంలోనే రజనీకాంత్‌ చిన్న,చిన్న ఉద్యోగాలె న్నింటోనో చేశారు. కూలీగా సైతం పనిచేశారు. ఆయన బెంగళూర్‌లోని ఆచార్య పాఠశాలలో చదువుకున్నారు. రామ కృష్ణ మిషన్‌ విద్యా సంస్థలలో ఉన్నతవిద్యను అభ్యసించారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత 1966 నుంచి 1973 వరకు బెంగళూర్‌, చెనై్న నగరాల్లో పలుచోట్ల పనిచేశారు. కొంతకాలం బెంగళూర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీస్‌లో బస్‌ కండ క్టర్‌గా సైతం పనిచేశారు రజనీకాంత్‌. ఇక రజనీకాంత్‌ సినిమాల్లోకి వచ్చిన అనంతరం 1981లో మన రాష్ర్టంలోని తిరుపతిలో లతా రంగచారి అనే యువతిని 31 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం 1981 సం వత్సరం ఫిబ్రవరి 26న జరిగింది. వారికి ఐశ్వర్య, సౌందర్య అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఐశ్వర్య వివాహం తమిళ హీరో ధనుష్‌తో జరుగగా, సౌందర్య వివాహం పారిశ్రామికవేత్త అశ్విన్‌ రామ్‌కుమార్‌తో జరిగింది.

Thursday, August 16, 2012

దేశం గర్వించదగ్గ తాత్వికుడు.. అరవిందుడు



భారతదేశం గర్వించదగ్గ మహాకవి, రచయిత, స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రసిద్ధ విప్లవకారుడు, రాజనీతికర్త, తాత్వికుడు అరవిందుడు. అరవిందఘోష్ అనే ఈయన క్రీస్తుశకం 1872 ఆగస్టు 15న కృష్ణ్ధనఘోష్, స్వర్ణలతాదేవీల మూడవ కుమారునిగా జన్మించారు. ఇంగ్లండులో విద్యాభ్యాసంలో అశేష ప్రతిభతో కింగ్స్ కాలేజినుంచి ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడయి, తండ్రి కోరికమేరకు ఐ.సి.యస్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఇండియాలోని ఆయన తండ్రికి ఆనందానికి అవధుల్లేవు. సివిల్ సర్వీసులో ఉత్తీర్ణత సాధించడం ఆరోజుల్లో ఒక గొప్ప విషయం. అక్కడ అరవిందుని మనసులో దేశభక్తి భావాలు బీజాలు నాటాయి. అంతే మనసంతా స్వేచ్ఛా విముక్తిపూరిత వాతావరణం అలుముకుంది. సివిల్ సర్వీసు పరీక్షలో ఆఖరి అంశం గుర్రపుస్వారీ. ఉద్దేశ పూర్వకంగా దాన్నుంచి తప్పించుకొని స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఆయన తీసుకున్న నిర్ణయ ఫలితమే భారతదేశానికి ఒక స్వాతంత్య్ర సమరయోధుడు, ఒక మహాజ్ఞాని ఆవిర్భవానికి కారణమయింది. 29 సంవత్సరాల వయసులో (1901)లో అరవిందునికి మృణాళినితో వివాహం జరిగింది. కొంతకాలం కలిసున్నాక బరోడాలో ఉద్యోగానికి అరవిందుడు వెళ్ళాడు. ఆ కాలంలో తన భార్యకు రాసిన లేఖలలో దేశభక్తి, ఆధ్యాత్మికత తొణికిసలాడేవి.
తన భార్యకు రాసిన లేఖలో ‘ఈపాటికి ఎలాంటి విచిత్రమైన వ్యక్తితో జీవితం పంచుకున్నావో నీకు అర్ధమై ఉంటుంది. మూడు రకాల పిచ్చినన్ను వెంటాడుతుంది. 1. ఈ విద్య, విజ్ఞానం, ఆస్తులు అన్నీ భగవంతుడిచ్చినవే. కనుక అన్నీ ఆయనకే చెందుతాయి. మన కుటుంబం గడవటానికి అవసరమైనంతే వుంచుకుని మిగతాదంతా ఆయనకిచ్చేయాలి. 2. నేను ఆ సర్వాంతర్యామిని ముఖాముఖీ చూసి తీరాలి. ఒకవేళ హిందూ సిద్ధాంతం ప్రకారం అందరిలో ఉన్నట్లే ఆయన నాలో కూడా వుండివుంటే ఆ అంతర్ దర్శనాన్ని నేను సాధించి తీరాల్సిందే. 3. నా మాతృదేశం నా కుటుంబానికి సంబంధం లేని ఒక రాక్షసుడు వచ్చి నా తల్లి గుండెలమీద కూర్చుని ఆమె రక్తం త్రాగుతున్నాడు. అది భరిస్తూ నేను నా భార్యతో సుఖంగా గడపగలనా? ఆమె విముక్తికన్నా ఏదీ నాకు ముఖ్యం’ కాదు.
1906దాకా బరోడా కళాశాలలో ఫ్రెంచి, ఆంగ్ల భాషల బోధనా సమయంలోనే ఆయన, బెంగాలీ, సంస్కృతం నేర్చుకుని విపరీతంగా పుస్తకాలు చదివేరు. 1906లో బరోడానుంచి కలకత్తాకు తిరిగి వచ్చాక ‘బందేమాతరం’ పత్రికా సంపాదకునిగా అరవిందుని రచనలు యావద్భారతదేశం దృష్టిని విపరీతంగా ఆకర్షించాయి. 1907లో సూరత్‌లో కాంగ్రెస్ మహాసభలు, మితవాదులు, అతివాదులుగా నాయకుల చీలిక, అక్కడ లాల్,బాల్,పాల్ వారసుడిగా అరవిందులకు గుర్తింపు లభించింది. ఒక బ్రిటీషు జడ్జిని చంపడానికి కుట్ర పన్నారన్న అభియోగంపై ‘బందేమాతరం’ సంపాదకుడు అరవిందుడ్ని, ఆయన సోదరుణ్ని అరెస్టుచేసి, అలీపూర్ జైల్లో పెట్టారు. ఒక ఏడాదిపాటు కొనసాగిన విచారణ అనంతరం అరవిందుడ్ని కోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ, ఆయన సోదరుడికి మాత్రం అండమాన్ దీవుల్లో యావజ్జీవ కారాగారశిక్ష విధించింది. ఈ విచారణ తాలూకు వాదోపవాదాల చివరి దశలో అరవిందుడి కోసం వాదించిన న్యాయవాది చిత్తరంజన్‌దాస్ న్యాయమూర్తి ఎదుట అన్న మాటలు చారిత్రాత్మకమైనవి.
‘‘ఈ కేసులూ, వివాదాలు, స్వాతంత్య్ర పోరాటాలు సమసిపోయాక, ఈయన అజ్ఞాతంలో వున్నా- మరణించినా, ఈ జాతి ఈయన్ని దేశభక్తిని జ్వలింపచేసిన మహాకవిగా, చైతన్యం నిండిన జాతీయతాభావాల ప్రవక్తగా, అపూర్వ మానవతావాదిగా గుర్తిస్తుంది. గౌరవిస్తుంది. ఈయన మరణానంతరం ఈయన బోధనలు ఖండ ఖండాంతరాల్లో ప్రతిధ్వనిస్తాయి.’’ ఆలీపూర్ జైల్లో గడిపిన 13-14 మాసాల కాలం అరవిందుడిలోని ఆధ్యాత్మిక చింతనని ఉద్దీపింపజేసింది. అరవిందుడు జైలునుంచి విడుదలైన తర్వాత 1909 మే 30న ఉత్తర పారాలో సభలో ఆయన చేసిన ప్రసంగం ప్రముఖమైనదే. అందులో నిజమైన సనాతన ధర్మం గురించి మాట్లాడారు. ఆయన మాటల్లో ‘‘మనకు సనాతన ధర్మమే జాతీయత. ఈ జాతి సనాతన ధర్మంతో ముడిపడి వుంది. ఆ ధర్మం క్షీణించిన రోజు మన జాతీయత పతనమవుతుంది. సనాతన ధర్మం వెలుగొందినంత కాలం మన జాతీయత జ్వలిస్తూనే వుంటుంది.’’ ఆలీపూర్ జైలులో అరవిందుడిలో కలిగిన ఆధ్యాత్మిక వికాసం- స్వామి వివేకానంద, సిస్టర్ నివేదితల ప్రోత్సాహంతో ఆయన పాండిచ్చేరి వెళ్ళడానికి (1910), అక్కడ ఆశ్రమవాసంలో ఆధ్యాత్మిక బోధన సాగించడానికి కారణమైంది. ఆయన జన్మదినమైన ఆగస్టు 15న స్వాతంత్య్రం రావడాన్ని విని స్వామి ఇలా స్పందించారు. ‘‘్భరత మాతకి విదేశీ శృంఖలాలు తొలగాయి. ఇప్పుడు ఆమెను రాజకీయంగా,సాంస్కృతికంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా మానవతా విలువలపరంగా ప్రపంచంలోకెల్లా మహోన్నత దేశంగా నిలబెట్టేలా మన ఆలోచనలని, జీవన సరళిని మనమే రూపొందించుకోవాల్సి ఉంది.’’ ఈ దేశంలో రెండు మహత్తరమైన జననాలు ఆగస్టు 15న సంభవించాయి. ఒకటి దేశానికి స్వాతంత్య్రం కాగా, రెండోది అరవిందుని అరుణోదయం. పాండిచ్చేరిలోని అరవిందాశ్రమం నేడు యావత్ ప్రపంచాన్నీ ఆకర్షిస్తున్న అపూర్వ ఆధ్యాత్మిక కేంద్రమై అలరారుతున్నది.

Source : http://andhrabhoomi.net/content/desam-6

Tuesday, April 24, 2012

మాస్టర్ బ్లాస్టరే అతడు (నేడు సచిన్ పుట్టినరోజు )



ఈ కాలం కుర్రకారుకి క్రికెట్ అన్న పేరు చెప్పగానే మొదటగా గుర్తుకువచ్చే పేరు సచిన్‌ రమేష్‌ టెండూల్కర్‌. 1973 ఏప్రిల్‌ 24న సచిన్‌ జన్మించి అంతర్జాతీయ క్రికెట్లో నెంబర్ వన్ స్దానానికి చేరుకున్న క్రికెట్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు ఈరోజుతో 39 ఏళ్లు నిండాయి. 1989లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టిన సచిన అతి తక్కువ సమయంలో ఎన్నో మరుపురాని రికార్డులను నెలకొల్పాడు.
భారత క్రికెట్‌పై తనదైన ముద్రవేసిన మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తనలో సత్తా ఉన్నంత కాలం క్రికెట్‌ను వదిలేది లేదని ఎప్పటినుంచో చెప్తున్నాడు. తనలో దాగున్న అద్భుతమైన టాలెంట్‌కు తోడు అకుంఠిత దీక్ష, నిరంతర శ్రమే సచిన్‌ను 23ఏళ్లుగా మాస్టర్‌ బ్లాస్టర్‌ గా నిలబెట్టింది. 1989 లో క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఈ లిటిల్‌ మాస్టర్‌.. తన ఉనికిని చాటుకోడానికి ఎంతో కాలం పట్టలేదు. తనను తాను భారత క్రికెట్‌కు అమూల్యమైన క్రికెటర్‌గా తీర్చిదిద్దుకున్న మాస్టర్‌ ఆతర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. తన కెరీర్‌లో ఎన్నో రికార్డులను బద్దలేకొట్టాడు. మరెన్నో అనితర సాధ్యమైన రికార్డులను నిర్మించాడు. టెస్టుల్లో, వన్డేల్లో వేలకొలది పరుగులు చేయడమే కాకుండా తాజాగా వందసెంచరీల మహోన్నతమైన రికార్డును నెలకొల్పి ప్రపంచ క్రికెటర్లందరికీ సవాల్‌ విసిరాడు. ఇప్పటికీ సచిన్‌ టెండూల్కర్‌ మ్యాచ్‌లో లేడంటే.. చాలా మంది టీవీల్లో మ్యాచ్‌ చూడడం మానేస్తారు. ఇప్పటికీ ఇటువంటి ట్రెండ్‌ కొనసాగుతుందంటే కేవలం మాస్టర్‌ క్లాసే కారణం.
ఇప్పుడు వస్తున్న క్రికెటర్లందరినీ మీ ఇన్‌స్పిరేషన్‌ ఎవరు అని అడిగితే చెప్పే పేరు ఒక్కటే మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌. 23 ఏళ్లుగా సచిన్‌ క్రికెట్‌ పై మమకారాన్ని చాటాడు. ఇప్పటికీ క్రికెట్‌ పై మోజు తగ్గలేదంటున్న సచిన్‌.. తగ్గిన రోజు వైదొలుగుతానన్నాడు. అతడి రికార్డులు, అవార్డులు, రివార్డులు మరే ఇతర క్రికెటర్‌ సాధించి ఉండడు. ద్రవిడ్‌, సెహ్వాగ్‌ నుంచి విరాట్‌ కోహ్లి, రైనా, రోహిత్‌, రహానే వంటి క్రికెటర్ల వరకు అందరూ చెప్పేది ఒకటే పేరు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌. తన విధ్వంసాలు, విన్యాసాలను చూసి భారత్‌లో బ్యాట్‌ పట్టిన క్రికెటర్లు కొన్ని వందల మంది ఉంటారు.
గత ఏడాది వరల్డ్‌ కప్‌లో తన పవర్‌ చూపించిన మాస్టర్‌.. వరల్డ్‌ కప్‌ గెలవడంతో ఉబ్బితబ్బిబె్బైపోయాడు. ఆతర్వాత 2011 ఐపీఎల్‌లోనూ రెచ్చిపోయి ఆడాడు. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత కొన్ని రోజులు రెస్ట్‌ తీసుకున్న సచిన్‌ ఇంగ్లండ్‌ టూర్‌కు వెళ్లాడు. ఆటూర్‌లో జట్టు ఘోర ప్రదర్శన ఇచ్చింది. దాన్లో సచిన్‌ కంట్రిబ్యూషన్‌ కూడా ఉంది. ఆవెంటనే జరిగిన రెండు వన్డే సిరీస్‌లకు మాస్టర్‌ దూరంగా ఉన్నాడు. నవంబర్‌లో వెస్టిండీస్‌తో స్వదేశంలోనే జరిగిన టెస్టు సిరీస్‌లో సచిన్‌ భారీ స్కోర్లు చేయలేకపోయాడు. సచిన్‌ ఆటలో లోపం లేకున్నా.. వందో సెంచరీ ఒత్తిడి అతడిపై స్పష్టంగా కనిపించింది. 50 పరుగులు దాటిన తర్వాత మాస్టర్‌ ఒత్తిడికి గురై వికెట్‌ సమర్పించుకునేవాడు. ఆ వైఫల్యం ఆ తర్వాత జరిగిన ఆస్ట్రేలియా టూర్లోనూ కనిపించింది. ఆస్ట్రేలియాలో 4 టెస్టులు, దాదాపు 7 వన్డేలు ఆడిన సచిన్‌.. ఒక్క సారి కూడా సెంచరీ చేయలేకపోయాడు. సిడ్నీ టెస్టులో ఆ అవకాశం లభించినా సద్వినియోగపర్చుకోలేకపోయాడు.  గతేడాది వరల్డ్‌ కప్‌లో సౌతాఫ్రికాపై చేసిన సెంచరీ తర్వాత సచిన్‌ మరో సెంచరీ చేయడానికి ఏడాది కాలం పట్టింది. ఎందుకంటే అతడికి అది వందో వంద కాబట్టి. ఏడాది పాటు ఊరించిన ఈ మెమొరబుల్‌ ఫీట్‌ను టెండూల్కర్‌ గత నెలలో బంగ్లాదేశ్‌లో జరిగిన ఏషియా కప్‌లో సాధించాడు. బంగ్లాతో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో సచిన్‌ 138 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్స్‌ సాయంతో శతక శతకాన్ని సాధించాడు. ఈ సెంచరీ కోసం అభిమానులు 12 నెలలుగా వేచి చూశారు. సచిన్‌ సెంచరీ అనంతరం అభిమానులు పరవశించిపోయారు.
క్రికెట్‌ ఎవరెస్ట్‌గా ఎదిగిన సచిన్‌ టెండూల్కర్‌ భారత క్రికెట్‌పైనే కాకుండా యావత్‌ ప్రపంచ క్రికెట్‌పై తనదైన ముద్రను వేశాడు. భారతదేశ కీర్తి ప్రతిష్టలను నలుదిశలా వ్యాపింపజేసిన వారిలో మొదటి వరుసలో మాస్టర్‌ నిలిచాడు. తన అకుంఠిత దీక్షతో క్రికెట్‌లో అత్యున్నత స్థానానికి ఎదిగిన సచిన్‌.. ఎందరో యువకులకు ఆదర్శప్రాయుడయ్యాడు. అటువంటి మాస్టర్‌కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇచ్చి గౌరవించాలని దేశం నలువైపులనుంచి అభిమానులు, క్రికెటర్లు, రాజకీయనాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం సచిన్‌ పేరును భారతరత్న నామినేషన్స్‌కు కూడా సిఫార్సు చేసింది. భారత ప్రభుత్వం ఇటీవలే భారతరత్న నామినేషన్స్‌ జాబితాలోకీ క్రీడాకారులను కూడా అనుమతించడంతో సచిన్‌ పేరును నామినేట్‌ చేయాలని డిమాండ్లు ఎక్కువయ్యాయి. అన్నీ కుదిరితే అతి త్వరలోనే సచిన్‌ టెండూల్కర్‌ పేరుకు ముందు భారతరత్న వచ్చి చేరుతుంది.
ఓ వైపు వయసు మీదపడుతోంది. మరోవైపు ద్రవిడ్‌, పాంటింగ్‌, గంగూలి వంటి సమకాలీన క్రికెటర్లు ఆటకు గుడ్‌ బై చెప్తున్నారు.దీంతో సచిన్‌పై రిటైర్మెంట్‌ ఒత్తిడి బాగా పెరిగింది. దీనికితోడు గత ఏడాదిగా అతడికి టైమ్‌ సరిగా కలిసిరాట్లేదు. వందో సెంచరీ కోసం ఏడాది పాటు ఆగాడు. మరోవైపు గాయాలు కూడా బాధిస్తుండడంతో సచిన్‌ను క్రికెట్‌ నుంచి వైదొలగాలి అన్న డిమాండ్లు బాగా పెరిగాయి. దీని సచిన్‌ డైరెక్ట్‌గా కాకపోయినా ఇండైరెక్ట్‌గా సమాధానమిచ్చాడు. తనలో పరుగుల కాంక్ష చావలేదని. తనలో పరుగులు చేయాల్సిన సత్తా తగ్గిన రోజు క్రికెట్‌ను వీడుతానని చెప్పాడు. దీంతో సచిన్‌ ఇప్పట్లో రిటైర్మెంట్‌ ఇచ్చేది లేదని పరోక్షంగా చెప్పాడు. ఏదేమైనా ఈ పుట్టినరోజు సచిన్‌కు ఆనందంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Friday, April 20, 2012

అలుపెరుగని పోరాటవాది మన చంద్రబాబు ( జన్మదినం సందర్భంగా )

ఏప్రిల్ 20, 1950 న చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో జన్మించిన తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు కు నేడు 61 సంవత్సరాలు నిండాయి. వందలాది పార్టీ అభిమానులు, నాయకులు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
పుణ్యక్షేత్రమైన తిరుపతికి 12 కిలోమీటర్ల దూరంలో, కనీసం గ్రామ పంచాయితీ అయినా కాని కుగ్రామం నారావారిపల్లెలో నారా ఖర్జూర నాయుడు, అమ్మణ్ణమ్మ దంపతులకు 1950 ఏప్రిల్‌ 20వ తేదీన జన్మించారు చంద్రబాబు నాయుడు.
వ్యవసాయ కుటుంబంలో జన్మించిన చంద్రబాబు చిన్నతనం నుంచే కష్టించి పనిచేసే వారు. చంద్ర బాబు కు ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో ఎకనామిక్స్ లో మాస్టర్స్ చేసారు చంద్ర బాబు.శేషాపురంలో ప్రాథమిక విద్య అనంతరం చంద్రబాబు సెకండరీ విద్యకోసం చంద్రగిరికి వెళ్ళారు. అక్కడ బంధువుల ఇళ్ళలో ఉంటూ పదవ తరగతి వరకూ చదివారు.

ఆ తర్వాత ఆయన చదువు తిరుపతికి మారింది. తిరుపతిలో హాస్టలు జీవితం. ఆయనలో నాయకత్వ లక్షణాలు అప్పటినుంచే వెలుగు చూశాయి. ఎస్‌.వి. ఆర్ట్స్‌ కాలేజీలో బిఏ ఎకనమిక్స్‌, పొలిటికల్‌ హిస్టరీ చదివే సమయంలోనే ఆయన గ్రామాభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేశారు. వినాయక సంఘం పేరిట సామాజికాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు8. 1972 ప్రాంతంలో జనాన్ని సమీకరించి ఐదున్నర కిలోమీటర్ల పొడవున రోడ్డు వేయించారు. ఆధునిక దృష్టి అపారంగా ఉన్న ఆయన ఆ రోజుల్లోనే నారావారిపల్లెకు బుల్‌రోజర్లు తెప్పించారు. భూమిని చదును చేయించి పంటలు పండించారు. కష్టపడి పనిచేయడం, కొత్తదనం కోసం పరితపించడం ఆయనకు చిన్ననాటినుంచి అబ్బిన లక్షణాలు.

వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆయన రాజకీయ జీవితానికి వేదిక అయింది. ఒకవైపు చదువు, వ్యవసాయం, సంఘసేవ, మరోవైపు రాజకీయ కార్యక్రమాలు. ఇలా ఆయన ఎంఏ పూర్తిచేశారు. యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఎన్నికల్లో ఆయన పాత్ర కీలకంగా ఉండేది. చంద్రగిరి బ్లాక్‌ యువజన కాంగ్రెస్‌ కార్యదర్శిగా ఆయన 1977 దివిసీమ ఉప్పెన సమయంలో యువజన దళాన్ని వెంటబెట్టుకుని సహాయకార్యక్రమాల్లో పాల్గొన్నారు.
చదువు పూర్తయిన తరువాత రాజకీయాల వైపు ఆసక్తి చూపుతున్న చంద్రబాబు కు 1978 లో చంద్రగిరి స్థానం నుంచి పోటీచేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ఈ ఎన్నికలలో విజయం సాధించిన చంద్రబాబు తన 29 వ ఏట టి అంజయ్య మంత్రివర్గంలో మంత్రిగా నియముతులయ్యారు.
ఒక చిత్ర షూటింగ్ సమయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి పరిచయమయ్యారు చంద్రబాబు. అటు పిమ్మట రామారావు గారు తన కూతురును వివాహం చేసుకోవలసిందిగా సందేశం పంపారు. దీనికి సంమతమయిన చంద్రబాబు వివాహం భువనేశ్వరి తో మద్రాసులో జరిగింది.
తరువాత రామారావు గారు 1982 స్థాపించిన తెలుగుదేశంలో చేర వలసిందిగా చంద్రబాబు కు సందేశం పంపారు రామారావు గారు. దీనిని తిరస్కరించిన చంద్రబాబు కాంగ్రెస్ లోనే కొనసాగుతూ 1983 లో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు చంద్రబాబు నాయుడు. ఈ ఓటమి తరువాత కాంగ్రెస్ ను వీడి తెలుగుదేశం లో చేరారు.
తెలుగుదేశం లో చేరిన మొదటి సమయంలో నాదెండ్ల భాస్కరరావు వర్గం ముందు చంద్రబాబు కు అంతగా ప్రాముఖ్యం ఇచ్చే వారు కాదు.
నాదెండ్ల భాస్కరరావు రామారావు గారితో విభేదించిన తరువాత చంద్ర బాబు నాయుడు గారు పార్టీలో పట్టు సాధించటం మొదలు పెట్టారు. ఈ సందర్భంగా కుప్పం స్థానం నుంచి తెలుగుదేశం తరఫున పోటీ చేసి గెలిచారు చంద్ర బాబు నాయుడు.
రాష్ట్రంలో తెలుగుదేశం పరిపాలనలో ఆర్ధిక మంత్రిగా కొనసాగారు చంద్రబాబు నాయుడు.1984లో ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చివేసినపుడు చంద్రబాబు సారథ్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం చారిత్రాత్మకం. ఆ తర్వాత ఆయన సామర్ధ్యాన్ని గుర్తించిన తెలుగుదేశం పార్టీ ఆయనకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవీ బాధ్యతలు అప్పగించింది. 1989 ఎన్నికల్లో కుప్పం శాసనసభ నియోజకవర్గం నుంచి గెలిచారు చంద్రబాబు. ఆ ఎన్నికల ఫలితాల రీత్యా తెలుగుదేశం ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. మళ్ళీ 1994 ఎన్నికల్లో తెలుగుదేశం విజయఢంగా మోగించింది. చంద్రబాబు రెవెన్యూ, ఆర్థిక శాఖలు నిర్వహించారు. అనంతరం 1995లో ఏర్పడ్డ సంక్షోభం చంద్రబాబుకు కొంత ఇబ్బంది తెచ్చిపెట్టింది. పార్టీ యంత్రాంగాన్ని పరిరక్షించే కర్తవ్యాన్ని చేపట్టారు. ఆ విధంగా తెలుగుదేశం పార్టీలో నాయకత్వ మార్పిడి జరిగాక చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు.
ఇక ఆయన వెనుతిరిగి చూడలేదు. పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. రోజుకు 18 గంటలు తాను శ్రమిస్తూ, ఇతరులలో కష్టపడే తత్వాన్ని పెంపొందించారు. దేశంలోనే ఇన్షర్మేషన్‌ టెక్నాలజీకి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఇ-గవర్నెన్స్‌కు నాంది పలికారు. 2004 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఓటమిపాలైనప్పటినుంచి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ధ్వజమెత్తుతూ, ప్రభుత్వ వైఫల్యాలను సభలో, ప్రజల్లో నిరంతరం ఎండగడుతూ కృషి చేస్తున్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజలమధ్య ఉంటూ వారికోసం పనిచేసే నేతగా ముందుకు సాగుతున్నారు.
( Collections from : Suryaa daily and some wiki articles )

Thursday, April 5, 2012

బడుగుల ఆశాజ్యోతి ! (నేడు జగ్జీవన్‌రామ్ 104వ జయంతి)

బీహార్ రాష్ట్రంలో అట్టడుగు కులంలో జన్మించి భారత రాజకీయాల్లో అత్యున్న తస్థాయికి ఎదిగిన అరుదైన నేత బాబూ జగ్జీవన్‌రామ్. విద్యార్థి దశలోనే సామాజిక సేవా కార్యక్రమాలతో గుర్తిం పుపొంది, మూడు పదులు కూడా నిం డని వయసులో బీహార్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికై బడుగుల ఆశాజ్యోతిగా వెలుగొందాడు. 1908 ఏప్రిల్ 5న బీహార్ రాష్ట్రంలోని చాంద్వా గ్రామంలో చమార్ కులానికి చెందిన బసంతీదేవి, శోభిరామ్ దంపతులకు జన్మించాడు. కలకత్తా, బనారస్ విశ్వవిద్యాలయాల నుంచి ఉన్నతవిద్యలో పట్టాలు పొందారు.

1934లో బీహార్‌లో సంభవించిన భూకంప బాధితులను ఆదుకోవడంలో జగ్జీవన్‌రామ్ చూపిన చొరవ అనన్యమైనది. అనారోగ్యంతో మొదటి భార్య కన్నుమూయడంతో, 1935లో కాన్పూర్‌కు చెందిన ఇంద్రాణితో రెండో వివాహం జరిగింది. బాబూ రాజేంద్రప్రసాద్, మహాత్మాగాంధీ ఆశీస్సులతో భారత స్వాతంత్య్రోద్యమంలోనూ, జాతీయ కాంగ్రెస్ కార్యకలాపాల్లోనూ బాబూ జగ్జీవన్‌రామ్ చురుగ్గా పాల్గొన్నారు. 1946లో నెహ్రూ మంత్రివర్గంలో కార్మిక మంత్రిగా ప్రమాణం చేశారు. 1950లో జెనీ వాలో జరిగిన ప్రపంచ కార్మిక మహాసభల్లో ఆయన పాల్గొనడం విశేషం. 

1957లో కేంద్ర రైల్వేశాఖ మంత్రిగా పనిచేసిన జగ్జీవన్‌రామ్, తదనంతరం వ్యవసాయశాఖ మంత్రిగా కొనసాగారు. 1970లో అఖిల భారత కాంగ్రెస్‌పార్టీ ఆధ్యక్షునిగా వ్యవహరించారు. 1971లో జగ్జీవన్‌రామ్ కేంద్ర రక్షణశాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో ‘బంగ్లాయుద్ధం’ జరిగి పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ విడివడి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. 1969లో కాంగ్రెస్ పార్టీ నుంచి భారత రాష్ట్రపతి అభ్యర్థిగా తొలుత నీలం సంజీవరెడ్డిని ప్రకటించిన ఇందిరాగాంధీ, తరువాత బెంగళూరులో జరిగిన పార్టీ మహాసభలో జగ్జీవన్‌రామ్‌తో వీవీ గిరి పేరును ప్రతిపాదింపచేసి, ‘ఆత్మప్రబోధం’ ప్రకారం రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని చేసిన ప్రకటన సంచలనంగా మారింది.

1975 ‘ఎమర్జెన్సీ’ అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి ‘కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ’ పేరుతో జగ్జీవన్‌రామ్ కొత్త పార్టీని ప్రారంభించారు. 1977 ఎన్నికల్లో జయప్రకాశ్ నారాయణ్ స్థాపించిన జనతాపార్టీతో పొత్తు పెట్టుకుని అఖండ విజయాన్ని సాధించి, తదనంతరం భారత ఉప ప్రధానిగా దేశానికి ఎనలేని సేవలందిం చారు. కేంద్ర ప్రభుత్వంలో కార్మిక, రైల్వే, వ్యవసాయ, సమాచార శాఖల మంత్రిగా జగ్జీవన్‌రామ్ రాజకీయ విజ్ఞతను ప్రదర్శించారు. 

పరిపాలనా దక్షునిగా, అట్టడుగు వర్గాల అసాధా రణ నేతగా భారతీయ సమాజ పరివర్తనలో విలక్షణమైన పాత్ర పోషించిన జగ్జీవన్‌రామ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రభావం తనపై ఎంతగానో ఉందని సవినయంగా ప్రకటించడం గమనార్హం. 1948లో ఒకసారి, 1976లో మరోసారి హైదరాబాద్‌లో జరిగిన అణ గారిన వర్గాల మహాసభల్లో పాల్గొని తన సందేశాన్ని తెలుగు ప్రజలకు వినిపించారు. ఆంధ్రా యూనివర్సిటీ ఆయనను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. జగ్జీవన్‌రామ్ 1986 జూలై 6న తుది శ్వాస విడిచారు. నేటితరం దళిత, బహుజన నేతలకు ఆయన జీవితం అనుసరణీయం.

గుండాల రాకేష్ నర్సరావుపేట, గుంటూరు జిల్లా ( From Sakshi blogs)