Showing posts with label News. Show all posts
Showing posts with label News. Show all posts

Friday, March 16, 2012

సచిన్ వందో సెంచరీ కొట్టాడోచ్ !!


అంతర్జాతీయ క్రికెట్ లో సచిన్ చరిత్ర సృష్టించాడు. ఏడాదిగా ఎదురు చూస్తున్న వందవ సెంచరీ కొట్టాడు. ఆసియా కప్‌లో భాగంగా భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య ఇక్కడ జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో సచిన్ సెంచరీ కొట్టాడు. ఉత్కంఠగా ఎదురు చూసిన అభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టారు. 33 ఇన్నింగ్స్ తరువాత ఈ సెంచరీ కొట్టాడు.
టెస్ట్ లో 51 సెంచరీలు చేసిన సచిన్ వన్డేల్లో 49 సెంచరీలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లో వంద సెంచరీలు చేసిన ఒకేఒక్కడుగా సచిన్ నిలిచాడు. సచిన్188 టెస్ట్ మ్యాచ్ లు, 462 వన్డే మ్యాచ్ లు ఆడాడు. అన్ని టెస్ట్ దేశాలపైన సెంచరీ చేశాడు. ఒన్డేల్లో అన్ని టీమ్ లపై సెంచరీలు చేసిన ఘనత దక్కించుకున్నాడు.ఆస్ట్రేలియాపై అత్యధికంగా 8 సెంచరీలు చేశాడు. 1990 ఆగస్ట్ 14న సచిన్ ఇంగ్లండ్ పై తొలి సెంచరీ చేశాడు.

Friday, March 2, 2012

ఎట్టకేలకు జగన్ ఎమ్మెల్యేలపై అనర్హతవేటు

జగన్ కు మద్దతు పలుకుతున్న ఎమ్మెల్యేలు 16 మందిని శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అనర్హులుగా ప్రకటించారు.
సిబిఐ ఛార్జిషీట్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుని చేర్చడంతో మన:స్తాపం చెందిన వీరు ఆగస్టు 24న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ 17 మంది అవిశ్వాస తీర్మానికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ అంశానికి సంబంధించి సుదీర్ఘంగా జరిగిన డ్రామాకు తెరపడింది.

స్పీకర్ అనర్హులుగా ప్రకటించిన ఎమ్మెల్యేలు:

ఒంగోలు - బాలినేని శ్రీనివాస రెడ్డి
పత్తిపాడు - మేకతోటి సుచరిత
మాచర్ల - పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి
నరసన్నపేట - ధర్మాన కృష్ణదాస్
పాయకరావుపేట - గొల్ల బాబురావు
అనంతపురం - గురునాధరెడ్డి
రాజంపేట - ఆకేపాటి అమరనాథ రెడ్డి
రాయదుర్గం - కాపు రామచంద్రారెడ్డి
పరకాల - కొండా సురేఖ
రైల్వేకోడూరు - కొరముట్ల శ్రీనివాసులు
రామచంద్రాపురం - పిల్లి సుభాష్ చంద్రబోస్
ఉదయగిరి - మేకపాటి చంద్రశేఖర రెడ్డి
రాయచోటి - గండికోట శ్రీకాంత రెడ్డి
తెల్లం పోలవరం - బాలరాజు
ఎమ్మిగనూరు - కె. చెన్నకేశవ రెడ్డి
నర్సాపురం - ముదునూరి ప్రసాద రాజు
కాగా,
జగన్ కు మద్దతు పలుకుతున్న ఎమ్మెల్యేలు 16 మందిని అనర్హులుగా ప్రకటించిన శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి రాజీనామాని ఆమోదించారు. శోభానాగిరెడ్డిని అనర్హురాలుగా ప్రకటించాలని పిఆర్ పి ఇచ్చిన లేఖని స్పీకర్ పరిగణనలోకి తీసుకోలేదు. ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయినందున, ఆమెని అనర్హురాలిగా ప్రకటిస్తే న్యాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉన్నందున స్పీకర్ ఆమె రాజీనామాని ఆమోదించారని భావిస్తున్నారు.

Monday, February 20, 2012

తిరుమలలో భారీ అగ్నిప్రమాదం

తిరుమలలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీవారి ఆలయ ప్రాంగణం సమీపంలోని రాంబగీచా అతిథిగృహం ఎదురుగా ఉన్న మినీ షాపింగ్ కాంప్లెక్స్ లో ఈప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు పది దుకాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడటంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. షార్ట్ సర్య్కూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. సుమారు రూ.10 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది.

Monday, February 6, 2012

మైనారిటీ శాఖ మంత్రిని కలవాలంటే.. ముస్లింల టోపీ ధరించాలా!

(చిత్రం) ముస్లిం సంప్రదాయ టోపీ ధరించి మంత్రి అహ్మదుల్లాను కలిసిన కర్నూలు జిల్లా కలెక్టర్ రాంశంకర్ నాయక్, ఎస్‌పి శివప్రసాద్.

ఏదైనా ప్రార్థనా మందిరానికి వెళ్లినప్పుడు ఆయా మతాల ఆచార వ్యవహారాలను పాటించడం పరిపాటి. ముస్లింల ప్రార్థనా మందిరాలకు వెళ్లినపుడు ప్రముఖులు సైతం ముస్లిం సంప్రదాయం ప్రకారం టోపీ ధరించడం మనం చూస్తుంటాం. అయితే ఆదివారం కర్నూలుకు వచ్చిన మైనారిటీ వర్గానికి చెందిన మంత్రివర్యులు అహ్మదుల్లాను కలిసేందుకు వెళ్లిన జిల్లా కలెక్టర్ రాంశంకర్‌నాయక్, ఎస్‌పి శివప్రసాద్ ముస్లిం టోపీ ధరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో తన శాఖకు సంబంధించిన పనుల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించడానికి మైనారిటీ శాఖా మంత్రి అహ్మదుల్లా ఆదివారం కర్నూలు వచ్చారు. ఈ సందర్భంగా మంత్రిని కలిసేందుకు వెళ్లిన కలెక్టర్, ఎస్పీ ముస్లింల టోపీ ధరించడం చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి ప్రొటోకాల్ ఉన్నా, ఎక్కడికి వెళ్లినా నిత్యం ఖాకీ టోపీ తలపై పెట్టుకునే జిల్లా పోలీసు బాస్ అందుకు విరుద్ధంగా వ్యవహరించం గమనార్హం.
అయితే ఇక్కడ మరో గమ్మత్తేమిటంటే వాస్తవానికి ముస్లిం వర్గానికి చెందిన మంత్రి అహ్మదుల్లా తలపై ఎలాంటి టోపీ లేకుండానే అధికారులతో మాట్లాడారు. జిల్లాకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు మంత్రికి స్వాగతం పలికేందుకు వెల్లినపుడు ముస్లింల టోపీ ధరించడం వెనుక ఉన్న మతలబేమిటో అర్థం కావడం లేదు. మంత్రిని ప్రసన్నం చేసుకునేందుకా.. లేక మత విశ్వాసాలను గౌరవిస్తున్నామని చెప్పుకునేందుకా.. దీనికి సమాధానం అధికారులే చెప్పాలి