Sunday, October 11, 2015

భయం లేదు.. ప్రళయం ఇప్పట్లో రాదు


భయం లేదు.. ప్రళయం ఇప్పట్లో రాదు
లండన్: భూమికి ఇప్పుడప్పుడే అంతం లేదని.. ప్రళయం వంటి విపత్కర పరిస్థితులు ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సోమవారం హామీ ఇచ్చింది. దాదాపు 2.5 కిలోమీటర్ల వ్యాసార్థం కలిగిన ఒక గ్రహశకలం భూమిపైకి దూసుకువస్తున్నదని.. దీని వేగం.. సాంద్రతను అంచనా వేసినప్పుడు..ఒకవేళ అది భూమిని ఢీకొంటే విశ్వ వినాశనం తప్పదన్న వార్తలను నాసా కొట్టిపారేసింది.

ఆస్టరాయిడ్86666 అనే పేరు గల ఈ గ్రహశకలం శనివారం భూమికి అతి సమీపం నుంచి వెళ్తుందని ముందుగానే నాసా శాస్త్రవేత్తలు చెప్పిన సంగతి తెలిసిందే. అది భూమిని ఢీకొంటుందని.. దానివల్ల ప్రపంచం క్షణాల్లో నాశనమవుతుందని గత నెలరోజులుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే.. దీని ప్రయాణం గురించి నాసా శనివారం తెలిపింది. ‘ఆస్టరాయిడ్ 86666 అక్టోబర్ 10న భూమిని 15 మిలియన్ మైళ్ల దూరం నుంచి సురక్షితంగా దాటుతుంది.’’ అని పేర్కొంది.  రానున్న వందేళ్లలో గ్రహశకలాల వల్ల భూమికి ప్రమాదం 0.01శాతం మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది.