Thursday, May 30, 2013

రెంటికీ చెడిన రేవడి అయిన జూ.ఎన్టీయార్

hero-jr-ntr-need-advisors

బహుశా జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పు డు తెలుగు పద్యాలు ఏవీ చదువుకుని వుండకపోవచ్చు. లేదంటే, తన కోపమె తన శతృవు..తన శాంతమె తనకు రక్ష…అన్న నానుడి పట్టుబడి వుండేది. కనీసం తెలుగు మీడియంలోనైనా చదివి వుంటే, ఓర్చినమ్మకు తేటనీరు అన్న సామెతన్నా తెలిసి వుండేది. ఇలాంటి విషయాలు ఏవి తెలిసి వున్నా, ఇప్పడిలా కోరి తలకాయనొప్పులు తెచ్చుకునేవాడు కాదు.
జూనియర్ ఎన్టీఆర్ నిజానికి ఓ సక్సెస్ స్టోరీ. తండ్రి, ఓ కుటుంబం ఇలాంటి వాటికి దూరంగా తల్లితోడదే లోకంగా బతికాడు. భగవంతుడు అనుగ్రహించి, బాబాయిలకు సైతం పూర్తిగా రాని తాత అందాన్ని అందించాడు. ఆపై అనుకోకుండా నటవారసత్వం అందివచ్చింది. జనం జేజేలు పలికారు. కానీ అక్కడే జూనియర్ తో తేడా వచ్చింది. ఇదంతా తన అదృష్టం అనుకున్నట్లు కనిపించలేదు. తనకు తిరుగులేదన్న ధీమా పెంచుకున్నట్లు కనిపించింది.
గడచిన ఎన్నిక్లలో పార్టీ తరపున ప్రచారం చేయడం తెలుగుదేశానికి సీట్లు తెచ్చిపెట్టకపోయినా, జూనియర్ రాజకీయ కాంక్షకు బీజాలు వేసిందేమో? తనను తాను కాస్త ఎక్కువగానే ఊహించుకునేలా చేసిందేమో? బండి బాట మారిపోయింది. తెలుగుదేశం వారసత్వం తనకు కావాలన్న తపన పెరిగినట్లుంది. సినిమా రంగంలో కావచ్చు, రాజకీయరంగంలో కావచ్చు..రౌతు మనసు ఎరిగి పరిగెత్తే గుర్రాలే ఎక్కువ. మంచి సలహాలు, దారితప్పితే వచ్చితే ముప్పు విప్పి చెప్పేవారు తక్కువ. ఎన్టీఆర్ విషయంలో కూడా అదే జరిగివుండొచ్చు.నిన్ను మించిన వాడు లేడు జగాన..అని భజన చేసేవాళ్లు చేసి వుండొచ్చు. కానీ మన కాళ్ల కింద నేల ఏపాటి గట్టిది అన్న ఇంగిత జ్ఞానం మనకు వుండాలి.
పట్టుమని పది హిట్లు లేని తరుణంలో, తన కెరియర్, చరిష్మా, తన వ్వయహారాలు అన్నీ తన సినిమాలతో ముడిపడి వున్న తరుణంలో వాటిపైనే దృష్టి కేంద్రీకరించుకోవాల్సి వుంది. వయసు చూస్తే తక్కువ. కనీసం మరో పదో, ఇరవయ్యో సినిమాలు చేయాల్సి వుంది. హిట్లు కొట్టాల్సి వుంది. టాలీవుడ్ లో పోటీ సామాన్యంగా లేదు. ఇలాంటప్పుడు తన సర్వ శక్తులు, ఆలోచనలు పూర్తిగా అటే కేంద్రీకరించాల్సి వుంది. పైగా తనకంటూ ఓ వెన్ను దన్ను వుండాలి. అంది అందించగలవాళ్ల అభిమానాన్ని పొందే మార్గం చూసుకోవాలి. ఇవన్నీ మాని, ముఖ్యమంత్రిగా చిరకాలం పనిచేసి, తొమ్మిదేళ్లు ప్రతిపక్షంలో వున్నా కూడా పార్టీని బతికించుకుంటూ వస్తున్న అనుభవం కలిగిన చంద్రబాబుతో ఢీ కొనడం ఎంతవరకు అవసరం? అది ఏ మేరకు లాభమో, నష్టమో తెచ్చిపేడుతుందో జూనియర్ ఆలోచించారా? బాలకృష్ణకు స్వంత చరిష్మా లేకనే బావ పక్కన నిలిచారా? అసలు సినిమాల్లో స్వంత వ్యవహారాలు, రాజకీయాలు చొప్పించి ప్రయోజనమేమిటి? దమ్ము సినిమా ఎందుకు దెబ్బతింది. కథను తన చిత్తం వచ్చినట్లు, తన స్వంత వ్వవహారాల చుట్టూ తిప్పడం వల్లనే కదా? ఒక విధంగా జూనియర్ కూడా జగన్ లాంటి తొందరపాటునే ప్రదర్శించారనిపిస్తోంది. ఎన్ని అంతస్తులైనా ఒక్కొక్కటీ ఎక్కాల్సిందే. అమాంతం ఎగిరే అవకాశం అందరికీ రాదు. ఒక వేళ బాబు తెలుగుదేశం వారసత్య పగ్గాలను లోకేష్కు అందివ్వాలానే అనుకున్నారని అనుకుందాం. హరికృష్ణ తనయుడి గురించి ఆలోచించినట్లు, బాబు తన కొడుకు ఆలోచించడంలో తప్పులేదు. కానీ ఇక్కడ ఒకటే సమస్య ఎవరి బలం ఏమిటన్నది చూడాలి. బాబు బలం ఎక్కువ అని గమనించినపుడు తగ్గి వుండాలి. వేరే విధంగా ఆయన నుంచి లాభం పొందడానికి చూసుకోవాలి. కెరియర్ పరంగా, ఇంకేమైనా పదవుల పరంగా. అది ఒక్కటీ తప్ప..అన్న చందంగా, వారసత్వ పగ్గాలు ఆశించకుంటే, ఏదడిగినా ఇవ్వడానికి బాబుకు కూడా అభ్యంతరం వుండకపోవచ్చు. ఇవన్నీ ఆలోచించకుండా తొందరపడి పార్టీకి, పార్టీ నేతలకు దూరం కావడం అన్నది ఎన్టీఆర్ దుందుడుకు చర్య. అతగాడి అనుభవ రాహిత్యానికి అది ఉదాహరణ.
నిజానికి మహానాడుకు ఆహ్వానం రాలేదనే అనుకుందాం..అయినా వెళ్లి..హుందాగా పాల్లొని, మొన్న తాత సమాధి దగ్గర చెప్పిన మాటలేవో అక్కడే చెప్పి, కావాలంటే, ఆహ్వానం లేకపోయినా వచ్చానని చెప్పివుంటే, బంతి బాబు కొర్టులో పడివుండేది.
ఇప్పు డు బంతి ఎన్టీఆర్ కోర్టులో వుంది. ఇక మరే పిలుపు రాదు. పిలవకుండా వెళ్లడానికి అహం అడ్డువస్తుంది. దిగజారడని అనుకుంటారన్న ఆందోళన. చేతిలో వున్నది ఒకటి రెండు సినిమాలు. మొన్నటికి మొన్న దమ్ము సినిమా పరాజయానికి తెలుగుదేశం అభిమానుల ఎస్ఎమ్ఎస్ లు కూడా కారణం అన్న వార్తలు వినవచ్చాయి. యుద్ధం అన్నాక అలాగే వుంటుంది. భవిష్యత్ లో సినిమాలకు కూడా ఈ తరహా యుద్దాలు తప్పకపోవచ్చు. ఈ చిన్న వయసులో ఇన్ని తలకాయ నొప్పులు అవసరమా? రాజకీయాల్లో ఎంతయినా వేచి వుండాల్సిందే. బాబు సైతం ఎన్ని ఏళ్ల అనుభవం తరువాత ముఖ్యమంత్రి కాగలిగారు? అది మరిచిపోయి..’నేను కాబోయే సిఎమ్ ను’ అన్న భ్రమల్లో గడిపితే ఫలితం లభించదు.
జూనియర్ తండ్రి హరికృష్ణకు ఇటువంటి దుందుడుకు తనమే వుంది. అదే వారసత్వంగా జూనియర్ కు వచ్చినట్లుంది. కానీ తండ్రి రాజకీయాల్లో విఫలమైనట్లు, తానూ విఫలం కాకూడదనుకుంటే, జూనియర్ ఆలోచనా విధానం సమూలంగా మారాల్సి వుంది. అందుకు కావాల్సింది రెండు . ఒకటి సరైన సలహాదారులు. రెండు వాటిని తలకెక్కించుకునే యోచన.
Source:  http://24by7news.com/headlines/hero-jr-ntr-need-advisors/#.UadnsawV84I

Saturday, May 25, 2013

"రోహిణీ కార్తె" అంటే ?

సూర్యోదయమప్పుడు ఏ చుక్క (నక్షత్రం) చంద్రుడికి దగ్గరగా ఉందనే దాన్ని బట్టి ఆ రోజు నక్షత్రం నిర్ణయమవుతుంది. పున్నమి రోజు చంద్రుడు ఏ చుక్కతో ఉంటే ఆ నెల పేరును ఆ చుక్క పేరు మీదుగా పెట్టేశారు మనవాళ్ళు: చిత్రా నక్షత్రమైతే చైత్రం, విశాఖ ఐతే వైశాఖం, ఇలా వరసగా. (పున్నమి నుంచి పున్నమికి దాదాపు 30 రోజులు. చైత్రమాసంలో పున్నమి రోజు చిత్రా నక్షత్రం వస్తే 27 రోజుల తర్వాత 28వ రోజు మళ్ళీ చిత్రా నక్షత్రం వస్తుంది. 29 వ రోజు స్వాతి, 30 వ రోజు విశాఖ. అదే వైశాఖ పున్నమి. ప్రతి సంవత్సరం ఇదే వరస!) ఈ చుక్కలన్నిట్లోకీ రోహిణీ మరింత చక్కని చుక్క. ఆ రోహిణీ నక్షత్రానికి పున్నమి చంద్రుడితో గడిపే అవకాశం కార్తీక మాసంలో గానీ రాదు. ఆ నెలలో పున్నమి పూర్తవకుండానే కృత్తికా నక్షత్రం వెళ్ళిపోయి రోహిణి వచ్చేస్తుంది. అప్పుడు చంద్రుడెంతగా వెలిగిపోతాడంటే అంత ప్రకాశవంతమైన వెన్నెల సంవత్సరం మొత్తం మీద మరే నాడూ ఉండదు. అసలు కార్తీక మాసానికే వెన్నెల మాసమని పేరు.
ఇక సూర్యుడి విషయానికి వస్తే సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉన్నాడనేదాన్ని బట్టి కార్తె నిర్ణయమవుతుంది. సంవత్సరానికి మొత్తం 27 కార్తెలు. ఎప్పుడు ఏ కార్తె వచ్చేదీ కాలెండర్ లో చూసి తెలుసుకోవచ్చు. (ఈ సంవత్సరం రోహిణీ కార్తె మే 24 నుంచి జూన్ 8 వరకు ఉండింది.) రోహిణీ కార్తెలో సూర్యుడెంతగా వెలిగిపోతాడో చెప్పనవసరం లేదు: "రోహిణీ ఎండలకు రోళ్ళు పగులుతాయి" అనే సామెతే ఉంది.
 రోహిణీ కార్తె రాకతో రైతులు సాగుకు మంచి రోజులుగా భావిస్తారు. ప్రతి ఖరీఫ్‌కు ఈ కార్తె నుంచే సాగుకు సమయాత్తమవుతారు. నార్లు పోసుకునేందుకు చాలా మంది రైతులు ఈ కార్తె ప్రారంభమైన రోజు నుంచే మొలక వేసుకుంటారు. అయితే ఈ సారీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఈ నెలలో మునుపెన్న డూ లేని విధంగా ఎండలు మండుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు సాగుకు సిద్ధమయ్యే పరిస్థితి లేదు.

Sunday, May 19, 2013

కేసీయార్ పై కాంగ్రెస్ అస్త్రం రఘునందన్ ?

మేము క్రితం పోస్టు ( మన రాష్ట్రంలో " కోదండరాం" తో కూడా అమలుచేసే అవకాశాలు...) లో చెప్పింది నిజమైందా? కానీ ఆ అస్త్రం కోదండరాం కాకుండా రఘునందన్ ని కాంగ్రెస్ ఎంచుకుందా? తెరాసా పతనానికి ,తెరాసాని ప్రజలు అసహ్యించుకొనేలా చేయడానికి కాంగ్రెస్ ఆపార్టీకే చందిన రఘునందన్ ని ఎంచుకుందా? దీనిలో చంద్రబాబు వ్యూహం కూడా ఉందా? మొన్న డిల్లీలో చంద్రబాబు కాంగ్రెస్ పెద్దలతో చర్చించి ఈ వ్యూహ రచన చేసారా/
అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు!  


 తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు కుటుంబంపై ఆరోపణల వర్షం కురిపించడం ద్వారా ఇతర పార్టీల నుండి వచ్చే నాయకులను నిలువరించడంతోబాటు, ఆయన దూకుడుకు కళ్ళెం వేసేందుకు రాజకీయ ప్రత్యర్థులు పకడ్బందీగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఎంపీలకు గాలమేస్తున్న తరుణంలో కాంగ్రెస్‌ అధిష్టానం పక్కా వ్యూహంతో ఒక పద్ధతి ప్రకారం కెసిఆర్‌పై చేతికి మట్టి అంటకుండా కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.
టి.కాంగ్రెస్‌ ఎంపీలకు నాయకత్వం వహిస్తున్న కె.కేశవరావును అధిష్ఠానం చాలా కాలం పెద్దగా పట్టించుకోలేదు. వారం రోజుల క్రితం కేశవరావును ఢిల్లిd పిలిపించుకుని మరీ సోనియాగాంధీ ఆయనతో మాట్లాడారు. అనంతరం టి.కాంగ్రెస్‌ ఎంపీలు మౌన ముద్ర దాల్చడంతోపాటు తెరాసలో చేరే అంశాన్ని కూడా పక్కనబెట్టినట్లు కనిపిస్తోంది.
కెసిఆర్‌పై సీబీఐ విచారణకు కాంగ్రెస్‌ ఎత్తుగడ వేస్తోందన్న వాదనలు వినవస్తున్నాయి. అయితే తమపై వస్తున్న అపవాదులు రాకుండా ఆ పార్టీ నాయకులనే అస్త్రంగా ఉపయోగించు కుని కెసిఆర్‌ కుటుంబంపై ఆరోపణలు చేయడం ద్వారా సిబిఐ విచారణకు మార్గం సుగమం చేయాలని అధిష్ఠానం భావించడం వల్లే రఘునందన్‌రావు వ్యవహారం ప్రారంభమైన ట్లుగా వార్తలు వినవస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో చీలిక తెచ్చేందుకు కెసిఆర్‌ ప్రయోగించిన అస్త్రమైన కేశవరావునే తిరిగి అతనిపైనే తెలివిగా ప్రయోగించేలా కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని బ్రతికించడం, పార్టీ నాయకులను తెరాస వైపుకు వెళ్ళనీయకుండా అడ్డుకుంటే ప్రతిఫలంగా భవిష్యత్తులో ఒక పదవి ఇస్తామని సోనియా కేకేకు హామీనిచ్చినట్లు రాజకీయ వర్గాల్లో వినవస్తున్నది. అందులో భాగంగానే రఘునందన్‌రావు తెరమీదికొచ్చారని, కెసిఆర్‌ కుటుంబంపై ఆయన చేత ఆరోపణలు చేయించారనే ప్రచారం సాగుతోంది.
తెరాస శాసనసభాపక్షం నాయకుడు ఈటెల రాజేందర్‌ కూడా రఘునందన్‌రావు వెనక ముఖ్యమంత్రి హస్తముందని ఆరోపించారు. మెదక్‌ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షుడు కె.సత్యనారాయణ కూడా హరీష్‌రావుపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణల వెనక ప్రత్యర్థుల కుట్ర ఉందని వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల నాయకులను పార్టీలోకి రప్పించడంలో హరీష్‌రావుది అందెవేసిన చేయి. దీంతో ఆయన దూకుడుకు కళ్ళెం వేయాలనే ఆలోచనతోపాటు కెసిఆర్‌కు హరీష్‌రావుకు మధ్య విభేదాలు సృష్టించవచ్చని, కాంగ్రెస్‌ నాయకత్వం రఘును అస్త్రంగా వదిలినట్లు తెలుస్తోంది. పనిలో పనిగా ఈ వ్యవహారంలోకి మరో ఎంపీ విజయశాంతిని కూడా లాగే ప్రయత్నం చేసినట్లు స్పష్టమవుతోంది.
సిబిఐకి రఘునందన్‌రావుచే ఫిర్యాదు చేయించి అనంతరం కెసిఆర్‌పై సిబిఐ విచారణకు కేంద్రం ప్రయత్నించవచ్చని సమాచారం. సోనియా కేకేతో సమావేశమైన తర్వాతే ఈ ప్రణాళికకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తాను కూడా ఎంపీలతో సహా తెరాసలో చేరుతానని, తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నా ఇబ్బందేమీ లేదని, ఒకవేళ తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చిన కేంద్ర మంత్రులపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఒకానొక దశలో అధిష్ఠానానికి ఎదురు తిరిగారు. అయితే తాజా పరిస్థితుల్లో ఆయన మౌనంగా ఉండడమే కాకుండా ఎంపీలు కూడా నోరు మెదపకపోవడం కాంగ్రెస్‌ వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. రఘునందన్‌రావుచే త్వరలో హైకోర్టులో కేసు వేయించడంతోపాటు సిబిఐకి కూడా ఫిర్యాదు చేయించి విచారణ చేయించేలా కాంగ్రెస్‌ పావులు కదుపుతున్నట్లు సమాచారం.
  మరి తెలంగాణా ప్రజలు , మేధావులు ఎలా ఆలోచిస్తారో వేచిచూడాలి ?
Some content from: Andhraprabha

Monday, May 13, 2013

కర్నాటక బిజెపి పతనంలో కాంగ్రెస్ పావు ఎడ్యురప్ప?

కర్నాటక ఎన్నికలలో విజయానికి సర్వ శక్తులూ ఒడ్డిన కాంగ్రెస్ ఎట్టకేలకు విజయం సాధించింది. కానీ ఆ విజయం వెనుక చాలానే వ్యూహాలు పన్నినట్లు అక్కడి మీడియా చెపుతోంది. దక్షిణ భారత దేశంలో తొలిసారి కర్నాటకలో పాగా వేసిన బీజేపీని యడ్యూరప్పతో కొత్త పార్టీ పెట్టించి, ఆ పార్టీని దెబ్బతీసిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 ఇటీవల జరిగిన కర్నాటక ఎన్నికల్లో యడ్యూరప్ప పార్టీతో బీజేపీ మునిగిపోయిన విషయం తెలిసిందే.
కర్నాటక ఎన్నికలలో మొత్తం 3,12,16,708 ఓట్లు పోలయితే.. అందులో కాంగ్రెస్‌కు 1,14,10,737; బీజేపీకి 63, 32,595; యడ్యూరప్ప నేతృత్వంలో కేజీపీకి 30, 68348 ఓట్లు పోలయ్యాయి. అంటే యడ్యూరప్ప పార్టీని వీడి సొంత పార్టీ పెట్టకపోతే 94 లక్షల ఓట్లు బీజేపీకే వచ్చేవి. అప్పుడు శ్రీరాములు బీఎస్సార్‌పార్టీ, ఇండిపెండెంట్ల మద్దతు కీలమయ్యేవి. అంటే అప్పుడు కాంగ్రెస్‌-బీజేపీ అధికారపీఠానికి దగ్గరగా వచ్చేవి. దీన్ని బట్టి కర్నాటకలో యడ్యూరప్ప పార్టీ బీజేపీ కొంపముంచిందని, ఆ పార్టీ చీల్చిన ఓట్లే కాంగ్రెస్‌ను గెలిపించాయని స్పష్టమవుతోంది. చాలాకాలం పాటు బీజేపీలో ఉన్న శ్రీరాములు కూడా పార్టీ పెట్టడం బీజేపీకి నష్టం కలిగించిందని ఫలితాలు స్పష్టం చేశాయి.
ఇదే వ్యూహాన్ని మన రాష్ట్రంలో " కోదండరాం" తో కూడా అమలుచేసే అవకాశాలు ఉన్నట్లు కొన్ని తెలుగు పత్రికలూ చెపుతున్నాయి. చూద్దాం ఏమి జరుగుతోందో?

Sunday, May 12, 2013

అయ్యా! రవి ప్రకాష్ గారూ ఇదేనా మీ "మెరుగైన సమాజం" ?

నిన్న కర్నూలులో రవిప్రకాష్పై ఓ మాజీ విలేఖరి చెప్పుతో దాడి చేసిన ఘటన సంచనలం సృస్టించింది. సదరు మాజీ విలేఖరి రమణపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసారు.  అయితే ఆ ఘటన తర్వాత టివి9 సిబ్బంది సదరు నిందితుడిని తమకు ఓ పావుగంట అప్పగించండి అని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. అప్పటికే అతనిపై ఆ సిబ్బంది దాడి చేసి గాయ పరిచారు.
సాక్షాత్తూ ప్రదానిపైనే బూటు విసిరిన సంఘటనలు గతంలో జరిగాయి. కానీ వారిని పోలీసులు అరెస్ట్ చేయడమూ, కొన్ని కేసులలో క్షమించి వదిలేయడమూ కూడా మనం చూసాము. కానీ ఇప్పుడు ఈ "మెరుగైన" సిబ్బంది ఓ పావు గంట ఆ నిందితునితో ఫుట్ బాల్ ఆడుకోవడానికో లేక ఏదైనా పార్ట్ తీసివేయడానికో అడిగారని ఊహించవచ్చా! రాయలసీన రౌడీలు, ఫ్రాక్షనిస్టులు అంటూ విరుచుకు పడుతున్న రవిప్రకాష్ గారు దీనికి ఏమి సమాధానంచెపుతారు?  పోలీసులు టివి9 సిబ్బందిపై కేసు నమోదు చెయ్యరా?

Sunday, May 5, 2013

కర్నాటక అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్

కర్నాటక అసెంబ్లీకి ఈరోజు పోలింగ్ తర్వాత  జరిగిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ దాదాపు మళ్ళీ బీజేపీ గెలవడం అసాధ్యమనే చెపుతున్నాయి. కాంగ్రెస్ కు అనుకూలంగా కొన్ని , హంగ్ ఏర్పడుతుందని కొన్నీ చెపుతున్నాయి.
మొత్తంగా చూస్తే..

CNNIBN-CSDS Karnataka Exit Poll 

 NDTV EXIT POLLS

 Congress abt 110, BJP/JDS abt 50 each, KJP + rest abt 15




Wednesday, May 1, 2013

భారత జనాభా 121,07,26,932 : 2001-11 జనాభా లెక్కలు వెల్లడి

 భారత జనాభా 121 కోట్లకు చేరుకుంది. గడచిన దశాబ్దితో పోల్చుకుంటే, దేశ జనాభాలో 17.7 శాతం పెరుగుదల నమోదైంది. హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే 2011 తుది జనాభా లెక్కల వివరాలను మంగళవారం విడుదల చేశారు. ఈ లెక్కల ప్రకారం 2011 మార్చి 1 నాటికి దేశ జనాభా 121,07,26,932. గత 2001 నాటి జనాభా లెక్కలతో పోల్చుకుంటే, 2011 నాటికి జనాభాలో 18.196 కోట్ల పెరుగుదల నమోదైంది. అయితే, పురుషుల జనాభా కంటే, మహిళల జనాభాలోనే కాస్త ఎక్కువ పెరుగుదల నమోదు కావడం గమనార్హం. పురుషుల జనాభా 9.097 కోట్లు పెరగగా, మహిళల జనాభా 9.099 కోట్లు పెరిగింది. పురుషుల జనాభాలో 17.1 శాతం పెరుగుదల నమోదవగా, మహిళల జనాభాలో 18.3 శాతం పెరుగుదల నమోదైంది. భారత జనాభా 2001-11 మధ్య కాలంలో 17.7 శాతం పెరగగా, అంతకు ముందు దశాబ్దిలో 21.5 శాతం పెరిగింది. దశాబ్ద కాలంలో అత్యధిక జనాభా పెరుగుదల నమోదైన రాష్ట్రాల్లో బీహార్ (25.4 శాతం) అగ్రస్థానంలో నిలిచింది. మరో 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సైతం జనాభా పెరుగుదల 20 శాతాని కంటే ఎక్కువగానే నమోదైంది. తాజా జనాభా లెక్కల ప్రకారం దేశంలోని 83.35 కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 37.71 కోట్ల మంది పట్టణాల్లో ఉన్నారు. పట్టణ జనాభాలో ఢిల్లీదే అగ్రస్థానం పట్టణ జనాభాలో ఢిల్లీ (97.5%) అగ్రస్థానంలో ఉండగా, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తొలి నాలుగు స్థానాల్లో గోవా (62.2%), మిజోరాం (52.1%), తమిళనాడు (48.4%), కేరళ (47.7 శాతం) ఉన్నాయి. అక్షరాస్యతలో తగ్గుతున్న వ్యత్యాసాలు దేశంలో అక్షరాస్యత శాతం 2001 నాటికి 64.8 శాతం ఉండగా, 2011లో దాదాపు 8 శాతం పెరిగి, 73 శాతానికి చేరుకుంది. తాజా జనాభా లెక్కల్లో పురుషుల్లో అక్షరాస్యత గత జనాభా లెక్కల కంటే 5.6 శాతం పెరిగి 80.9 శాతానికి చేరుకోగా, మహిళల్లో అక్షరాస్యత గత జనాభా లెక్కల కంటే 10.9 శాతం పెరిగి, 64.6 శాతానికి చేరుకుంది. అక్షరాస్యతలో అత్యధిక పెరుగుదల కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్‌హవేలీలో నమోదైంది. ఈ ప్రాంతంలో 2001లో 57.6 శాతం ఉన్న అక్షరాస్యత 2011 నాటికి 76.2 శాతానికి (18.6 పాయింట్లు) చేరుకుంది. బీహార్‌లో అక్షరాస్యత 47.0 శాతం నుంచి 61.8 శాతానికి (14.8 పాయింట్లు), త్రిపురలో 73.2 శాతం నుంచి 87.2 శాతానికి (14.0 పాయింట్లు) పెరిగింది. మిజోరాం మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ, కేంద్రపాలిత ప్రాంతాల్లోను పురుషుల కంటే మహిళలే అక్షరాస్యతలో ఎక్కువ పురోగతి సాధించారు. మిజోరాంలో అక్షరాస్యత పెరుగుదల మహిళల్లోను, పురుషుల్లోను సమానంగా నమోదైంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యత వ్యత్యాసం ప్రతి జనాభా లెక్కల్లోనూ తగ్గుతోంది. అలాగే, మహిళలు, పురుషుల అక్షరాస్యత వ్యత్యాసం కూడా తగ్గుతూ వస్తోంది. అక్షరాస్యతలో తొలి ఐదు స్థానాల్లో కేరళ (94 శాతం), లక్షదీవులు (91.8 శాతం), మిజోరాం (91.3 శాతం), గోవా (88.7 శాతం), త్రిపుర (87.2 శాతం) ఉన్నాయి. అక్షరాస్యతలో అట్టడుగు ఐదు రాష్ట్రాల్లో బీహార్ (61.8 శాతం), అరుణాచల్ ప్రదేశ్ (65.4 శాతం), రాజస్థాన్ (66.1 శాతం), జార్ఖండ్ (66.4 శాతం), ఆంధ్రప్రదేశ్ (67 శాతం) ఉన్నాయి. లింగ నిష్పత్తిలో హర్యానా అత్యంత దారుణం తాజా లెక్కల ప్రకారం లింగ నిష్పత్తిలో హర్యానా పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. హర్యానాలో ప్రతి వెయ్యిమంది పురుషులకు 879 మంది మాత్రమే స్త్రీలు ఉన్నారు. లింగ నిష్పత్తిలో ముందంజలో ఉన్న తొలి ఐదు రాష్ట్రాల్లో కేరళలో ప్రతి వెయ్యిమంది పురుషులకు 1,084 మంది మహిళలతో అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు (996), ఆంధ్రప్రదేశ్ (993), ఛత్తీస్‌గఢ్ (991), ఒడిశా (979) ఉన్నాయి. దేశవ్యాప్తంగా చూసుకుంటే, 2011 నాటికి ప్రతి వెయ్యిమంది పురుషులకు 943 మంది స్త్రీలు ఉన్నారు. గత జనాభా లెక్కల్లో ఈ సంఖ్య 933గా నమోదవగా, ఈసారి స్వల్పంగా పెరుగుదల చోటు చేసుకుంది. దేశంలో పిల్లల జనాభా నామమాత్రంగా 0.4 శాతం మాత్రమే పెరిగింది. 2001 నాటికి 0-6 ఏళ్ల వయసు లోపు గల పిల్లల జనాభా 16.38 కోట్లు కాగా, 2011 జనాభా లెక్కల్లో 16.45 కోట్లుగా నమోదైంది. 2001 లెక్కలతో పోల్చుకుంటే 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తగ్గుదల నమోదైంది. జనసాంద్రతలో బీహార్ టాప్ దేశంలో జనసాంద్రత కూడా పెరిగింది. గత 2001 లెక్కల ప్రకారం చదరపు కిలోమీటరుకు 325 నమోదైన జనసాంద్రత, 2011 నాటికి 382కు చేరుకుంది. జనసాంద్రత విషయంలో ప్రధాన రాష్ట్రాల్లో బీహార్ (1106) అగ్రస్థానంలో నిలిచింది. 2001 నాటి లెక్కల్లో పశ్చిమ బెంగాల్ తొలిస్థానంలో ఉండేది. అత్యధిక జనసాంద్రత గల నగరంగా ఢిల్లీ (11,320) తొలిస్థానంలో నిలవగా, చండీగఢ్ (9,258) రెండోస్థానంలో నిలిచింది. -
 See more at: http://www.sakshi.com/Main/FullStory.aspx?CatId=590198&Categoryid=1&subCatId=32#sthash.L06XqZof.dpuf